ఖర్చుకు వెనకాడేది లేదు.. కోరుకున్నది కొనేస్తున్నారు! | A new category of customers is showing great interest in online shopping | Sakshi
Sakshi News home page

ఖర్చుకు వెనకాడేది లేదు.. కోరుకున్నది కొనేస్తున్నారు!

Published Sun, Apr 23 2023 4:35 AM | Last Updated on Sun, Apr 23 2023 8:14 AM

A new category of customers is showing great interest in online shopping - Sakshi

ఆన్‌లైన్‌ షాపింగ్‌పై మధ్య వయస్కు ల అధికాసక్తి బ్రాండెడ్‌ వస్తువులు, దుస్తులు, తదితరాల కొనుగోళ్లకు మొగ్గు కరోనా కాలంలో పెరిగిన ఆసక్తి క్రమంగా అలవాటుగా మారుతున్న వైనం బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్, మాట్రిక్స్‌ పార్ట్‌నర్స్‌ ఇండియా అధ్యయనంలో వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌ : ఓ కొత్త వర్గం కస్టమర్లు ఆన్‌లైన్‌ షాపింగ్‌పై అధికాసక్తి చూపిస్తున్నారు. నవతరం ముఖ్యంగా 18 నుంచి 25 ఏళ్ల లోపు యువతే ఆన్‌లైన్‌ షాపింగ్‌ ఎక్కువ చేస్తారనే అభిప్రాయం ఉంది. కానీ 35 ఏళ్లకు పైబడిన వారు ఈ తరహా షాపింగ్‌పై అధికంగా మొగ్గుచూపుతున్నట్లు తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. వివిధ రకాల బ్రాండెడ్‌ వస్తువులు మొదలుకుని ఫ్యాషన్‌ దుస్తులు, ఇతర కొనుగోళ్లలో వీరు ముందున్నట్టు స్పష్టమౌతోంది.

వివిధ రకాల యాప్‌లు, వెబ్‌సైట్ల వాడకంలో యువతరం ముందున్నా, ఇప్పుడు మధ్య వయస్కు లు కూడా ఈ విషయంలో వారితో పోటీ పడుతున్నారు. కరోనా మహమ్మారి కాలంలో డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా కొనుగోళ్లు ఊపందుకోగా తర్వాతి కాలంలో ఇది మరింత విస్తరించింది. క్రమంగా ఇది అలవాటుగా కూడా మారినట్లు వెల్లడవుతోంది. 2021లో మూడు నుంచి నాలుగు కోట్ల మంది కొత్తగా ఆన్‌లైన్‌ షాపర్స్‌ జాబితాలో చేరగా, అందులో 67 శాతం మంది 35 ఏళ్లకు పైబడిన వారే ఉండటం గమనార్హం.

కాగా అందులోనూ అధికశాతం మెట్రో నగరాలకు చెందని చిన్న పట్టణాల మహిళలే ఎక్కువగా ఉండడం మరో విశేషం. వివిధ బ్రాండ్ల దుస్తులు గతంలో అందుబాటులో లేక నిరుత్సాహపడిన వీరంతా, ఇప్పుడు ఆన్‌లైన్‌ షాపింగ్‌ ద్వారా పెద్దమొత్తంలో ఖర్చు చేస్తూ బ్రాండెడ్‌ వస్తువులపై తమకున్న మోజును, ఇష్టాన్ని చాటుతున్నారు. బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్, మాట్రిక్స్‌ పార్ట్‌నర్స్‌ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన తాజా అధ్యయనంలో అనేక ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి.  

ముఖ్యాంశాలివే... 
కొత్త ఆన్‌లైన్‌ కస్టమర్లు డిజిటల్‌ విధానాలను గతంలో అంతగా వినియోగించక పోయినా, ఇప్పుడు ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్స్‌లో సులభంగా షాపింగ్‌ చేసే పద్ధతులను అన్వేషిస్తున్నారు 

ఆన్‌లైన్‌లో వివిధ వస్తువులను షాపింగ్‌ చేస్తున్నపుడు ప్రాంతీయ భాషల్లో వాయిస్, వీడియో అసిస్టెన్స్‌ సర్విసులను సైతం వీరు ఉపయోగిస్తున్నారు 

ఈ సెగ్మెంట్‌ కస్టమర్లకు దగ్గరయ్యేందుకు చిన్న, మధ్యతరహా విక్రయదారుల ద్వారా స్థానికంగా ఆయా ఉత్పత్తులుఅందుబాటులోకి వచ్చేలా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మీషో వంటి ఈ కామర్స్‌ కంపెనీలు తమ వంతు కృషి చేస్తున్నాయి 

తమకు గతేడాది రెండో శ్రేణి నగరాలు, అంతకంటే కిందిస్థాయి ప్రదేశాల నుంచే 80 శాతం ఆర్డర్లు వచ్చినట్టుగా మీషో వెల్లడించింది  రాబోయే మూడేళ్లలో చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల నుంచే 50 శాతం ఆదాయం వస్తుందని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. 

ఇప్పుడు పరిస్థితి మారిపోయింది 
గతంలో కస్టమర్లను ఆకర్షించేందుకు ఆన్‌లైన్‌ కంపెనీలు డిస్కౌంట్లు, ఇతర మార్కెటింగ్‌ టెక్నిక్‌లను ఉపయోగించేవి. ఇప్పుడు ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది. ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సర్విసెస్‌ వంటివి మామూలై పోయాయి. గతంలో ఏవైనా దుస్తులు, వస్తువులు, ఇతర వస్తువులను కస్టమర్లు కొనేలా చేసేందుకు వాటిని వారి చేరువగా తీసుకెళ్లి తమ ఉత్పత్తులు అమ్ముడయ్యేలా చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఆన్‌లైన్‌ షాపింగ్‌ అందుబాటులోకి రావడంతో వీరు, వారు అనే తేడా లేకుండా అన్ని వర్గాల వారు ఖర్చుకు వెనకాడకుండా తమకు నచ్చి న వస్తువులు కొనేందుకు సిద్ధమౌతున్నారు.
- తరుణ్‌ తావ్డా, ఎండీ, మ్యాట్రిక్స్‌ పార్ట్‌నర్స్‌ ఇండియా 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement