
జుట్టు ఊడిపోతున్నప్పుడు జింక్ వంటి పోషకాల లోపం ఏదైనా ఉందేమో చూసుకోవడంతోపాటు ఏవైనా ఆరోగ్య సమస్యల కోసం మనం వాడే మందులు మనకు సరిపడక జుట్టును రాల్చేస్తున్నాయేమో కూడా చూడాలి. అలా కొన్ని రకాల మందులు సరిపడకపోవడం లేదా వాటి
దుష్ప్రభావాల వల్ల కూడా కొందరిలో జుట్టు రాలిపోతుంది. అలా జట్టును రాలేలా చేసే మందులేమిటో తెలుసుకోండి.
జుట్టు రాలేలా చేసే కొన్ని రకాల మందులేమిటో, అవి ఎందుకు వాడుతుంటారో తెలుసుకుందాం.
జుట్టు రాల్చే మందులివే...
ఇక్కడ పేర్కొన్న ఈ మందులన్నీ జుట్టును రాలిపోయేలా తప్పక చేస్తాయని కాదు. కానీ కొందరిలో అవి సరిపడక΄ోవడం వల్ల ప్రతికూలంగా పనిచేసి జుట్టును రాల్చేందుకు కారణమవుతుంటాయి.
వాటిలో ప్రధానమైన కొన్ని మందులివి...
ఇన్ఫెక్షన్లకు వాడే కొన్ని యాంటీబయాటిక్స్
యాంటీ ఫంగల్ మందులు
మొటిమలకు వాడే కొన్ని మందులు
కొన్ని యాంటీ డిప్రెసెంట్స్
నోటి ద్వారా తీసుకునే గర్భనిరోధక మందులు
యాంటీకొలెస్ట్రాల్ మందులు
రక్తాన్ని పలచబార్చేవి
ఇమ్యునోసప్రెసెంట్స్ మూర్ఛ చికిత్సలో వాడే మందులు
హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీలో వాడే ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్, పురుషులకు వాడే టెస్టోస్టెరాన్, యాండ్రోజెన్ వంటి హార్మోన్‌లు ఇంటర్‌ఫెరాన్స్
వేగంగా మూడ్స్ మారి΄ోతున్నప్పుడు నియంత్రణకు వాడే మూడ్ స్టెబిలైజేషన్ మందులు
నొప్పినివారణకు వాడే ఎన్‌ఎస్‌ఏఐడీ తరహా మందులు
స్టెరాయిడ్స్... వీటితోపాటు వీటన్నింటిలోకీ కీమోథెరపీకి వాడే మందులు జుట్టును రాలేలా చేయడంలో ముఖ్య పాత్రపోషిస్తాయి.
వెంట్రుక దశలు
ఈ మందులు వెంట్రుక జీవితచక్రంలోని వివిధ దశల్లోకి జొరబడి అవి జుట్టును రాలేలా చేస్తాయి. ఏయే మందులు ఏయే దశల్లో జొరబడి జుట్టు రాలుస్తాయో తెలుసుకోవడంతోపాటు ఆ దశలేమిటో చూద్దాం. వెంట్రుక పెరుగుదలలో కెటాజెన్, టిలోజెన్, అనాజెన్ అనే దశలు ఉంటాయి.
టిలోజెన్ : మొత్తం జుట్టులో 10–15 శాతం ఎప్పుడూ ఈ దశలోనే ఉంటుంది. ఈ దశ సాధారణంగా 100 రోజుల ΄ాటు కొనసాగుతుంది. అయితే కనుబొమలు, కనురెప్పలు, బాహుమూలాల్లో ఉండే వెంట్రుకల్లో ఈ దశ మరింత దీర్ఘకాలం ఉంటుంది. ఈ దశలోనే వెంట్రుక తన పూర్తిస్థాయి పొడవులో ఉంటుంది. ఈ దశలో ఉన్నప్పుడు రోమాన్ని పీకితే... వెంట్రుక కింద గసగసాల్లాంటి గుండ్రటి, తెల్లటి భాగం కనిపిస్తుంది.
కెటాజన్ : మొత్తం జుట్టులో కనీసం మూడు శాతం ఎప్పుడూ ఈ దశలోనే ఉంటుంది. వెంట్రుక పెరుగుదల లో ఇదో సంధి దశ. ఈ దశ 2 నుంచి 3 వారాల పాటు ఉంటుంది. ఈ దశలో వెంట్రుక నిద్రాణంగా ఉండి, రోమాల పెరుగుదల ఏమాత్రం ఉండదు.
అనాజెన్ : వెంట్రుక పెరుగుదల దశలన్నింటిలోనూ అనాజెన్ అనేది చురుకైనది. ఈ దశలో వెంట్రుక మూలంలో కణవిభజన వేగంగా జరుగుతుంటుంది. కింద రోమాంకురంలో కొత్త కణాలు పెరుగుతున్న కొద్దీ పాత కణాలు ముందుకు వెళ్తుంటాయి.
ఫలితంగా కింది నుంచి వేగంగా వెంట్రుక పై వైపునకు పెరుగుతూ ΄ోతుంది. (అందుకే జుట్టుకు రంగు వేసుకునేవారిని చూసినప్పడు జుట్టు కింది భాగంలోని వెంట్రుకలు రంగులేకుండా కనిపిస్తుండటానికి కారణమిదే). ఈ దశలో ప్రతి 28 రోజులకు వెంట్రుక ఒక సెంటీమీటరు పొడవు పెరుగుతుంది. అలా కొంత పొడవు పెరిగి ఆగి΄ోతుంది.
తల మీద ఉన్న వెంట్రుకలు రెండు నుంచి ఆరేళ్ల పాటు పెరుగుతాయి. బాహుమూలాల్లో, కాళ్లపైనా, కనుబొమలు, కనురెప్పపై ఉండే వెంట్రుకల్లో పెరుగుదల వ్యవధి 30–45 రోజులు మాత్రమే ఉండి, ఆ తర్వాత ఆ పెరుగుదల ఆగి΄ోతుంది. ఈ కారణం వల్లనే ఈ వెంట్రుకలు మాడుపై ఉండే వెంట్రుకలంత పొడవు పెరగవు.
మన ఆరోగ్య సమస్యల కోసం వాడే మందులు జుట్టు పెరుగుదలలో ఉండే అనాజెన్, కెటాజెన్, టిలోజెన్ దశలను ప్రభావితం చేస్తాయి. దాంతో జుట్టు పెరుగుదలలో మార్పు వస్తుంది. ఫలితంగా టిలోజెన్ ఎఫ్లూవియమ్, అనాజెన్ ఎఫ్లూవియమ్ అనే రెండు రకాల మార్పులు వచ్చి అవి జుట్టు రాలేలా చేస్తాయి.
టిలోజెన్ ఎఫ్లూవియమ్ : ఏదైనా ఆరోగ్య సమస్య కోసం మందులు వాడటం మొదలుపెట్టగానే వాటి ప్రభావంతో 2 నుంచి 4 నెలల్లో హెయిర్ ఫాలికిల్ విశ్రాంతి దశలోకి వెళ్తుంది. అంతేకాదు... ఒక్కోసారి మనకు ఉన్న వ్యాధి కూడా టిలోజెన్ ఎఫ్లూవియమ్‌ను కలిగించవచ్చు.
అనాజెన్ ఎఫ్లూవియమ్ : ఈ దశలో వెంట్రుకలు తమ పెరుగుదల దశలోనే రాలి΄ోతుంటాయి. మందు వాడటం మొదలుపెట్టిన కొద్దిరోజుల్లోనే ఇది కనిపిస్తుంది. ఉదాహరణకు కీమోథెరపీ తీసుకునేవారిలో అనాజెన్ ఎఫ్లూవియమ్ వల్లనే జుట్టురాలిపోతుంది. ఈ మందులు కేవలం తల మీది జుట్టే కాకుండా కనుబొమలు, కనురెప్పల వెంట్రుకలూ రాలిపోయేలా చేస్తాయి.
మందుల వల్లనే జుట్టు రాలుతుంటే...
సాధారణంగా మందులు మానేయగానే మళ్లీ వచ్చేందుకు అవకాశమెక్కువ
ఒక మందుతో జుట్టు రాలుతుంటే దానికి ప్రత్యామ్నాయ మందులు వాడటం
జుట్టు రాలడాన్ని అరికట్టే మందులనూ వాడటం (డాక్టర్ సలహా మేరకు మాత్రమే)
కీమోథెరపీ ఇచ్చే సమయంలో హైపోథెర్మియా అనే ప్రక్రియను ఉపయోగించడం ద్వారా. ఈ ప్రక్రియలో కీమోథెరపీ ఇచ్చే ముందర... ఇచ్చిన అరగంట తర్వాత మాడుపై ఐస్‌తో రుద్దుతారు. ఫలితంగా కీమోథెరపీలో ఇచ్చిన మందు ఫాలికిల్‌లోకి అంతగా ప్రవేశించదు.
ఇది జుట్టు రాలడాన్ని చాలావరకు నివారిస్తుంది. అయితే ఈ ఫలితం అందరిలోనూ ఒకేలా ఉండకపోవచ్చు. బాధితులకు ఉన్న క్యాన్సర్ ఏమిటన్నదాని మీద ఈ హైపోథెర్మియా ఫలితాలు ఆధారపడి ఉంటాయి. అందుకే ఆ ప్రక్రియను ఉపయోగించే ముందర ఒకసారి చికిత్స చేస్తున్న ఆంకాలజిస్ట్ సలహా తీసుకుని ముందుకు వెళ్లడం మంచిది. ఎవరికైనా తాము వాడుతున్న మందుల వల్ల జుట్టు రాలుతోందనిపిస్తే ఆ విషయాన్ని తమ డాక్టర్‌కు తెలపాలి. అప్పుడు వాళ్లు తగిన ప్రత్యామ్నాయాలను సూచిస్తారు.
(చదవండి: సమ్మర్‌లో ఎయిర్ కూలర్స్, ఏసీలే వాడేస్తున్నారా..?)