కొద్ది కాలం క్రితం ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కొన్ని ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వ హయంలో తీసుకువచ్చిన సంస్కరణలు ఏలా సాగుతున్నాయో చూశారు. పాఠశాలల రూపురేఖలు సమూలంగా మారిపోవడం, డిజిటల్ బోర్డులు, పిల్లల చేతిలో ట్యాబ్‌లు, అడిగిన వెంటనే కొంత మంది విద్యార్థులు ఆంగ్లంలో మాట్లాడటం వంటి సన్నివేశాలు కనిపించాయి. దాంతో లోకేష్ కూడా వైఎస్ జగన్ ప్రభుత్వంపై పెద్దగా విమర్శలు ఏమీ చేయకుండా వెళ్లిపోయారు.
అయితే, ఆ స్కూల్లో లోటు పాట్లు కనిపించి ఉంటే మంత్రి హోదాలో ఆయన ఎంత గందరగోళం సృష్టించే వారో. విద్యా రంగానికి సంబంధించి వైఎస్ జగన్ తీసుకువచ్చిన సంస్కరణలు ఏలా ఉన్నాయో స్వయంగా గమనించినా, మొత్తం విద్యా వ్యవస్థను వెనక్కు నడిపించేందుకు లోకేశ్, సీఎం చంద్రబాబులు సిద్ధమైనట్లుగా కనిపిస్తోంది. సీబీఎస్‌ఈ సిలబస్‌ను రద్దు చేయాలన్న నిర్ణయమే ఇందుకు తాజా సాక్ష్యం. కొన్ని సందర్బాల్లో ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకంగా మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన విద్య లేకుండా చేస్తున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు.
ఒక వైపు తెలంగాణలో ప్రభుత్వం సెంట్రల్ సిలబస్ ప్రవేశపెట్టాలని, ఎయిడెడ్ స్కూల్లో కూడా అదే విధానం అమలు చేయాలని తలపెట్టినట్లు కథనాలు వచ్చాయి. ప్రపంచంతో పోటీ పడాలని సీబీఎస్‌ఈ విధానం తీసుకువస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం చెబుతుంటే.. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం అందుకు వ్యతిరేకంగా ప్రభుత్వ స్కూళ్లలో ఇప్పటికే అమలు అవుతున్న విధానాలకు మంగళం పాడుతున్నారు. అంతర్జాతీయ స్కూళ్లతో పాటు తెలంగాణలోని కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా సిలబస్‌లో మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తూంటే ఏపీలో ఇప్పటికే అమలు అవుతున్న ఆ సిలబస్‌ను, ఇతర సంస్కరణలను ఎత్తివేయాలని సంకల్పించడం అత్యంత శోచనీయం.
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మాదిరి తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేసి ఈ ప్రయత్నాలు సాగిస్తోంది.స్టేట్ సిలబస్ వల్ల ప్రభుత్వ స్కూల్స్ పిల్లలు రాణించ లేకపోతున్నారని తెలంగాణ మార్పులు తీసుకువస్తుంటే ఏపీలో ఇప్పటికే దేశం అంతటిని ఆకర్షించిన ప్రభుత్వ విద్యా వ్యవస్థను నీరు గార్చే ప్రయత్నం జరగడం అత్యంత దురదృష్టకరం. ఆంగ్ల మీడియంలో మిషనరీ స్కూళ్లు, ప్రతిష్టాత్మకమైన కాలేజీ, అమెరికాలో ఖ్యాతిగాంచిన యూనివర్సిటీలో చదువుకున్న లోకేష్ ఏపీలో కూడా అదే స్థాయిలో ప్రభుత్వ స్కూళ్లను మరింతగా తీర్చిదిద్దడానికి ప్రయత్నించాల్సింది పోయి, ఉన్న పేద విద్యార్ధులకు ఉపయెగపడే వ్యవస్థలను ధ్వంసం చేస్తూ కార్పొరేట్లకు ప్రయోజనం కలిగించేలా చర్యలు చేపట్టం అంతా బాగలేదు.
వైఎస్ జగన్ హయంలో ప్రభుత్వ స్కూల్స్ కళకళలాడాయి. చదువుతో పాటు పిల్లలు తీసుకునే ఆహారం, వారు ధరించే దుస్తులు, బూట్లు, మొదలైన అన్నింటిపై చాలా శ్రద్ద తీసుకునే వారు. కేంద్రం తీసుకువచ్చిన విద్యా విధానంతోపాటు పిల్లల భవిష్యత్‌కు ఉపయోగపడే టోఫెల్, ఇంటర్నేషనల్ బాకులరేట్(ఐబి) బోధనకు కూడా వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. వాటి అన్నింటి ఫలితంగానే వైఎస్సార్‌సీపీ హయంలో విద్యా వ్యవస్థకు మంచిపేరు వచ్చింది. పలు రాష్ట్రాల బృందాలు వచ్చి పరిశీలించి వెళ్లాయి. ఏపీ నుంచి ప్రభుత్వ స్కూల్ పిల్లలు ఐక్యరాజ్యసమితి కూడా వెళ్లి మాట్లాడి వచ్చారు. అందుకే ప్రభుత్వ స్కూల్లో విద్యార్ధులు జగన్ మామయ్య అంటూ అప్యాయంగా పిలుచుకునేవారు. ఆయా కార్యక్రమాల్లో వారు ఆంగ్లంలో ప్రసంగించిన తీరు అందరిని ఆకట్టుకునేది. బహుశా ఆ గుర్తులు అన్నింటినీ చెరిపేయాలని భావనతోనే చంద్రబాబు, లోకేష్‌ల ప్రభుత్వం పేద పిల్లలకు ఉపయోగపడే సిలబస్ మార్చివేస్తున్నట్టుగా ఉంది.
ఇదే సమయంలో ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీల్లో మాత్రం ఆంగ్ల మీడియం, సీబీఎస్‌ఈ సిలబస్‌లు మాత్రం యథా ప్రకారం కొనసాగుతాయి. తత్ఫలితంగా పేద పిల్లలు సైతం ప్రైవేట్ బడుల వైపు చూసే పరిస్థితిని చంద్రబాబు ప్రభుత్వం సృష్టించిందని అనుకోవాలి. ఇప్పటికే రెండు లక్షల మంది ప్రభుత్వ స్కూల్ పిల్లలు ప్రైవేట్ వైపు మళ్లారని మీడియాలో కథనాలు వచ్చాయి. సీబీఎస్‌ఈ విద్యను అందించడం కోసం తొలుత వెయ్యి ప్రభుత్వ స్కూల్‌ను జగన్ ప్రభుత్వం ఎంపిక చేసి అమలు చేసింది. కానీ, ఇప్పుడు దాన్ని ఎత్తి వేస్తుండటంతో సుమారు 84వేల మంది విద్యార్ధులు నష్టపోతున్నారని అంచనా.
ఒక యూనిట్ పరీక్షలు ముగిసిన తర్వాత ఇలాంటి గందరగోళం ఎందుకు సృష్టించారో అర్థం కాదు. ఇంగ్లీష్‌లో ప్రావీణ్యం సాధించేందుకు వీలుగా జగన్ ప్రభుత్వం టోఫెల్ శిక్షణను తీసుకువచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో నిర్వహించిన టోఫెల్ జూనియర్ విభాగంలో దాదాపు 11.75 లక్షల మంది, ప్రైమరీ విభాగంలో 4.17 లక్షల మంది విద్యార్ధులు పరీక్షలు రాశారు. ఈ పరీక్షల్లో పాస్ అయిన విద్యార్ధులకు అమెరికాకు చెందిన ఈటీఎస్ అనే సంస్థ సర్టిఫికెట్లను ఇస్తుంది. కానీ, టీడీపీ కూటమి ప్రభుత్వం పరీక్ష ఫలితాలను ప్రకటించకపోగా ఈ విద్యా సంవత్సరంలో మొత్తం టోఫెల్‌ను రద్దు చేసింది. ఇలాగే అంతర్జాతీయ స్థాయిలోని ఐబీ కోర్సును కూడా రద్దు చేశారు. కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు పిల్లల దగ్గర లక్షల ఫీజులు వసూలు చేసి ఐబీ సిలబస్‌ను అందిస్తున్నాయి. అలాంటిది పేద పిల్లలకు ఉచితంగా అందించడం కోసం వైఎస్ జగన్ తీసుకువచ్చిన ఈ కోర్స్‌ను ఎత్తివేయడం దురదృష్టకరం.
పెద్దగా చదువుకోని పవన్ కళ్యాణ్ వంటి వారు వీటికి వ్యతిరేకంగా మాట్లాడితే అర్ధం చేసుకోవచ్చు కానీ, అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించిన లోకేష్ ఇలాంటి నిర్ణయాలు చేయడం ఏపీలోని పేద విద్యార్ధులకు అశనిపాతమే. కార్పొరేట్ స్కూల్స్ వ్యాపారంలో సిద్దహస్తుడు అయిన నారాయణ.. చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. ఆయన లాంటి బడా బాబులకు మేలు చేసేందుకు పేద పిల్లల చదువుపై దెబ్బకొడుతున్నారన్న విమర్శలకు మంత్రి లోకేష్ అవకాశం ఇవ్వకుండా ఉంటే మంచిదని చెప్పాలి. తల్లికి వందనం పథకాన్ని పెట్టి ప్రతీ విద్యార్ధికి పదిహేను వేలు ఇస్తామన్న హామీ సంగతి దేవుడెరుగు కానీ, గత ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలు అన్నింటినీ ఎత్తివేయడం ద్వారా వైఎస్ జగన్ పేరు తుడిచి వేయాలన్న వికృతమైన ఆలోచన ఏపీలో పేద పిల్లలకు శాపంగా మారేలా ఉంది.
కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్,
రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
Comments
Please login to add a commentAdd a comment