ప్రెగ్నెన్సీ టైంలో అన్ని మార్పులా..? అ‍క్కడ నొప్పి ఎందుకు వస్తుంది..? | Womens Health: Physical Changes During Pregnancy | Sakshi
Sakshi News home page

ప్రెగ్నెన్సీ టైంలో అన్ని మార్పులా..? అ‍క్కడ నొప్పి ఎందుకు వస్తుంది..?

Published Sun, Apr 6 2025 2:06 PM | Last Updated on Sun, Apr 6 2025 2:07 PM

Womens Health: Physical Changes During Pregnancy

నాకు ఇప్పుడు నాల్గవ నెల. నడుము, పొత్తి కడుపు, వెన్నులో చాలా నొప్పి ఉంటోంది. ఇది మామూలే అని చెప్తున్నారు. అసలు ఇది ఎందుకు వస్తుంది? 
– లక్ష్మీ, తిరుపతి. 

ప్రెగ్నెన్సీలో శరీరంలో చాలా మార్పులు వస్తాయి. బేబీని మొయ్యటం అనేది చాలా పెద్ద బాధ్యత. ఇలాంటి సమయంలో ఎంత సంతోషంగా ఉంటుందో, శారీరకంగా, మానసికంగా వచ్చే మార్పులను తట్టుకోవడానికి కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. ఓపిక చాలా అవసరం. మొదట్లో ఎలాంటి నొప్పి, అసౌకర్యం ఉండకపోవచ్చు. శారీరకంగానూ బాగానే ఉంటుంది. కాని, హార్మోన్లు సహజంగా హెచ్చుగా ఉన్నందున అలసత్వం, నీరసం, ముభావంగా ఉండటం, తలనొప్పి, వికారం ఉంటాయి. 

రొమ్ముల్లో నొప్పి కొంచెం ఉండొచ్చు. రెండో త్రైమాసికంలో అంటే నాలుగు నుంచి ఏడవ నెల వరకు చాలా కొత్త మార్పులు ఉంటాయి. బేబీ పెరుగుతున్నప్పుడు లోపల ఒత్తిడి, స్ట్రెచింగ్‌ తెలుస్తుంది. శరీరంలో వాపు వస్తుంది. నొప్పిగా ఉంటుంది. సైడ్స్‌లో రౌండ్‌ లిగమెంట్స్‌ బాగా స్ట్రెచ్‌ అయి నొప్పిగా అనిపించవచ్చు. 

మూడో త్రైమాసికంలో బేబీ బరువు రెండు నుంచి మూడు కిలోల మధ్య ఉంటుంది. కాబట్టి, ఆ బరువు కాళ్ల మీద, పొత్తి కడుపు, నడుము, వీపు భాగంలో పడుతుంది. కీళ్ల నొప్పులు ఉంటాయి. ఉబ్బసం, మలబద్ధకం, ఆయాసం రావచ్చు. ఎక్కువ నడవలేక పోతారు. యూరిన్‌ అర్జెన్సీ ఉండటం, చర్మం నల్లబడటం, రొమ్ముల్లో నొప్పి, చిగుళ్లలో రక్తం రావటం, తల తిరగటం ఇవన్నీ సహజమైన మార్పులుగానే చెప్తాం. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అలానే ఏది సహజమైన సమస్య అని తెలిస్తే, అసలైన సమస్య, నొప్పిని త్వరగా గుర్తించి, సత్వర చికిత్స తీసుకోవచ్చు. డాక్టర్‌ను వెంటనే సంప్రదించవచ్చు. 

చాలామందికి నిద్రపట్టక ఇబ్బంది పడుతుంటారు. చివరి మూడు నెలల్లో ఆందోళన, ఆలోచనలు, భయాలు పెరుగుతాయి. ఇలా కాకుండా ధ్యానం, యోగా సాయంత్రం వేళల్లో చేస్తే శరీరం రిలాక్స్‌ అవుతుంది. నిద్రపోయే ముందు షవర్‌ బాత్‌ చెయ్యటం, వేడి పాలు తీసుకోవటం, సంగీతం వినటం, గదిని డిమ్‌గా ఉంచడంలాంటివి సహాయం చేస్తాయి. నిద్ర మాత్రలు అసలు వాడకూడదు. కొంతమందికి హెమరాయిడ్స్‌ ఎక్కువ అయి మలబద్ధకం, మూత్రవిసర్జన సమయంలో రక్తం రావటం, నొప్పి ఉండవచ్చు. 

అందుకు సరైన సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. ఎక్కువ ఒత్తిడితో మూత్రవిసర్జన చెయ్యకూడదు. భేది మందులతో సులభంగా అయ్యేట్టు మందులు వాడాలి. లూజు, కాటన్‌ ఇన్నర్‌ వెయిర్‌ వేసుకోవాలి. ఒక పక్కకు తిరిగి పడుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి. కోల్డ్‌ ప్యాక్స్‌ను ఉపయోగించవచ్చు. యూరిన్‌ కూడా ఎక్కువ రావటం, లీక్‌ అవటం సహజంగా చూస్తాం. కేగెల్‌ వ్యాయామాలు చెయ్యాలి. బ్లాడర్‌ ట్రైనింగ్‌ అలవాటు చేసుకోవాలి. 

యూరినరీ ట్రాక్ట్‌ ఇన్‌ఫెక్షన్స్‌ ఉన్నాయా అని చెక్‌ చెయ్యాలి. ఫ్లూయిడ్స్‌ మూడు నుంచి నాలుగు గంటలు తీసుకోవాలి. వెజైనల్‌ డిశ్చార్జ్‌ కూడా కామన్‌. దురదలు, మంటలు, దుర్వాసన లేకపోతే అది నార్మల్‌. ఒకసారి డాక్టర్‌తో పరీక్షించుకోవాలి. అప్పుడే ఉమ్మనీరు సంచి పగిలిపోవటం వారు గుర్తిస్తారు. బ్రాక్ట్సన్‌ కిక్స్‌ అనే కాంట్రాక్షన్స్‌ ఏడవనెల నుంచి కొన్ని సెకండ్లు వచ్చి పోతుంటాయి. అవి లేబర్‌ పెయిన్స్‌ కాదు. ఒక పక్కకు తిరిగి పడుకోవడం, రిలాక్సింగ్‌ వ్యాయామాలు చెయ్యటంతో ఈ నొప్పి తగ్గుతుంది. 

ఇవి అప్పుడప్పుడు వస్తుంటాయి. ఇవి ప్రెగ్నెన్సీలో మామూలే. వేరికోస్‌ వీన్స్‌కి కంప్రెషన్‌ స్టాకింగ్స్‌ వేసుకోవాలి. కాళ్లు, అరికాళ్లను ఎత్తులో పెట్టుకొని ఆఫీసు పని చేసుకోవాలి. చాలా వాపు వస్తే, బీపీ ఎక్కువ ఏమైనా అయిందా అని డాక్టర్‌ని సంప్రదించాలి. చర్మంలో మార్పులు, స్ట్రెచ్‌ మార్క్స్‌ని నిరోధించలేము. మాయిశ్చరైజ్‌ క్రీమ్స్‌ కొంత వరకు పనిచేస్తాయి. పొట్టపైన, రొమ్ములు, తొడలపైన పూసుకోవాలి. 

అలసట, నీరసం అనేది చాలా సాధారణంగా వచ్చే సమస్య. కాని, రక్తహీనతలో కూడా ఇది ఉంటుంది. అందుకే మీకు ఇలా ఉన్నప్పుడు ఐరన్, బీ12, ఫోలిక్‌ యాసిడ్‌ మందులు సరిగ్గా తీసుకుంటున్నారా లేదా అని చెక్‌ చేసుకోండి. పికా అంటే బ్లడ్‌ లెవల్స్‌ తక్కువ ఉన్నప్పుడు బియ్యం, పేపర్‌ తినాలనిపిస్తుంది. ఇది ఉంటే వెంటనే డాక్టర్‌ని సంప్రదించండి. సరిపడా నిద్ర ఉందా అని చెక్‌ చేసుకోండి, వ్యాయామం చెయ్యండి. తలనొప్పికి ఐస్‌ ప్యాక్స్‌ వాడొచ్చు. 

10 నుంచి 12 గ్లాసుల నీరు రోజు తీసుకోవటం మంచిది. పారాసిటమాల్‌ టాబ్లెట్‌ ఒకటి సేఫ్‌గా వాడొచ్చు. వికారం, వాంతులకు మెత్తని ఆహార పదార్థాలు, అరటిపండు, అన్నం, బ్రెడ్‌ లాంటివి తీసుకోవాలి. కాల్చిన బంగాళదుంపలు, ఉడకబెట్టిన మొక్కజొన్న తీసుకోవాలి. మసాలాలు, నూనె పదార్థాలు, వేపుళ్లు తినకూడదు. నాన్‌ కాఫినేటెడ్‌ డ్రింక్స్‌ తీసుకోవాలి. సిప్స్‌లాగా నీళ్లు తీసుకోవాలి. 

పండ్ల రసాలు తాగొచ్చు, అల్లం టీ తాగొచ్చు. కాఫీ, టీ మానెయ్యాలి. సమయానికి ఆహారం తీసుకోవాలి. రెండు నుంచి మూడు గంటలకి ఒకసారి కొంచెం ఆహారం తీసుకోవాలి. మాంసాహారంలో డీన్‌ మీట్, హై ప్రోటీన్‌వి తీసుకోవాలి. ప్రతిరోజు మల్టీవిటమిన్‌ మాత్రలు తీసుకోవాలి. రొమ్ముల్లో మార్పులు ప్రెగ్నెన్సీలో సాధారణంగానే వస్తాయి. సైజ్‌ పెరగటం, డార్క్‌ కావటం, నొప్పి ఉండటం ఇవన్నీ మామూలే. కొంతమందికి ఐదవ నెల నుంచే కొలోస్ట్రమ్‌ లీక్‌ కావచ్చు. మంచి సపోర్ట్‌ ఇన్నర్‌ వేర్‌ వేసుకోవాలి. కాటన్‌వి వాడాలి. 

కాటన్‌ టవల్‌తో లీక్‌ అవుతున్న ఫ్లూయిడ్స్‌ని తుడవాలి. ప్రెస్‌ చెయ్యకూడదు. వేడి కాపడం పెట్టుకోవచ్చు. పొట్ట పక్కన గుచ్చినట్లుగా నొప్పులు రావచ్చు. పొట్ట పెరిగే కొద్దీ లిగ్మెంట్‌ స్ట్రెచ్‌తో ఈ నొప్పి వస్తుంది. నడుము లేదా గ్రోయిన్‌ ఏరియాలో కూడా వస్తుంది. కాళ్ల నొప్పులు కూడా ఉంటాయి. రాత్రిళ్లు ఈ నొప్పి ఎక్కువ ఉంటుంది. హీట్‌ థెరపీ లేదా బ్యాక్‌ మసాజ్‌ దీనికి పనిచేస్తుంది. రబ్బర్‌ దిండు, లేదా మెటర్నిటీ బెల్ట్‌ కూడా వాడొచ్చు. వదులైన దుస్తులు ధరించాలి. కంప్రెషన్‌ స్టాకింగ్స్‌ వేసుకోవాలి. 
డాక్టర్‌ భావన కాసు,గైనకాలజిస్ట్‌ – ఆబ్‌స్టెట్రీషియన్‌ హైదరాబాద్‌ 

(చదవండి: ఈ జెల్‌ సాక్స్‌తో పాదాలు ఇట్టే కోమలంగా మారతాయ్‌..!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement