బంగారు కొండే!..10 గ్రా. @ రూ. 83,750 | Donald Trump tariffs and economic uncertainty effect on Gold Price | Sakshi
Sakshi News home page

బంగారు కొండే!..10 గ్రా. @ రూ. 83,750

Published Thu, Jan 30 2025 12:53 AM | Last Updated on Thu, Jan 30 2025 8:41 AM

Donald Trump tariffs and economic uncertainty effect on Gold Price

రోజురోజుకు కొత్త రికార్డులతో దూసుకెళ్తున్న పుత్తడి ధర

ట్రంప్‌ సుంకాల మోత.. ఆర్థిక అనిశ్చితి ఎఫెక్ట్‌

అమెరికా ఫెడ్‌ రేట్ల కోత, పాజ్‌ చేయడం కూడా కనకానికి సానుకూలమే

రూపాయి విలువ తగ్గడంతోనూ ధరలకు ఆజ్యం

ఈ ఏడాది అంతర్జాతీయంగా ఔన్సు 3,150 డాలర్లను తాకవచ్చంటున్న విశ్లేషకులు

తులం బంగారం లక్ష రూపాయలను తాకడం ఖాయమనే అంచనాలు

సాక్షి, బిజినెస్‌ డెస్క్‌: బంగారం వెలుగులు విరజిమ్ముతోంది. తగ్గేదేలే అంటూ రోజురోజుకు కొత్త రికార్డులతో దూసుకుపోతోంది. తాజాగా ఢిల్లీలో తులం మేలిమి బంగారం ధర రూ.83,750కు ఎగబాకింది. ఇది ఇన్వెస్టర్లకు కనకవర్షం కురిపిస్తుంటే.. కొత్తగా నగలు కొనుక్కోవాలనుకునే వారికి మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి. దీంతో కనకం ఇంకెన్ని కొత్త శిఖరాలకు చేరుతుందోనన్న ఉత్కంఠ పెరిగిపోతోంది.

ఎందుకీ ర్యాలీ..:
అంతర్జాతీయంగా చూస్తే బంగారం ఔన్స్‌ (31.1 గ్రాములు) ధర ఈ నెల 24న సరికొత్త ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయి 2,822 డాలర్లను తాకింది. గత ఏడాది నవంబర్‌ 5న నమోదైన 2,541 డాలర్ల కనిష్టం నుంచి ఏకంగా 281 డాలర్లు ఎగబాకింది. ముఖ్యంగా ట్రంప్‌ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధాలకు మళ్లీ తెర తీస్తారనే భయాలు పెరిగిపోయాయి. అనుకున్నట్లే ముందుగా కెనడా, మెక్సికోలపై దిగుమతి సుంకాల మోత మోగించారు. 

చైనా, భారత్‌తోపాటు మరిన్ని దేశాలపైనా సుంకాలు పెంచేందుకు కసరత్తు జరుగుతోంది. ఇది అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితికి ఆజ్యం పోసింది. ఇప్పటికే భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావంతో బంగారం ఏడాదికాలంగా ఎగబాకుతూనే వస్తోంది. అనిశ్చితుల్లో ఆదుకునే సురక్షిత పెట్టుబడి సాధనంగా పేరొందిన బంగారంలోకి ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు పోటెత్తుతున్నాయి. మరోవైపు అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల కోత మొదలుపెట్టడం కూడా పసిడి ధరలకు దన్నుగా నిలుస్తోంది. 

2024లో వరుసగా మూడుసార్లు పావు శాతం చొప్పున ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేటు తగ్గించింది. ఈ ఏడాది రేట్ల కోత జోరు తగ్గినా, అక్కడే కొనసాగినా కూడా పసిడికి సానుకూలాంశమేనని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు ట్రంప్‌ ప్రపంచవ్యాప్తంగా వడ్డీరేట్లు తగ్గాలని పదేపదే చెబుతున్నారు. అంటే రానున్న కాలంలో అమెరికాలో వడ్డీరేట్లు మరింత దిగొచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇది కనకానికి మరింత కిక్కిచ్చే అంశం!

సెంట్రల్‌ బ్యాంకుల కొనుగోళ్ల జోరు...
అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు, భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్‌ బ్యాంకులు కూడా బంగారాన్నే నమ్ముకుంటున్నాయి. 2024 నవంబర్లో అవి 53 టన్నుల పసిడిని కొనుగోలు చేయగా, ఇందులో భారత్‌ వాటా 8 టన్నులు. నవంబర్లో జరిగిన కొనుగోళ్లతో 2024లో ఆర్‌బీఐ 73 టన్నుల బంగారం కొనుగోలు చేసి రెండో అతిపెద్ద కొనుగోలుదారుగా నిలిచింది. పోలాండ్‌ నేషనల్‌ బ్యాంక్‌ 90 టన్నులు కొని టాప్‌లేపింది. ఇలా సెంట్రల్‌ బ్యాంకులు ఎడాపెడా పసిడి కొనుగోళ్లకు దిగడం కూడా రేట్ల పెరుగుదలకు కారణమవుతోంది.

మన దగ్గర అంతకు మించి..
అంతర్జాతీయంగా పసిడి ధరలకు మించి భారత్‌లో పుత్తడి జిగేల్‌మంటోంది. గతేడాది చివర్లో పండుగల సీజన్‌కు తోడు, పెళ్లిళ్లు కూడా బాగా ఉండటంతో ఆభరణాలు, రిటైల్‌ కొనుగోళ్లు దూసుకెళ్లాయి. నవంబర్లో భారత్‌ 10 బిలియన్‌ డాలర్ల విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకోవడం దీనికి నిదర్శనం. అంతర్జాతీయంగా గోల్డ్‌ రష్‌కు తోడు దేశీయంగా ఆభరణాల వర్తకులు, రిటైలర్ల నుంచి కొనుగోళ్ల మద్దతు, డాలర్‌తో రూపాయి మారకం విలువ అంతకంతకూ దిగజారుతుండటం పసిడి ధరలు జోరందుకోవడానికి ప్రధాన కారణమని ఆల్‌ ఇండియా సరాఫా అసోసియేషన్‌ చెబుతోంది.

రూపాయి ఎఫెక్ట్‌..
దేశీయంగా బంగారం ధర జనవరి నెలలోనే 5.5 శాతం (రూ.4,360) ఎగబాకగా.. గత వారం రోజుల్లోనే 2 శాతం (రూ.1,700) జంప్‌ చేసింది. దీనికి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రూపాయి నేలచూపులే. రోజురోజుకూ బక్కచిక్కతున్న రూపాయి విలువ తాజాగా 86.85 ఆల్‌టైమ్‌ కనిష్టానికి జారిపోయింది. ఇందులో ట్రంప్‌ గెలిచిన రోజు నుంచి చూస్తే రూపాయి విలువ 250 పైసల మేర ఆవిరి కావడం గమనార్హం. అంతర్జాతీయంగా ఔన్స్‌ బంగారం ధర ఈ నెల 24న ఆల్‌టైమ్‌ గరిష్టాన్ని తాకి ప్రస్తుతం 2,795 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అయినా భారత్‌లో గత వారం రోజుల్లో పసిడి రేటు పెరుగుతూపోతోంది. డాలరు పుంజుకుని, రూపాయి పడిపోవడం వల్ల బంగారం దిగుమతుల కోసం ఎక్కువ రూపాయలు చెల్లించుకోవాల్సి రావడమే దీనికి కారణం.



రేటు పైపైకే...!
బంగారం గడిచిన ఏడాది నిజంగా కనకవర్షమే కురిపించింది. అంతర్జాతీయంగా, దేశీయంగా దాదాపు 25–30 శాతం మేర రాబడులు అందించి అత్యుత్తమ పెట్టుబడి సాధనంగా నిలిచింది. ప్రస్తుత రాజకీయ, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లో పసిడి దూకుడు ఈ ఏడాది కూడా ఖాయమేనని బులియన్‌ నిపుణులు కుండబద్దలు కొడుతున్నారు. కాయిన్‌ ప్రైస్‌ బులియన్‌ విశ్లేషకుల తాజా అంచనా ప్రకారం.. ఈ ఏడాది బంగారం 3,150 డాలర్లను తాకే అవకాశం ఉంది. ఏడాది చివరికల్లా 3,150–3,356 డాలర్ల రేంజ్‌లో స్థిరపడొచ్చని లెక్కగట్టారు. ఇక మన రూపాయి ఇలాగే పడిపోతూ.. దేశీయంగా ఆభరణాల డిమాండ్‌ కూడా పెరిగితే తులం బంగారం అక్షరాలా లక్ష రూపాయలను తాకడం ఖాయమనేది మెజారిటీ నిపుణుల అభిప్రాయం!!

‘ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకులు, ట్రంప్‌ సుంకాల మోత భయాలతో ఇన్వెస్టర్లు పసిడి జై కొడుతున్నారు. అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ వడ్డీరేట్ల కోతకు పాజ్‌ ఇచ్చినా సరే పుత్తడికి సానుకూలమే’
– దేవేయ గగ్లానీ, యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ కమోడిటీస్‌ రీసెర్చ్‌ ఎనలిస్ట్‌

ఒక్కరోజే రూ.910 పెరుగుదల
కొనుగోళ్ల డిమాండ్‌తో బుధవారం (29న) ఒక్కరోజే 99.9 స్వచ్ఛత బంగారం ధర ఢిల్లీలో 10 గ్రాములకు రూ.910 పెరిగి రూ.83,750కి చేరింది. ఈ నెల 1న బంగారం ధర రూ.79,390 వద్ద ఉండగా.. నెల రోజుల్లో 5.5 శాతం మేర (రూ.4,360) ర్యాలీ చేసింది. 99.5 శాతం స్వచ్ఛత బంగారం ధర సైతం రూ.910 పెరిగి జీవిత కాల గరిష్టం రూ.83,350కి చేరింది. వెండి ధర కిలోకి రూ.1,000 పెరిగి రూ.93,000కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ రేటు 2,795 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement