
గ్రూప్స్ సెమీఫైనల్స్ మాత్రమే
సమాజ సేవే ఆశయం
నా విజయంలో కుటుంబ సభ్యులే కీలకం
‘సాక్షి’తో గ్రూప్–1 ర్యాంకర్ హరిణి
సప్తగిరికాలనీ(కరీంనగర్): ‘పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదు. ఎంచుకున్న లక్ష్యం నెరవేరే వరకు శోధన చేయాలి. అప్పుడే సక్సెస్ అవుతాం. ఐఏఎస్ లక్ష్యంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి రాజీనామా చేశాను. సొంతంగా ప్రిపేర్ అయ్యాను. అయి నా మూడు సార్లు సివిల్స్ రాసి తృటితో విఫలమయ్యాను. అధైర్య పడకుండా తొలి ప్రయత్నంలోనే గ్రూప్–1లో విజయం సాధించా. ఇందుకోసం కోచింగ్ లేకుండా సొంతంగా మూడు నెలలనే ప్రిపేరయ్యా. గ్రూప్–1 సెమీ ఫైనల్స్ మాత్రమే. నా లక్ష్యం సివిల్స్. ఐఏఎస్ సాధించి సమాజసేవే లక్ష్యంగా ముందుకు సాగుతా’ అంటోంది గ్రూప్–1లో రాష్ట్రస్థాయిలో 55వ ర్యాంక్, ఎస్సీ కమ్యూనిటీలో రాష్ట్రస్థా యి మొదటి ర్యాంకు సాధించిన కరీంనగర్‌కు చెందిన కన్నం హరిణి. ఆదివారం గ్రూప్–1 ఫలితాలు వెల్లడించిన నేపథ్యంలో ‘సాక్షి’తో తన విజయ రహస్యాలను పంచుకుంది.
అమ్మానాన్న ప్రభుత్వ ఉపాధ్యాయులు
మా సొంతూరు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం అనంతపల్లి. 15ఏళ్ల క్రితం కరీంనగర్‌లోని విద్యానగర్‌లో స్థిరపడ్డాం. అమ్మానాన్న రమేశ్, కళా ప్రపూర్ణ జ్యోతి ప్రభుత్వ ఉపాధ్యాయులు. అక్క అఖిల ఎంబీబీఎస్ పూర్తి చేసింది. చెల్లెలు వర్షిణి ఎంబీబీ ఎస్ ద్వితీయ సంవత్సరం, తమ్ముడు బాలాజీ మెడిసిన్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నాడు. నేను ఎస్సెస్సీలో 9.8 జీపీఏ, ఇంటర్ ఎంపీసీలో 978 మార్కులు సాధించాను. వరంగల్‌లోని నీట్‌లో ఈఈఈ పూర్తిచేశాను.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి రాజీనామా చేసి
బీటెక్ అనంతరం హైదరాబాద్‌లో బ్యాంక్ ఆఫ్ ఆమెరికాలో రెండేళ్లు సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా చేశాను. తరువాత ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యాను. మూడుసార్లు ప్రిలిమినరీలో 0.18శాతంతో మిస్సయ్యాను. మళ్లీ ప్రిపేర్ అవుతున్న క్రమంలో తెలంగాణ ప్రభుత్వం తొలిసారి గ్రూప్–1 నోటిఫికేషన్ ఇచ్చింది. కేవలం 3 నెలల పాటు శ్రమించి తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అయ్యాను. స్టేట్ 55ర్యాంక్, ఎస్సీ కేటరిటీలో ఫస్ట్ ర్యాంక్ సాధించాను.
కుటుంబ ప్రోత్సాహం
నా విజయంలో కుటుంబ సభ్యుల పాత్ర కీలకం. సివిల్స్‌లో ఫెయిల్ అయిన ప్రతీసారి వెన్ను తట్టి ప్రోత్సహించేవారు. 2021 కరోనా కాలంలో ఎక్కడా కోచింగ్ సెంటర్లు లేవు. అప్పటి నుంచి ఆన్‌లైన్ వేదికగా సివిల్స్ ప్రిపరేషన్ కొనసాగించా. అదే ప్రిపరేషన్ గ్రూప్–1 విజయంలో కీలకంగా మారింది. ఐఏఎస్ నా కల. గ్రూప్–1 ఉద్యోగం చేసూ్తనే సివిల్స్‌కు ప్రి పేర్ అవుతా. సమాజ సేవ చేయాలన్నదే నా ఆశయం. ఐఏఎస్‌లు ధాత్రిరెడ్డి, దురిశెట్టి అనుదీప్ నా రోల్ మోడల్.