
దృఢ సంకల్పం, మనం కనే కలలపై అచంచల విశ్వాసం ఉంటే ఏదైనా సాధ్యమని ప్రముఖ పారిశ్రామికవేత్త బినోద్ చౌదరి నిరూపించారు. ఆయన పూర్వీకులు రాజస్థాన్ నుంచి నేపాల్‌లోని ఖాట్మండుకు వలస వెళ్లడంతో అక్కడే స్థిరపడి టెక్స్‌టైల్ వ్యాపారాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి నేపాల్‌లో తొలి బిలియనీర్‌గా మారారు. బిజినెస్ గురించి ఆయన అవలంబిస్తున్న విధానాలు, చేస్తున్న వ్యాపారాలు వంటి ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.
బినోద్ చౌదరి నేపాల్‌లోని ఖాట్మండులో మార్వాడీ కుటుంబంలో జన్మించారు. ఆయన పూర్వీకులు ఇండియాలోని రాజస్థాన్ నుంచి చాలా ఏళ్ల కిందటే వలస వెళ్లారు. 1934లో నేపాల్-బిహార్ భూకంపం తరువాత బినోద్ తాత బురమల్‌దాస్ చౌదరి తన 20వ ఏటా టెక్స్‌టైల్ వ్యాపారం ప్రారంభించారు. నేపాల్‌లో అధికారికంగా నమోదు చేయబడిన దుస్తుల కంపెనీని ప్రారంభించిన మొదటి వ్యక్తిగా నిలిచారు. బినోద్ తండ్రి లుంకరణ్ దాస్ చౌదరి తాత స్థాపించిన వస్త్ర వ్యాపారాన్ని అభివృద్ధి చేశారు. అంతర్జాతీయ వర్తక సంస్థలను ప్రారంభించారు. 1968లో లుంకరణ్ దాస్ చౌదరి అరుణ్ ఎంపోరియం అనే రిటైల్ స్టోర్‌ను ఏర్పాటు చేశారు. ఇది అత్యంత విజయవంతమైన సంస్థగా నిలిచింది.
పద్దెనిమిదో ఏటా బాధ్యతలు
పద్దెనిమిదేళ్ల వయసులో బినోద్ చౌదరి చార్టర్డ్ అకౌంటెన్సీ చదవడానికి ఇండియా రావాలని నిర్ణయించుకున్నారు. కాని అతని తండ్రి గుండె జబ్బుతో బాధపడుతుండడంతో కుటుంబ వ్యాపారాన్ని కొనసాగించలేరని డాక్టర్ చెప్పారు. దాంతో కుటుంబ బాధ్యతతోపాటు వ్యాపారాలు చూసుకోవాల్సి వచ్చింది. తాత స్థాపించి, తండ్రి అభివృద్ధి చేసిన వ్యాపారం పగ్గాలు బినోద్ అందుకున్నారు. ఈ సంఘటనపై బినోద్ ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ..‘రాత్రికి రాత్రే నా జీవితం పూర్తిగా మారిపోయింది. నాకు వేరే ఆప్షన్ లేదు. కానీ అది నన్ను మరింత కఠినమైన వ్యక్తిగా మార్చింది’ అని అన్నారు.
తొలుత నేపాల్‌కు జపాన్ సుజుకీ కార్లను దిగుమతి చేసుకొని ఆ సంస్థ కార్లకు డీలర్‌షిప్ దక్కించుకొని ఆటోమొబైల్ విభాగంలోకి అడుగుపెట్టాలని బినోద్ భావించారు. కానీ తాను వస్త్ర వ్యాపారి కాబట్టి సుజుకీ సంస్థ తనను నమ్మలేదు. అయినా వారిని ఒప్పించి నేపాల్‌లో సుజుకీ ఉత్పత్తులు విక్రయించడానికి ట్రయల్ డీలర్ షిప్ ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం ఆరు నెలల్లో ఎక్కువ కార్లు అమ్మితే పూర్తి డీలర్‌షిప్ లభిస్తుంది. దాంతో అనుకున్న విధంగానే అత్యధిక కార్లు సేల్ చేసి డీలర్‌షిప్ పొందారు. తర్వాత కాపర్ ఫ్లోర్ అని పిలువబడే డిస్కోటెక్ కంపెనీను స్థాపించారు. ఈ క్లబ్‌ను సందర్శించిన అనేక మంది సంపన్నుల కారణంగా కంపెనీ భారీ విజయం సాధించింది. 1979లో జపనీస్ ఎలక్ట్రానిక్ సంస్థ నేషనల్ పానాసోనిక్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు.
వై వై నూడుల్స్ తయారీ
బినోద్ చౌదరి తన 23వ ఏటా ఒకసారి థాయ్‌లాండ్‌కు వెళ్లారు. అక్కడ చాలామంది నూడుల్స్ తినడం, వాటిని కొనుగోలు చేయడం గమనించాడు. వెంటనే నూడుల్స్ అమ్మాలనే ఆలోచన చౌదరికి వచ్చింది. నేపాల్‌లోనూ థాయ్ నూడుల్స్‌పై మక్కువ ఉందని గ్రహించారు. థాయ్‌లాండ్‌లోని నూడుల్స్‌ను ఉత్పత్తి చేసే థాయ్ ప్రిజర్వ్‌డ్ ఫుడ్ ఫ్యాక్టరీ కంపెనీ లిమిటెడ్‌ను సందర్శించారు. ఆ కంపెనీతో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నాడు. దాంతో ఆ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని నేపాల్‌లో ఇన్‌స్టంట్ నూడుల్స్ బ్రాండ్ వై వైను ప్రారంభించారు. ఈ కంపెనీ చాలా తక్కువ సమయంలోనే భారీగా విక్రయాలు జరిపి రికార్డు నెలకొల్పింది. క్లబ్‌ను నిర్వహించడం, తన తండ్రి స్థాపించిన అరుణ్ ఎంపోరియం నడపడం తనకు ఎన్నో వ్యాపార విషయాలు నేర్పించాయని బినోద్ తెలిపారు.
పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నిక
1979లో అతని నూడుల్స్ కంపెనీకి నేపాల్ ప్రభుత్వం నుంచి లైసెన్స్ అవసరం అయింది. ఆ సమయంలో సూర్య బహదూర్ థాపా అధికారంలో ఉన్నారు. అతను చౌదరిని తన పరిపాలనకు, ప్రచారానికి మద్దతు ఇవ్వాలని కోరగా వెంటనే ఒప్పుకున్నారు. తర్వాత కొన్ని కారణాల వల్ల 2017లో షేర్ బహదూర్ దేవ్‌బా నేతృత్వంలోని నేపాలీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. చౌదరి దేశానికి గణనీయమైన కృషి చేశారని పార్టీ పేర్కొంది. డిసెంబర్ 2022లో పార్టీ తరఫున పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
ఇతర వ్యాపారాలు
1995లో నబిల్ బ్యాంకులో దుబాయ్ ప్రభుత్వ నియంత్రణ వాటాను చౌదరి కొనుగోలు చేశారు. 1990లో సింగపూర్‌లో సినోవేషన్ గ్రూప్‌ను ప్రారంభించారు. హోటళ్లు, రిసార్టులు, వన్యప్రాణులు, పర్యాటకం, ఎఫ్ఎంసీజీ (ఫుడ్ అండ్ బేవరేజెస్), రియల్ ఎస్టేట్, సిమెంట్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాల్లో ఈ కంపెనీ సర్వీసు అందిస్తోంది. తాజ్ హోటల్స్ గ్రూప్‌తో జాయింట్ వెంచర్స్ కోసం చౌదరి చర్చలు జరిపారు. బినోద్ చౌదరి నాయకత్వంలో చౌదరి గ్రూప్ టూరిజం, రియల్ ఎస్టేట్, ఆర్థిక సేవలు, విద్యతో సహా వివిధ విభాగాల్లో సర్వీసులు అందిస్తోంది. దాదాపు 30కి పైగా దేశాల్లో విస్తరించింది. నేపాల్‌లో ఇతర పెట్టుబడిదారులు ఇన్వెస్ట్ చేసేందుకు సురక్షితమైన ప్రదేశంగా భావించేలా చేస్తుండడంతో బినోద్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఏ ప్రభుత్వమైనా పెట్టుబడులకు అనుకూలంగా ఉండాలని, సంపద సృష్టి, ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ను ప్రోత్సహించాలని తెలిపారు.
ఇదీ చదవండి: ప్రపంచంలోనే అధిక బంగారు నిల్వలున్న దేశాలు
టాటా, బచ్చన్‌లే ఆదర్శం
బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, దివంగత పారిశ్రామికవేత్త జేఆర్‌డీ టాటా ఇద్దరు ప్రముఖులను బినోద్ ఆదర్శంగా తీసుకుంటారని చెప్పారు. అమితాబ్ బచ్చన్ తీవ్ర సంక్షోభంలో కూడా తననుతాను ఎలా మోటివేట్ చేసుకున్నారో నిత్యం గుర్తు చేసుకుంటానని తెలిపారు. మరోవైపు భారత్ ఎన్నో వ్యాపారాలు ప్రారంభించిన జేఆర్‌డీ టాటా దార్శనిక నాయకత్వం, నైతిక వ్యాపార విధానాలను తాను ఆదర్శంగా తీసుకుంటానని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment