నూరుపూలు వికసించనీ... వేయి భావాలు సంఘర్షించనీ అంటారు. కానీ, మనమిప్పుడు ఏ చిన్న వ్యతిరేక వ్యాఖ్యనైనా సహించలేని స్థితికి వచ్చేశామా? డిజిటల్, సోషల్ మీడియా విప్లవంతో జనం సమాచారం పంచుకోవడం నుంచి స్వేచ్ఛగా అభిప్రాయాలు వ్యక్తీకరణ దాకా – సమస్తం మారిపోయిన వేళ ప్రభుత్వాల నియంత్రణ ఎంత? ప్రతి ఒక్కరికీ అందుబాటుతో మీడియా ప్రజాస్వామికీకరణతో పాటు విచ్చలవిడితనమూ పెరిగే ప్రమాదం ఉన్నందున ఈ భారీ టెక్ సంస్థల బాధ్యత ఎంత? కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై ట్విట్టర్ మాజీ సీఈఓ, సహ వ్యవస్థాపకుడైన జాక్ డోర్సీ సోమవారం చేసిన సంచలన ఆరోపణలు ఇలాంటి ఎన్నో ప్రశ్నల్ని మరోసారి లేవనెత్తాయి.
అమెరికన్ యూట్యూబ్ షో ‘బ్రేకింగ్ పాయింట్స్’కు డోర్సీ ఇచ్చిన ఇంటర్వ్యూ భారత ప్రభుత్వానికీ, పాపులర్ సోషల్ మెసేజింగ్ వేదికకూ మధ్య కొనసాగుతున్న పోరులో కొత్త సంగతులను సోమవారం రాత్రి బయటపెట్టింది. రైతుల ఉద్యమ సమయంలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న పలు ట్విట్టర్ ఖాతాలను స్తంభింపజేయాల్సిందిగా భారత ప్రభుత్వం నుంచి పలు అభ్యర్థనలు వచ్చాయనేది ఆయన కథనం.
అంతకన్నా ఆందోళనకరమైనవి ఏమిటంటే – ప్రభుత్వ డిమాండ్లకు తలొగ్గకపోతే, భారత్‌లో ట్విట్టర్‌ను మూసివేయిస్తామనీ, దేశంలోని సంస్థ ఆఫీసులపైన, ఉద్యోగుల ఇళ్ళపైన దాడులు చేయిస్తామనీ గద్దె మీది పెద్దలు బెదిరించారట. డోర్సీ చేసిన ఈ ఆరోప ణలు తీవ్రమైనవి. సహజంగానే ప్రభుత్వం ఆ ఆరోపణల్ని పూర్తిగా తోసిపుచ్చింది.
అంతమాత్రాన కేంద్రంలో గడచిన తొమ్మిదేళ్ళ పైచిలుకు బీజేపీ హయాం సంప్రదాయ మీడి యాకైనా, సోషల్ మీడియాకైనా సవ్యంగా ఉందనుకోలేం. పత్రికలు, టీవీ ఛానళ్ళ నుంచి వెబ్‌సైట్లు, సోషల్ మీడియా దాకా అన్నిటినీ నయానో, భయానో తమ చెప్పుచేతల్లో ఉంచుకోవడానికి పాలకులు ప్రయత్నిస్తున్న తీరు కొత్తేమీ కాదు. కొన్ని జాతీయ టీవీ ఛానళ్ళను బీజేపీ పెద్దలు, వారి మిత్రులు, ఆశ్రితులు హస్తగతం చేసుకోవడమూ బహిరంగ రహస్యమే.
ఈ నేపథ్యంలో ట్విట్టర్ మాజీ పెద్ద చేసిన ఆరోపణలు అసత్యమో, సత్యమో కానీ... అసహజమని మాత్రం అనిపించట్లేదు. తొమ్మిదేళ్ళ చరిత్ర చూస్తే నమ్మశక్యంగానే ఉన్నాయి. అదే సమయంలో ట్విట్టర్ సారథ్యం వదిలేసిన ఇంతకాలానికి డోర్సీ ఇప్పుడు ఈ అంశాలను ఎందుకు లేవనెత్తుతున్నారన్నదీ ఆలోచించాల్సినదే!
ట్విట్టర్ పులు కడిగిన ముత్యం అనుకోలేం. పలు సందర్భాల్లో ఏకపక్షంగా వ్యవహరించిన చరిత్ర దానిది. పారదర్శకత లేకుండా ఈ తోక లేని పిట్ట తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన చర్యలు కూడా సవాలక్ష. స్వయంగా డోర్సీ సైతం వివాదాలకు అతీతులేమీ కాదు. 2018లో భారత్‌లో పర్యటించినప్పుడు ఆయన వివాదాస్పద పోస్టర్‌ను చేత ధరించిన ఘటన ఇప్పటికీ విశ్లేషకులకు గుర్తే. అలాగే, ఆయన హయాంలో ట్విట్టర్ తన అల్గారిథమ్ ద్వారా నచ్చినవారిని పెంచుతూ, నచ్చనివారిని తుంచుతూ నడిచిందన్న ఆరోపణలూ ఉన్నాయి.
ట్విట్టర్ కొత్త యజమాని ఎలాన్ మస్క్ సైతం అలాంటి కొన్ని అంతర్గత పత్రాలను బయటపెట్టారు. కొన్ని వార్తా కథనాలను నిరో ధిస్తూ, కొన్ని ఖాతాలను స్తంభింపజేశాక ఇలాంటి వేదికలకు ఇక తటస్థత ఎక్కడున్నట్టు? పారదర్శ కత, జవాబుదారీతనం లేనప్పుడు ట్విట్టరే కాదు... ఏ సోషల్ మీడియా వేదికకైనా పవిత్రత, గౌరవం ఏం ఉంటాయి? పాలకులను అవి వేలెత్తి చూపితే, మూడు వేళ్ళు వాటినే వెక్కిరిస్తాయి.
అలాగని ఆ లోపాలే సందుగా... పాలక పక్షాలు, ప్రభుత్వాలు సోషల్ మీడియా సహా సమస్త భావప్రసార వేదికల పైనా స్వారీ చేస్తుంటే సమర్థించలేం. సోమవారం ఒకపక్కన ‘కోవిన్’ పోర్టల్ లోని పౌరుల సమాచారం అంగట్లో లభిస్తున్నట్టు బయటపడ్డ కొద్ది గంటల్లోనే, డోర్సీ సంచలన ఆరోపణలూ రావడం యాదృచ్ఛికమే కావచ్చు. కానీ, వార్తలనైనా, వ్యాఖ్యలనైనా... నోటితో ఖండించడమే తప్ప సర్కార్ తన సమర్థత, నిర్దోషిత్వాలను నిరూపించుకొనేందుకు ప్రయత్నించడం లేదు.
నిజానికి, 2021 ఫిబ్రవరిలో సైతం దాదాపు 250 ఖాతాలనూ, ట్వీట్లనూ తొలగించమంటూ పాలకుల నుంచి ఆదేశాలు వచ్చినప్పుడు ట్విట్టర్ ప్రతిఘటించింది. బీజేపీ అధికార ప్రతినిధి ఒకరు చేసిన వివాదాస్పద ట్వీట్‌కు ‘మ్యానిప్యులేటెడ్ మీడియా’ అని ట్యాగ్ తగిలించేసరికి, 2021 మే నెలలో తన కార్యాలయాలపై ఢిల్లీ పోలీసు దాడులను ఎదుర్కోవాల్సి వచ్చింది. చివరకు ఇలా రహస్యంగా, అడ్డగోలుగా సాగుతున్న ఈ సెన్సార్‌షిప్ డిమాండ్లపై కర్ణాటక హైకోర్ట్‌లో రిట్ పిటిషన్ వేసింది. అప్పుడైనా, ఇప్పుడైనా ప్రభుత్వం ఆరోపణల్ని తోసిపుచ్చడానికే పరిమితమైంది.
ధ్రువీకృత జర్నలిస్టులు, వార్తా సంస్థల ఖాతాలు పోస్ట్‌లను సైతం స్తంభింపజేయమంటూ మన దేశం నుంచి ట్విట్టర్‌కు వస్తున్న డిమాండ్లే ఎక్కువట. 2021 ద్వితీయార్ధంలో మొత్తం 326 లీగల్ డిమాండ్లొస్తే, అందులో 114 మన దేశానివే. మొత్తం మీద పాలకులకు ప్రజా ఉద్యమాలు, ప్రతికూల వ్యాఖ్యలంటే దడ పుడుతున్నట్టుంది. రైతు ఉద్యమమైనా, రెజ్లర్ల నిరసనైనా సర్కార్ శైలి ఒకటే– ముందు ఉదాసీనత, తర్వాత అణచివేత.
ప్రజాక్షేత్రంలో వ్యవహారం బెడిసి కొడుతోందనిపిస్తే – ఆఖరికి అత్యవసర కంటి తుడుపు కార్యాచరణ. ఏ రకంగా చూసినా ఇది సరి కాదు. ట్విట్టర్ సహా అన్నీ జవాబుదారీతనంతో, స్థానిక చట్టాలకు కట్టుబడాలి. అదెంత ముఖ్యమో, బెదిరింపు ధోరణులు ప్రజాస్వామ్య విలువలకే మచ్చ అని పాలకులు గ్రహించడం అంత కీలకం. ఆ రెండూ జరగనంత కాలం ఇవాళ డోర్సీ... రేపు మరొకరు... పేరు మారవచ్చేమో కానీ, ఆరోపణల తీరు, సారం మారవు.
Comments
Please login to add a commentAdd a comment