
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ నెల 28 నుంచి 30 దాకా హైదరాబాద్‌లో జరగనున్న గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ సదస్సు (జీఈఎస్)కు పలువురు దిగ్గజాలు హాజరవుతున్నారు. టెక్నాలజీ దిగ్గజ సంస్థ సిస్కో చైర్మన్ జాన్ చాంబర్స్, ట్యాక్సీ సేవల సంస్థ ఓలా సహ వ్యవస్థాపకుడు భవీష్ అగర్వాల్, ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ చందా కొచర్ తదితరులు ఇందులో ఉన్నారు. అమెరికాతో పాటు వివిధ దేశాలకు చెందిన ఇన్వెస్టర్లు, పారిశ్రామిక వేత్తలతో పాటు స్టార్టప్ సంస్థలూ ఈ సదస్సులో పాలు పంచుకుంటాయి. ప్రధానంగా ఇంధనం– మౌలిక రంగం, హెల్త్‌కేర్ – లైఫ్‌సైన్సెస్, ఫిన్‌టెక్ – డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, మీడియా–వినోద రంగం... ఈ 4 రంగాలపైనే ఫోకస్ ఉంటుందని, సంబంధిత వర్క్‌షాప్‌లు జరుగుతాయని నీతి ఆయోగ్ తెలియజేసింది. ఈ సదస్సును అమెరికా ప్రభుత్వం, నీతి ఆయోగ్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. అమెరికా తరఫున హాజరయ్యే బృందానికి అధ్యక్షుడు ట్రంప్‌కు సలహాదారుగా వ్యవహరిస్తున్న ఆయన కుమార్తె ఇవాంకా ట్రంప్ నేతృత్వం వహిస్తారు. కాగా ‘అందరికీ పురోగతి; మహిళలే ముందు’ అనే థీమ్‌తో జరగనున్న ఈ సదస్సులో పాల్గొనే వారిలో సుమారు సగం మంది మహిళలే ఉంటారని నీతి ఆయోగ్ పేర్కొంది. సదస్సును ప్రధాని మోదీ, ఇవాంకా ప్రారంభిస్తారు. కాగా సదస్సుకు అమెరికా, చైనాతో పాటు పలు విదేశీ దిగ్గజాల నుంచి ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
100కు పైగా వినూత్న స్టార్టప్‌లతో పాటు వినూత్న ఉత్పత్తులు, సర్వీసులు మొదలైన వాటికి జీఈఎస్–2017 వేదిక కానున్నదని నీతి ఆయోగ్ పేర్కొంది. గతేడాది అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో జరిగిన జీఈఎస్‌లో 170 దేశాల నుంచి 700 మంది ఔత్సాహిక వ్యాపారవేత్తలు, 300 మందికి పైగా ఇన్వెస్టర్లు పాల్గొన్నారు. ఈసారి సదస్సు అంతకన్నా భారీగా ఉంటుందని నీతి ఆయోగ్ అంచనా వేస్తోంది. ఇందులో పారిశ్రామికవేత్తలు, ఇన్వెస్టర్లు, పలు దిగ్గజ సంస్థల సీఈవోలతో పాటు 1,600 మంది పైగా ప్రతినిధులు పాల్గొంటారని నీతి ఆయోగ్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment