రష్యా చేసిన నష్టానికి రష్యా నిధులే వాడతారట.! | G7 decided to allocate Russia funds to Ukriane | Sakshi
Sakshi News home page

రష్యా చేసిన నష్టానికి రష్యా నిధులే వాడతారట.!

Jun 13 2024 3:29 PM | Updated on Jun 13 2024 4:25 PM

G7 decided to allocate Russia funds to Ukriane

ఉక్రెయిన్‌ ఆదుకునేందుకు రష్యా నిధులు : G7 దేశాలు

ఈ ఏడాది చివరి నాటికి 50 బిలియన్‌ డాలర్లు సాయం

300 బిలియన్‌ యూరోల ఆస్తులను స్తంభింపజేసిన G7 దేశాలు 

దీనిపై వచ్చిన వడ్డీలో 50 బిలియన్‌ డాలర్లను అప్పుగా ఇవ్వాలని నిర్ణయం

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ సన్నిహితుడైన ఒలిగార్చ్‌ ఆస్తులు కూడా సీజ్‌

ఈ ఆస్తుల మొత్తం విలువ 397 బిలియన్‌ డాలర్లు

ఉక్రెయిన్‌ పునర్‌ నిర్మాణానికి 486 బిలియన్‌ డాలర్లు అవుతుందన్న వరల్డ్‌ బ్యాంక్‌

185 బిలియన్‌ యూరోలు జప్తు చేసిన బెల్జియంలోని యూరోక్లియర్‌

మిగతా ఆస్తులను సీజ్‌ చేసిన బ్రిటన్‌, ఆస్ట్రియా, జపాన్‌, స్విట్జర్లాండ్‌, యూఎస్‌

రష్యన్ సెంట్రల్ బ్యాంక్ డబ్బును జప్తు చేయకుండా అంతర్జాతీయ చట్టం నిషేధం

రుణం మంజూరు చేయాలంటే ఈయూ సభ్య దేశాల అనుమతి అవసరం

యుద్ధంతో అతలాకుతలమైన ఉక్రెయిన్‌ ఆదుకునేందుకు G7 దేశాలు కొత్త వ్యూహం అనుసరిస్తున్నాయి. వేర్వేరు దేశాల్లో స్తంభింపజేసిన రష్యా నిధులను ఉక్రెయిన్‌కు కేటాయించాలని ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఈ ఏడాది చివరి నాటికి 50 బిలియన్‌ డాలర్లు సాయం చేయాలని నిర్ణయించాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభించిన తర్వాత.. 300 బిలియన్‌ యూరోల రష్యన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ ఆస్తులను G7 దేశాలు స్తంభింపజేశాయి. దీనిపై వచ్చిన వడ్డీలో 50 బిలియన్‌ డాలర్లను రుణం కింద అందించాలని ఈయూ ప్రతిపాదించింది.

యుద్ధంలో ధ్వంసమైన ఉక్రెయిన్‌ను పునర్‌ నిర్మించాలంటే 486 బిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువ ఖర్చు అవుతుందని ప్రపంచ బ్యాంక్‌ అంచనా వేసింది. రష్యన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ ఆస్తులనే కాకుండా.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సన్నిహితులైన ఒలిగార్చ్‌ ఆస్తులను కూడా EU, G7 దేశాలు స్తంభింపజేశాయి. పడవలు, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు, ఇతర ఆస్తులను స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఆస్తుల మొత్తం విలువ 397 బిలియన్‌ డాలర్లుగా యుక్రేనియన్‌ థింక్‌ ట్యాంక్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లెజిస్లేటివ్‌ ఐడియాస్‌ అంచనా వేసింది.

ఇక రష్యాకు చెందిన మెజార్టీ ఆస్తులను ఈయూ దేశాలు స్తంభింపచేశాయి. దాదాపు 185 బిలియన్‌ యూరోలు బెల్జియంలోని అంతర్జాతీయ డిపాజిట్‌ సంస్థ అయిన యూరోక్లియర్‌ జప్తు చేయగా.. మిగతా ఆస్తులను బ్రిటన్‌, ఆస్ట్రియా, జపాన్‌, స్విట్జర్లాండ్‌, యూఎస్‌ దేశాలు సీజ్‌ చేశాయి. ఇప్పుడు వీటిని ఎలా ఉపయోగించాలనే విషయంలో ఈయూ దేశాలు కీలక పాత్ర పోషించనున్నాయి. నిజానికి.. రష్యన్ సెంట్రల్ బ్యాంక్ డబ్బును పశ్చిమ దేశాలు జప్తు చేయకుండా అంతర్జాతీయ చట్టం నిషేధిం విధించింది. ఇప్పుడు దీని నుంచి తప్పించుకునేందుకు సీజ్‌ చేసిన రష్యా ఆస్తుల నుంచి వచ్చే వడ్డీని ఉక్రెయిన్‌కు రుణం కింద అందించాలని భావిస్తున్నాయి.

ఉక్రెయిన్‌కు రుణం అందించే విషయంలో పలు ఇబ్బందులు ఎదురుకానున్నాయి. ఇంతకుముందు యూఎస్‌ రుణాలు అందిస్తుందని భావించగా.. ఇప్పుడు G7 దేశాలు కూడా ఇందులో భాగస్వామ్యమయ్యాయి. ఈ దేశాల నుంచి ఎవరు రుణాన్ని అందిస్తారనే విషయంపై క్లారిటీ లేకుండా పోయింది. రుణం మంజూరు చేయాలంటే ఈయూ సభ్య దేశాలన్నింటి నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. ఒకవేళ యుద్ధం నుంచి రష్యా విరమించుకొని ఆస్తులను తిరిగి ఇవ్వాల్సి వస్తే ఏం జరుగుతుందనే దానిపై కూడా ఆయా దేశాల మధ్య స్పష్టత లేన్నట్లు తెలుస్తోంది. చైనా వంటి దేశాలు పశ్చిమ దేశాల్లో పెట్టుబడులు పెట్టాలంటే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement