entrepreneurship
-
అవసరం నుంచి ఆకాంక్ష వరకు
మహిళల పురోగతికి ఆకాశమే హద్దు. నిజమే... మరి! మహిళ పురోగతి ఎక్కడ మొదలవుతుంది? ఒక ఆకాంక్ష నుంచి మొదలు కావచ్చు... అలాగే... ఒక అవసరం నుంచి కూడా మొదలు కావచ్చు. అవును... అవసరమే ఆమెను జాతీయస్థాయిలో నిలిపింది. ఆమె... మహిళలకు చేయూతనిచ్చే స్థానంలో నిలిచింది. ఆలూరి లలిత మహిళాపారిశ్రామికవేత్త. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ చేశారు. పెళ్లి చేసుకుని హైదరాబాద్‌లో వ్యాపార కుటుంబంలో అడుగుపెట్టారు. ఉమ్మడి కుటుంబం కూడా కావడంతో తన మీద పెద్ద బాధ్యతలేవీ లేవు. నాలుగేళ్లు అలా గడిచిపోయాయి. తమ కంపెనీ ఒడిదొడుకుల్లో ఉందని, భాగస్వాములు దూరం జరిగారని తెలిసిన తర్వాత భర్తకు తోడుగా బాధ్యత పంచుకోవడానికి భుజాన్నివ్వాల్సి వచ్చింది. అలా మొదలైన పారిశ్రామిక ప్రస్థానం ఆమెను విజేతగా నిలపడంతోపాటు జాతీయ స్థాయిలో సంఘటితమైన మహిళా పారిశ్రామికవేత్తల సమాఖ్య (కోవె)కు అధ్యక్షురాలిని చేసింది. ఆ వివరాలను సాక్షితో పంచుకున్నారు లలిత. ‘అవసరం’తో పోరాటం ‘‘గృహిణిగా ఉన్న నేను పరిశ్రమ నిర్వహణలోకి అడుగుపెట్టింది 1998లో. అప్పటికే మనుగడ సమస్య మాది. తీరా అడుగు పెట్టిన తర్వాత తెలిసింది బ్యాంకు వాళ్లు మా పరిశ్రమను ఎన్పీఏ (నాన్ పెర్ఫార్మింగ్ అసెట్) కేటగిరీలో లిస్ట్ చేశారని. మూడు క్వార్టర్లు బకాయి పడి ఉన్నాం. మరో క్వార్టర్ సమయం కావాలని అడిగాను. మొదట్లో ససేమిరా అన్నారు. ‘మీరు హ్యాండోవర్ చేసుకుని మీ డబ్బు ఎలా జమ చేసుకుంటార’ని అడిగాను. మెషినరీ అమ్మేస్తామన్నారు. ఈ మెషీన్లతో పని చేయడానికి మా వారు సింగపూర్‌లో శిక్షణ తీసుకుని వచ్చారు, హైదరాబాద్‌లో ఈ టెక్నాలజీ చాలామందికి తెలియదు. మీరు స్క్రాప్ కింద అమ్మాల్సిందే, రెండు లక్షలు కూడా రావు. మాకు టైమిస్తే మీ లోన్ మొత్తం తీర్చేస్తామని చెప్పాను. ఆ తర్వాత అక్కచెల్లెళ్లు, అన్నదమ్ముల సహాయంతో పది లక్షలు ఎదురు పెట్టి కొత్త టెక్నాలజీతో పరిశ్రమను నడిపించాం. రెండేళ్లపాటు రోజుకు 18 గంటలు పనిచేశాం. మొత్తానికి గట్టెక్కాం. 2005లో పరిశ్రమ విస్తరించాలనే ఆలోచనతో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ నెట్వర్క్ – జేఎన్టీయూ తో కలిసి నిర్వహించిన ఎంప్లాయ్మెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌లో శిక్షణ తీసుకున్నాను. అప్పటి నుంచి ఈ సంస్థలో భాగస్వామినయ్యాను. లైఫ్ మెంబర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్, తెలంగాణ చాప్టర్ ప్రెసిడెంట్, జాతీయ స్థాయి కమిటీలో జాయింట్ సెక్రటరీ, సెక్రటరీ బాధ్యతలు నిర్వహించి ఇప్పుడు ప్రెసిడెంట్ బాధ్యతలు చేపట్టాను. ఈ రాష్ట్రాలు ముందున్నాయి! మహిళా పారిశ్రామిక వేత్తల విషయంలో తెలంగాణ, ఏపీ, కర్ణాటక, రాజస్థాన్, గుజరాత్, యూపీ, ఢిల్లీ రాష్ట్రాలు ముందువరుసలో ఉన్నాయి. వెస్ట్‌బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్రతోపాటు కొన్ని రాష్ట్రాలు చేయి పట్టి నడిపించాల్సిన దశలోనే ఉన్నాయి. మా సంస్థలో ఉన్న ఎంటర్‌ప్రెన్యూర్స్‌లో ఎక్కువ మంది బాగా చదువుకున్న వాళ్లే. ఐఐటీ, బిట్స్, ఐఐఎమ్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్లు ఇంజనీరింగ్, మాన్యుఫాక్చరింగ్ కంపెనీలు నిర్వహిస్తున్నారు. మా చదువు, పరిశ్రమ నిర్వహణలో మేము నేర్చుకున్న మెళకువలతో కొత్తగా పరిశ్రమల రంగంలోకి వచ్చిన వాళ్లకు మెంటార్‌గా వ్యవహరిస్తున్నాం. ఈశాన్య రాష్ట్రాల మీద ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్నాం. అలాగే కాలేజ్‌లకెళ్లి విద్యార్థులకు వర్క్‌షాపులు నిర్వహించడం, నగరాల్లోని అల్పాదాయ వర్గాలు నివసించే కాలనీల్లోనూ, గ్రామాల్లోనూ మహిళలకు శిక్షణతోపాటు ఇన్క్యుబేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. మహిళలు మారారు! మహిళల్లో చాలా మార్పు వచ్చింది. ఒకప్పుడు మహిళలు ఉద్యోగం చేసుకుంటే చాలన్నట్లు, భర్త సంపాదనకు తోడు మరికొంత అన్నట్లు ఉండేవారు. ఇప్పుడు ఆ ధోరణి పూర్తిగా మారిపోయింది. తన ఐడెంటిటీని తామే రాసుకోవాలనే ఆకాంక్ష పెరిగింది. అలాగే విజయవంతం అవుతున్నారు. ఉద్యోగం చేసి పిల్లల కారణంగా కెరీర్లో విరామం వచ్చిన మహిళలకు (35 నుంచి 45 ఏళ్ల మధ్య ఉన్న వారికి) వారి సామర్థ్యం, ఆసక్తిని బట్టి ‘రీ ఇగ్నైట్’ ప్రోగ్రామ్ కింద సపోర్ట్ చేస్తున్నాం. పదివేల మంది విద్యార్థులను, 30 వేల మంది గ్రామీణ మహిళలను సాధికారత దిశలో నడిపించాలనేది ప్రస్తుతం మా కోవె ముందున్న లక్ష్యం’’. ఇలా చేయండి ఒక మహిళ వ్యాపారం కానీ పరిశ్రమ కానీ పెట్టినప్పుడు అది నిలదొక్కుకుని లాభాల బాట పట్టే వరకు దాదాపుగా మూడు నాలుగేళ్లు జీవితం మనది కాదు మన పరిశ్రమది అనుకుని శ్రమించాలి. మార్కెట్‌ని విశ్లేషించుకోవాలి. రెవెన్యూ మీద అవగాహన ఉండాలి. పెట్టుబడి, రాబడి మాత్రమే కాదు. రాబడికి ఆదాయానికి మధ్య తేడా తెలుసుకోవాలి. ► కౌంటర్లోకి వచ్చిన ప్రతిరూపాయి మనది కాదు. ఉద్యోగుల వేతనాలు, అద్దె, కరెంటు, పెట్టుబడి కోసం మనం ఇంటి నుంచి పెట్టిన డబ్బుకు కొంత జమ వేసుకోవడం, బ్యాంకు లేదా ఇతర అప్పులు అన్నీ పోగా మిగిలినదే ఆదాయం. అదే మనం సంపాదించినది, మన కోసం ఖర్చు చేసుకోగలిగినది. ► పరిశ్రమ కోసం ఒక మూలనిధి ఏర్పాటు చేసి ఏటా పదిశాతం లాభాలను మూలనిధిలో జమ చేయాలి. యంత్రాల రిపేరు వంటి అనుకోని ఖర్చులకు, పరిశ్రమ విస్తరణకు ఆ నిధి పనికొస్తుంది. కోవిడ్ దెబ్బకు తట్టుకుని నిలబడినవన్నీ మూలనిధి ఉన్న పరిశ్రమలే. ► మహిళలు గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే... పరిశ్రమ నిర్వహణ బరువైనప్పుడు అది లాభాల బాట పట్టడం కష్టం అని నిర్ధారించుకున్నప్పుడు దాని నుంచి వెంటనే మరొక దానికి మారిపోవాలి. ► మొదట్లో కష్టపడినన్ని గంటలు పదేళ్లు, పాతికేళ్లు కష్టపడలేరు. కాబట్టి ఇంట్లోనూ, పరిశ్రమలోనూ సపోర్టు సిస్టమ్‌ని అభివృద్ధి చేసుకోవాలి. ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి ఫొటోలు : మోర్ల అనిల్ కుమార్ -
త్వరలో ‘నైపుణ్యాల హబ్’గా భారత్
న్యూఢిల్లీ: ప్రజల్లో అవకాశాలను అందిపుచ్చుకునే సామర్థ్యాలు, అవగాహనను పెంపొందించేందుకు విద్య, నైపుణ్యాల కల్పనపై మరింతగా ఇన్వెస్ట్ చేయడం చాలా ముఖ్యమని కేంద్ర నైపుణ్యాల అభివృద్ధి, ఎంట్రప్రెన్యూర్షిప్ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. అప్పుడే వారు 21వ శతాబ్దంలో అవకాశాలను దక్కించుకోవడానికి సర్వసన్నద్ధులుగా ఉండగలరని పేర్కొన్నారు. ఈ దిశగా ప్రత్యేకంగా దృష్టి పెడుతున్న భారత్.. అతి త్వరలోనే ప్రపంచ నైపుణ్యాల హబ్‌గా మారుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, స్విట్జర్లాండ్‌కి చెందిన హోటల్ అండ్ టూరిజం మేనేజ్మెంట్ ఇనిస్టిట్యూట్ (హెచ్టీఎంఐ) భాగస్వామ్యం కుదుర్చుకున్న కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. ఆతిథ్య రంగంలో విద్యార్థులు కెరియర్ను ఏర్పర్చుకోవడానికి, అంతర్జాతీయంగా నిపుణుల కొరతను తగ్గించేందుకు ఈ భాగస్వామ్యం తోడ్పడగలదని పేర్కొన్నారు. దీనితో డ్యుయల్ డిగ్రీ విధానంలో విద్యాభ్యాసం చేస్తున్న వారికి కచ్చితమైన ఉద్యోగావకాశాలు లభించగలవని, పరిజ్ఞానం పెంపొందించుకోగలరని ప్రధాన్ వివరించారు. హెచ్టీఎంఐకి ఆస్ట్రేలియా, చైనా, దుబాయ్, మారిషస్ తదితర దేశాల్లో క్యాంపస్‌లు ఉన్నాయి. స్విస్–యూరోపియన్ కలినరీ ఆర్ట్స్ మొదలైన విభాగాల్లో డిగ్రీ, పీజీ కోర్సులు అందిస్తోంది. -
డీప్ టెక్ స్టార్టప్స్‌లోకి మరిన్ని పెట్టుబడులు రావాలి
బెంగళూరు: దేశీ డీప్ టెక్నాలజీ స్టార్టప్ సంస్థలు వేగంగా ఎదిగేందుకు వాటికి ప్రారంభ దశలో మరింత ఎక్కువగా పెట్టుబడులు అందాల్సిన అవసరం ఉందని ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ ప్రెసిడెంట్ దేవయాని ఘోష్ చెప్పారు. ప్రస్తుతం టెక్నాలజీ రంగంలోకి వచ్చే పెట్టుబడుల్లో కేవలం 11 శాతం మాత్రమే డీప్ టెక్ స్టార్టప్‌లకు లభిస్తున్నాయని తెలిపారు. చైనా, అమెరికా వంటి దేశాలు తమ డీప్ టెక్ స్టార్టప్ వ్యవస్థను పటిష్టం చేసుకోవడానికి ప్రాధాన్యం ఇస్తుండగా, దేశీయంగానూ వీటి నిధుల అవసరాలపై మరింత దృష్టి పెట్టాల్సి ఉందన్నారు. పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) నిర్వహించిన స్టార్టప్‌లు, ఎంట్రప్రెన్యూర్షిప్ వర్క్‌షాప్‌లో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ విషయాలు చెప్పారు. దేశీయంగా 25,000 పైచిలుకు టెక్ స్టార్టప్‌లు ఉండగా.. వీటిలో డీప్‌టెక్‌కు సంబంధించినవి 12 శాతం (3,000) మాత్రమే ఉన్నాయని తెలిపారు. కృత్రిమ మేథ (ఏఐ), రోబోటిక్స్, బ్లాక్‌చెయిన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), డ్రోన్లు మొదలైన టెక్నాలజీపై డీప్ టెక్ సంస్థలు పని చేస్తుంటాయి. ఇలాంటి సంస్థల పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలపై సమయం వెచ్చించాల్సి ఉంటుంది కాబట్టి వాటి ఉత్పత్తులు మార్కెట్లోకి రావడానికి ఎక్కువ సమయం పడుతుందన్న విషయాన్ని ఇన్వెస్టర్లు, నియంత్రణ సంస్థలు గుర్తించాలని దేవయాని ఘోష్ చెప్పారు. ప్రతిభావంతులు చాలా మందే ఉంటున్నప్పటికీ .. వారిని అందుకోవడం సమస్యగా మారిన నేపథ్యంలో సింగపూర్ వంటి దేశాల్లో మిలిటరీ సర్వీసును తప్పనిసరి చేసిన విధంగా ’స్టార్టప్ సర్వీసు’ను కూడా ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలించవచ్చని తెలిపారు. తద్వారా మూడు, నాలుగో సంవత్సరంలోని ఇంజినీరింగ్ విద్యార్థులు ఏడాది పాటు ఏదైనా టెక్ స్టార్టప్స్‌లోకి వెళ్లి పనిచేయొచ్చని పేర్కొన్నారు. ఆ రకంగా ప్రతిభావంతుల తోడ్పాటుతో ఆయా అంకుర సంస్థలు, పెద్ద కంపెనీలతో పోటీపడవచ్చన్నారు. అవ్రా మెడికల్ రోబోటిక్స్‌లో ఎస్ఎస్ఐకి వాటాలు న్యూఢిల్లీ: దేశీ మెడ్‌టెక్ స్టార్టప్ కంపెనీ ఎస్ఎస్ ఇన్నోవేషన్ తాజాగా అమెరికాకు చెందిన నాస్డాక్ లిస్టెడ్ కంపెనీ అవ్రా మెడికల్ రోబోటిక్స్‌లో నియంత్రణ వాటాలను కొనుగోలు చేసింది. దీనితో తమకు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా ప్రవేశించేందుకు అవకాశం లభించినట్లవుతుందని సంస్థ వ్యవస్థాపకుడు, చైర్మన్ సుధీర్ పి. శ్రీవాస్తవ తెలిపారు. ’ఎస్ఎస్ఐ మంత్ర’ రూపంలో ఇప్పటికే తాము మేడిన్ ఇండియా సర్జికల్ రోబో వ్యవస్థను ప్రవేశపెట్టామని ఆయన చెప్పారు. అవ్రాతో భాగస్వామ్యం .. రోబోటిక్ సర్జరీలకు సంబంధించి వైద్య సేవల్లో కొత్త మార్పులు తేగలదని శ్రీవాస్తవ వివరించారు. -
40-50 ఏళ్ల వయస్సులో బిజినెస్‌లో రాణించాలనుకునే వారి కోసం
ముంబై: దేశీయంగా తొలి స్టార్టప్ స్టూడియో జెన్ఎక్స్ వెంచర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు అంకుర సంస్థ సండే టెక్ వెల్లడించింది. 40 ఏళ్లు పైబడి, వ్యాపారవేత్తలుగా ఎదగాలనుకునే వారికి తోడ్పాటు అందించేందుకు తొలుత 2 మిలియన్ డాలర్ల నిధితో దీన్ని నెలకొల్పినట్లు సంస్థ వ్యవస్థాపకుడు జోసెఫ్ జార్జి తెలిపారు. వచ్చే మూడేళ్లలో 50 స్టార్టప్‌ల వృద్ధిలో పాలుపంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు వివరించారు. ముంబై, బెంగళూరు, న్యూఢిల్లీ తదితర నగరాలపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నట్లు పేర్కొన్నారు. కెరియర్ మధ్యలో ఉన్న చాలా మంది మంచి జీతాలు వచ్చే ఉద్యోగాలను వదులుకుని, ఎంట్రప్రెన్యూర్షిప్ బాట పడుతున్నారని జార్జి పేర్కొన్నారు. స్టార్టప్ వెంచర్లలో సహ వ్యవస్థాపకులుగా ఉండటంతో పాటు వాటిని ప్రారంభ దశ నుంచి నిర్మించడంలో స్టార్టప్ స్టూడియోల ముఖ్య పాత్ర పోషిస్తాయి. 1965 నుంచి 1980 మధ్య కాలంలో పుట్టిన జనరేషన్ ఎక్స్ (జెన్ ఎక్స్) తరం ప్రస్తుతం 40–50 ఏళ్ల వయస్సులో ఉన్నారని, వ్యాపారవేత్తలుగా ఎదగాలనుకునే ఇలాంటి సీనియర్ ప్రొఫెషనల్స్‌కు తోడ్పాటు అందించే సరైన వ్యవస్థ ప్రస్తుతం లేని నేపథ్యంలోనే తాము జెన్ఎక్స్ వెంచర్స్‌ను తలపెట్టామని జార్జి పేర్కొన్నారు. -
పరి పూనమ్ చౌదరి.. ఉమన్ ఆఫ్ బునాయ్
తెలిసీ తెలియని వయసులో... ‘‘పెద్దయ్యాక నేను డాక్టర్ని అవుతాను.. ఇంజినీర్ని అవుతాను... కలెక్టర్ అవుతాను’’ అని చెప్పి ఆ తర్వాత మర్చిపోయేవారు కొందరైతే, పెద్దయ్యాక ఏమవ్వాలో చిన్నతనంలోనే లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ దిశగా ప్రణాళికాబద్ధంగా కష్టపడి, సమాజంలో తమకంటూ ఒక ఉన్నత స్థానాన్ని ఏర్పరచుకునేవారు మరికొందరు. ఈ రెండో కోవకు చెందిన అమ్మాయే పరి పూనమ్ చౌదరి. జైపూర్‌లోని ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన పరి పూనమ్ చౌదరికి చిన్నప్పటి నుంచి ఫ్యాషనబుల్‌గా ఉండే దుస్తులంటే ఎంతో ఆసక్తి. పదమూడేళ్ల వయసులో తన అభిరుచి ఫ్యాషన్ అని తెలుసుకుంది పరి. అప్పటినుంచి ఆ రంగంలో గొప్ప స్థాయికి ఎదగాలని కలలు కనేది. తన కలను నిజం చేసుకునేందుకు డిగ్రీ చదువుతూనే ఫ్యాషన్ డిజైనింగ్‌లో డిప్లొమా కోర్సు చేసింది. యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ ఆర్ట్స్‌లో ఫ్యాషన్ మీడియా స్టైలింగ్ కోర్సును నేర్చుకుంది. తరువాత 2014లో ఢిల్లీలో మాస్టర్స్ చేస్తూనే ఫైన్ ఆర్ట్స్, స్ట్రీట్ ఫొటోగ్రఫీ, విజువల్ ఆర్ట్స్’, లగ్జరీ బ్రాండ్ మేనేజ్మెంట్ కోర్సులు చేసింది. తన చదువుకు తగ్గట్టే ఫ్యాషన్ ప్రపంచంలో తన మార్కును చూపించాలన్న ఆలోచన వచ్చింది పూనమ్‌కి. వెంటనే తను రూపొందించిన డిజైన్లతో ఒక బ్లాగ్‌ను ప్రారంభించింది. దాంతోబాటు ఇన్ స్టాగ్రామ్ పేజిలో ఫ్యాషన్ కు సంబంధించిన పోస్టులు పెడుతూ యూజర్లను ఆకట్టుకునేది. బ్లాగ్ ప్రారంభించిన రెండేళ్ల తరవాత తన ఫ్యాషన్ డిజైనింగ్ ఐడియాలతో ‘బునాయ్’ అనే బ్రాండ్‌ను ప్రారంభించింది. ఈ బ్రాండ్ మార్కెట్లోకి వచ్చే సమయానికి పరి వయసు 23 ఏళ్లు. బునాయ్ బ్రాండ్... భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబిస్తూనే ఫ్యాషనబుల్‌గా ఉండే డ్రెస్‌లతో 2016లో బునాయ్ని జైపూర్‌లో ప్రారంభించింది. సంప్రదాయాలకు తగ్గట్టుగా స్టైల్‌గా ఉండే వస్త్రాలను అందుబాటు ధరలకు అందించడమే బునాయ్ లక్ష్యం. అందులో భాగంగా కొన్ని డ్రెస్‌లను ఆన్ లైన్ లో పెట్టింది. వారం తిరక్కుండానే అన్నీ హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి. దీంతో బట్టలే కాకుండా, ఆభరణాలు, సంప్రదాయ ఎంబ్రాయిడరీ డిజైన్లు, హస్తకళాకారులు రూపొందించిన అలంకరణ వస్తువులను విక్రయించేది. కస్టమర్ల అభిరుచులకు, వారి స్కిన్ టోన్‌కు సరిపడినట్లు డిజైన్ చేయడం, నాణ్యమైన బట్టను అందుబాటు ధరకే అందించడంతో అతికొద్దికాలంలోనే ఆమె బ్రాండ్ ‘బునాయ్’ ఫ్యాషన్ ప్రపంచంలో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుంది. కార్పొరేట్ మోడల్స్ నుంచి గృహిణుల వరకు అందరూ వేసుకోదగిన డ్రెస్‌లు లభించడం కూడా బునాయ్ బ్రాండ్ పాపులర్ అవడానికి మరో కారణం. ఉమన్ ఆఫ్ బునాయ్ ప్రారంభంలో కేవలం యాభై వేల రూపాయలతో కొన్ని కుట్టుమిషన్లను కొని, ఇద్దరు టైలర్స్‌ను చేర్చుకుని బునాయ్ని ప్రారంభించిన పరి నేడు నాలుగు వందలకు పైగా ఉద్యోగులు, మూడున్నర లక్షల కస్టమర్లతో, కోట్ల టర్నోవర్‌తో వాణిజ్య ప్రపంచంలో దూసుకుపోతుండడంతో పూనమ్‌కి ‘ఉమన్ ఆఫ్ బునై’ అనే స్థాయిలో గుర్తింపు వచ్చింది. మామూలు వారితోపాటు సోనాక్షి సిన్హా, భూమి పెడ్నేకర్, దివ్యాంకా త్రిపాఠీ, రిధి డోగ్రా వంటి ఎంతోమంది సెలబ్రెటీలు కూడా బునాయ్ బ్రాండ్‌వే కావాలని అడిగి కొనేంతగా పాపులర్ అయింది. ఇన్ స్టాగ్రామ్ పేజీలో పదిలక్షలకుపైగా ఫాలోవర్స్‌తో పరి ఫ్యాషన్ ఇన్ ఫ్లుయెన్సర్ అనే పేరుతోబాటు, గతేడాది బీడబ్ల్యూ ఇచ్చే ఎంట్రప్రెన్యూర్షిప్ అవార్డ్స్’లో ఈ–కామర్స్ టెక్ ఉమెన్ ఎంట్రప్రెన్యూర్ అవార్డు కూడా ఆమెను వరించింది. -
డిసెంబర్లో ‘ఎంట్రప్రెన్యూర్షిప్ 360’
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ మహమ్మారి మూలంగా పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించేందుకు హైదరాబాద్‌లో అతిపెద్ద అంతర్జాతీయ సదస్సు జరగనుంది. ఈ మేరకు సదస్సు నిర్వహించడానికి ‘ది ఇండస్ ఎంట్రప్రెన్యూర్స్ (టై)’ హైదరాబాద్ శాఖ సన్నాహాలు చేస్తోంది. డిసెంబర్ 8 నుంచి 10 వరకు మూడు రోజుల పాటు జరిగే ఈ వర్చువల్ సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ప్రయత్నిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన సుమారు 20వేల మంది వ్యాపార, వాణిజ్య వేత్తలు, రెండు వందల మంది పెట్టుబడిదారులు ఇందులో పాల్గొం టారు. వ్యాపార, వాణిజ్య, క్రీడా, తదితర రంగాలకు చెందిన సుమారు 50 మంది వక్తలు ప్రసంగిస్తారు. అంతర్జాతీయ వ్యాపార, వాణిజ్య దిగ్గజాలు సత్య నాదెళ్ల, రతన్‌టాటా, ఎలాన్ మస్క్, సుందర్ పిచాయ్, ఆనంద్ మహీంద్రా, షెరిల్ సాండ్‌బెర్గ్ వంటి వారు ఈ సదస్సులో పాల్గొంటారని ‘టై’ వెల్లడించింది. సరికొత్త అవకాశాలపై చర్చలు.. ‘ఎంట్రప్రెన్యూర్షిప్ 360’గా పిలిచే ఈ సదస్సులో కోవిడ్ కారణంగా వివిధ రంగాలు ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చిస్తారు. ఎంట్రప్రెన్యూర్స్ తమ వ్యూహాలను సమీక్షిం చుకోవడంతో పాటు, తమకు అవసరమైన పెట్టుబడులు సమకూర్చుకునేలా ఈ సదస్సు దోహదం చేస్తుందని భావిస్తున్నారు. ఇందులో పలువురు అంతర్జాతీయ వ్యాపార, వాణిజ్యవేత్తలు తమ ఉత్పత్తులు, సేవలు ప్రదర్శించే అవకాశం ఉంది. కోవిడ్ మూలంగా వివిధ రంగాలు దెబ్బతిన్నా, అంతే సమంగా కొత్త అవకాశాలూ ఉన్నాయనే కోణంలో ఈ సదస్సులో భాగస్వామ్యం వహిస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ వర్గాలు వెల్లడించాయి. కాగా, ప్రపంచ వ్యాప్తంగా 15వేలకు పైగా సభ్యులు, 3వేలకు పైగా చార్టర్ సభ్యులతో పాటు 14దేశాల్లో 61 చాప్టర్లను ‘టై’ కలిగి ఉంది. డిసెంబర్లో జరగనున్న టై సదస్సులో అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఆసియా ఖండాల నుంచి 25 చాప్టర్లు పాల్గొనే అవకాశం ఉంది. -
నానమ్మ పిజ్జా సూపర్‌హిట్
ఫిబ్రవరి వరకూ ఆమె ఒక సగటు అమ్మ, నానమ్మ. మే నాటికి అంట్రప్రెన్యూర్ అయిపోయింది. లాక్డౌన్లో తన కొడుకుల ఇళ్లకు పిజ్జా చేసి పంపిస్తే వాళ్లు ఆహా, ఓహో అన్నారు. హోమ్ కిచెన్ పెట్టించారు. ఇప్పుడు వారానికి 300 మంది ఆమె పిజ్జాలు తెప్పించుకుంటున్నారు. 67 సంవత్సరాల ముంబై గృహిణి నవ విజయగాథ ఇది. ముంబై లోఖండ్వాలాలో నివసించే 67 సంవత్సరాల ప్రతిభా కానోయ్‌కు ఒకటే కోరిక. ‘నన్ను ఏదైనా పని చేసి డబ్బు సంపాదించనివ్వండ్రా’ అని. కలిగిన కుటుంబం. భర్త మూడేళ్ల క్రితం చనిపోయాడు. కొడుకులు ముంబైలోనే సెటిల్ అయ్యారు. ఆమె ఇంట్లో పని చేసే వారికే నెలకు పది, పన్నెండు వేలు జీతాలు ఇవ్వాలి. ‘అందరూ పని చేసి డబ్బు సంపాదిస్తున్నారు. నేనొక్కదాన్ని తిని కూచుంటున్నాను. నేను కూడా పని చేసి సంపాదిస్తాను’ అని ఆమె తరచూ అనేది. కాని భర్త, కొడుకులు ‘అంత అవసరం ఏముంది’ అని ఆమె మాట పడనివ్వలేదు. కాని కాలం కలకాలం ఒకేలా ఉండదు. అది కరోనాను తెస్తుంది. మార్చిలో మొదలు ప్రతిభా కానోయ్‌కు నలుగురు మనమలు ఉన్నారు. కొడుకులు తరచూ వాళ్లను బయటకు తీసుకెళతారు. లేదా ఇంటికి బయటి ఫుడ్ తెప్పించి పెడతారు. కాని మార్చిలో లాక్డౌన్ మొదలయ్యాక ప్రతిభా మనసు ఊరికే ఉండలేకపోయింది. ‘అయ్యో... పిల్లలు బయటి తిండిని తెప్పించుకోలేకపోతున్నారే’ అనుకుంది. తన ఇద్దరు కొడుకుల ఇళ్లకు తన ఇంటి నుంచి పిజా తయారు చేసి పంపించడం మొదలెట్టింది. కొడుకులు ఆ పిజా రుచి చూసి ఆశ్చర్యపోయారు. మనమలు అయితే లొట్టలు వేయసాగారు. ప్రతిభా కానోయ్ చేసేది వెజ్ పిజ్జాలు. అలాంటి పిజ్జాలు ముంబైలో తినలేదు అని వారు ప్రశంసించసాగారు. మారిన మనసు తల్లి వంట ప్రతిభను చూశాక కొడుకుల మనసు మారింది. ‘అమ్మా.. హోమ్ కిచెన్ పెట్టిస్తాం. ఇంటి నుంచే నువ్వు వ్యాపారం ప్రారంభించు. సొంతగా సంపాదించు’ అని ఏర్పాట్లు చేశారు. ఇద్దరు చెఫ్‌లు జీతానికి కుదిరారు. డెలివలి బోయ్స్ కూడా. ‘మమ్మీస్ కిచెన్’ అనే పేరుతో మే 2న ప్రతిభా పిజ్జా వ్యాపారం మొదలైంది. కొడుకులే ఆమె ప్రచారకర్తలు అయ్యారు. ‘మా అమ్మ పిజ్జాలు టేస్ట్ చేసి చెప్పండి’ అని ఫ్రెండ్స్‌ను కోరారు. ఫ్రెండ్స్ ఆర్డర్స్ పెట్టారు. ప్రతిభ చేసి పంపే పిజ్జాలను చూసి వహ్వా అన్నారు. రెండు మూడు నెలల్లో ఆమె వ్యాపారం ఎంత బిజీ అయ్యిందంటే ఇవాళ పిజ్జా కావాలంటే నిన్న ఆర్డర్ పెట్టాలి. ఖాళీగా ఎందుకుండాలి? ‘నా భర్త భోజన ప్రియుడు. నాతోపాటు కలిసి వంట చేయడాన్ని ఇష్టపడేవాడు. చిన్నప్పుడు మా అక్క దగ్గర వంట నేర్చుకున్నాను. అలా వంటలో నేను నేర్చుకున్నది ఇప్పుడు ఉపయోగపడింది. పిజ్జాలో వాడే పదార్థాలు స్వచ్ఛంగా ఉండేలా చూసుకుంటాను. వాటిని శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టి వినిగర్లో నానబెట్టి ఉపయోగిస్తాను. ఉదయం 9 గంటలకు నేను కిచెన్‌లోకి వెళితే సాయంత్రం వరకూ రోజుకు 30 నుంచి 50 వరకూ డెలివరీలు ఉంటాయి. శని, ఆదివారాలు 100 పైగా ఆర్డర్లు ఉంటాయి. 11 రకాల పిజ్జాలు తయారు చేస్తాం. 400 నుంచి 550 వరకూ చార్జ్ చేస్తాం. నన్ను చూసి కొందరు ఇంత డబ్బుండి ఇదేం పని అనుకోవచ్చు. కాని ఎవరైనా సరే ఎందుకు ఖాళీగా ఉండాలి అంటాను. స్త్రీలు తమ ఆర్థిక స్వాతంత్య్రం తాము చూసుకోవాలి. అలాగే వయసైపోయిందని కొందరు అనుకుంటూ ఉంటారు. ఆరోగ్యాన్ని సరిగ్గా కాపాడుకుంటే వయసు ఎప్పటికీ అవదు. ఏ వయసులో అయినా జీవితాన్ని ఫుల్‌గా జీవించవచ్చు. 67 ఏళ్ల వయసులో సక్సెస్ సాధించి నా తోటి వయసు వారికి నేను ఇవ్వాలనుకుంటున్న సందేశం ఇదే’ అంది ప్రతిభ. ఎప్పుడైనా ముంబై వెళితే ఆమె చేతి పిజ్జాకు ఆర్డర్ పెట్టండి. – సాక్షి ఫ్యామిలీ -
సబ్సిడీల కోసం వ్యాపారాలు చేయొద్దు
సాక్షి, హైదరాబాద్: సబ్సిడీల కోసం కాకుండా ఆసక్తి, పట్టుదలతో వ్యాపారాలు చేస్తే రాణిస్తారని, అలాంటి వారి కోసం రాష్ట్రంలోని ఇండస్ట్రీయల్ పార్కుల్లో అవకాశాలు ఎదురు చూస్తున్నాయని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్ పార్కుల్లో గ్రామీణ యువత, మహిళలు, దళితులు, గిరిజనులకు ప్రత్యేకంగా రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. గురువారం ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)లో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సీఎం ఎస్టీ ఎంట్రప్రెన్యూర్ అండ్ ఇన్నోవేషన్ పథకం కింద 2019 బ్యాచ్ కోసం ఎంపిక చేసిన 100 మంది గిరిజన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్య, తెలివి, వ్యాపారం ఎవరి సొత్తూ కాదని, పట్టుదల ఉంటే అందరూ పారిశ్రామికవేత్తలు కాగలరని, ఇప్పటికే కొందరు ఔత్సాహిక యువ గిరిజన పారిశ్రామికవేత్తలు దీనిని నిరూపించారన్నారు. గిరిజన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కార్యక్రమంలో పాల్గొన్న తృప్తి ఎప్పుడూ కలగలేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఐఎస్బీలో శిక్షణ పొంది, ప్రభుత్వ సాయంతో ఏర్పాటయ్యే పరిశ్రమల ప్రారంభోత్సవానికి తనతోపాటు సెలబ్రిటీలనూ వెంట తీసుకొస్తానని అన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల వల్లే 70 శాతం ఉపాధి, ఉద్యోగాలు లభిస్తున్నాయని, ఈ పరిశ్రమలను కాపాడేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. ఐఎస్బీలో నిలబడే అవకాశమిచ్చారు: సత్యవతి రాథోడ్ గిరిజనులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రారంభించిన ‘సీఎం ఎస్టీ ఎంట్రప్రెన్యూర్ అండ్ ఇన్నొవేషన్ స్కీం’ద్వారా ఐఎస్బీలో నిలబడి మాట్లాడే అవకాశం గిరిజనులకు దక్కిందని గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సమావేశంలో గిరిజన సంక్షేమ కార్యదర్శి బెన్హర్ మహేశ్‌దత్ ఎక్కా, కమిషనర్ డాక్టర్ క్రిస్టినా చోంగ్తు, ఎస్బీఐ డీజీఎం దేబాశిష్ మిశ్రా, ఐఎస్బీ డీన్ రాజేంద్ర శ్రీవాస్తవ పాల్గొన్నారు. -
ఆలయాలు ఉద్యోగాలను సృష్టించలేవు
గాంధీనగర్: దేవాలయాలు ఉద్యోగాలను సృష్టించలేవనీ, ఆ శక్తి కేవలం సైన్స్ కు మాత్రమే ఉందని ప్రముఖ సాంకేతిక నిపుణుడు శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యానించారు. ‘ఉద్యోగకల్పన, ఎంట్రప్రెన్యూర్షిప్’ అంశంపై గుజరాత్‌లోని కర్ణావతి విశ్వవిద్యాలయంలో పిట్రోడా మాట్లాడారు. ‘దేశంలో దేవాలయం, మతం, దేవుడు, కులం గురించి వాదోపవాదాలు విన్నప్పుడు నాకు ఇండియా గురించి చాలా బాధ కలుగుతుంది. ఆలయాలు రేపు ఉద్యోగాలను సృష్టించలేవు. కేవలం సైన్స్ మాత్రమే భవిష్యత్‌ను సృష్టించగలదు. యువతకు అనర్హులైన రాజకీయ నేతలు పనికిమాలిన విషయాలు చెప్పి తప్పుదోవ పట్టిస్తున్నారు’ అని పిట్రోడా చెప్పారు. ప్రస్తుతం టెలికాం రంగం తరహాలో మరో పదేళ్లలో ఇంధనం, 20 ఏళ్లలో రవాణా కారు చౌకగా మారిపోతాయన్నారు. -
ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు 2017
-
జీఈఎస్ సదస్సుకు దిగ్గజాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ నెల 28 నుంచి 30 దాకా హైదరాబాద్‌లో జరగనున్న గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్షిప్ సదస్సు (జీఈఎస్)కు పలువురు దిగ్గజాలు హాజరవుతున్నారు. టెక్నాలజీ దిగ్గజ సంస్థ సిస్కో చైర్మన్ జాన్ చాంబర్స్, ట్యాక్సీ సేవల సంస్థ ఓలా సహ వ్యవస్థాపకుడు భవీష్ అగర్వాల్, ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ చందా కొచర్ తదితరులు ఇందులో ఉన్నారు. అమెరికాతో పాటు వివిధ దేశాలకు చెందిన ఇన్వెస్టర్లు, పారిశ్రామిక వేత్తలతో పాటు స్టార్టప్ సంస్థలూ ఈ సదస్సులో పాలు పంచుకుంటాయి. ప్రధానంగా ఇంధనం– మౌలిక రంగం, హెల్త్‌కేర్ – లైఫ్‌సైన్సెస్, ఫిన్‌టెక్ – డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, మీడియా–వినోద రంగం... ఈ 4 రంగాలపైనే ఫోకస్ ఉంటుందని, సంబంధిత వర్క్‌షాప్‌లు జరుగుతాయని నీతి ఆయోగ్ తెలియజేసింది. ఈ సదస్సును అమెరికా ప్రభుత్వం, నీతి ఆయోగ్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. అమెరికా తరఫున హాజరయ్యే బృందానికి అధ్యక్షుడు ట్రంప్‌కు సలహాదారుగా వ్యవహరిస్తున్న ఆయన కుమార్తె ఇవాంకా ట్రంప్ నేతృత్వం వహిస్తారు. కాగా ‘అందరికీ పురోగతి; మహిళలే ముందు’ అనే థీమ్‌తో జరగనున్న ఈ సదస్సులో పాల్గొనే వారిలో సుమారు సగం మంది మహిళలే ఉంటారని నీతి ఆయోగ్ పేర్కొంది. సదస్సును ప్రధాని మోదీ, ఇవాంకా ప్రారంభిస్తారు. కాగా సదస్సుకు అమెరికా, చైనాతో పాటు పలు విదేశీ దిగ్గజాల నుంచి ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది. 100కు పైగా వినూత్న స్టార్టప్‌లతో పాటు వినూత్న ఉత్పత్తులు, సర్వీసులు మొదలైన వాటికి జీఈఎస్–2017 వేదిక కానున్నదని నీతి ఆయోగ్ పేర్కొంది. గతేడాది అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో జరిగిన జీఈఎస్‌లో 170 దేశాల నుంచి 700 మంది ఔత్సాహిక వ్యాపారవేత్తలు, 300 మందికి పైగా ఇన్వెస్టర్లు పాల్గొన్నారు. ఈసారి సదస్సు అంతకన్నా భారీగా ఉంటుందని నీతి ఆయోగ్ అంచనా వేస్తోంది. ఇందులో పారిశ్రామికవేత్తలు, ఇన్వెస్టర్లు, పలు దిగ్గజ సంస్థల సీఈవోలతో పాటు 1,600 మంది పైగా ప్రతినిధులు పాల్గొంటారని నీతి ఆయోగ్ తెలిపింది. -
తెల్లగా ఉంటేనే వ్యాపారంలో రాణిస్తారట!
తెల్లగా ఉంటే ఆత్మవిశ్వాసం ఉంటుందని, విజయాలు సాధిస్తారని చెప్పే వాణిజ్య ప్రకటనలు చాలానే చూశాం. కానీ ఇప్పుడు అలా చెప్పడానికి ప్రకటనలు అక్కర్లేదు తామున్నామంటూ రాజస్థాన్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ముందుకొచ్చింది. ఈ బోర్డు ఇటీవల ముద్రించిన కొన్ని పాఠ్య పుస్తకాలలో దీనికి సంబంధించిన అంశాలున్నాయి. మంచి ఎత్తు, అందమైన రంగు ఉన్నవాళ్లే వ్యాపారంలో రాణిస్తారని ఆ పుస్తకాల్లో రాశారు. మంచి ఆరోగ్యం, మౌనంగా ఉండటం, ప్రభావశీలమైన వ్యక్తిత్వం, మంచి ఎత్తు, మంచి రంగు, గంభీరత లాంటి భౌతిక అంశాలు కూడా మంచి వ్యాపార లక్షణాలని వివరించారు. సమాజానికి ఉపయోగపడే లక్షణాల పేరుతో ముద్రించిన ఈ పుస్తకాల్లో కేంద్రంలోను, రాష్ట్రంలోను ఉన్న బీజేపీ ప్రభుత్వాలు అమలుచేస్తున్న పథకాల గురించి కూడా వివరించారు. 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు నాలుగు పాఠ్యపుస్తకాల్లో స్వచ్ఛభారత్ అభియాన్, పీఎం కౌశల్ వికాస్ యోజన, గల్ స్వావలంబన్ యోజన, భమాషా యోజనల గురించి ఒక్కో అధ్యాయం ప్రచురించారు. మొదటి రెండు మోదీ ప్రభుత్వం పథకాలు కాగా మిగిలిన రెండు వసుంధర రాజే ప్రభుత్వం ప్రవేశపెట్టినవి. ఇటీవల ఇలాగే 12వ తరగతికి సంబంధించిన ఫిజికల్ ఎడ్యుకేషన్ పుస్తకంలో 36-24-36 కొలతలు మహిళలకు మంచి శరీరాకృతిని సూచిస్తాయని తెలిపారు. -
‘నేషనల్ యంగ్ లీడర్స్ అవార్డ్స్’కు దరఖాస్తులు
ఎంట్రప్రెన్యూర్షిప్ విభాగంలో ఆహ్వానం హైదరాబాద్: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా కంపెనీల మంత్రిత్వ శాఖ (ఎంఎస్ఎంఈ) తాజాగా ఎంట్రప్రెన్యూర్షిప్ విభాగం కింద ‘నేషనల్ యంగ్ లీడర్స్ అవార్డ్స్-2015-16’కి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దరఖాస్తుల స్వీకరణకు సెప్టెంబర్ 5ని గడువుగా నిర్ణయించింది. ఔత్సాహికులు దరఖాస్తులు సహా ఇతర సమాచారం కోసం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.డీసీఎంఎస్ఎంఈ.గవ్.ఇన్ వెబ్‌సైట్‌ను సందర్శించొచ్చు. ఇక్కడ యువతీ యువకుల విభాగంలో రెండు అవార్డులుంటాయి. అవార్డు గ్రహీతలకు మెడల్, సర్టిఫికెట్, రూ.1,00,000 నగదు బహుకరిస్తారు. దరఖాస్తు పంపేవారి వయసు 15-29 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎంట్రపెన్యూర్ అయ్యిండాలి. -
క్లౌడ్ మార్కెట్‌పై..
భారత్‌లో ఇప్పుడు డిజిటల్, ఎంట్రప్రెన్యూర్షిప్, స్టార్టప్, క్లౌడ్ వంటివి హాట్ టాపిక్. భారతీయ క్లౌడ్ మార్కెట్లో రూ.120 లక్షల కోట్ల విలువైన వ్యాపార అవకాశాలున్నాయని ఢిల్లీలో నాదెళ్ల చెప్పారు. భవిష్యత్ క్లౌడ్దేనని, ఈ టెక్నాలజీపై మరింత దృష్టి సారించండని ఎంఐడీసీలో ఉద్యోగులకు ఉద్బోధించిన సంగతి తెలిసిందే. భారతీయ మార్కెట్‌పై పెద్ద ఎత్తున ఫోకస్ చేశామని ఆయన చెప్పారు. 2015 చివరికల్లా మూడు డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. గతేడాది మైక్రోసాఫ్ట్ క్లౌడ్ విభాగ ఆదాయం 100% వృద్ధి చెందడం కూడా కంపెనీకి ఇక్కడి మార్కెట్‌పై ఆశలు రేకెత్తిస్తోంది. ఏదేమైనా నాదెళ్ల పర్యటనబట్టి చూస్తే టెక్నాలజీ దిగ్గజాల్లో ఒకటైన మైక్రోసాఫ్ట్.. అపార వ్యాపార అవకాశాలున్న భారత్‌ను ప్రధాన మార్కెట్‌గా భావిస్తోందనే చెప్పొచ్చు. -
భారత్‌కు వ్యాపార మెలకువలు నేర్పండి
ఇండోఅమెరికన్ కార్పొరేట్ దిగ్గజాలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు న్యూయార్క్: భారత్‌లోని ఔత్సాహికులకు వ్యాపార మెలకువలు, ఎంట్రప్రెన్యూర్‌షిప్‌లను నేర్పించాలని ఇండియన్-అమెరికన్ కార్పొరేట్ సారథులను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. వారిని భారత్‌కు రావాలని ఆహ్వానించారు. అమెరికా పర్యటనలో ఉన్న మోదీతో ఆదివారం సుమారు 10 మంది టాప్ ఇండో అమెరికన్ సీఈఓల బృందం సమావేశమైంది. స్థిరమైన వ్యాపార వాతావరణం, మానవ వనులపై పెట్టుబడులు వంటి కొన్ని కీలక అంశాలను ఈ సందర్భంగా సీఈఓలు మోదీ దృష్టికి తీసుకొచ్చారు. మానవ వనరుల అభివృద్ధి, పరిశోధన కార్యకలాపాల్లో తమ సహకారం విషయాన్ని గంటకుపైగా జరిగిన ఈ భేటీలో చర్చించారు. మోదీని కలిసిన వారిలో సింఫనీ టెక్నాలజీ గ్రూప్ చైర్మన్ సీఈఓ రోమేష్ వాధ్వానీ, కాగ్నిజెంట్ సీఈఓ ఫ్రాన్సిస్కో డిసౌజా, అడోబ్ సిస్టమ్స్ సీఈఓ, ప్రెసిడెంట్ శాంతను నారాయణ్, యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ ప్రెసిడెంట్ రేణు ఖటార్, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ డీన్ నితిన్ నోహ్రియా, హార్మన్ ఇంటర్నేషనల్ ఇన్కార్పొరేటెడ్ సీఈఓ దినేష్ పాలివాల్, మైక్రోసాఫ్ట్ డెవలపర్ విభాగం కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ ఎస్ సోమశేగర్, కార్నెగీ మెలన్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ సుబ్రా సురేశ్ తదితరులు ఉన్నారు. భారత్‌లో వృద్ధి అవకాశాల గురించి వీరంతా చాలా సానకూల దృక్పథాన్ని వ్యక్తం చేశారని.. తమ సూచనలను కూడా తెలియజేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. భారత్‌ను ప్రపంచ తయారీ కేంద్రంగా చేసే లక్ష్యంగా తాజాగా ప్రారంభించిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని, ప్రజలు తమ వినూత్న ఆలోచనలు, సూచనలను నేరుగా ప్రభుత్వానికి తెలియజేసేందుకు ఉద్దేశించిన ‘మై గవర్నమెంట్ డిజిటల్ ప్లాట్‌ఫామ్’ ప్రాజెక్టుల గురించి సీఈఓలకు మోదీ వివరించినట్లు సమాచారం. ఇదిలాఉండగా.. భారత్‌కు పెట్టుబడులను ఆకర్షించడం కోసం సోమవారం ఉదయం అమెరికాలో టాప్ కార్పొరేట్ దిగ్గజాల అధిపతులతో మోదీ భేటీ కానున్నారు. 30న వాషింగ్టన్లో యూఎస్ఐబీసీ నిర్వహిస్తున్న సమావేశంలోనూ ప్రధాని పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి 300-400 మంది వ్యాపారవేత్తలు హాజరుకానున్నారు. -
కాంగ్రెస్, బీజేపీ దొందూదొందే
విభజన పాపం ఆ పార్టీలదే సంపన్నులకు ఊడిగం చేస్తున్న మోడీ సీపీఎం నేత బృందా కారత్ ధ్వజం విశాఖపట్నం, న్యూస్‌లైన్: పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు ఊడిగం చేయడంలో కాంగ్రెస్, బీజేపీలు దొందూదొందేనని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ వ్యాఖ్యానించారు. కేజీ బేసిన్లో సహాజవాయివు నిక్షేపాలను పెట్టుబడిదారులకు కట్టబెట్టడంలో ఆ రెండు పార్టీలు పోటీ పడుతున్నాయని విమర్శించారు. విశాఖలో బుధవారం జరిగిన సీపీఎం నేత జ్యోతిబసు శతజయంతి ఉత్సవ సభలో ఆమె ప్రసంగించారు. ఎర్రజెండాతో 75ఏళ్లు కార్మికులు, పీడిత ప్రజల కోసం పోరాడిన ఏకైక నేత జ్యోతిబసు అని కొనియాడారు. అత్యంత సంపన్న కుటుంబంలో పుట్టినప్పటికీ జీవితాంతం వాటికి దూరంగానే బతికారన్నారు. టీ అమ్ముకునే కుటుంబం నుండి వచ్చానని చెప్పుకుంటూ నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా తిరుగుతూ సంపన్నులకు ఊడిగం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్, బీజేపీల జెండాలు వేరైనా సిద్ధాంతాలు మాత్రం ఒక్కటేనన్నారు. అందమైన రాష్ట్రాన్ని ముక్కలు చేశారు స్వాతంత్రం వచ్చిన తరువాత నంబూద్రి ప్రసాద్, జ్యోతిబసు, బసవపున్నయ్య తదితరుల పోరాటాల ఫలితంగా ఏర్పడిన మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని బృందాకారత్ పేర్కొన్నారు. ఈరోజు అతిపెద్ద, అందమైన రాష్ట్రాన్ని కాంగ్రెస్, బీజేపీలు కలసి ముక్కలు చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకృష్ణ కమిటీ సూచనలను పక్కనబెట్టిన కాంగ్రెస్ పార్టీ ఓట్లు, సీట్లు కోసం రాష్ట్రాన్ని విడదీసిందని విమర్శించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో బీజేపీ నేత వెంకయ్యనాయుడు ఒక మాంత్రికుడిలా మాయజాలం చేసి ప్యాకేజీలతో తన జేబు నింపుకున్నారని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా ఒకే వేదికపైకి వచ్చే పార్టీలకు తమ మద్దతు పూర్తిగా ఉంటుందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. -
టాప్-10 కెరీర్స్... బెస్ట్ ఆపర్చునిటీస్
డిగ్రీ, పీజీ కోర్సులు పూర్తిచేసినవారికి ఉద్యోగాలపరంగా ఎన్నో అవకాశాలున్నాయి. అయితే రానున్న ఐదారేళ్లలో మంచి ఉద్యోగావకాశాలు కల్పించే రంగాలుగా.. ఏవియేషన్, హెల్త్‌కేర్, రిటైల్ మేనేజ్మెంట్, సోషల్ వర్క్/రూరల్ డవలప్మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఫార్మా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్, హాస్పిటాలిటీ, టెలికం మేనేజ్మెంట్, మర్చెంట్ నేవీ నిలుస్తాయని ఆయా రంగాల నిపుణులు పేర్కొంటున్నారు. అందుకు తగిన విధంగా అభ్యర్థులు నైపుణ్యాలు పెంచుకోవాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో టాప్‌టెన్ కెరీర్స్‌పై ప్రత్యేక ఫోకస్.. ఏవియేషన్.. ఎమర్జింగ్ ఏవియేషన్ రంగంలో.. ప్రతి ఏటా 121 మిలియన్ దేశీయ, 41 మిలియన్ల అంతర్జాతీయ ప్రయాణికులతో తొమ్మిదో పెద్ద దేశంగా నిలుస్తున్న భారత్.. 2020 నాటికి మూడో పెద్ద దేశంగా ఎదుగుతుందని అంచనా. దీన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం రాజీవ్ గాంధీ నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తోంది. దీని ద్వారా పైలట్ లెసైన్సింగ్ కోర్సులతోపాటు గ్రౌండ్ డ్యూటీ, క్యాబిన్ క్రూ, ఎయిర్ క్రాఫ్ట్ ఇంజనీరింగ్ కోర్సులను ప్రారంభించాలని నిర్ణయించింది. మన రాష్ట్రంలో ప్రభుత్వ పరిధిలో ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ అకాడమీ.. ఈ రంగానికి చెందిన టెక్నికల్ కోర్సులను అందిస్తోంది. ‘ఏవియేషన్ రంగం కేవలం ప్రయాణికుల విభాగంలోనే కాకుండా కార్గో విభాగంలోనూ శరవేగంగా వృద్ధి చెందుతోంది. కాబట్టి సమీప భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు ఏర్పడతాయి. ఈ మేరకు నిపుణుల అవసరం పెరుగుతోంది. దీన్ని గమనించి విద్యార్థులు ఈ రంగంలో అడుగుపెడితే ఉజ్వల భవిష్యత్తును అందుకోవచ్చు.’ అంటున్నారు ఏపీ ఏవియేషన్ అకాడమీ డెరైక్టర్ కెప్టెన్ ఎస్.ఎన్.రెడ్డి. హెల్త్ కేర్.. కెరీర్ హెవెన్ ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్, సీఐఐ అంచనాల ప్రకారం హెల్త్‌కేర్ రంగంలో 2020 నాటికి.. పారా మెడికల్ సిబ్బంది నుంచి సీఈవో స్థాయి వరకు 40 మిలియన్ల ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. దీనికి ప్రధాన కారణం.. ఇతర దేశాలతో పోలిస్తే ఇక్కడ చికిత్స ఖర్చులు తక్కువగా ఉండ టం, మెడికల్ టూరిజంకు ప్రాధాన్యం పెరగడమే. కేవలం క్లినికల్ సర్వీసులే కాకుండా హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్‌కు సంబంధించి హాస్పిటల్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్స్ కొరత కూడా అధికంగానే ఉంది. ఔత్సాహికులు వీటిని దృష్టిలో పెట్టుకుంటే పదో తరగతి మొదలు.. పీజీ వరకు తమ అర్హతకు తగిన ఉద్యోగ వేదికగా హెల్త్‌కేర్ విభాగం నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రారంభంలో కనీసం నెలకు రూ. పదిహేను వేల జీతంతో కెరీర్ ప్రారంభించొచ్చు. నర్సింగ్ కోర్సులు పూర్తి చేసిన వారికి అమెరికా, యూరప్ దేశాల్లోనూ విపరీతమైన డిమాండ్ నెలకొంది. రిటైల్.. ఫర్ ఫ్యూచర్ వెల్ సింగిల్ బ్రాండ్ రిటైల్‌లో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు, మల్టీ బ్రాండ్ విభాగంలో 51 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రిటైల్ రంగంలో ఐదో పెద్ద దేశంగా నిలిచిన భారత్.. 2020 నాటికి ఈ రంగంలో 1.3 ట్రిలియన్ డాలర్ల వృద్ధి నమోదు చేయనుంది. అంటే ఆ స్థాయిలో రిటైల్ ఔట్లెట్లు ఏర్పాటు కానున్నాయి. అందుకు తగిన విధంగా స్టోర్ కీపర్ నుంచి స్టోర్ సీఈవో వరకు వేలల్లో అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. దీన్ని గుర్తించిన పలు ఇన్స్టిట్యూట్లు ఇప్పటికే రిటైల్ మేనేజ్మెంట్లో పలు డిప్లొమా, సర్టిఫికెట్, పీజీ డిప్లొమా, పీజీ కోర్సులను అందిస్తున్నాయి. ‘రిటైల్ మేనేజ్మెంట్లో ఇప్పుడు పలు కోర్సులు, ఇన్స్టిట్యూట్లు అందుబాటులోకి వస్తున్నప్పటికీ.. వాటికి గల గుర్తింపు, ఇతర ప్రామాణికాల ఆధారంగానే వాటిని ఎంచుకోవాలి’ అనేది ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్-హైదరాబాద్ రిటైల్ మేనేజ్మెంట్ కోర్సు కోఆర్డినేటర్ శ్రీకాంత్ సూచన. సోషల్ సర్వీస్ / ఎన్జీఓ ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేయడం, ప్రతి కంపెనీ తమ లాభాల్లో 2 శాతం నిధులను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పేరిట సామాజిక సేవకు కేటాయించాలనే నిబంధన విధించడంతో సోషల్ వర్క్, రూరల్ డవలప్మెంట్ వంటి కోర్సులు చేసినవారికి అవకాశాలు పెరిగాయి. దేశంలో చాలా యూనివర్సిటీలు ఎంఏలో ఈ కోర్సులను అందిస్తున్నాయి. ఈ విభాగాల్లో రెండు లక్షల ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ పథకం కింద 12వ పంచవర్ష ప్రణాళికలో 15.75 లక్షల స్వయం సహాయక బృందాలను నియమించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కోర్సుల వైపు అడుగులు వేస్తే మంచి అవకాశాలు అందుకోవచ్చు అంటున్నారు ఎన్ఐఆర్డీ సీపీజీఎస్ డెరైక్టర్ ఎస్.ఎం.ఇలియాస్. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్వయం ఉపాధి దిశగా కెరీర్ కోరుకునే వారికి సరైన వేదిక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. అంటే సొంతంగా ఏదైనా వ్యాపార, ఉత్పత్తి సంస్థను నెలకొల్పి ఆదాయార్జన పొందడం. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ వంటి కోర్సులు చేసిన వారికి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు. ఈ మేరకు ఐఎస్బీ, ఐఐటీ-కాన్పూర్, నర్సీమొంజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ తదితర సంస్థలు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మేనేజ్మెంట్లో పీజీ కోర్సులను అందిస్తున్నాయి. మంచి ఐడియాలతో వచ్చే వారికి ఆర్థికంగా చేయూత కూడా అందిస్తూ సొంత వ్యాపారాభివృద్ధి దిశగా ఊతమిస్తున్నాయి. ఫార్మా కెరీర్ సగటున 12 శాతం వార్షిక వృద్ధితో పయనిస్తూ.. అంతే స్థాయిలో అవకాశాలు కల్పిస్తున్న రంగం ఫార్మాస్యూటికల్. నేషనల్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ అంచనాల ప్రకారం 2015 నాటికి లక్ష నుంచి లక్షన్నర మంది నిపుణుల అవసరం ఉంది. ఇంటర్ ఎంపీసీ/బైపీసీ అర్హతతో బీఫార్మసీలో ప్రవేశించొచ్చు. ఆ తర్వాత పీజీ, పీహెచ్డీ చేయొచ్చు. దేశీయ ఫార్మా కంపెనీల్లోనూ, విదేశాల్లోనూ, విదేశీ ఔట్ సోర్సింగ్ సంస్థల్లోనూ అవకాశాలుంటాయి. పీజీ స్థాయిలో ఫార్మకాలజీ, ఫార్మాస్యూటిక్స్, టాక్సికాలజీ వంటి డిమాండ్ గల స్పెషలైజేషన్లు పూర్తి చేస్తే అవకాశాలకు ఆకాశమే హద్దు అంటున్నారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైపర్)-హైదరాబాద్ క్యాంపస్ రిజిస్ట్రార్ ఎన్.సత్యనారాయణ. కెరీర్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ ఒక దేశ ప్రగతికి మూలం.. మౌలిక సదుపాయాలు. అందుకే.. ప్రభుత్వం ఇటీవలి కాలంలో రోడ్లు, రైల్వేస్, ఏవియేషన్, షిప్పింగ్, ఎనర్జీ, పవర్, ఆయిల్ అండ్ గ్యాస్ ప్రొడక్షన్ తదితర విభాగాల్లో వృద్ధికి ప్రాధాన్యమిస్తోంది. వచ్చే పదేళ్లలో ఈ రంగం 7 నుంచి 10 శాతం సగటు వృద్ధి సాధిస్తుందని అంచనా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్లోని నిర్దేశిత విభాగాల్లో అడుగుపెట్టాలంటే ప్రధానంగా సివిల్, మెకానికల్ తదితర కోర్సుల్లో ఉత్తీర్ణులై ఉండాలి. కింది స్థాయిలో ఐటీఐ, డిప్లొమా కోర్సులతోనూ ఈ విభాగంలో అడుగుపెట్టొచ్చు అంటున్నారు జేఎంసీ ప్రాజెక్ట్స్ ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ఉదయ్‌భాస్కర్. ఆతిథ్య రంగం.. ఆదాయ మార్గం నేటి యువతకు మరో చక్కటి ఆదాయ మార్గం ఆతిథ్య రంగం (హాస్పిటాలిటీ). సగటున పది శాతం వృద్ధి రేటుతో సాగుతున్న రంగం. హోటల్స్, టూరిజం ఏజెన్సీలు ఈ రంగంలోని ప్రధాన విభాగాలు. టూరిజం శాఖ అంచనాల ప్రకారం.. ఆతిథ్య రంగంలో 2020 బనాటికి దాదాపు 9 లక్షల మంది నిపుణుల అవసరం ఏర్పడనుంది. ఎన్నో విద్యా సంస్థలు హోటల్ మేనేజ్మెంట్లో సర్టిఫికెట్ స్థాయి నుంచి పీజీ వరకు కోర్సులను అందిస్తున్నాయి. ఈ కోర్సులు పూర్తి చేస్తే ఉజ్వల భవిష్యత్తు ఖాయం. విభాగం ఆధారంగా నెలకు కనీసం రూ. పది వేల జీతం ఉంటుంది. టూర్ ఆపరేటర్లు, గైడ్లుగా నెలకు రూ. 25 వేల వరకు సంపాదించే అవకాశం ఉంది. టూరిజం విభాగంలో స్వయం ఉపాధి అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు సంబంధిత రంగ నిపుణులు. టెలికం మేనేజ్మెంట్ ప్రభుత్వ నూతన విధానంతో విభిన్న అవకాశాలకు మార్గం వేస్తున్న మరో రంగం టెలికమ్యూనికేషన్స్. సాధారణ టెలిఫోన్స్ సంఖ్య క్రమేణా తగ్గుతూ స్మార్ట్ఫోన్ల వినియోగం విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో టెలికం మేనేజ్మెంట్ కచ్చితంగా కొలువు ఖాయం చేసే విభాగమని నిపుణుల అభిప్రాయం. పల్లెపల్లెలో బ్రాడ్ బ్యాండ్ సేవలు విస్తరిస్తుండటం కూడా ఈ రంగంలో ఉపాధికి ఊతమిచ్చేవే. ఈ సేవలు సమర్థంగా సాగాలంటే టెలికం రంగంలో నిపుణుల ఆవశ్యకత ఎంతో. 2020 నాటికి.. దాదాపు పది లక్షల మంది నిపుణుల అవసరం ఏర్పడనుంది. ఈ క్రమంలో ప్రభుత్వం ప్రత్యేకంగా టెలికం సెంటర్ ఫర్ ఎక్సలెన్స్, సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ వైర్లెస్ టెక్నాలజీ వంటి ప్రత్యేక శిక్షణ సంస్థలను నెలకొల్పింది. సింబయాసిస్ ఇన్స్టిట్యూట్, వెలింగ్కర్ ఇన్స్టిట్యూట్ వంటి సంస్థలు టెలికం మేనేజ్మెంట్ కోర్సులను అందిస్తున్నాయి. దీంతోపాటు ఇంజనీరింగ్ ఈసీఈ అభ్యర్థులు కూడా ఈ రంగంలో అడుగుపెట్టే అవకాశం ఉంది అంటున్నారు సీఎంసీ సంస్థ హెచ్.ఆర్.మేనేజర్ టి. ఓంప్రకాశ్. మర్చంట్ నేవీ దేశదేశాలను చూడాలనే ఆకాంక్ష.. సముద్రపు అలలను ఆస్వాదించాలనుకునే వారికి చక్కటి అవకాశం కల్పించే కెరీర్ మర్చంట్ నేవీ. ఏడాదిలో సగభాగం సముద్రంలో.. ఓడల్లో గడిపే ఈ కెరీర్‌కు ఇప్పుడిప్పుడే డిమాండ్ పెరుగుతోంది. కేవలం ఇంటర్మీడియెట్ ఎంపీసీ అర్హతగా మర్చంట్ నేవీలో కెరీర్ ప్రారంభించొచ్చు. మెరైన్ ఇంజనీరింగ్, నాటికల్ సైన్స్, నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ షిప్ బిల్డింగ్ వంటి పలు కోర్సులు బీఎస్సీ, బీటెక్ స్థాయిలో అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుత డిమాండ్ ప్రకారం మర్చంట్ నేవీలో వేల సంఖ్యలో అవకాశాలు రెడీగా ఉన్నాయి. ఇతర దేశాలతో పెరుగుతున్న వాణిజ్య ఒప్పందాల దృష్ట్యా.. భవిష్యత్తులో కార్గో షిప్పింగ్ వ్యవహారాలు రెట్టింపై అంతే స్థాయిలో అవకాశాలు కూడా పెరగనున్నాయి. ప్రారంభంలో కనీసం నెలకు రూ. 25 వేల నుంచి రూ. 50 వేల వరకు అందుకోవచ్చు.