కొరకరాని కాయ
మిర్చి బేసన్ కర్రీ
కావలసినవి: పచ్చిమిర్చి - 100 గ్రా., సెనగ పిండి - టేబుల్ స్పూను, వాము - అర టీ స్పూను, కారం - అర టీ స్పూను, ఉప్పు - తగినంత, నూనె - 2 టేబుల్ స్పూన్లు.
తయారీ: ముందుగా పచ్చి మిర్చిని శుభ్రంగా కడిగి తడిపోయే వరకు ఆరబెట్టాలి నిలువుగా మధ్యకు గాటు పెట్టాలి బాణలిలో నూనె కాగాక పచ్చి మిర్చి వేసి దోరగా వేయించాలి సెనగ పిండి, వాము, కారం, ఉప్పు వేసి బాగా కలిపి, సుమారు ఐదు నిమిషాలు మూత పెట్టి ఉంచాలి మూత తీసి మరోమారు బాగా కలిపి, రెండు నిమిషాలయ్యాక దింపేయాలి.
మిర్చి కా సాలన్
కావలసినవి: పచ్చి మిర్చి - 100 గ్రా. (ఎక్కువ కారం ఉండకూడదు), చింతపండు గుజ్జు - టేబుల్ స్పూను (చిక్కగా ఉండాలి), నీళ్లు - 3 కప్పులు, ఆవాలు - అర టీ స్పూను, జీలకర్ర - అర టీ స్పూను, కరివేపాకు - ఏడెనిమిది రెమ్మలు, నూనె - 4 టేబుల్ స్పూన్లు, ఉప్పు - తగినంత, మసాలా పేస్ట్ కోసం, పచ్చి కొబ్బరి తురుము - పావుకప్పు, వేయించిన పల్లీలు - పావు కప్పు, వేయించిన నువ్వులు - రెండు టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ - 1 (చక్రాలుగా తరగాలి), వెల్లుల్లి రేకలు - 3, అల్లం తురుము - అర టీ స్పూను, కారం - అర టీ స్పూను, పసుపు - పావు టీ స్పూను, గరం మసాలా - అర టీ స్పూను, ఉప్పు - తగినంత
తయారీ: బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక ఉల్లి చక్రాలు వేసి బంగారురంగులోకి వచ్చేవరకు వేయించాలి పచ్చి కొబ్బరి తురుము జత చేసి మరోమారు వేయించాలి పల్లీలు, నువ్వులు జత చేసి మరోమారు వేయించి దింపి, చల్లార్చాలి వెల్లుల్లి రేకలు, అల్లం తురుము, మసాలా పొడులు, ఉప్పు జత చేసి, మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి కొద్దిగా నీరు జత చేసి పేస్ట్‌లా చే స్తే మసాలా సిద్ధమవుతుంది.
కూర తయారీ:
పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి తడి పోయేవరకు నీడలో ఆరబెట్టాలి నిలువుగా మధ్యకు గాట్లు పెట్టాలి. (కాయ కాయలాగే ఉండాలి. ముక్కలు చేయకూడదు) బాణలిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేశాక, పచ్చి మిర్చి వేసి దోరగా వేయించి తీసేయాలి అదే బాణలిలో మరికాస్త నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించాలి తయారుచేసి ఉంచుకున్న మసాలా ముద్ద జత చేసి బాగా వేయించాలి చింతపండు గుజ్జు, రెండు కప్పుల నీళ్లు జత చేసి మరోమారు కలిపి ఐదు నిమిషాల తర్వాత పచ్చి మిర్చి వేసి బాగా కలిపి, కొద్దిసేపయాయక దింపేయాలి కొత్తిమీరతో అలంకరించి వేడివేడిగా అన్నంతో తింటే రుచిగా ఉంటుంది.
పచ్చి మిర్చి ఊరగాయ
కావలసినవి: పచ్చి మిర్చి - పావు కిలో, ఆవాలు - 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు - టేబుల్ స్పూను, జీలకర్ర - టీ స్పూను, మెంతులు - టీ స్పూను, ఇంగువ - పావు టీ స్పూను, పసుపు - టీ స్పూను, గరం మసాలా - అర టీ స్పూను, నిమ్మరసం - 2 టేబుల్ స్పూన్లు, నూనె - 2 టేబుల్ స్పూన్లు
తయారీ: బాణలిలో ఆవాలు, జీలకర్ర, మెంతులు (నూనె లేకుండా) వేసి వేయించాలి ఇంగువ జత చేసి బాగా కలిపి స్టౌ ఆపేసి, చల్లార్చాలి మిక్సీలో... ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఇంగువ వేసి మెత్తగా పొడి చేయాలి పసుపు, గరం మసాలా, ఉప్పు జత చేసి మరోమారు తిప్పి, ఒక పాత్రలోకి తీసి, టేబుల్ స్పూను నిమ్మరసం, నూనెలో సగభాగం వేసి కలపాలి పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి, తొడిమలు తీసి, తడి పోయేవరకు నీడలో ఆరబెట్టాలి తడి పోయాక, పచ్చి మిర్చిని ఒక వైపు కట్ చేసి, తయారుచేసి ఉంచుకున్న మిశ్రమాన్ని స్టఫ్ చేసి, ఒక ప్లేట్లో ఉంచాలి మిగిలిన నూనెను వాటి మీద వేసి ఎండబెట్టాలి. (ఎండ లేకపోతే ప్లేట్‌ను గదిలోనే ఉంచాలి) ప్రతిరోజూ రెండుసార్లు కలుపుతుండాలి నాలుగు రోజుల తర్వాత వాడుకోవచ్చు. కారం వాడనివాడు తెలుగువాడు కాడు. కూరగాయల బుట్టలో కాసిని పచ్చి మిర్చిని పడేసుకోని ఇల్లాలు తెలుగు ఇల్లాలు కాదు. చప్పిడి తిండి తింటే తెలుగు పౌరుషం ఏం కావాలి చెప్పండి.
ఒకేలాంటి తిండి తినీ తినీ విసుగెత్తి పోయారా?ఇవిగో ఈ పదార్థాలతో కాసింత కారం తగిలించండి. కళ్లల్లో నోటిలో నీరు కారనీయండి. ఫ్రెష్ అయిపోతారు. మిర్చి - కొరికితే కారమే. కోసి వండి నలుగురికీ పెడితే మమకారమే.
పచ్చి మిర్చి పచ్చడి
కావలసినవి: పచ్చి మిర్చి - 50 గ్రా., మినప్పప్పు - టేబుల్ స్పూను, సెనగ పప్పు - టేబుల్ స్పూను, ఆవాలు - టీ స్పూను, జీలకర్ర - టీ స్పూను, మెంతులు - అర టీ స్పూను, పల్లీలు - టేబుల్ స్పూను, ఇంగువ - పావు టీ స్పూను, పసుపు - పావు టీ స్పూను, చింతపండు - నిమ్మకాయంత, ఉప్పు - తగినంత, నూనె - టేబుల్ స్పూను, కొత్తిమీర - కొద్దిగా.
తయారీ: పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి తొడిమలు తీసేయాలి బాణలిలో నూనె కాగాక పచ్చి మిర్చి వేసి వేయించి తీసేయాలి అదే బాణలిలో మరి కాస్త నూనె వేసి కాగాక మినప్పప్పు, సెనగ పప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, వేసి వేయించి, చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా అయ్యేలా తిప్పాలి వేయించిన పచ్చి మిర్చి, చింతపండు, ఉప్పు వేసి మరోమారు మెత్తగా అయ్యేలా తిప్పి, చిన్న గిన్నెలోకి తీసుకోవాలి కొత్తిమీరతో అలంకరించి, వేడి వేడి అన్నంలో కమ్మటి నేతితో తింటే రుచిగా ఉంటుంది.
పనీర్ చిల్లీ పకోడా
కావలసినవి: పచ్చిమిర్చి - 100 గ్రా., పనీర్ తురుము - అర కప్పు, సెనగ పిండి - 100 గ్రా., బియ్యప్పిండి - టేబుల్ స్పూను, కారం - టీ స్పూను, ఉప్పు - తగినంత, నూనె - డీప్ ఫ్రైకి సరిపడా, ధనియాల పొడి - అర టీ స్పూను, బేకింగ్ సోడా - చిటికెడు. తయారీ: పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి తొడి మలు తీసేయాలి మిక్సీలో పచ్చి మిర్చి వేసి మెత్తగా ముద్ద చేయాలి ఒక పాత్రలో పచ్చి మిర్చి ముద్ద, పనీర్ తురుము వేసి బాగా కలపాలి సెనగ పిండి, బియ్యప్పిండి, ఉప్పు, కారం, ధనియాల పొడి, బేకింగ్ పౌడర్ జత చేసి మరోమారు కలపాలి. (అవసరమనుకుంటేనే నీరు జతచేయాలి) బాణలిలో నూనె కాగాక, ఈ మిశ్రమాన్ని పకోడీలుగా వేయించాలి బంగారు వ ర్ణంలోకి వచ్చాక కిచెన్ టవల్ మీదకు తీసుకోవాలి చిల్లీ సాస్‌తో వేడివేడి పకోడీలను అందిస్తే రుచిగా ఉంటాయి.
చిల్లీ సాస్
కావలసినవి: పచ్చి మిర్చి - 100 గ్రా. (పెద్దవి), పచ్చి మిర్చి - 100 గ్రా. (చిన్నవి), వెనిగర్ - ముప్పావు కప్పు, జీలకర్ర - 2 టీ స్పూన్లు, అల్లం - చిన్న ముక్క, ఉప్పు - తగినంత, ఇంగువ - పావు టీ స్పూను, నూనె - 3 టేబుల్ స్పూన్లు
తయారీ: పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి తడిపోయేవరకు ఆరబెట్టాలి తొడిమలు తీసి, పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేయాలి అల్లం ముక్కలుగా తరగాలి బాణలిలో నూనె కాగాక జీలకర్ర వేసి వేయించాలి ఇంగువ జత చేయాలి పచ్చి మిర్చి, అల్లం ముక్కలు వేసి వేయించాలి ఉప్పు జత చేసి, రెండు నిమిషాల పాటు వేయించాలి అర కప్పు నీళ్లు జత చేసి బాగా కలిపి మూత పెట్టి సుమారు ఐదు నిమిషాలు ఉంచాలి ఒకసారి కలిపి మళ్లీ మూత ఉంచి తడి పోయేవరకు ఉంచి, దింపేయాలి చల్లారాక మిక్సీలో వేసి, కొద్దిగా వెనిగర్ జత చేసి మిక్సీ తిప్పాలి ఒకపాత్రలోకి తీసుకోవాలి మిగిలిన వెనిగర్ జత చేసి బాగా కలిపితే చిల్లీ సాస్ సిద్ధమైనట్లే ఎక్కువ రోజులు నిలవ ఉండాలనుకుంటే కొద్దిగా సిట్రిక్ ఆసిడ్ జత చేయాలి.
సేకరణ: డా. పురాణపండ వైజయంతి
‘సాక్షి’ ఫీచర్స్ ప్రతినిధి, విజయవాడ