సాక్షి, హైదరాబాద్ : యుక్త వయసు పిల్లలు డబ్బులడిగితే.. మధ్యతరగతి తల్లిదండ్రులు వంద ఆరాలు తీస్తారు. వివిధ రుణసంస్థలు తామిచ్చే అప్పు తీర్చగలరా? లేదా? అనేది రుణగ్రహీతల ఆర్థిక పరిస్థితిని బట్టి అంచనా వేస్తాయి. అయితే, ఇవేమీ లేకుండానే స్టూడెంట్స్ లోన్ యాప్స్ యువకులకు ఎడాపెడా ఆన్‌లైన్‌లో లోన్లు ఇచ్చేస్తున్నాయి. అడ్డగోలుగా వడ్డీలు పిండుతూ, బెదిరింపులకూ దిగుతున్నాయి. ఫలితంగా పలువురు యువకులు ఒత్తిడికి గురై, అప్పులు తీర్చేందుకు దారితప్పుతున్నారు. హైదరాబాద్ సైబర్‌క్రైమ్ స్టేషన్‌లో నమోదైన బీటెక్ విద్యార్థి ఉదంతమే దీనికి ఉదాహరణ. ఎం–పాకెట్ యాప్‌లో అప్పు తీసుకున్న ఇతడు దాన్ని తీర్చడానికి సైబర్ నేరానికి పాల్పడి పోలీసులకు చిక్కాడు.
అన్నీ ఆన్‌లైన్‌లోనే..
విద్యార్థులకు రుణాలిచ్చే ఎం–పాకెట్, లెండ్ కరో, క్రేజీబీ, స్లైస్‌పే, ఉదార్ కార్డ్, రెడ్‌కార్పెట్ వంటి యాప్స్ అనేకం ఉన్నాయి. ఎదుటి వారిని నేరుగా కలవకుండానే ఇవి రుణాలు ఇచ్చేస్తుంటాయి. యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా అప్పు తీసుకునే విద్యార్థి తన ఆధార్ కార్డు, టెన్త్ మెమో లేదా పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం, స్టూడెంట్ ఐడీ అప్‌లోడ్ చేయాలి. ఈ యాప్స్ రూ.500 నుంచి రూ.10 వేల వరకు రుణం ఇస్తున్నాయి. ఆ మేరకు విద్యార్థి కోరుకున్న మొత్తం కొన్ని గంటల్లోనే అతనికి చెందిన పేటీఎం, గూగుల్ పే వాలెట్స్‌లోకి వచ్చి పడుతుంది. వడ్డీ, పెనాల్టీ కలిపి నెలకు 5 నుంచి 10 శాతం వరకు అవుతోంది. రూ.2 వేలు అప్పు తీసుకుంటే మొదటి నెల పూర్తయ్యేలోపు రూ.2,114, రెండో నెలలో రూ.2,225, మూడో నెలలో రూ.2,450 వరకు చెల్లించాలి. అప్పు చెల్లింపు గడువుకు వారం ముందు యాప్ నుంచి సందేశం వస్తుంది. అందులో ఉన్న లింకు క్లిక్‌చేస్తే ఆన్‌లైన్‌లోనే చెల్లింపు జరిగిపోతుంది.
అప్పు తీరుస్తారా? అందరికీ చెప్పాలా?
స్టూడెంట్‌లోన్ యా ప్స్‌ను ప్లేస్టోర్స్ నుం చి డౌన్‌లోడ్ చేసుకుని, ఇన్‌స్టాల్ చేసుకునేటప్పుడు.. కాంటాక్ట్స్, ఫొటో స్, లొకేషన్ యాక్సెస్ కోసం అ నుమతి కోరుతుంది. దీన్ని యా క్సెప్ట్ చేస్తేనే యాప్ ఇన్‌స్టాల్ అవుతుంది. విద్యార్థులకు రుణాలిస్తు న్న ఈ యాప్స్ తమకున్న యా క్సెస్ ద్వారా సదరు విద్యార్థి ఫోన్ లోని కాంటాక్ట్స్ లిస్ట్‌ను ముందే కాపీచేసి పెట్టుకుంటున్నాయి. రు ణం చెల్లించకున్నా, తమ ఫోన్లకు స్పందించకపోయినా వాట్సాప్ ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నాయి. తమ వద్ద మీ కాంటా క్ట్ లిస్ట్ ఉందని చెబుతూ.. మచ్చు కు కొన్ని కాంటాక్ట్స్‌ను పేస్ట్ చేస్తు న్నారు. తక్షణం డబ్బు చెల్లించకపోతే మీ కుటుంబసభ్యులు, స్నే హితులకు ఫోన్లుచేసి చెబుతామ ని బెదిరిస్తున్నారు. ఆపై అప్పు చె ల్లింపునకు గంట గడువిస్తున్నా రు. అప్పటికీ చెల్లించకుంటే ఫోన్‌కాల్స్ మొదలవుతాయి.
బయటపడనివి మరెన్నో..
ఇటీవలే లెండ్ కరో యాప్ బ్లాక్‌మెయిలింగ్‌పై ట్విట్టర్ ద్వారా మా దృష్టికొచ్చింది. స్టూడెంట్స్ లోన్ యాప్స్ కారణంగా పెడదారి పడుతున్న విద్యార్థులు మరెందరో ఉండొచ్చు. దీన్ని సీరియస్‌గా తీసుకుని అప్పులు ఇచ్చే యాప్స్‌పై విచారణ చేస్తున్నాం. వీటికి సరైన అనుమతులు ఉన్నాయా? ఏ మేరకు వడ్డీలు వసూలు చేస్తున్నాయి? ఏ తరహా బ్లాక్‌మెయిలింగ్స్‌కు పాల్పడుతున్నాయి? వంటివి ఆరా తీస్తున్నాం. మధ్య, దిగువ మధ్య తరగతి కుటుంబాల్లోని తల్లిదండ్రులు తమ పిల్లల ఫోన్లను చెక్‌చేస్తూ ఏయే యాప్స్ ఉన్నాయో పరిశీలించాలి. – సిటీ పోలీసు ఉన్నతాధికారి
బీటెక్ విద్యార్థి ఉదంతంతో వెలుగులోకి..
నగరంలోని బీరంగూడకు చెందిన బీటెక్ విద్యార్థి మూడు నెలల క్రితం ఎంపాకెట్ యాప్ నుంచి రూ.2,000 అప్పు తీసుకున్నాడు. అది వడ్డీతో కలిపి రూ.2,450 అయ్యింది. ‘యాప్’ నుంచి ఒత్తిడి పెరగడంతో కట్టుతప్పాడు. పరీక్ష రాయడానికి వెళ్లిన ఇతగాడు ఎగ్జామ్‌హాల్ బయట ఉన్న ఓ యువతి బ్యాగ్ నుంచి సెల్‌ఫోన్ తస్కరించాడు. అందులో ‘సే హాయ్’ చాటింగ్ యాప్ డౌన్‌లోడ్ చేశాడు. అందులోని వివరాల ఆధారంగా సదరు యువతి మాదిరిగానే ఈ యాప్‌లో ప్రొఫైల్ క్రియేట్ చేశాడు. తనతో చాటింగ్ చేయాలన్నా, తన ఫొటోలు కావాలన్నా కొంత మొత్తం చెల్లించాలంటూ తన పేటీఎం వాలెట్ నంబర్ ఇచ్చాడు. ఈ విద్యార్థి ఇదంతా ఆ యువతి డూప్లికేట్ సిమ్ తీసుకునేలోపే, అదే సిమ్‌కార్డు వాడి ఇవన్నీ చేసేశాడు.
దీంతో ఒకరిద్దరు కొంత మొత్తం ఇతడి పేటీఎంకు డబ్బు పంపారు. ఈలోపు డూప్లికేట్ సిమ్ తీసుకున్న ఆ యువతికి నగదు చెల్లించిన ఇద్దరు ఫోన్లు చేయడంతో ఆమె కంగుతిని సిటీ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సాంకేతిక ఆధారాలను బట్టి విద్యార్థిని పట్టుకున్నారు. తాను ఎంపాకెట్ నుంచి అప్పు తీసుకోవడం, అది తీర్చడానికి తప్పు చేసినట్టు విచారణలో చెప్పాడు. ఆ విద్యార్థి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆ యువతి కేసు వద్దని పోలీసులను కోరింది. దీంతో అధికారులు సోమవారం వీరిద్దరినీ రాజీపడటానికి కోర్టుకు పంపారు. బీటెక్ విద్యార్థి తండ్రి, సోదరిని ఠాణాకు పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment