
వంటగదిలో ఉండే ఎరుపు మిరపకాయలతో వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించాడు. అదికూడా ఓ శరణార్థిగా వేరొక దేశంలోకి వచ్చి అక్కడే కోట్లకు పడగలెత్తాడు. ఎవ్వరూ ఊహించని రీతిలో వంటల్లో ఘాటు కోసం ఉపయోగించే మిరపకాయలతో అద్భుతమైన సాస్ తయారు చేశాడు. చూస్తుండగానే అతితక్కువ కాలంలోనే వ్యాపారం విస్తరించి లాభాల బాటపట్టింది. ఎలాంటి ప్రకటన, ప్రముఖుల అడ్వర్టైస్‌మెంట్‌లు లేకుండా కేవలం నోటిమాటతో వ్యాపారం ఊపందుకునేలా చేశాడు. విచిత్రమైన లోగోతోనే ఆ ప్రొడక్ట్ నాణ్యత ఏంటో అర్థమయ్యేలా చేశాడు. అలా ఆ ప్రొడక్ట్ పేరే బ్రాండ్ నేమ్‌గా స్థిరపడిపోయేలా ప్రజాదరణ పొందింది. ఇంతకీ ఆ వ్యాపార సామ్రాజ్యం సృష్టికర్త ఎవరు..? ఎలా ఈ సాస్‌ని రూపొందించాడంటే..
పాశ్చాత్య దేశాల్లో ఏ నాన్‌వెజ్ తినాలన్నా ఈ చిల్లీసాస్ జోడించి ఆస్వాదిస్తారు. అక్కడ ప్రజలకు ఇది లేనిదే వంట పూర్తికాదు అన్నంతగా దీనిపై ఆధారపడిపోయారు. అది కూడా పచ్చగా ఉండే పచ్చిమర్చిని కాదని పండు ఎరుపు మిర్చిలనే ఎంచుకోవడానికి ప్రధాన కారణం దాని స్పైసీనెస్ అని చెప్పొచ్చు. పచ్చిమిర్చిలోని ఘాటుకంటే పండిని పచ్చిమిర్చిలో కారం ఎక్కువ. శ్రీరాచా చిల్లీసాస్ పేరుతో డేవిడ్ ట్రాన్ అనే వియత్నాం శరణార్థి దీన్ని మార్కెట్లోకి తీసుకొచ్చాడు.
అతడి ప్రస్థానం మొదలైందిలా..
1945లో దక్షిణ వియత్నాంలో జన్మించిన డేవిడ్ ట్రాన్ సైగాన్‌కు వెళ్లాడు. అక్కడ అతను దక్షిణ వియత్నామీస్ సైన్యంలో చేరడానికి ముందు రసాయనాల వ్యాపారంలో మెళుకువలు నేర్చుకున్నాడు. అక్కడే అతను చెఫ్‌గా కూడా పనిచేసేవాడు. ఆ టైంలోనే ట్రాన్ మిరపకాయలతో సాస్ తయారీ ప్రయోగాలు చేస్తుండేవాడు. వాటిని రీసైకిల్ చేసిన గెర్బర్ బేబీ ఫుడ్ జాడిలలో నిల్వ చేసేవాడు.
అయితే ఇంతలో సైగాన్‌లో పరిస్థితి ఉద్రీక్తంగా మారిపోయింది. డిసెంబర్ 1978లో, కమ్యూనిస్ట్ వియత్నాం, చైనా మధ్య ఏర్పడిన శతృత్వం రీత్యా అక్కడ పరిస్థితి అధ్వాన్నంగా మారిపోయింది. దీంతో ట్రాన్‌కి మాతృభూమిని వీడక తప్పలేదు. అయితే అతడు అద్భుతమైన దూరదృష్టితో తన ఆస్తులను ఆ కాలంలోనే దాదాపు రూ. 85 లక్షల రూపాయలకుపైనే విక్రయించి, ఆ డబ్బుతో హుయ్ ఫాంగ్" అనే తైవానీస్ సరుకు రవాణా నౌకలో అమెరికాకు వలస వచ్చాడు.
సాస్ వ్యాపారం ఆవిర్భావం..
బోస్టన్‌లో కొంతకాలం పనిచేసిన తర్వాత, ట్రాన్ 1980లో లాస్ ఏంజిల్స్‌కు మకాం మార్చాడు. అక్కడే తన హాట్‌సాస్ తయారీ ప్రారంభించాడు. సాంప్రదాయ వియత్నాం మిరపకాయలకు బదులుగా స్థానికంగా లభించే జలపెనోల మిరపకాయలను ఉపయోగించి తయారు చేశాడు. వాటిని రీసైకిల్ చేసిన బేబీ ఫుడ్ జాడిలలో నింపి నీలిరండు వ్యాన్‌లో దక్షిణ కాలిఫోర్నియా అంతటా ఉన్న ఆసియా రెస్టారెంట్లకు ట్రాన్ స్వయంగా డెలివరీ చేవాడు. అలా మొదటి నెల రూ. 2 లక్షల లాభాన్ని ఆర్జించాడు దీనికి వెంచర్ క్యాపిటల నిధులు లేవు, మార్కెటింగ్ బృందం లేదు, ప్రకటను ప్రచారాలు కూడా లేవు.
తన ప్రొడక్ట్‌కి ఉన్న శ్రీరాచా అనే పేరు, దాని లోగో..విలక్షణమైన గ్రీన్‌క్యాప్ అమ్మకాలను ఆకర్షించే ట్రేడ్‌మార్క్‌గా క్రియేట్ చేశాడు. ఎవ్వరైనా తన ప్రొడక్ట్ పేరుని వాడుకునే యత్నం చేస్తే..వారిని తన వ్యాపారానికి ఉచితంగా అడ్వర్టైస్‌మెంట్ చేసేవాళ్లుగా అభివర్ణించేవాడు. అంతేగాదు మా ప్రొడక్ట్ అత్యంత హాట్‌గా ఉంటుంది. ఒకవేళ వేడిచేస్తే తక్కువగా వినియోగించండి అని స్వయంగా చెప్పేవాడు.
అలా అనాతికాలంలోనే లాస్ ఏంజిల్స్‌లోని చైనాటౌన్, రోజ్‌మీడ్, కాలిఫోర్నియా అంతటా వ్యాపారం జోరుగా ఊపందుకుంది. ఇక తన ప్రొడక్ట్‌కి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో కాలిఫోర్నియాలో 650,000 చదరపు అడుగుల ఫ్యాక్టరీ పెట్టే స్థాయికి చేరుకున్నాడు. దానికి తాను అమెరికాకు వలస వచ్చిన నౌక పేరు మీదుగా హుయ్ ఫాంగ్ ఫుడ్స్ అని పేరు పెట్టాడు.
అలా 2019 నాటికి, వార్షిక అమ్మకాలు రూ. 16 వందల కోట్లకు చేరుకుంది. అంతేగాదు అమెరికన్ హాట్ సాస్ మార్కెట్‌లో దాదాపు 10% వాటాని సొంతం చేసుకుంది. అంతేగాదు ఈ రెడ్‌చిల్లీ బాటిల్‌పై లేబుల్ వియత్నామీస్, ఇంగ్లీష్, చైనీస్, ఫ్రెంచ్ స్పానిష్ వంటి భాషలలో టెక్స్ట్‌ను కలిగి ఉండటం విశేషం. తన ప్రొడక్ట్ ఇలా లాభాలతో దూసుకుపోవడానికి కారణం కేవలం "పేదవాడి ధరకు ధనవంతుడి సరిపోయే నాణ్యతలో సాస్ తయారు చేయడం" అని అంటారు ట్రాన్.
ఈ ఏడాదితో ఈ వ్యాపారం 80 ఏళ్లకు చేరుకుంటోంది. పరిశ్రమ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. అతడి వ్యాపార సామ్రాజ్యం రూ. 11 వేల కోట్లు టర్నోవర్ ఉంటుదని అంచనా. నాణ్యతలో రాజీ పడకుండా, ఎలాంటి లాభదాయకమైన కొనుగోళ్లకు కక్కుర్తిపడకుండా ప్రజల నమ్మకాన్ని చూరగొంటే ఏ వ్యాపారమైన విజయపథంలో దూసుకుపోతుందంటారు డేవిడ్ ట్రాన్. కేవలం పట్టుదల, కష్టపడేతత్వం తదితరాలే వ్యాపారానికి అసలైన పెట్టుబడులని నొక్కి చెబుతున్నాడు.
(చదవండి: కష్టాలు మనిషిని కనివినీ ఎరుగని రేంజ్‌కి చేరుస్తాయంటే ఇదే..!)