
దృఢ సంకల్పం, పట్టుదల ఉంటే జీవితంలో ఏదైనా సాధించగలమని ప్రముఖ పారిశ్రామికవేత్త రాజ్ సర్దానా నిరూపించారు. ఢిల్లీలో ప్రభుత్వం నిర్మించిన ఒక చిన్న ఇంట్లో ఉంటూ జీవనం సాగించిన సర్దానా వ్యాపారంలో ఎదిగి యునైటెడ్ స్టేట్స్‌లో బిలియనీర్‌గా స్థిరపడ్డారు. జేబులో కేవలం 100 డాలర్ల(సర్దానా అమెరికా వెళ్లే సమయానికి విలువ రూ.1700)తో అమెరికాలో అడుగుపెట్టిన ఆయన తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించి ఏకంగా రెండు బిలియన్ డాలర్ల(ప్రస్తుతం రూ.16,490 కోట్లు) నికర సంపదని సృష్టించారు. రాజ్ సర్దానా జీవిత ప్రయాణం ఎంతోమంది పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.
ఢిల్లీలో జీవితం ప్రారంభం..
1947 విభజన తర్వాత భారతదేశానికి వలస వచ్చిన పంజాబీ తల్లిదండ్రులకు 1960లో సర్దానా జన్మించారు. న్యూఢిల్లీలోని ప్రభుత్వ గృహంలో పెరిగారు. ఎలాంటి సదుపాయాలు లేని సాధారణ జీవితం సాగించారు. ‘నా తల్లిదండ్రులు నా ఎదుగుదలకు అలుపెరగని కృషి చేశారు. ఎన్నో విలువలు నేర్పించారు. నాకు, నా సోదరుడికి నాణ్యమైన విద్యను అందించడానికి చాలా కష్టపడ్డారు’ అని అథారిటీ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సర్దానా గుర్తు చేసుకున్నారు.
అమెరికాకు తరలివెళ్లి..
సర్దానా 1981లో జార్జియా టెక్‌లో మెకానికల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ చేయడానికి యునైటెడ్ స్టేట్స్‌కు వెళ్లారు. అమెరికా వెళ్లే సమయానికి తన వద్ద కేవలం 100 డాలర్లు(ప్రస్తుతం దాని విలువ రూ.8,500) ఉన్నాయి. పొట్టకూటికోసం కాలేజీ క్యాంటీన్‌లో పని చేయాలని నిర్ణయించుకున్నాడు. అక్కడ సంపాదించగా వచ్చిన డబ్బుతోనే చదువు పూర్తిచేశాడు. గ్రాడ్యుయేషన్ తరువాత సర్దానా హెచ్-1 వీసా (నేటి హెచ్-1 బీ వీసా) పొంది హౌమెట్ ఏరోస్పేస్‌లో కెరియర్ ప్రారంభించారు.
కెరియర్‌లో ఒడిదొడుకులు
1987 నాటికి సర్దానా తోమహాక్ క్షిపణి ఇంజిన్లను తయారు చేసే టెలీడైన్ సీఏఈ అనే సంస్థలో ప్రతిష్ఠాత్మక ఉద్యోగంలో చేరాడు. అయితే 1990లో ప్రచ్ఛన్న యుద్ధం(యూఎస్-సోవియట్ యూనియర్ మధ్య యుద్ధం) ముగియడంతో క్షిపణి ఉత్పత్తి నిలిచిపోయింది. దాంతో సర్దానా ఉద్యోగం కోల్పోయారు. ‘అప్పటికే నేను తనఖాతో ఇల్లు కొన్నాను. ఆరు నెలల కుమార్తె ఉంది. నా తల్లిదండ్రులు కూడా నాతో నివసిస్తున్నారు. ఆ సమయంలో నా కుటుంబాన్ని పోషించడానికి ఆదాయం లేదు’ అని సర్దానా ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ సమయంలో ఆర్థిక అనిశ్చితి ఎదుర్కొన్న ఆయన సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని పారిశ్రామికవేత్తగా ఎదగాలని నిర్ణయించుకున్నారు. అప్పటికే తన వద్ద ఉన్న పొదుపు 25,000 డాలర్లు(ఇప్పటి విలువ రూ.21.86 లక్షలు)తో సొంత వ్యాపారాన్ని ప్రారంభించాడు.
ఇదీ చదవండి: ఆకాశవీధిలో పెరిగిన ప్రయాణికులు
ఇన్నోవా సొల్యూషన్స్
ఐటీ సేవలకు భవిష్యత్తులో గిరాకీ ఉంటుందని గ్రహించిన రాజ్ తరువాతి కాలంలో కొన్ని ఐటీ సంస్థలను కొనుగోలు చేసి ఇన్నోవా సొల్యూషన్స్ అనే ఐటీ సేవల సంస్థను అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఇన్నోవా సొల్యూషన్స్‌లో ప్రపంచవ్యాప్తంగా 50,000 మందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. సర్దానా సంస్థల నికర విలువ రెండు బిలియన్ డాలర్లు(రూ.16 వేల కోట్లు)గా ఉంది. ఢిల్లీలోని ప్రభుత్వ గృహంలో నివసించి కేవలం జేబులో 100 డాలర్లతో అమెరికా వెళ్లిన సర్దానా ప్రస్తుతం బిలియనీర్‌గా ఎదిగి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment