
కృషి, పట్టుదల ఉంటే మనిషి దేన్నైనా సాధించగలడు. తాను ఏ స్థితిలో ఉన్నా భవిష్యత్తులో ఉన్నత స్థానానికి చేరగలడు. అందుకు ప్రముఖ వ్యాపారవేత్త నిర్మల్ మిండా(66) జీవితమే ఉదాహరణ. తన తండ్రికి చెందిన చిన్న మెకానిక్ షాపులో వాహనాలకు ఎలక్ట్రిక్ పరికరాలను తయారు చేసే నిర్మల్ మిండా క్రమంగా వ్యాపారంలో ఎదిగి ఏకంగా రూ.66,904 కోట్ల విలువైన యునో మిండా కంపెనీకి సారథిగా నిలిచారు. తాను ఇంత స్థాయికి ఎలా ఎదిగారో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇంజినీరింగ్‌లోనే కారు ఉత్పత్తి అంశాలపై దృష్టి
నిర్మల్ మిండా హరియాణాలో జన్మించారు. తనకు చిన్నతనం నుంచి ఇంజినీరింగ్ పట్ల అభిరుచి ఉండేది. తన తండ్రి షాదీలాల్ మిండాకు ఢిల్లీలోని కమలానగర్‌లో మోటారు సైకిళ్లకు అవసరమైన ఎలక్ట్రికల్ విడిభాగాలను తయారు చేసే ఓ చిన్న షాపు ఉంది. ఇక్కడే ఆయన విజయానికి పునాది పడింది. నిత్యం తండ్రి చేస్తున్న పనిని గమనిస్తూ ఈ రంగంలో కీలక మార్పులు తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. దాంతో ఆటోమోటివ్ ప్రొడక్షన్‌లో కెరీర్ ప్రారంభించాలని భావించి మెకానికల్ ఇంజినీరింగ్ చదివారు. ఇంజినీరింగ్‌లో ఉన్నప్పుడే తాను కారు ఉత్పత్తికి అవసరమైన అన్ని అంశాలను నేర్చుకున్నారు. 1977లో తన 20వ ఏట తన తండ్రి కంపెనీలో చేరారు. అప్పటికే తన ఆలోచనలతో చిన్న షాపుగా ఉన్న వారి కుటుంబ వ్యాపారం కాస్తా చిన్నపాటి కంపెనీగా రూపాంతరం చెందేందుకు కృషి చేశారు. ఆయన మొదట్లో సంస్థలో మార్కెటింగ్ విభాగంలో పనిచేసి కొత్త ఆలోచనలు, ఆశయాలను పంచుకున్నారు.
వ్యూహాత్మక దూరదృష్టి
1990ల్లో నిర్మల్ తన సోదరుడితో విడిపోయి సొంతంగా వ్యాపారం ప్రారంభించారు. గతంలో మిండా ఇండస్ట్రీస్ అని పిలువబడే యునో మిండాకు పునాది వేశారు. అతని వ్యూహాత్మక దూరదృష్టితో కేవలం మోటారుసైకిల్ భాగాల్లో మాత్రమే కాకుండా ఇతర విడిభాగాలను తయారు చేయడం ప్రారంభించారు. సెన్సార్లు, లైట్లు, అల్లాయ్ వీల్స్‌తో సహా విస్తృత శ్రేణి ఆటోమోటివ్ భాగాలను మార్కెట్‌లో ప్రవేశపెట్టారు. ఇవి ద్విచక్ర వాహనాలు, కార్లు రెండింటి అవసరాలను తీర్చాయి. దాంతో కొద్ది కాలంలోనే కంపెనీ ఉత్పత్తులకు ఆదరణ పెరిగింది. ప్రస్తుతం యునో మిండా హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో వంటి ప్రధాన ఒరిజినల్ పరికరాలతోపాటు అంతర్జాతీయ బ్రాండ్లకు సరఫరాదారుగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా 73 తయారీ ప్లాంట్లను కలిగి ఉంది.
అతిపెద్ద సంస్థల్లో ఒకటిగా..
ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) రంగంలోకి ప్రవేశించడం యునో మిండా వృద్ధికి కీలకంగా మారింది. 2020 నుంచి కంపెనీ సెన్సార్లు, లైటింగ్ వంటి విభాగాల్లో అధునాతన విడిభాగాలను ఉత్పత్తి చేస్తుంది. ఇందుకోసం చైనాకు చెందిన సుజౌ ఇనోవాన్స్ ఆటోమోటివ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇది వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆటోమోటివ్ పరిశ్రమలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసేందుకు తోడ్పడుతుందని కంపెనీ నమ్ముతుంది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.50,268 కోట్లు కాగా, ప్రపంచవ్యాప్తంగా ఆటో కాంపోనెంట్స్ రంగంలో అతిపెద్ద సంస్థల్లో ఒకటిగా నిలిచింది.
బిలియనీర్‌గా..
నిర్మల్ మిండా వ్యక్తిగత సంపద అతని వ్యాపార విజయాన్ని ప్రతిబింబిస్తుంది. ఇప్పటివరకు అతని సంపద నికర విలువ 3.5 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది సుమారు రూ.30,000 కోట్లకు సమానం. దాంతో గురుగ్రామ్‌లోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు. దాంతోపాటు భారతదేశంలోని బిలియనీర్లలో ఒకరిగా గుర్తింపు పొందారు. గురుగ్రామ్‌లోని రెండో అత్యంత ధనవంతుడైన దీపిందర్ గోయల్ సంపద కంటే మిండా సంపద మూడు రెట్లు ఎక్కువ. హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024 ప్రకారం మిండా సంపద 2018లో ఒక బిలియన్ డాలర్ల నుంచి 2025 నాటికి 3.5 బిలియన్ డాలర్లకు చేరింది.
ఇదీ చదవండి: జొమాటోలో ఉద్యోగాల కోత.. కారణం..
దాతృత్వ కార్యక్రమాలతో సేవ
నిర్మల్ మిండా కేవలం బిజినెస్ టైకూన్ మాత్రమే కాదు. ఆయన పరోపకారిగా కూడా గుర్తింపు పొందారు. సామాజిక అభ్యున్నతికి సుమన్ నిర్మల్ మిండా ఫౌండేషన్ (ఎస్ఎన్ఎమ్ఎఫ్) స్థాపించి దాతృత్వ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సుమన్ మిండాను వివాహం చేసుకున్న అతను నిత్యం వందల సంఖ్యలో పిల్లలకు ఆహారం, ఆశ్రయంతోపాటు విద్యను అందించేలా మిండా బాల్ గ్రామ్ అనే అనాథాశ్రమాన్ని స్థాపించారు. నిరుపేద పిల్లల కోసం ప్రాథమిక పాఠశాల మిండా విద్యా నికేతన్‌ను ఏర్పాటు చేశారు. అతని కృషికి ‘హరియాణా రత్న’ అవార్డు, ఇండియా యమహా మోటార్స్ నుంచి ‘గోల్డ్ అవార్డు ఫర్ క్వాలిటీ’ వంటి ప్రశంసలు లభించాయి. నిర్మల్, సుమన్ దంపతులకు పరిధి, పల్లక్ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.