12 మంది భార్యలు, 102 మంది పిల్లలు, 578 మంది వారసులు
ఒక భార్య, ఓ నలుగురో , ఐదుగురో కొడుకులు, కుమార్తెలు,20-30 మంది మనవలు మనవరాళ్లతో అలరారే కుటుంబాన్ని పెద్ద కుటుంబం అంటూ ఉంటాం. మరి 12 మంది భార్యలు, 102 మంది పిల్లలు , 578 మంది మనవళ్లు ఉన్న ఫ్యామిలీని ఏమని పిలవాలి? 12 మంది భార్యలా? 102 మంది సంతానమా అని నోరెళ్ల బెట్టకండి. నిత్యం ఆకలి , కరువుతో సతమతమయ్యే ఆఫ్రికా దేశాల్లో ఒకటైన ఉగాండాలో ఉందీ బాహుబలి ఫ్యామిలీ.
తూర్పు ఉగాండాలోని ముకిజాకు చెందిన 70 ఏళ్ల ముసా హసహ్య కసేరా (MusaHasahyaKasera) ఈ జెయింట్ ఫ్యామిలీకి మూల పురుషుడు. ఈయనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ సందడి చేస్తోంది. 'దిఇండోట్రెక్కర్' అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ అయిన ఈ వీడియోకు ఒక్క రోజులోనే 8.6 లక్షలకు పైగా లైకులు వచ్చాయి.
1972లో 17 ఏళ్ల వయస్సులో వివాహం చేసుకోవడంతో అతని పెళ్లిళ్ల పరంపర మొదలైంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 మందిని వివాహం చేసుకున్నాడు. వీరికి 102 మంది పిల్లలు పుట్టారు. అంటే ఒక్కో భార్యకు దాదాపు తొమ్మిది మంది. అంతేనా మరో 578 మంది వారసులకు తాత కూడా. దశాబ్దాలుగా, అతని కుటుంబం అలా విస్తరిస్తూ పోయింది. అతని పిల్లలు ఇప్పుడు 10 - 50 సంవత్సరాల వయస్సు వరకు ఉన్నారు. అతని భార్యలలో చిన్న ఆమెకు 35 ఏళ్ల వయస్సు. ఇపుడు ఈ సంతానం కడుపు నింపేందుకు నానా పాట్లు పడటమే కాదు, మనవలు,మనవరాళ్ల పేర్లు గుర్తు పెట్టుకోవడం కూడా కష్టంగా ఉందట ముసాకు. అందుకే ఒక రిజిస్టర్‌ను మెయింటైన్ చేస్తున్నారు.
అతనికున్న ఆస్తల్లా శిథిలావస్థలో ఇల్లు. రెండు ఎకరాల భూమి. దీంతో ఇల్లు గడవక చాలా కష్టపడుతున్నామని వాపోయింది మూడో భార్య జబీనా. పిల్లలు, మనుమలు చేతికి వచ్చిన పని చేస్తారు. మరికొందరు కుటుంబం కోసం నీళ్లు కట్టెలు తీసుకురావడానికి వారి రోజులు గడుపుతారు. వీరందరూ కడుపు నిండా భోంచేయండం కూడా గగనమే.
మరోవైపు అతని ఆరోగ్యం క్షీణించడం, ఇంత పెద్ద ఇంటిని నిర్వహించడం కష్టంగా ఉండటంతో, అతని ఇద్దరు భార్యలు వెళ్లిపోయారు. టీచర్‌గా పనిచేస్తున్న అతని కుమారుడు షాబాన్ మాజినో(30) కుటుంబ నిర్వహణలో సహాయం చేస్తాడు.
దీంతో నెటిజన్లు ఛలోక్తులతో సందడి చేస్తున్నారు. 'ప్రపంచంలో ఎక్కువ మంది పిల్లలను ఉత్పత్తి చేసిన వ్యక్తి' ఒకరు, “ఇస్కో పరివార్ క్యోం బోల్తే హో ...? జిల్లా ఘోషిత్ క్యోం నహీ దేతే.” (వీళ్లని కుటుంబమని అంటారేంటి...జిల్లాగా ప్రకటించాలి) అంటూ వ్యాఖ్యానించారు. బాహుబలి ఫ్యామిలీ, తాతగారు గేమ్ ఛేంజర్ అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment