యంగెస్ట్‌ మొబైల్‌ అప్లికేషన్‌ ప్రొగ్రామర్స్‌.. | Shravan Kumaran And Sanjay Kumaran Godimensions App Developers | Sakshi
Sakshi News home page

యంగెస్ట్‌ మొబైల్‌ అప్లికేషన్‌ ప్రొగ్రామర్స్‌..

Published Wed, Dec 9 2020 10:42 AM | Last Updated on Wed, Dec 9 2020 10:42 AM

Shravan Kumaran And Sanjay Kumaran Godimensions App Developers - Sakshi

స్కూల్‌ రోజుల్లో కాలేజి జీవితం గురించి ఆలోచిస్తారు చాలామంది.ఈ పిల్లలు మాత్రం కంపెనీలు స్థాపించడం గురించి ఆలోచించారు. కలలను సాకారం చేసుకున్నారు....ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు...

చెన్నైలో ఉండే సురేంద్ర కుమరన్‌ తన పిల్లలకు చందమామ కథలు చెప్పలేదు. కానీ గొప్పవాళ్ల కథలనే చందమామ కథలుగా చెప్పాడు. వాటిలో రైట్‌ బ్రదర్స్‌ నుంచి స్టీవ్‌జాబ్స్‌ వరకు ఎందరో ఉన్నారు. శ్రావణ్‌ కుమరన్, సంజయ్‌ కుమరన్‌ సోదరులకు స్టీవ్‌జాబ్స్‌ గురించి వినడం అంటే పదే పదే ఇష్టం.‘ఇరవై సంవత్సరాల వయసులోనే స్టీవ్‌జాబ్స్‌ తమ కారు గ్యారెజ్‌లో యాపిల్‌ మొదలుపెట్టాడు’ ఆ తరువాత? ‘మీలాంటి పిల్లలకు రోల్‌ మోడల్‌గా చూపించే స్థాయికి ఎదిగాడు.

నాన్న చెప్పిన కథలు వృథా పోలేదు. పదహారేళ్లు నిండకుండానే ఈ సోదరులు ‘గో డైమెన్షన్స్‌’ పేరుతో టెక్నాలజీ సొల్యూషన్‌ కంపెనీ మొదలుపెట్టారు. పదకొండు అప్లికేషన్స్‌కు పైగా డెవలప్‌ చేశారు. ‘యంగెస్ట్‌ మొబైల్‌ అప్లికేషన్‌ ప్రొగ్రామర్స్‌’గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. థర్డ్‌గ్రేడ్‌లో ఉన్నప్పుడు కుమరన్‌ బ్రదర్స్‌కు ల్యాప్‌టాప్‌ కొనిచ్చాడు తండ్రి. అప్పటి నుంచే సాంకేతిక విషయాల పట్ల వారిలో ఆసక్తి పెరిగింది. తండ్రి నుంచి ‘క్యూ బేసిక్‌’ నేర్చుకున్న తరువాత ‘ప్రోగ్రామింగ్‌’ మీద ఆసక్తి పెరిగింది.

పర్వీందర్‌సింగ్‌ (18) , అర్జున్‌ సంతోష్‌ కుమార్‌ (20) 
రకరకాల పుస్తకాలు చదివి ప్రొగ్రామింగ్‌ మీద పట్టు సాధించిన కుమరన్స్‌ ‘గో వీఆర్‌’ పేరుతో సొంతంగా వర్చువల్‌ రియాలిటీ డివైజ్‌ తయారుచేశారు. మార్కెట్లో ఎన్నో వీఆర్‌ డివైజ్‌లు ఉండగా దీన్ని ఎందుకు కొనాలి? సోదరుల మాటల్లో చెప్పాలంటే వాటితో పోల్చితే ఇది కారుచౌక. తమ తొలి అధికారిక యాప్‌ ‘క్యాచ్‌ మీ కాప్‌’కి ముందు 150కి పైగా ‘టెస్ట్‌ యాప్స్‌’ రూపొందించారు. క్యాచ్‌ మీ కాప్, ఆల్ఫాబెట్స్‌ బోర్డ్స్, ప్రేయర్‌ ప్లానెట్, కార్‌ రేసింగ్, సూపర్‌హీరో జెట్‌ ప్యాక్, కలర్‌ పాలెట్‌... మొదలైన యాప్స్‌కు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. సేవాతత్వానికి ఊతం ఇచ్చే ‘గో డొనేట్‌’లాంటి యాప్స్‌ని రూపొందించిన కుమరన్‌ బ్రదర్స్‌ ‘సమాజం కోసం ఏదైనా కచ్చితంగా చేయాలని అనుకుంటున్నాము’ అంటున్నారు. ‘ఫోర్బ్స్‌ 30 అండర్‌ 30’ జాబితాలో చోటు సంపాదించడంతో పాటు ఎన్నో అవార్డ్‌లు సొంతం చేసుకున్నారు.

చెన్నైలో ఒకరోజు. అబ్బాయి స్కూల్‌ నుంచి ఇంకా రాలేదు. వర్షం పెరిగింది. తల్లిదండ్రులలో ఆందోళన పెరిగింది. భారీ వర్షం కారణంగా అర్జున్‌ సంతోష్‌కుమార్‌ ఇంటికి ఆలస్యంగా వచ్చాడు. తల్లిదండ్రులకు పోయిన ప్రాణం లేచివచ్చింది. ఈ సంఘటనే అర్జున్‌ని ‘లొకెటేర’ అనే మొబైల్‌ యాప్‌ రూపొందించడానికి ప్రేరణ ఇచ్చింది. వాతావరణానికి అనుగుణంగా స్కూల్‌ బస్‌రూట్స్‌లో ప్లాన్, షెడ్యూల్, రీ–షెడ్యూల్‌ చేయడానికి, ట్రాన్స్‌పోర్ట్‌కు సంబంధించిన సమాచారాన్ని పేరెంట్స్‌కు తెలియజేయడానికి అనువైన ఈ యాప్‌ మాసాచుసెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (యంఐటీ) ‘బెస్ట్‌యాప్‌’ అవార్డ్‌ గెలుచుకున్నాడు.

నిజజీవిత సమస్యలకు వినూత్నమైన పరిష్కారాల కోసం ‘లెటెరలాజిక్స్‌’ కంపెనీ మొదలుపెట్టాడు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ఫలితాలు అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి ‘ఎనీవన్‌ ఏఐ’ వెంచర్‌ మొదలుపెట్టిన అర్జున్‌ గూగుల్‌ వెబ్‌రేంజర్స్‌ అవార్డ్, నేషనల్‌ అవార్డ్‌ ఫర్‌ ఎక్సెప్షనల్‌ ఎచీవ్‌మెంట్స్‌ ఫర్‌ కంప్యూటర్‌ టెక్నాలజీ అవార్డ్‌లు అందుకున్నాడు. చెన్నైను వరదలు చుట్టిముట్టినప్పుడు అర్జున్‌ డెవలప్‌ చేసిన ‘ఐ వాలంటీర్‌ ఫర్‌ చెన్నై’ యాప్‌ స్వచ్ఛందసంస్థలు, సేవకులకు ఎంతో ఉపయోగపడింది. అర్జున్‌ సంతోష్‌ కుమార్‌కు ఎన్నో దీర్ఘకాలిక లక్ష్యాలు ఉన్నాయి. ఇప్పటికీ అతడు సాధించిన విజయాలను బట్టి చూస్తే ఆ లక్ష్యాలకు చేరువకావడం కష్టం కాదు అనిపిస్తుంది.

పుణెకి చెందిన పర్వీందర్‌సింగ్‌ ‘ప్రోసింగ్‌’గా సుపరిచితుడు. మధ్యతరగతికి చెందిన పర్వీందర్‌ 13 ఏళ్ల వయసులోనే టెక్‌ ప్రపంచంలో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు. చదువులో చురుకైన పర్వీందర్‌ ప్రొగ్రామింగ్‌ లాంగ్వేజెస్‌ నేర్చుకొని ‘మనీ రివార్డ్‌’ అనే తొలి యాప్‌ను లాంచ్‌ చేశాడు. తమ మొబైల్స్‌ ద్వారా డబ్బులు సంపాదించడానికి టీనేజర్స్‌కు ఉపయోగపడే యాప్‌ ఇది. 16 సంవత్సరాల వయసులో ‘ఇన్‌స్టా ఈజీ’ సార్టప్‌ను లాంచ్‌ చేశాడు. 17 సంవత్సరాల వయసులో ‘ది యాక్చువల్‌ గ్రోత్‌ హాక్‌–ఏ కంప్లీట్‌ గైడ్‌ ఆఫ్‌ ఇన్‌స్టాగ్రామ్‌’ అనే పుస్తకం రాశాడు. బేసిక్స్‌ నుంచి కీలకమైన సాంకేతిక విషయాల వరకు ఎన్నో ఈ పుస్తకం నుంచి నేర్చుకోవచ్చు. వీరు మచ్చుకు కొందరు మాత్రమే. ఇంకా ఎంతో మంది చిరంజీవులు ఉన్నారు. వారికి అభినందనలు తెలియజేద్దాం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement