ఒక్కోసారి చేతిలో ఖాళీ ఉంటుంది. కానీ ఆ ఖాళీకి సార్థకత తెచ్చేలా చేయగలిగిందేమీ తోచదు. అప్పుడు ఆడుకోవడానికి ఆన్‌లైన్ అనేది మంచి గేమ్. అందరినీ వ్యసనపరులను చేసే ఆన్‌లైన్ గేమ్స్ గురించి కాదు; ఆన్‌లైన్‌తోనే ఆడుకోవడం! దీనికి గూగుల్, వికీపీడియా, యూట్యూబ్, ట్విట్టర్ లాంటివన్నీ పనిముట్లు. ఒకదాన్లోంచి ఇంకోదాన్లోకి గెంతుతూ, కొత్త విషయాలకు ద్వారాలు తెరుచుకుంటూ వెళ్లడం సరదాగా ఉంటుంది. మామూలుగా అయితే ఇలాంటి విషయాలను తెలుసుకోవడానికి గ్రంథాలయాలను చుట్టేయాలి. అంత శ్రమ లేకుండా మన అరచేతిలోనే ఆ భాండాగారం ఉంది.
ఎక్కడినుంచి మొదలు పెట్టాలనే సమస్య అయితే ఉంటుంది. ఇది వ్యక్తిగత ఎంపిక. ఉదాహరణకు ప్రపంచ సినిమాను ఇష్టపడే ఏ స్నేహితుడో ఈ పేరును డ్రాప్ చేసివుంటాడని అనుకుందాం: ‘హిరోషిమా మాన్ అమౌర్’. ఈ ఒక్క హింటు మీదే ఎన్నో విషయాలు పోగేయవచ్చు. హిరోషిమా అంటే అర్థమౌతోంది; తర్వాతి పదాలు? గూగుల్ ఎందుకుంది? మాన్ అంటే ఫ్రెంచ్‌లో ‘నా’. అమౌర్ అంటే ప్రేమ.
రెండో ప్రపంచ యుద్ధపు బీభత్సాన్ని చిత్రించిన సినిమా ఇది. కానీ ఆ బీభత్సం కథాకాలానికి సుదూర గతం. యుద్ధం మనుషుల మనసుల్లో ఎంత లోతైన గాయాలను చేసిందో జ్ఞాపకాల తలపోత ద్వారా చెప్పిన సినిమా. దీర్ఘ కవిత లాంటి సినిమా. పేరులేని అతడు, ఆమె జరిపే ఏకాంత సంభాషణ. ఇదంతా సినిమా చూస్తే అర్థమౌతుంది. సినిమాకు బయటి సంగతులు?
ప్రపంచ సినిమా గతిని మార్చిన ‘న్యూ ఫ్రెంచ్ వేవ్’కు ఈ సినిమా ఒక శక్తిమంతమైన చేర్పు. 1959లో వచ్చింది. ఈ వేవ్‌లో శిఖరంగా చెప్పే ‘బ్రెత్‌లెస్’ కంటే ఏడాది ముందే విడుదలైందని తెలియడం అదనపు విశేషం. ఇదొక ఫ్రెంచ్–జపనీస్ ఉమ్మడి నిర్మాణం. తగినట్టుగానే ‘ఆమె’ ఫ్రెంచ్ నటి, ‘అతడు’ జపనీస్ నటుడు. ఎమాన్యుయెల్ రివా, ఎయిజీ ఒకాడా. వీళ్ల విశేషాలేమిటి? రివా సరిగ్గా తొంభై ఏళ్లు బతికి 2017లో చనిపోయింది.
ఆమె కవయిత్రి, ఫొటోగ్రాఫర్. ఇంకా చాంటెయూజ్. అంటే బార్ లేదా స్టేజ్ మీద పాడే నైట్‌క్లబ్ సింగర్. వీటన్నింటికంటే ఆకట్టుకునే విశేషం, ఆమె మరో సుప్రసిద్ధ సినిమా– ‘అమౌర్’. రెండిట్లోనూ ప్రేమ ఉంది చూశారా? అది విదేశీ భాషా చిత్రం విభాగంలో 2012లో ఆస్కార్ గెలుచుకున్న ఫ్రెంచ్ సినిమా.
ఈమెను ఇక్కడ వదిలేసి ‘అతడి’ దగ్గరికి వెళ్తే– ఓహో! ఈ ఎయిజీ ఒకాడా 1964లో వచ్చిన జపనీస్ కల్ట్ సినిమా ‘వుమన్ ఇన్ ద డ్యూన్స్’లో హీరోనట! అందుకేనా ఆ రెండింట్లోనూ ఒకే రకమైన మగటిమి నవ్వు ఉంటుంది! ఇలాంటి నవ్వు బహుశా యూకియో మిషిమా ఇష్టపడతాడు. ఈయనెందుకు వచ్చాడు మధ్యలో? అదే 1960ల్లో ఆయన్ని సాహిత్యంలో నోబెల్ పురస్కారం వరిస్తుందనుకున్నారు.
కండలు తీరి మంచి దేహదారుఢ్యంతో ఉండే మిషిమా వేషధారణ, జీవనశైలి ఒక యోధుడిని తలపించేది. జపనీస్ సాహిత్యం ‘సుకుమార హృదయ’ సంబంధి అనీ, దాన్ని తాను ‘మగటిమి’ దిశగా లాక్కెళ్తున్నాననీ అనేవాడు.
ఇంతకీ మనం దర్శకుడి గురించి వాకబు చేయనేలేదు. ఆయన పేరును ఫ్రెంచ్ ఉచ్చారణలో అలె రెనీ అనాలట. ఈ రెనీకి సంబంధించిన విశేషాలేమిటి? 1922లో జన్మించాడు. అంటే పోయినేడాదే శతజయంతి ఉత్సవాలు ముగిశాయి. దీనికంటే ముఖ్యమైనది, ప్రపంచ మేటి డాక్యుమెంటరీల్లో ఒకటిగా చెప్పే ‘నైట్ అండ్ ఫాగ్’కు దర్శకత్వం వహించడం! 1956లో వచ్చిన ఈ డాక్యుమెంటరీ నాజీ కాన్సంట్రేషన్ క్యాంపుల్లో శవాల గుట్టలుగా మిగిలిన యూదుల దయనీయ గాథను కడుపులో తిప్పేంత దగ్గరగా చూపుతుంది.
ఏ హేతువుకూ అందని దుర్మార్గం దాని పరాకాష్ఠకు చేరినప్పుడు మనిషనేవాడు కేవలం శవాల గుట్టల్లో కొన్ని గుర్తుపట్టని ఎముకలుగా మాత్రమే మిగిలిపోయే అత్యున్నత విషాదాన్ని చిత్రిస్తుంది. దర్శకుడిని వదిలేసి, ఆ సినిమాకు రచయితగా ఎవరు చేశారో చూద్దాం. మార్గ్యూరైట్ డురాస్. ఈమె ఫ్రెంచ్ రచయిత్రి.
‘ఫిడెలిటీ’(పాతివ్రత్య) భావాల పట్ల భిన్నాభిప్రాయాలు ఉన్నావిడ అని తెలియడం ఈమెకు సంబంధించి కొట్టొచ్చినట్టు కనబడే విశేషం. ఈమె కొన్ని సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. ఆ జాబితాలో ఏమైనా ఉండనీ, ‘ఇండియన్ సాంగ్’ అనే పేరున్న సినిమాకు దర్శకత్వం వహించారని తెలియడం భారతీయ మెదడును ఆకర్షిస్తుంది. ఆమె భావాలకు తగినట్టే భారత్‌లో ఫ్రెంచ్ రాయబారి భార్య తాలూకు వ్యక్తిగత సంబంధాల నేపథ్యంలో సాగుతుంది. గొప్ప సినిమా ఏం కాదని విమర్శకులు చెబుతున్నారు, కానీ దీనికి సీక్వెల్ కూడా వచ్చింది.
ఎటూ ఆటను హిరోషిమాతో మొదలుపెట్టాం కాబట్టి, మళ్లీ అక్కడికే వద్దాం. ఆ మహా విషాదాన్ని గుర్తుచేస్తూ ఇటీవలే ‘ఒపెన్‌హైమర్’ సినిమా వచ్చింది. అణుబాంబు పితగా అపఖ్యాతి పొందిన రాబర్ట్ ఒపెన్‌హైమర్ నేతృత్వంలో తయారు చేసిన బాంబులనే హిరోషిమా, నాగసాకి నగరాల మీద వరుసగా 1945 ఆగస్ట్ 6, 9 తేదీల్లో వదిలింది అమెరికా.
మరింత ఘోర చేదు వాస్తవం ఏమిటంటే, జపాన్‌ను లొంగదీసుకోవడం కోసం అమెరికా ఈ బాంబులు వేయలేదు; అప్పటికే జపాన్ ఓటమి అంచున ఉంది. కేవలం తన అణుపాటవ శక్తిని ప్రపంచానికి చాటడం కోసం ఈ బాంబుల్ని జారవిడిచింది. దీనివల్ల సుమారు మూడున్నర లక్షల మంది క్షణాల్లో బూడిదయ్యారు. లక్షల మంది ఏళ్లకేళ్లు దాని పర్యవసానాలు అనుభవించారు.
మూలమూలల్లోని సమాచారం ఎవరికైనా ఎప్పుడైనా అందుబాటులో ఉండటమే ఈ ఆధునిక కాలంలో నిజమైన స్వతంత్రం. ఆ ఉన్న సమాచారంతో ఏం చేస్తామనేది మన వివేకం!
అరచేతిలో స్వతంత్రం
Published Mon, Aug 14 2023 12:02 AM | Last Updated on Mon, Aug 14 2023 4:34 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment