సాక్షి, న్యూఢిల్లీ: రష్యా సైనిక దాడుల కారణంగా ఉక్రెయిన్‌లో భయానక వాతావరణం నెలకొంది. ప్రజలు ప్రాణాలను అరచేతిలో పట్టుకొని బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. అయితే, యుద్ధం నేపథ‍్యంలో ఉక్రెయిన్ తమ గగనతలాన్ని మూసివేసిన విషయం తెలిసిందే. దీంతో అక్కడి నుంచి వివిధ దేశాలను వెళ్లాల్సిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను స‍్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప‍్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయుల కోసం ప్రత్యేక విమానాలను నడుపనున్నట్టు వెల్లడించింది. కాగా, వారి కోసం విమాన ఛార్జీలను సైతం కేంద్రమే భరించనున్నట్టు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది. శుక్రవారం రాత్రి రెండు ప్రత్యేక విమానాలు ఉక్రెయిన్ సమీప దేశాల నుంచి బయలుదేరనున్నాయి. రుమేనియా దేశం మీదుగా ఈ విమానాలు తిరిగి స్వదేశానికి రానున్నాయి.
కాగా, భారతీయ అధికారుల బృందాలు విద్యార్థులను హంగేరి, పోలాండ్ దేశాల మీదుగా ఉక్రెయిన్ సరిహద్దులకు పంపిస్తారు. అక్కడ్నుంచి విద్యార్థులను స్వదేశానికి తీసుకురానున్నారు. ఈ క్రమంలో ఉక్రెయిన్, పోలాండ్, హంగేరి దేశాల్లోని ఇండియన్ ఎంబసీ అధికారులు ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. విద్యార్థులకు అప్‌డేట్స్ ఇస్తున్నారు. ఉక్రెయిన్‌లో సుమారు 16వేల మంది భారతీయులు చిక్కుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు యుద్దం కారణంగా గురువారం ఉక్రెయిన్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం తిరిగి ఢిల్లీకి వచ్చిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment