
జనతంత్రం
పేదరికం కారణంగా కొంతమంది ఏపీ విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయలేకపోయారన్న వార్తలు వస్తున్నాయి. మన పాలక వ్యవస్థ సిగ్గుతో తలదించుకోవలసిన పరిణామం ఇది. ఉన్న ఊళ్లో ఉపాధి లేక పొట్టకూటికోసం వెనుకబడిన ప్రాంతాల ప్రజలు వలసబాట పడుతున్నారు. చదువుకుంటున్న వారి పిల్లలు కూడా గత్యంతరం లేక తల్లిదండ్రులను అనుసరించవలసి వస్తున్నది.
వారిలో పదో తరగతి చదివిన పిల్లలు కూడా ఉన్నారు. వలస కారణంగా వారు కీలకమైన పదో క్లాసు పరీక్షలకు దూరమయ్యారు. వారి భవిష్యత్తు గురించి వ్యవస్థ పట్టించు కోనట్టయితే డ్రాపవుట్లుగా మిగిలే అవకాశం ఉన్నది. వారి భావి జీవితం వలసకూలి టైటిల్‌తో ముడిపడే ప్రమాదం ఉన్నది.
‘‘ఒక్క మలినాశ్రు బిందువొరిగినంత వరకు... ఈ సిగ్గులేని ముఖాన్ని చూపించలేను’’ అంటాడు కవి బాలగంగాధర తిలక్. నిజంగా ప్రజల ఆలనాపాలనా చూడవలసిన ఏపీ సర్కార్‌కు మాత్రం అటువంటి సెంటిమెంట్లేవీ లేవు. ఇప్పుడు ఒక్క కన్నీటి బొట్టు రాలడం కాదు. మూర్తీభవించిన కన్నీరు దారిపొడుగునా ప్రవహిస్తున్నది.
‘‘జగన్ సర్కార్ అమలు చేసిన ‘అమ్మ ఒడి’ పథకాన్ని కొనసాగించి ఉన్నట్లయితే మా పిల్లలు తప్పకుండా పదో తరగతి పరీక్ష రాసేవార’’ని పిల్లల తల్లిదండ్రులు చెబుతున్నారు. నాణ్యమైన సార్వత్రిక విద్యను అమలు చేయడం కోసం జగన్ మోహన్ రెడ్డి ఎంతగా మేధామథనం జరిపి పథకాన్ని రూపొందించి ఉంటారో ఈ విషాద పరిణామాన్ని చూస్తే అర్థమవు తున్నది.
మన దేశంలో విద్యాహక్కు చట్టం అమలులో ఉన్నది. అటు వంటి చట్టాన్ని అమలు చేయాలని భారత రాజ్యాంగం కూడా ఆదేశించింది. దురదృష్టవశాత్తు ఇది మొక్కుబడి తతంగంగా మారిందన్న సంగతి అందరికీ తెలిసిందే. బడికి వచ్చే పిల్లలకు అరకొర చదువు చెప్పడం ప్రభుత్వ స్కూళ్ల కర్తవ్యంగా మారి పోయింది.
ఉద్దేశపూర్వకంగా తలెత్తిన ఈ ధోరణి ఫలితంగా తామరతంపరగా ప్రైవేట్ విద్యాసంస్థలు పట్టుకొచ్చాయి. స్థోమత ఉన్నవాళ్లంతా ప్రైవేట్ స్కూళ్లలో మెరుగైన విద్యను కొనుగోలు చేయడం, పేద పిల్లలు సర్కారు బడి చదువులతో పోటీలో నిలవలేకపోవడం... గత మూడు దశాబ్దాలుగా బాగా ఎక్కువైంది. ఈ ధోరణి పట్ల పలువురు ప్రగతిశీల సామాజిక వేత్తలు, మేధావులు అసహనాన్నీ, ఆందోళననూ వ్యక్తం చేస్తూనే ఉన్నారు.
ఐక్యరాజ్య సమితి సైతం తన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో (ఎస్‌డీజీలు) పిల్లలందరికీ నాణ్యమైన విద్య ఉచితంగా సమా నంగా అందుబాటులో ఉండాలని నాలుగో లక్ష్యంగా నిర్దేశించింది. మన్నికైన జీవన ప్రమాణాలతో మానవజాతి దీర్ఘకాలం పాటు ఈ భూగోళంపై మనుగడ సాగించాలంటే ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడం అవసరమేనని మేధాప్రపంచం అభిప్రాయపడుతున్న సంగతి తెలిసిందే.
కానీ పాలకుల్లో చిత్త శుద్ధి లేకపోవడం ఈ లక్ష్యాలకు ఆటంకంగా మారింది. ఉదార ప్రజాస్వామిక వ్యవస్థలు క్రమంగా ‘ప్లుటానమీ’ (సంపన్నులు శాసించే వ్యవస్థలు)లుగా పరివర్తనం చెందుతున్నాయని పలు వురు పొలిటకల్ ఎకనామిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైన దశాబ్ద్ద కాలానికి ఈ పదప్రయోగం వ్యాప్తిలోకి వచ్చింది.
సంస్కరణలు ప్రారంభమైన తొలి దశాబ్దిలో క్రియాశీలకంగా ఉన్న రాజకీయ నాయకుల్లో చంద్రబాబు కూడా ఒకరు. ప్రజలకు ఏదీ ఉచితంగా ఇవ్వరాదనే వాదాన్ని ఆయన బలంగా వినిపించేవారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ డిమాండ్‌ను ఆయన ఎంత తీవ్రంగా వ్యతిరేకించేవారో చాలామందికి గుర్తుండే ఉంటుంది.
రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో అమలుచేసిన తర్వాత ఈ అంశానికి సర్వత్రా ఆమోదం లభించింది. అలాగే ప్రభుత్వ సేవలన్నింటికీ ప్రజలు యూజర్ ఛార్జీలు చెల్లించాలనే నియమం పెట్టింది కూడా చంద్రబాబే! మితిమీరిన ప్రైవేటీకరణ సూపర్ రిచ్ వర్గాన్ని సృష్టించడం, తిరిగి ఆ వర్గం మొత్తం ఆర్థిక – రాజకీయ వ్యవస్థలను ప్రభా వితం చేయడం ప్లుటానమీకి దారి తీస్తున్నది.
ఇటువంటి వ్యవస్థల్లో సహజ వనరుల దగ్గ ర్నుంచి సర్వే సర్వత్రా ప్రైవేటీకరణే తారకమంత్రంగా పనిచేస్తుంది. విద్యారంగం ఇందుకు మినహాయింపేమీ కాదు. విభజిత రాష్ట్రానికి మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ‘విద్య ప్రభుత్వ బాధ్యత కాద’ని చంద్రబాబు వ్యాఖ్యానించిన సంగతిని గుర్తు చేసుకోవడం అవసరం. ఈ నేపథ్యాన్ని అర్థం చేసు కుంటేనే జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ రంగంలో నిర్మించిన 17 మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాలని ఎందుకనుకుంటున్నారో అర్థమవుతుంది.
అమరావతి కోసం అరవై వేల కోట్ల రూపాయల అప్పును ఆగమేఘాల మీద పుట్టించగలిగిన వ్యక్తి, తాను పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్న ‘తల్లికి వందనం’ ఎందుకు అమలుచేయలేకపోయాడో అర్థమవుతుంది. ఈ పూర్వరంగం అర్థం కానట్లయితే ఆర్థిక వెసులుబాటు లేకనే అమలు చేయలేకపోయారనే మోసపు ప్రచారానికి తలూప వలసి వస్తుంది.
విద్యారంగంలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. పూర్తి ప్రజాస్వామికీకరణ చర్య లను చేపట్టింది. ప్రజల ఆకాంక్షల మేరకు ఇంగ్లిష్ మీడియం బోధనను ప్రారంభించింది. భాషా – సంస్కృతుల ముసుగులో పెత్తందారులు ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా చలించలేదు. సీబీఎస్‌ఈ సిలబస్‌ను విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చింది.
నగరాల్లో సూపర్ రిచ్ పిల్లలకు మాత్రమే పరిమితమైన అంతర్జాతీయ స్థాయి ఐబీ సిలబస్‌ను పిల్లలందరికీ ఉచితంగా ఈ సంవత్సరం నుంచి అమలుచేయడానికి అన్ని ఏర్పాట్లూ చేసింది. అంతర్జా తీయ స్థాయిలో మన పిల్లలు పోటీపడాలన్న తపనతో చేపట్టిన కార్యక్రమాలివి. డిజిటల్ యుగంలో తన రాష్ట్ర విద్యార్థులు ప్రపంచ స్థాయిలో వెలుగొందాలని పాఠశాలల్లో డిజిటల్ బోర్డు లను ఏర్పాటు చేయించారు. ఎనిమిదో క్లాసు నుంచి విద్యార్థుల చేతికి ట్యాబ్‌లను ఉచితంగా అందజేశారు.
పాఠశాల విద్యార్థులకు పౌష్టికాహార లోపం లేకుండా చూడాలని ముఖ్యమంత్రి స్వయంగా పూనుకొని తయారు చేయించిన మెనూతో మధ్యాహ్న భోజన పథకాన్ని విజయవంతంగా నిర్వహించారు. విద్యార్థులపై పైసా భారం పడకుండా పుస్తకాలు, బ్యాగ్, బెల్ట్, యూనిఫామ్‌లను పాఠశాలల ప్రారంభానికి ముందే సిద్ధం చేసి ఉంచేవారు. మూడు నుంచి ఐదో తరగతి వరకు చదివే విద్యార్థులకు అన్ని సబ్జెక్టులూ ఏకోపాధ్యా యుడే బోధించే పద్ధతికి స్వస్తిచెప్పి వారికి సబ్జెక్టు వారీగా బోధించే టీచర్లను ఏర్పాటు చేశారు.
ఇందుకోసం ఆ మూడు తరగతులను కిలోమీటర్ పరిధి లోపల ఉండే అప్పర్ ప్రైమరీ, హైస్కూళ్లలో విలీనం చేశారు. ఫలితంగా ఆ విద్యార్థులకు సబ్జెక్టు టీచర్ల సదుపాయం ఏర్పడింది. ఆ వయసు పిల్లల్లో గ్రాహ్యశక్తి బలంగా ఉంటుందన్న అధ్యయనాలను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐదేళ్ల తన పదవీ కాలంలో రెండేళ్లు కోవిడ్ కోతకు గురైనప్పటికీ పాఠశాల విద్యారంగంలో పెను మార్పులకు జగన్ తెరతీశారు.
పేద – ధనిక తేడాల్లేని, లింగవివక్ష అసలే లేని ఒక నవ యుగ విద్యాసౌధ నిర్మాణం కోసం ఇన్ని ఇటుకల్ని పేర్చిన వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డి తప్ప ఈ దేశంలో మరొకరు లేరు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా విద్యావ్యవస్థ పునర్నిర్మాణా నికి ఇంత వేగంగా అడుగులు వేసిన వ్యక్తి కూడా మరొకరు కాన రారు. కేరళ రాష్ట్ర విద్యారంగం మొదటి నుంచీ కూడా మిగతా దేశంతో పోల్చితే ఆరోగ్యంగానే ఉన్నది. ఆర్థిక సంస్కరణల తర్వాత కూడా అది తన ప్రతిష్ఠను కాపాడుకోగలిగింది.
చదువుల తల్లి సరస్వతిని అమ్ముకోవడం తరతరాలుగా మన సంస్కృతిలో తప్పుగానే భావిస్తున్నారు. ఇందుకు ఆంధ్ర భాగవతం కర్త బమ్మెర పోతనామాత్యులే ఉదాహరణ. ‘‘బాల రసాలసాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ / కూళలకిచ్చి యప్పడుపు కూడు భుజించుట కంటె సత్కవుల్ / హాలికులైననేమి? గహనాంతర సీమల కందమూల / కౌద్దాలికు లైననేమి నిజ దార సుతోదర పోషణార్థమై’’ అన్నారు.
తాను రాసిన కావ్యాన్ని సరస్వతిగా భావించి, దాన్ని రాజులకు అంకిత మివ్వడానికి ఆయన నిరాకరించారు. అలా వచ్చిన సొమ్ము పడుపువృత్తితో వచ్చిన సొమ్ముగా ఆయన అసహ్యించుకున్నారు. ఆ సంప్రదాయానికి విరుద్ధంగా ఇప్పుడు చదువుల తల్లిని అంగట్లో నిలబెట్టి అమ్ముకుంటున్నారు. దానికి మనం ఎన్ను కున్న ఏలికలు వత్తాసుగా నిలబడుతున్నారు.
చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరమే ఆరు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లను విడిచిపెట్టి ప్రైవేట్ స్కూళ్లలో చేరారు. ఆయన అధికారంలోకి వస్తే ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం రద్దవుతుందన్న భయం ఒక కారణం. ఎంతమంది పిల్లలున్నా అందరికీ ‘తల్లికి వందనం’ కింద డబ్బులొస్తా్తయనే నమ్మకం కూడా ఇంకో కారణం కావచ్చు. అట్లా మారిన విద్యార్థులు ఇప్పుడు ఫీజులు కట్టలేక అల్లాడు తున్నారు.
ఇంగ్లీషు మీడియాన్ని రద్దు చేస్తారనే ప్రచారం, సీబీఎస్‌ఈ సిలబస్‌ను ఎత్తేయడం దేన్ని సూచిస్తున్నాయి? ఎని మిదో తరగతి నుంచి విద్యార్థులకు ఇచ్చే ట్యాబ్‌లను నిలిపి వేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన ట్యాబ్‌లలో కొత్త కంటెంట్ లోడ్ చేయలేదు. ‘నాడు–నేడు’ కార్యక్రమం కింద దాదాపు ఇరవై వేల స్కూళ్లలో సౌకర్యాలను ప్రైవేట్ స్కూళ్ల కంటే మిన్నగా జగన్ ప్రభుత్వం మెరుగుపరిచింది.
మిగిలిన స్కూళ్లలో ఆ కార్యక్ర మాన్ని నిలిపివేశారు. మధ్యాహ్న భోజనం నాణ్యత చాలాచోట్ల నాసిరకంగా మారింది. మూడు నుంచి ఐదో తరగతి చదివే విద్యార్థులకు గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్‌ను ఎత్తేస్తారట! ఇవన్నీ చూస్తుంటే ప్రభుత్వ స్కూళ్లపై ప్రజలకు ఏర్పడ్డ నమ్మకాన్ని చంపేయడమే లక్ష్యంగా పెట్టు కున్నట్టు కనిపిస్తున్నది.
మరోపక్క పెద్ద ఎత్తున ప్రైవేట్ స్కూళ్లకు, జూనియర్ కాలేజీలకు అనుమతులిస్తున్నారన్న ప్రచారం సాగుతున్నది. ప్రభుత్వ స్కూళ్ల సంఖ్యను పెద్ద ఎత్తున తగ్గించబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతున్నది. మెడికల్ కాలేజీల సంగతి తెలిసిందే! మరోసారి ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో ప్రైవేట్ జేగంట మోగుతున్నది. అంగడి చదువులు మళ్లీ రంగప్రవేశం చేస్తున్నాయి. విద్యా విప్లవానికి గ్రహణం పట్టింది. ఈ ప్రభుత్వం మారితేనే గ్రహణం విడిచేది!
వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com
Comments
Please login to add a commentAdd a comment