సాక్షి, అమరావతి: ‘మీకు రుణం కావాలా.. ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా రెండు గంటల్లోనే మీ బ్యాంకు ఖాతాలో జమ చేస్తాం’.. అంటూ గుంటూరుకు చెందిన మూర్తికి ఓ ఫోన్ వచ్చింది. కరోనాతో తన చిరు వ్యాపారం దెబ్బతినడంతో ఇబ్బందుల్లో ఉన్న ఆయన అప్పుల కోసం బ్యాంకుల చుట్టూ తిరిగి విసిగిపోయి ఉన్నారు. దాంతో ఆ ఫోన్‌కాల్‌కు సానుకూలంగా స్పందించి ‘రూ.లక్ష లోన్ కావాలి’ అని అన్నారు. వారు అడిగిన వివరాలన్నీ యాప్‌లో అప్‌లోడ్ చేశారు. ఆయన అడిగింది రూ.లక్ష.. కానీ, ఇచ్చింది రూ.70వేలే.. అంటే ముందే రూ.30వేలు వడ్డీ కింద ఉంచుకుని రూ.లక్ష అప్పు ఇచ్చినట్లు చూపించారు.
ఆ తరువాత నుంచి ప్రతినెలా వాయిదాలు కడుతున్నా అప్పు పెరుగుతోందే కానీ, తగ్గడంలేదు. చివరికి రూ.రెండు లక్షలు చెల్లించిన తరువాతగానీ ఆయన మోసాన్ని గుర్తించలేదు. దాంతో వాయిదాలు చెల్లించడం మానేయడంతో ఫోన్లో తీవ్రపదజాలంతో దూషణలు, బెదిరింపులు మొదలయ్యాయి. వాట్సాప్ మెసేజులు వచ్చాయి. ఆయన కుటుంబ సభ్యులను దూషిస్తూ ఆయన ఫోన్లో ఉన్న వాట్సాప్ గ్రూపుల్లో మెసేజులు ప్రత్యక్షమయ్యాయి. ఫోన్‌చేసి వేధించడం మొదలుపెట్టారు. దీంతో మూర్తి సైబర్ పోలీసులను ఆశ్రయించగా వారు దర్యాప్తు చేపట్టారు.
..ఇలా మూర్తి ఫిర్యాదుపైనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా లోన్‌యాప్ కంపెనీల ఆగడాలపై రాష్ట్ర సైబర్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. చైనా నుంచి కార్యకలాపాలు నిర్వహించే ఈ అనధికారిక సంస్థల ఆగడాల నుంచి బాధితులకు అండగా నిలుస్తున్నారు. ఈ దారుణాలకు అడ్డుకట్ట వేసేందుకు ద్విముఖ వ్యూహంతో కార్యాచరణను వేగవంతం చేశారు. మోసాలకు పాల్పడుతున్న వాటిపై కఠిన చర్యలను వేగవంతం చేశారు.
మొదటి స్థానంలో తిరుపతి జిల్లా
ఈ తరహా మోసాలపై రాష్ట్రంలో ఈ ఏడాది ఇప్పటివరకు 63 కేసులు నమోదుచేశారు. లోన్‌యాప్ కంపెనీలపై కేసుల్లో తిరుపతి జిల్లా మొదటిస్థానంలో ఉండగా గుంటూరు, విశాఖజిల్లాలు రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇక ఈ కంపెనీలపై అత్యధికంగా కేసులు నమోదు చేసిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.
విస్తృతంగా అవగాహన..
నిజానికి.. దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న లోన్‌యాప్ కంపెనీల్లో 90 శాతం కంపెనీలకు రిజర్వ్ బ్యాంకు అనుమతిలేదు. చైనాలో ఉంటూ ఇక్కడ అనధికారికంగా కాల్ సెంటర్లు ఏర్పాటుచేసుకుని మోసాలకు పాల్పడుతున్నాయి. అందుకే లోన్‌యాప్ కంపెనీల మోసాలపై ప్రజలకు సరైన అవగాహన కల్పించేందుకు రాష్ట్ర సైబర్ పోలీసు విభాగం ప్రత్యేక కార్యాచరణ చేపట్టి పలు సూచనలు చేసింది. అవి..
► తెలియని వ్యక్తులు, కంపెనీలు పంపించే లింక్‌లు, ఈమెయిల్స్ ఓపెన్ చేయకూడదు. చేస్తే.. ఆ యాప్ డౌన్‌లోడ్ కాగానే వారి ఫోన్/ల్యాప్‌టాప్‌లోని కాంటాక్టŠస్ వివరాలు, ఇతర వ్యక్తిగత సమాచారం, వాటికి వచ్చే ఓటీపీ నంబర్లతోసహా సమాచారమంతా కూడా లోన్‌యాప్ కంపెనీకి అందుబాటులోకి వస్తుంది.
► అందుకే ఏదైనా లింక్‌ను క్లిక్ చేసేముందు ఆ కంపెనీకి గుర్తింపు ఉందా లేదా, గుర్తింపు ఉంటే ఆ కంపెనీకి రేటింగ్‌ను తెలుసుకోవాలి.
► బ్యాంకులు, గుర్తింపు పొందిన నాన్ బ్యాంకింగ్ కంపెనీలు మాత్రమే రుణాలు మంజూరు చేసేందుకు అనుమతి ఉంది. మిమ్మల్ని సంప్రదించిన కంపెనీ ఆ కేటగిరీకి చెందుతుందో లేదో పరిశీలించాలి.
► ఆధార్ నంబర్, కాంటాక్ట్స్ వివరాలు, ఫొటోలు, వ్యక్తిగత వివరాలు, ఓటీపీ నంబర్లు అడిగితే ఇవ్వొద్దు.
► ఆర్‌బీఐ గుర్తింపు పొందిన ఏ కంపెనీ కూడా రుణం మంజూరుచేసే ముందే కొంత మొత్తాన్ని మినహాయించుకోదు. అలా చేస్తామని ఏ కంపెనీ అయినా చెబితే మోసానికి పాల్పడుతున్నట్లే లెక్క.
► అలాగే, హామీలు, డాక్యుమెంట్లు అవసరంలేకుండా ఎవరైనా రుణం ఇస్తామన్నా విశ్వసించొద్దు.
► మీ యూపీఐ పిన్ నంబర్లు, పాస్‌వర్డ్, క్రెడిట్/డెబిట్ కార్డ్ నంబర్లు, సీవీవీ నంబర్లు ఎవరికీ చెప్పొద్దు. గుర్తింపు పొందిన బ్యాంకులు ఆ వివరాలు అడగవు.
► తెలియని ఖాతాల నుంచి మీ బ్యాంకు ఖాతాల్లో డబ్బులు డిపాజిట్ అయినట్లు గుర్తిస్తే వెంటనే ఆ విషయాన్ని మీ బ్యాంకు అధికారులకు తెలియజేయండి. లేకపోతే మోసపూరిత లోన్‌యాప్ కంపెనీలు మీరు రుణం కోరితేనే బ్యాంకులో జమచేశామని చెప్పే ప్రమాదముంది.
ఫిర్యాదులకు ప్రత్యేక వ్యవస్థలు
మరోవైపు.. బాధితులు ఫిర్యాదు చేసేందుకు పలు వ్యవస్థలను పోలీసులు ఏర్పాటుచేశారు. అవి..
► డయల్ 1930 : లోన్ యాప్ కంపెనీల మోసాలపై ఈ టోల్‌ఫ్రీ నంబరుకు ఫిర్యాదు చెయ్యొచ్చు.
► సైబర్‌మిత్ర వాట్సాప్ నం. 9121211100 : లోన్‌యాప్‌ల మోసాలు, వేధింపులపై దీనికీ ఫిర్యాదు చేయవచ్చు.
► సైబర్ క్రైమ్ పోర్టల్ : లోన్‌యాప్ కంపెనీలతోపాటు ఇతర సైబర్ నేరాలపై ఫిర్యాదు చేసేందుకు సంప్రదించాల్సిన సైబర్ క్రైమ్ పోర్టల్: www. cybercrime. gov. in
లోన్‌యాప్ మోసాలపై కఠిన చర్యలు
లోన్‌యాప్‌ల కంపెనీల మోసాలు, వేధింపులపై పోలీసు శాఖ కఠిన చర్యలు చేపడుతోంది. స్థానిక పోలీస్‌స్టేషన్‌తోపాటు బాధితులు ఫిర్యాదులు చేసేందుకు వివిధ వ్యవస్థలను అందుబాటులోకి తెచ్చాం. లోన్‌యాప్‌లపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా మోసపోయామని భావిస్తే వెంటనే పోలీసులను సంప్రదించాలి.
– కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, డీజీపీ
జిల్లాల వారీగా లోన్‌యాప్ మోసాలపై నమోదైన కేసులు..
Comments
Please login to add a commentAdd a comment