విద్యార్థుల జీవితాలతో చెలగాటమా?: వైఎస్‌ జగన్‌ | Ys Jagan Mohan Reddy Questioned Chandrababu Naidu Government Over Fee Reimbursement | Sakshi
Sakshi News home page

విద్యార్థుల జీవితాలతో చెలగాటమా?: వైఎస్‌ జగన్‌

Published Mon, Nov 25 2024 5:28 AM | Last Updated on Mon, Nov 25 2024 1:01 PM

YS Jagan Mohan Reddy questioned Chandrababu Naidu government

చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదు? 

మూడు త్రైమాసికాలుగా బకాయిలు పెట్టడం భావ్యమా? 

ఫీజులు కట్టకపోతే కాలేజీలకు రానివ్వడం లేదు 

చదువు పూర్తయిన వారికి సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు 

ఫీజు కట్టలేక ఓ విద్యార్థి పనులకు వెళ్తుండటం నన్ను కలచివేసింది 

విద్యార్థులపై కక్షకట్టినట్టు వ్యవహరిస్తుండటం సరికాదు  

కూటమి పాలనలో విద్యతో పాటు అన్ని రంగాల్లో తిరోగమనం 

ఇంగ్లిష్‌ మీడియం, సీబీఎస్‌ఈ నుంచి ఐబీ దాకా అన్నీ రద్దే 

మా ప్రభుత్వ హయాంలో ప్రతి త్రైమాసికం పూర్తి కాగానే తల్లుల ఖాతాలో నగదు జమ  

విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకే రూ.18 వేల కోట్లు ఇచ్చాం 

చదువులకు నిలయమైన ఏపీలో ఇప్పుడు దౌర్భాగ్యకర పరిస్థితులు 

ఇసుక స్కాం, లిక్కర్‌ స్కాం, పేకాట క్లబ్బులు, మాఫియా సామ్రాజ్యాలు 

ప్రైవేటీకరణ ముసుగులో స్కాములు చేస్తూ దోచుకోవడాలు.. 

ఇవి తప్ప పిల్లల చదువుల పట్ల శ్రద్ధ ఏదీ? 

ఇప్పటికైనా అమ్మకు వందనం, వసతి దీవెన, విద్యా దీవెన డబ్బులు వెంటనే విడుదల చేయాలి  

సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో మూడు త్రైమాసికాలుగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బులను చెల్లించక పోవడంతో విద్యార్థులు చదువులు మానుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. ప్రకాశం జిల్లా జె.పంగులూరులో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రాక, ఫీజులు కట్టలేక.. పనులకు వెళుతున్న ఓ విద్యార్థి దీనావస్థ నాకు వేదన కలిగించింది.

విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతారా?’ అని చంద్రబాబు ప్రభుత్వాన్ని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిలదీశారు. తక్షణమే అమ్మకు వందనం, ఫీజు రీయింబర్స్‌మెంటుతోపాటు వసతి దీవెన డబ్బులు కూడా విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. పిల్లల చదువులను దెబ్బతీసే చంద్రబాబు నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఈ మేరకు ఆదివారం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. 

ఫీజులు కట్టకపోతే కాలేజీలకు రానివ్వడం లేదని, చదువు పూర్తి చేసిన వారు బకాయిలు కడితేగానీ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా 11 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారని తెలిపారు. ఆ పోస్టులో వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

1 చంద్రబాబు కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది. మూడు త్రైమాసికాలుగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బులను పిల్లల చదువులకు చెల్లించక పోవడంతో వారు చదువులు మానుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. చంద్రబాబు వారిపై కక్షకట్టినట్టు వ్యవహరిస్తున్నారు.

2 చంద్రబాబు అధికారంలోకి రాగానే అన్ని రంగాల్లోనూ తిరోగమనమే కనిపిస్తోంది. ముఖ్యంగా విద్యా రంగాన్ని దారుణంగా దెబ్బ తీశారు. అమ్మ ఒడిని, ఇంగ్లీష్‌ మీడియంను, 3వ తరగతి నుంచి టోఫెల్, 3వ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్లు, సీబీఎస్‌ఈ, సీబీఎస్‌ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం, 8వ తరగతి పిల్లలకు ట్యాబులు, బైజూస్‌ కంటెంట్, నాడు–నేడు.. ఇలా అన్నింటినీ రద్దు చేసి, 1–12 వ తరగతి విద్యార్థులను, వారి తల్లిదండ్రులను దెబ్బ తీశారు. వసతి దీవెన, విద్యా దీవెన నిలిపేసి.. డిగ్రీ, ఇంజినీరింగ్, డాక్టర్‌ చదువులు చదువుతున్న వారినీ తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు.

3 వైఎస్సార్‌సీపీ హయాంలో ప్రతి త్రైమాసికం పూర్తి కాగానే తల్లుల ఖాతాలో నగదు  జమ చేసే వాళ్లం. ఇలా గత విద్యా సంవత్సరం డిసెంబర్‌ త్రైమాసికం వరకు రూ.12,609 కోట్లు ఒక్క విద్యా దీవెనకే ఖర్చు చేశాం. తల రాతలను మార్చేది చదువులు మాత్రమేనని గట్టిగా నమ్ముతూ వైఎస్సార్‌సీపీ హయాంలో ఈ రెండు (విద్యా దీవెన, వసతి దీవెన) పథకాలకే రూ.18 వేల కోట్ల వరకు ఖర్చు చేశాం.

ఎన్నికల కోడ్‌ కారణంగా జనవరి–మార్చి త్రైమాసికానికి, ఏప్రిల్‌లో వెరిఫికేషన్‌ చేసి మే నెలలో ఇవ్వాల్సిన ఫీజు డబ్బులు ఇవ్వనీయకుండా ఇదే కూటమి పారీ్టల వారు ఈసీకి ఫిర్యాదు చేశారు. పోనీ, ఎన్నికలు అయిన తర్వాత వీళ్లు జూన్‌లో అయినా ఇచ్చారా అంటే అదీ లేదు. అప్పటి నుంచి ఒక్క పైసా కూడా చెల్లించడం లేదు. ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన వసతి దీవెన పరిస్థితి కూడా అంతే. తర్వాత ఏప్రిల్‌–జూన్, జూలై–సెపె్టంబర్‌ త్రైమాసికాలకు సంబంధించి ఫీజుల చెల్లింపులో ఎలాంటి అడుగూ ముందుకు పడటం లేదు. 

YS Jagan: కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ ఆగ్రహం

ఇప్పుడు అక్టోబర్‌–డిసెంబర్‌ త్రైమాసికం కూడా సగం గడిచి పోయింది. దీంతో కలుపుకుంటే సుమారు రూ.2,800 కోట్లకుపైగా ఫీజులు రీయింబర్స్‌ చేయాల్సి ఉంది. మరో రూ.1,100 కోట్లు లాడ్జింగ్, బోర్డింగ్‌ ఖర్చుల కింద వసతి దీవెన బకాయిలు కూడా ఉన్నాయి. మొత్తంగా బకాయిలు పెట్టిన డబ్బులు డిసెంబర్‌ నాటికి రూ.3,900 కోట్లకు చేరుకుంటాయి. కానీ, ఈ ప్రభుత్వం తీరు చూస్తే మాటలేమో కోటలు దాటుతున్నాయి.. కాళ్లేమో గడప కూడా దాటడం లేదు.

5 ఫీజులు కట్టకపోతే కాలేజీలకు రానివ్వడం లేదు. చదువులు పూర్తి చేసిన వారికి బకాయిలు కడితేగానీ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఇలా 11 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. చేసేదిలేక తల్లిదండ్రులు అప్పులు చేయడమో, వాటిని తీర్చలేక ఆస్తులు అమ్ముకోవ­డమో చేయాల్సి వస్తోంది. ఏదారీ లేని వారు తమ పిల్లలను పనులకు తీసుకెళ్తున్నారు. చదువులకు నిలయమైన ఏపీలో దౌర్భాగ్యకర పరిస్థితులు ఇలా ఉన్నాయి.

కూటమి ప్రభుత్వం వచ్చాక ఇసుక స్కాం, లిక్కర్‌ స్కాం, పేకాట క్లబ్బులు, మాఫియా సామ్రాజ్యాలు, ప్రైవేటీకరణ ముసుగులో స్కాములు చేస్తూ మెడికల్‌ కాలేజీలు, ప్రభుత్వ పోర్టులను దోచిపెట్టడాలు తప్ప పిల్లల చదువుల మీద శ్రద్ధ లేకుండా పోయింది. వెంటనే అమ్మకు వందనం, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సహా వసతి దీవెన డబ్బులు విడుదల చేయాలని గట్టిగా డిమాండ్‌ చేస్తున్నాం. పిల్లల చదువులను దెబ్బతీసే చంద్రబాబు నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement