ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వినియోగం నిత్య జీవన క్రియలో భాగమైనది. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ మొబైల్ వాడకం విజృంభిస్తోంది. స్మార్ట్ ఫోన్ అరచేతిలోకి తీసుకొచ్చేశాక యువతరంలో సోషల్ మీడియా
ఎంత పాప్యులరైందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నాణేనికి రెండు వైపులా ఉన్నట్టే... కాలక్షేపంతో పాటు కష్టాల్ని కొనితెచ్చే టిక్‌టాక్ లాంటి యాప్స్ మాత్రమే కాదు మన అవసరాలను తీర్చుకునే క్రమంలో శ్రమని, ఒత్తిడిని తగ్గించడానికి మహిళల కోసం ప్రత్యేకంగా వందలాది యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. అలాంటి కొన్ని ట్రెండీ యాప్స్ విశేషాలు...
రొపోసో ఆప్
దేశంలోనే అత్యంత ఆదరణ పొందిన ఫ్యాషన్ సోషల్ నెట్‌వర్క్‌గా నిలిచింది రొపోసో. నెట్టింట్లో అధునాతన ఫ్యాషన్ టెక్నాలజీ, సరికొత్త ట్రెండ్స్‌ని కోరుకునే ఆడవారికి రొపోసో ఆప్ మంచి వేదికగా మారింది. ఇందులో ఎవరైనా సరే తమ ఫ్యాషన్‌కి సంబంధించిన విశేషాలు, వీడియోలు తదితర అంశాలను షేర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ మాధ్యమంలో తమకు నచ్చిన వారిని ఫాలో అవుతూ అభిరుచులను పంచుకోవచ్చు. బాగా నచ్చిన ఉత్పత్తులను, స్టోరీస్‌ని రొపోసో వేదికగా రీ పోస్ట్ చేసుకోవచ్చు. ఇన్ని ఉపయోగాలున్న ఈ యాప్‌ని ప్రస్తుతం సెలబ్రెటీల నుండి సామాన్య ప్రజల వరకు ఫ్యాషన్ ప్రియులందరూ ఫాలో అవుతున్నారు.
స్పై కెమెరా డిటెక్టింగ్ ఆప్
ప్రస్తుతం సామాజికంగా అమ్మాయిలను అతిగా ఇబ్బందిపెడుతున్న సమస్య స్పైయింగ్. ప్రయాణాల్లో, షాపింగ్స్, హోటల్స్‌లో, టూరిస్ట్ ప్లేసెస్ తదితర జన సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాలలో ఏర్పాటు చేసిన రహస్య కెమెరాలతో వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న సంఘటనలు ఎన్నో చూస్తున్నాం. ఇలాంటి సందర్భాలలో రాడార్‌బోట్ ఫ్రీ, యాంటీ స్పై కెమెరా, స్పై హిడెన్ కెమెరా డిటెక్టర్ లాంటి యాప్స్ వీటిని ఎదుర్కునేందుకు ఉపకరిస్తున్నాయి. యాప్‌ని స్మార్ట్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకొని మనకు అనుమానాస్పదంగా అనిపించిన ప్రదేశాలలో ఆన్ చేస్తే చాలు.. ఆ యాప్‌లోని మాగ్నెటిక్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ డిటెక్టర్ సాంకేతికతతో రహస్య కెమెరాలను కనిపెడెతుంది. ప్రస్తుతం వ్యక్తిగత భద్రత దృష్ట్యా యువతకు ఈ యాప్ చాలా ఉపయుక్తం అని చెప్పొచ్చు.
పెప్పర్ ట్యాప్ ఆప్
ఉద్యోగం చేసుకొంటూ, ఇంటినీ పిల్లలనీ చూసుకొనే ఆధునిక మహిళలకు క్షణం కూడా తీరిక ఉండడడం లేదు. ఇలాంటి పరిస్థితులలో నిత్యావసర వస్తువులకై సూపర్ మార్కెట్, కిరాణాషాప్‌కి వెళ్ళాలంటే కూడా సమయం దొరకని పరిస్థితి. ఇలాంటి వారి కోసమే ఈ పెప్పర్ ట్యాప్ ఆప్. ఒక్క క్లిక్‌తో ఆర్డర్ చేస్తే చాలు.. కావలసిన సరుకులన్నీ, ఎంచుకున్న మోతాదులో, చెప్పిన సమయానికే ఇంటివద్దకి డెలివరీ చేసేస్తారు. ఎలాంటి షాపింగ్ చేయకుండానే అతి సులభంగా అన్ని వస్తువులు ఇంటికే వస్తుండటంతో పెప్పర్‌ట్యాప్‌కి ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తోంది.
గుడ్ గైడ్ ఆప్
ప్రతిరోజూ ఎన్నో రకాల కొత్త కాస్మెటిక్స్ తదితర మహిళా సంబంధ ఉత్పత్తులు మార్కెట్‌లోకి వస్తుంటాయి. అయితే అవి ఉపయోగించడం ఆరోగ్యకరమైనదో కాదో తెలుసుకోవడం అంత సులభం కాదు. అలాంటి సందేహం ఉన్నవారు ఈ గుడ్‌గైడ్ యాప్‌తో ఆ వస్తువు నాణ్యతను ఇట్టే తెలుసుకోవచ్చు. ఈ యాప్‌లో డియోడరంట్ నుండి డైపర్ క్రీమ్ వరకు అన్నిరకాల ఉత్పత్తులకు రేటింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇందులో అందించే రేటింగ్ ఆధారంగా కావలసిన వాటిలో బెస్ట్ అనబడే వస్తువులను కొనుగోలు చేయవచ్చు.
112 ఇండియా మొబైల్ ఆప్
భారత నిర్భయ చట్టం అనుబంధంగా 112 ఇండియా మొబైల్ ఆప్‌ను తయారు చేసింది. అత్యవసర పరిస్థితుల్లో మహిళల, బాలికల తక్షణ సహాయం కోసం దీనిని రూపొందించారు. ఈ యాప్‌ని మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత... ఎలాంటి అవాంచనీయ పరిస్థితుల్లోనైనా కేవలం ఒక్క క్లిక్‌తో కాల్ చేయడం వలన పోలీసులు క్షణాల్లో సంఘటనా స్థలానికి చేరుకొంటారు. ఈ ఆప్‌లోని ఉఖSSటెక్నాలజీతో సంఘటన జరిగిన ప్రదేశాన్ని పోలీసులు క్షణాల్లో గుర్తిస్తారు. అంతేకాకుండా ఈ యాప్‌కి 100 (పోలీస్), 101(ఫైర్), 108(అంబులెన్స్), 181(మíßళా, శిశు సంరక్షణా శాఖ) మెదలైనవి అనుసంధానమై ఉంటాయి.
ఎఫ్బీ లేకున్నా... యాప్ ఉండాలి...
అరచేతిలోని అంతర్జాలాన్ని మనకున్న పరిప్థితికి అనుగుణంగా మార్చుకొని శ్రమ ఒత్తిడిని తగ్గించుకోవడమే కాకుండా వ్యక్తిగత భద్రతనూ పెంచుకోవచ్చు. సిటీలోని ఒక మార్కెటింగ్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. నైట్ షిఫ్ట్ చేసినప్పుడు కానీ, సిటీలో తప్పనిసరి రాత్రి సమయాల్లో రాకపోకలు సాగించాల్సి ఉంటుంది. నా మొబైల్‌లో 112 ఇండియన్ యాప్ వాడుతున్నా. విపత్కర పరిస్థితుల్లో క్షణాల్లోనే పోలీస్ సహాయం అందిస్తుంది. ఆడవారికి వాట్సాప్, ఫేస్‌బుక్ అకౌంట్స్ సంగతేమో కాని ఇలాంటి యాప్స్ ఎంతో అవసరం. ఇటీవలే యువతలో ఇలాంటి యాప్స్‌పై అవగాహన పెరుగుతోంది. – రమ్యసుధ, మార్కెటింగ్ ఉద్యోగిని
Comments
Please login to add a commentAdd a comment