న్యూఢిల్లీ: చౌక ధరలో ఆఫర్ చేస్తుండటంతో రష్యా నుంచి భారత్ చమురును భారీగా దిగుమతి చేసుకుంటోంది. దిగుమతైన చమురుతో కొంతమేర పెట్రోలియం ప్రొడక్టులను రూపొందిస్తోంది. వీటిని తిరిగి ఎగుమతి చేస్తోంది. అయితే వీటిలో మూడో వంతు ప్రొడక్టులను జీ–7 తదితర సంపన్న దేశాలకు ఎగుమతి చేస్తుండటం ప్రస్తావించదగ్గ అంశం! ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా పలు యూరోపియన్ దేశాలు రష్యన్ చమురు ధరలపై పరిమితులు విధించాయి.
అయితే శుద్ధి చేసిన చమురు ఉత్పత్తులను ఆయా దేశాలు కొనుగోలు చేసేందుకు విధానాలు అనుమతిస్తున్నాయి. వెరసి చట్టబద్ధంగా భారత్ నుంచి చమురు ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నాయి. నిజానికి రష్యా చమురు కొనుగోలుపై జీ7, ఈయూ, ఆ్రస్టేలియా ఎలాంటి ఆంక్షలనూ అమలు చేయనప్పటికీ 2022 డిసెంబర్‌లో బ్యారల్ ధర 60 డాలర్లకు మించి కొనుగోలు చేయకుండా పరిమితి విధించుకున్నాయి. తద్వారా రష్యాకు అధిక ఆదాయం లభించకుండా అడ్డుకునేందుకు నిర్ణయించాయి.
రష్యా– ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో చమురు ధరలు జోరందుకోవడంతో రష్యా అదనపు లబ్ధి చేకూరకుండా చెక్ పెట్టేందుకు తీర్మానించాయి. అయితే ఆపై భారత్ నుంచి రష్యా చమురు ద్వారా తయారైన 6.65 బిలియన్ డాలర్ల(6.16 బిలియన్ యూరోలు) విలువైన చమురు ఉత్పత్తులు ఆయా దేశాలకు ఎగుమతి అయినట్లు ఫిన్లాండ్ సంస్థ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్(సీఆర్‌ఈఏ) వెల్లడించింది. వీటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన గుజరాత్ జామ్‌నగర్ రిఫైనరీ నుంచి 5.2 బిలియన్ యూరోల ఎగుమతులున్నట్లు ఒక నివేదికలో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment