ఇంటర్నెట్ లేని మొబైల్‌లో ట్విట్టర్!
న్యూఢిల్లీ: సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ ట్విటర్.. ఇకపై ఇంటర్నెట్ సదుపాయంలేని మొబైల్స్‌లో కూడా అందుబాటులోకి రానుంది. దేశీయంగా దాదాపు 70 కోట్ల మంది సాధారణ మొబైల్ ఫోన్ యూజర్లు, అదేవిధంగా వర్ధమాన దేశాల్లో 80 శాతం వినియోగదారులకు ట్విటర్ యోగం లభించనుంది. సింగపూర్‌కు చెందిన యుటోపియా అనే మొబైల్ సొల్యూషన్ల సంస్థ ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది.
ఇందుకోసం తాను రూపొందించిన ‘ఫోన్‌ట్విష్’ అనే ఒక ప్రత్యేకమైన మొబైల్ అప్లికేషన్(యాప్)ను ఈ సంస్థ యూజర్లకు అందించనుంది. వచ్చే ఏడాది జనవరి-మార్చి మధ్య ఈ యాప్‌ను ట్విటర్ యాక్సెస్ కోసం అందుబాటులో ఉంచనున్నట్లు యుటోపియా మొబైల్ సీఈఓ సుమేష్ మీనన్ వెల్లడించారు. అన్‌స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా(యూఎస్‌ఎస్‌డీ) అనే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినాకూడా ఎవరైనా ట్విటర్‌ను వాడొచ్చని ఆయన చెప్పారు.
సాధారణంగా టెలికం ఆపరేటర్లు యూజర్లకు డేటా సంబంధఅలర్ట్ మెసేజ్‌లను పంపేందుకు, అదేవిధంగా ప్రీ-పెయిడ్ కాల్‌బ్యాక్ సేవలు, లొకేషన్ ఆధారిత కంటెంట్ సేవలు, మెనూ ఆధారిత సమాచార సేవలకు ఈ యూఎస్‌ఎస్‌డీ పరిజ్ఞానాన్ని వినియోగిస్తాయి. కాగా, ఫేస్‌బుక్, గూగుల్ టాక్‌లు కూడా ఇదే అప్లికేషన్‌తో ఇప్పటికే మొబైల్ వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి.
తమ ఫోన్‌ట్విష్ సేవలు అంతర్జాతీయంగా లభ్యమవుతున్నాయని దీనిద్వారా చాలా చౌకగా సాధారణ మొబైల్స్‌లో కూడా ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే వెబ్‌సైట్లను యాక్సెస్ చేసేందుకు వీలవుతుందని మీనన్ పేర్కొన్నారు. ఇప్పటికే దాదాపు 1.1 కోట్ల మంది మొబైల్ యూజర్లు ఫోన్‌ట్విష్ ద్వారా ఫేస్‌బుక్, గూగుల్ టాక్‌లను ఉపయోగిస్తున్నారని కూడా ఆయన తెలిపారు.