ఈ కళ్లజోడును రోజూ ధరించినట్లయితే, నిద్రలేమి సమస్య దూరమవుతుంది. ప్రతిరోజూ సరైన వేళకు చక్కగా నిద్రపడుతుంది. ఆస్ట్రేలియన్ కంపెనీ ‘రీటైమ్’ ఈ హైటెక్ లైట్‌థెరపీ కళ్లజోడును తాజాగా ‘రీటైమర్–3’ పేరుతో మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఆడలాయిడ్‌లోని ఫ్లిండర్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్త ప్రొఫెసర్ లియోన్ ల్యాక్ ‘రీటైమ్’ కంపెనీ కోసం ప్రత్యేకంగా ఈ కళ్లజోడును రూపొందించారు.
ఈ కళ్లజోడును ధరిస్తే, దీని నుంచి నిర్ణీత తరంగదైర్ఘ్యంలో నీలి–ఆకుపచ్చ రంగులోని కాంతి కళ్ల మీద పడుతుంది. ఈ కాంతి కళ్ల అలసటను పోగొడుతుంది. దీని నుంచి వెలువడే కాంతి శరీర గడియారానికి అనుకూలంగా పనిచేస్తుంది. ఫలితంగా, వేళకు చక్కగా నిద్రపట్టేలా చేస్తుంది. ఈ కళ్లజోడు రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఒకసారి చార్జ్ చేసుకుంటే, ఆరుగంటల సేపు నిరంతరాయంగా పనిచేస్తుంది. దీని ధర 179 డాలర్లు (రూ.15,021) మాత్రమే!
ఎక్కడైనా వాడుకోగల పోర్టబుల్ ఏసీ..
ఇది పోర్టబుల్ ఏసీ. దీనిని ఎక్కడైనా వాడుకోవచ్చు. ఇళ్లల్లోనే కాదు, పిక్నిక్‌లకు, ఫారెస్ట్ క్యాంపులకు వెళ్లేటప్పుడు తాత్కాలికంగా వేసుకున్న టెంట్లలో కూడా దీనిని ఉపయోగించుకోవచ్చు. చైనాకు చెందిన ‘హావోరాన్’, ‘యిఫీలింగ్ డిజైన్ ల్యాబ్’లకు ఇంజినీర్లు ‘యూయీ’ పేరుతో ఈ పోర్టబుల్ ఏసీకి రూపకల్పన చేశారు. ఒకదానికి మరొకటి అనుసంధానమై రెండు భాగాలుగా ఉండే ఈ ఏసీని సూట్‌కేసులా ఎక్కడికైనా సులువుగా తీసుకుపోవచ్చు.
ఏసీ భాగాన్ని టెంట్ లోపల లేదా గది లోపల పెట్టుకుని, ఏసీ అడుగున ఉన్న భాగాన్ని టెంట్ లేదా గది వెలుపల పెట్టుకుని, ఆన్ చేసుకుంటే సరిపోతుంది. ఇది గది లేదా టెంట్ లోపల ఉన్న వేడిని బయటకు పంపి క్షణాల్లోనే చల్లబరుస్తుంది. అంతేకాదు, ఇది పనిచేసే పరిసరాల్లోకి దోమలు, ఇతర కీటకాలు చేరలేవు. దీని ధరను ఇంకా ప్రకటించలేదు.
రక్తనాళాల్లోకి చొచ్చుకుపోయే మిల్లీరోబోలు..
డచ్ వైద్యశాస్త్రవేత్తలు రక్తనాళాల్లోకి చొచ్చుకుపోయే ఈ మిల్లీరోబోలను ప్రయోగాత్మకంగా రూపొందించారు. ఇవి నేరుగా రక్తనాళాల్లోకి చొచ్చుకుపోయి, సూచించిన దిశలో ముందుకు సాగుతూ, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టిన చోట ఏర్పడిన అవరోధాలను సునాయాసంగా తొలగించి, సజావుగా రక్తప్రసరణ జరిగేలా చేస్తాయి. నెదర్లండ్స్‌లోని ట్వంటీ యూనివర్సిటీ, రాడ్‌బోడ్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఈ మిల్లీరోబోలను త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారా రూపొందించారు.
అయస్కాంతం ద్వారా వీటి కదలికలకు దిశా నిర్దేశం చేయడానికి వీలవుతుంది. ఈ మిల్లీరోబోల పనితీరుపై ఇంకా లాబొరేటరీ పరిశోధనలు జరుగుతున్నాయి. ఇవి అందుబాటులోకి వచ్చినట్లయితే, గుండెజబ్బులు, పక్షవాతంతో బాధపడే చాలామంది రోగులకు చికిత్స చేసే పద్ధతి మరింత సులభతరమవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment