Will Petrol And Diesel Prices Increase In The Future In India? - Sakshi
Sakshi News home page

Petro Prices : త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలకు రెక్కలు ?

Published Mon, Jul 10 2023 4:53 PM | Last Updated on Mon, Jul 10 2023 5:30 PM

Will the price of Petrol and Diesel increase? - Sakshi

మరోసారి భారత్‌లో పెట్రోల్‌, డీజిల్ ధలరకు రెక్కలు రానున్నాయా ? అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరగకపోయినా సరే ....ఇండియాలో క్రూడాయిల్ ధరలు ఎందుకు పెరుగబోతున్నాయి ? మొన్నటి వరకు భారత్‌కు చమురు దిగుమతుల్లో డిస్కౌంట్స్‌ ఇచ్చిన ఆ దేశం ఒక్కసారిగా ధరలు పెంచడమే ఇందుకు కారణమా ? ముడిచమురు కోసం ఒకటి రెండు దేశాలపై ఆధారపడటమే భారత్‌కు శాపంగా మారిందా  ? 

డిస్కౌంట్ ఫట్.. రేట్లు అప్

మరికొద్ది రోజుల్లో పెట్రోల్‌, డీజిల్ ధరలుకు రెక్కలు రాబోతున్నాయన్న అంచనాలు వస్తున్నాయి. ఇప్పటి దాకా ఒపెక్‌ దేశాల మీద ఆధారపడి చమురును దిగుమతి చేసుకున్న భారత్‌ రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభమైన తరువాత  రష్యా నుంచి ముడిచమురు దిగుమతిని చేసుకోవడం ప్రారంభించింది. అది కూడా ఇతర చమురు దేశాల నుంచి దిగుమతి చేసుకునే రేటు కంటే దాదాపుగా బ్యారెల్‌ 30 డాలర్లకే భారత్‌కు ముడిచమురు దొరికేది. కానీ ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో రష్యా నుంచి ఇండియాకు దిగుమతి అవుతున్న క్రూడాయిల్ పై డిస్కౌంట్‌ను డిస్‌కనెక్ట్ చేసింది రష్యా దీంతో ఈ భారం ఇండియాపై పడనుంది. 

మన వాటా ఎంత? ఎంతకు కొంటున్నాం?

ఉక్రెయిన్ వార్ మొదలైనప్పటి నుంచి రష్యన్‌‌‌‌ క్రూడ్‌‌‌‌ను చాలా తక్కువ రేటుకు ఇండియన్ కంపెనీలు కొంటున్నాయి. తాజాగా ఈ క్రూడ్‌‌‌‌పై ఇస్తున్న డిస్కౌంట్‌‌‌‌ను రష్యా  బ్యారెల్‌‌‌‌పై 4 డాలర్ల వరకు మాత్రమే పరిమితం చేసింది. అదీకాక రవాణా ఛార్జీలను  కూడా ఇంతకు ముందున్న దానికంటే రెట్టింపు వసూలు చేస్తోంది. ఇంతకు ముందు మన చమురు అవసరాల్లో కేవలం 2శాతం  మాత్రమే రష్యా నుంచి దిగుమతి చేసుకునేవాళ్ళం కానీ యుద్ధం తరువాత తక్కువ ధరకే చమురు లభించడంతో ఇపుడు మన చమురు దిగుమతుల్లో రష్యా వాటా 44శాతానికి పెరిగింది.  

పశ్చిమ దేశాల ఆంక్షలెందుకు?

2022లో పశ్చిమ దేశాలు రష్యన్ క్రూడ్‌‌‌‌పై బ్యారెల్‌‌‌‌కు 60 డాలర్ల ప్రైస్‌‌‌‌ లిమిట్‌‌‌‌ను విధించాయి. అయినప్పటికీ అదే ఆయిల్‌‌‌‌ను డెలివరీ చేస్తున్న రష్యన్ కంపెనీలు బ్యారెల్‌‌‌‌కు 11 నుంచి 19 డాలర్ల వరకు రవాణా ఛార్జీని వసూలు చేయడమే ఇపుడు చమురు ధరలు భారీగా పెరిగేందుకు కారణంగా కనపబడుతోంది. క్రూడాయిల్‌‌‌‌ను బాల్టిక్‌‌‌‌, బ్లాక్ సముద్రాల నుంచి మన దేశంలోని వెస్ట్రన్ కోస్ట్‌‌‌‌కు డెలివరీ చేయడానికి ఈ మొత్తాన్ని వసూలు చేస్తున్నారు.

అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడిచమురు ధరలు

రష్యా ఉక్రేయిన్‌ పై దాడి చేస్తున్న సమయంలో బ్రెంట్ క్రూడాయిల్‌ధర 80-100 డాలర్ల దగ్గర ఉంది. అయినప్పటికీ మనకు రష్యా అతి తక్కువ ధరకే ముడిచమురును అందించడంతో ఇండియన్ రిఫైనరీ కంపెనీలు రష్యా నుంచి భారీగా ఆయిల్‌‌‌‌ను దిగుమతి చేసుకోవడం మొదలుపెట్టాయి. ఐఓసీ, హెచ్‌‌‌‌పీసీఎల్‌‌‌‌, బీపీసీఎల్‌‌‌‌, మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్‌‌‌‌, హెచ్‌‌‌‌పీసీఎల్‌‌‌‌ మిట్టల్‌‌‌‌ ఎనర్జీ వంటి ప్రభుత్వ కంపెనీలు, రిలయన్స్‌‌‌‌, నయారా వంటి ప్రైవేట్ కంపెనీలు రష్యన్ కంపెనీలతో సపరేట్‌‌‌‌గా డీల్స్‌‌‌‌ కుదుర్చుకుంటుండడంతో రష్యన్ క్రూడ్‌‌‌‌పై ఇస్తున్న డిస్కౌంట్‌‌‌‌ భారీగా తగ్గిందని కొంత మంది చమురు రంగ నిపుణులు చెబుతున్నారు.

మనకెంత ధర? రష్యాకు ఎంత ఖర్చు?

ప్రస్తుతం బ్యారల్‌ బ్రెంట్‌ ముడిచమురు ధర 77 డాలర్ల దగ్గర ఉంది ఈ లెక్కన రష్యా నుంచి దిగుమతి చేసుకునే ముడిచమురు ధర రవాణా ఛార్జీలతో కలిపితే ఇంచు మించు అంతే మొత్తంలో ఖర్చు అవుతుండటంతో ఇపుడు భారత్‌ మరోసారి ప్రత్యామ్నయ మార్గాలను అన్వేశిస్తోంది. అదీకాక మరోసారి రష్యా కంపెనీలతో బేరమాడేందుకు ఇండియాకు ఛాన్స్‌ ఉంది. ఎందుకంటే చైనా ఐరోపాల నుంచి రష్యా చమురుకు ప్రస్తుతం డిమాండ్ తగ్గింది సో.. ఇది భారత ప్రభుత్వానికి కలిసివచ్చే అవకాశం.

సామాన్యుడి పరిస్థితేంటీ?

మన ప్రభుత్వ ఆధీనంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు రష్యా నుంచి రోజుకు 2 మిలియన్‌  బ్యారెళ్ళ ముడిచమురును దిగుమతి చేసుకుంటున్నాయి. సో మనం కనుక మరోసారి రష్యాతో బేరమాడితే మనకూ తక్కువ ధరలో చమురు లభించే అవకాశం ఉంది. అయినప్పటికీ మన ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్‌ కంపెనీలకు ఉన్న నష్టాలతో రిటైల్ మార్కెట్లో కామన్‌ మ్యాన్‌కు మాత్రం ఆ ప్రయోజనాలు అందడం లేదనేది నిజం. అంతర్జాతీయంగా ఎలా ముడిచమురు ధరలు ఉన్నా సామాన్యుడికి మాత్రం ప్రయోజనం శూన్యం అనేది నిపుణులు చెపుతున్నమాట. 

రాజ్ కుమార్, బిజినెస్ కరస్పాండెంట్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement