కాంగ్రెస్, బీజేపీ దొందూదొందే
విభజన పాపం ఆ పార్టీలదే
సంపన్నులకు ఊడిగం చేస్తున్న మోడీ
సీపీఎం నేత బృందా కారత్ ధ్వజం
విశాఖపట్నం, న్యూస్‌లైన్: పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు ఊడిగం చేయడంలో కాంగ్రెస్, బీజేపీలు దొందూదొందేనని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ వ్యాఖ్యానించారు. కేజీ బేసిన్‌లో సహాజవాయివు నిక్షేపాలను పెట్టుబడిదారులకు కట్టబెట్టడంలో ఆ రెండు పార్టీలు పోటీ పడుతున్నాయని విమర్శించారు. విశాఖలో బుధవారం జరిగిన సీపీఎం నేత జ్యోతిబసు శతజయంతి ఉత్సవ సభలో ఆమె ప్రసంగించారు. ఎర్రజెండాతో 75ఏళ్లు కార్మికులు, పీడిత ప్రజల కోసం పోరాడిన ఏకైక నేత జ్యోతిబసు అని కొనియాడారు. అత్యంత సంపన్న కుటుంబంలో పుట్టినప్పటికీ జీవితాంతం వాటికి దూరంగానే బతికారన్నారు. టీ అమ్ముకునే కుటుంబం నుండి వచ్చానని చెప్పుకుంటూ నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా తిరుగుతూ సంపన్నులకు ఊడిగం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్, బీజేపీల జెండాలు వేరైనా సిద్ధాంతాలు మాత్రం ఒక్కటేనన్నారు.
అందమైన రాష్ట్రాన్ని ముక్కలు చేశారు
స్వాతంత్రం వచ్చిన తరువాత నంబూద్రి ప్రసాద్, జ్యోతిబసు, బసవపున్నయ్య తదితరుల పోరాటాల ఫలితంగా ఏర్పడిన మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని బృందాకారత్ పేర్కొన్నారు. ఈరోజు అతిపెద్ద, అందమైన రాష్ట్రాన్ని కాంగ్రెస్, బీజేపీలు కలసి ముక్కలు చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకృష్ణ కమిటీ సూచనలను పక్కనబెట్టిన కాంగ్రెస్ పార్టీ ఓట్లు, సీట్లు కోసం రాష్ట్రాన్ని విడదీసిందని విమర్శించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో బీజేపీ నేత వెంకయ్యనాయుడు ఒక మాంత్రికుడిలా మాయజాలం చేసి ప్యాకేజీలతో తన జేబు నింపుకున్నారని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా ఒకే వేదికపైకి వచ్చే పార్టీలకు తమ మద్దతు పూర్తిగా ఉంటుందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు.