వాట్సాప్, స్కైప్లకు పోటీగా హైక్ న్యూ ఫీచర్
వాట్సాప్, స్కైప్లకు పోటీగా హైక్ న్యూ ఫీచర్
Published Wed, Oct 26 2016 6:48 PM | Last Updated on Sat, Aug 18 2018 4:44 PM
భారతదేశపు మొదటి స్వదేశీ మెసేజింగ్ యాప్ హైక్ మెసెంజర్, బుధవారం ఓ కొత్త ఫీచర్ను యూజర్ల ముందుకు తీసుకొచ్చింది. వాట్సాప్, స్కైప్ వంటి పలు మెసేజింగ్ యాప్స్ ఇప్పటికే యూజర్ల ముందుకు తీసుకొచ్చిన వీడియో కాలింగ్ ఫీచర్ను, హైక్ మెసెంజర్ కూడా ఆవిష్కరించేసింది. దీంతో వాట్సాప్, స్కైప్లకు ఈ దేశీయ మెసెంజర్ యాప్ గట్టి పోటీనివ్వనున్నట్టు తెలుస్తోంది. గత నెలలో ఎంపికచేసిన కస్టమర్లకు మాత్రమే ఈ వీడియో కాలింగ్ ఫీచర్తో కూడిన బీటా వెర్షన్ను అందుబాటులోకి తీసుకొచ్చిన హైక్... ప్రస్తుతం తన యూజర్లందరికీ వీడియో కాలింగ్ ఫీచర్ను ప్రారంభిస్తున్నట్టు పేర్కొంది. కానీ ఇది కేవలం ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండనుంది.
ఈ ఫీచర్ను త్వరగా మార్కెట్లోకి తీసుకురావడంపై తాము ఎంతో సంతోషిస్తున్నామని హైక్ మెసెంజర్ సీఈవో, వ్యవస్థాపకుడు కవిన్ భారతీ మిట్టల్ ఓ ప్రకటనలో తెలిపారు.గత కొన్ని నెలల నుంచి ఈ బీటా వెర్షన్ను తాము కలిగి ఉన్నామని, ఇది మంచి ఫలితాలను ఇచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్లో సౌండ్ మార్కెట్పై ఎక్కువగా దృష్టిసారిస్తుందని, ఈ వీడియో కాలింగ్ ఫీచర్ కమ్యూనికేషన్లలో ఎంతో ప్రభావం చూపగలదని తాము విశ్వసిస్తున్నట్టు మిట్టల్ తెలిపారు. ఈ ఫీచర్ ద్వారా కాల్ను ఆన్షర్ చేసేముందు అవతలి వ్యక్తి లైవ్ వీడియో ప్రీవ్యూను కూడా చూసే వెసులుబాటును హైక్ తన యూజర్లకు అందించనుంది.
Advertisement
Advertisement