దిల్లు ఉన్నోడు దునియా మొత్తం ఏలతాడు అన్నది సినిమా డైలాగే కానీ దీన్ని అక్షరాలా రుజువు చేసి చూపించాడు రైతు కుటుంబంలో పుట్టిన శ్రీకాంత్ బొల్లాపల్లి. చిన్నతనంలో కడు పేదరికంలో గడిపాడు. పదవ తరగతి స్కూలు ఫీజు కట్టడానికి కూడా డబ్బులు లేకపోవడంతో ఏదో ఒక పని చేసుకోవాలని భావించాడు. బెంగళూరులో వెయ్యి రూపాయలకు పనిచేశాడు. అక్కడ ఆయన జీవితం మలుపుతిరిగింది. లాభదాయకమైన పూలసాగు గురించి తెలుసుకుని సక్సెస్ అయ్యాడు. కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు.
తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో రైతు కుటుంబంలో పుట్టి పెరిగాడు శ్రీకాంత్. అతని కుటుంబం వ్యవసాయ కుటుంబమే కానీ పెద్దగా లాభసాటిగా లేదు. చదువుకొని ఉద్యోగం చేయాలనుకున్నాడు. అదీ కుదరలేదు. అటుపేదరికం, ఇటు అప్పులు ఇలా అనేక సవాళ్లు కళ్లముందు కనిపించాయి. దీంతో16 ఏళ్లకే 1995లో బెంగళూరులో బంధువులతో కలిసి పనిచేయాల్సి వచ్చింది. అక్కడ పూల పెంపకం గురించి తెలుసుకుని మళ్లీ వ్యవసాయం చేయాలన్న కోరిక పుట్టింది.
నెలకు వెయ్యి రూపాయల చొప్పున ఏడాది పని చేసిన తర్వాత, శ్రీకాంత్ వ్యాపారానికి సంబంధించిన మెళకువలతో సిద్ధమయ్యాడు. పూలసాగు, కోత, మార్కెటింగ్ ,పువ్వుల ఎగుమతి ఇలా ప్రతిదీ నేర్చుకున్నాడు. తొలుత చాలా తక్కువ పెట్టుబడితో రైతుల నుండి పూలను సేకరించి వాటితో వ్యాపారం చేయడం ప్రారంభించాడు. 1997లో నగరంలో చిన్న పూల దుకాణాన్ని ప్రారంభించాడు. అలా ఒక పదేళ్లు పనిచేశాక ఇతర పూల పెంపకం దారులతో సహా పరిశ్రమలోని ఇతరులతో పరిచయాలు బాగా పెరిగాయి. దీంతో సొంతంగా పూలసాగులోకి దిగాడు.
నేషనల్ హార్టికల్చర్ బోర్డును సంప్రదించి, ప్రభుత్వ రుణం తీసుకొని బెంగళూరులోని దొడ్డబళ్లాపుర సమీపంలోని 10 ఎకరాలతో ప్రారంభించిన పూలసాగు ఆయన ఇప్పుడు 52 ఎకరాలకు చేరింది. 52 ఎకరాల పొలంలో గులాబీలు, జెర్బెరా, కార్నేషన్లు, జిప్సోఫిలా ఇలా 12 రకాలకు పైగా పూలను పండిస్తున్నాడు శ్రీకాంత్. ఏడాదికి దాదాపు 70 కోట్లదాకా సంపాదిస్తున్నాడు.
వ్యవసాయంలో ముఖ్యంగా వాతావరణ పరిస్థితులలో మార్పులకారణంగా కష్టాలు, సవాళ్లు చాలా ఉంటాయి. దృఢ సంకల్పం , సహనమే తనను ఉన్నత స్థితికి తీసుకువెళ్లింది అంటాడు శ్రీకాంత్. తన సాగు అంతా సేంద్రీయంగా ఉంటుందనీ, గ్రీన్‌హౌస్‌లు, పాలీహౌస్‌లలో సేంద్రీయంగా పెంచుతానని తెలిపాడు. దేశవ్యాప్తంగా ఉన్న కస్టమర్లతో, శ్రీకాంత్ రూ. 70 కోట్ల టర్నోవర్‌ను సాధించాడు. గ్రామీణ కర్నాటక చుటుపక్కల 200 మందికి పైగా ఉపాధి కల్పిస్తూ విజయబాటలో నడుస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment