తండ్రి అయినంత మాత్రాన ఉద్యోగం ఇవ్వాలా? | US Billionaire Refused To Hire His Son | Sakshi
Sakshi News home page

తండ్రి అయినంత మాత్రాన ఉద్యోగం ఇవ్వాలా?

Published Wed, Apr 2 2025 1:43 PM | Last Updated on Wed, Apr 2 2025 3:04 PM

US Billionaire Refused To Hire His Son

వ్యాపారాల్లో కోట్ల రూపాయలు సంపాదించిన తండ్రులు తమ కుమారుల చదువు అయిపోయిన వెంటనే ఆస్తులు పంచి, వ్యాపారాల్లో భాగస్వామ్యం ఇచ్చి, దర్జాగా తమ పక్క సీట్లో కుర్చోబెట్టుకుంటున్న రోజులివి. ప్రముఖ రియల్‌ఎస్టేజ్‌ వ్యాపారి, బిలియనీర్‌ జార్జ్ పెరెజ్ మాత్రం అందుకు భిన్నంగా తన కుమారులకు సొంత కంపెనీలో ఉద్యోగం ఇచ్చేందుకు నిరాకరించారు. తన కంపెనీలో ఉన్నత స్థానం కావాలంటే సొంతంగా ఎదగాలని సూచించి కఠిన నిబంధనలు పెట్టారు.

జార్జ్ పెరెజ్ కుమారుడు జాన్ పాల్ పెరెజ్‌ కాలేజీ చదువు పూర్తి చేసుకొని తమ కుటుంబానికి చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ రిలేటెడ్ గ్రూప్‌లో ఉద్యోగం చేయాలనుకున్నాడు. కానీ అందుకు తన తండ్రి నిరాకరించారు. తండ్రి-కొడుకుల బంధం ఉన్నంత మాత్రాన తన 60 బిలియన్ డాలర్ల(సుమారు రూ.5 లక్షల కోట్లు) ఆస్తిని, కంపెనీ ప్రతిష్టను కుమారుడి సామర్థ్యం తెలియకుండా పణంగా పెట్టదలుచుకోలేదని జార్జ్‌ తెలిపారు. అందుకు బదులుగా కుమారుడి సామర్థ్యాలను నిరూపించడానికి జాన్ పాల్‌ను జార్జ్‌ సన్నిహిత స్నేహితుడి వద్దకు పని చేయడానికి పంపారు. దాంతో జాన్ పాల్ పెరెజ్ మియామి విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ చేసిన తరువాత కెరియర్‌లో ఎదిగేందుకు న్యూయార్క్ వెళ్లాడు.

కనీసం ఐదేళ్లు అనుభవం

తనతో కలిసి పని చేయాలంటే జార్జ్‌ తన పిల్లలందరికీ కఠినమైన నిబంధనలు విధించారు. న్యూయార్క్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో కనీసం ఐదు సంవత్సరాలు అనుభవం సంపాదించాలని చెప్పారు. ఒక టాప్ బిజినెస్ స్కూల్ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందాలని తెలిపారు. పిల్లలు సులువుగా తన కెరీర్ మార్గాన్ని అనుసరించకుండా ఈ విధానాన్ని రూపొందించినట్లు చెప్పారు.

నచ్చని పనిచేస్తే విజయం సాధించలేరు..

‘నేను రియల్ ఎస్టేట్‌లో విజయం సాధించినంత మాత్రాన తమకు అభిరుచి లేనిదాన్ని ఎంచుకోవద్దని పిల్లలకు చెప్పాను. ఎందుకంటే జీవితం చాలా కఠినంగా ఉంటుంది. ప్రతిరోజూ డబ్బు సంపాదన కోసం నచ్చని పని చేస్తే విజయం సాధించలేరు. నాకు సమాజంలో ఉన్న ​ప్రతిష్టతోనే పిల్లలను మార్కెట్‌లోకి తీసుకొచ్చారని మిగతా కంపెనీ సభ్యులు భావించడం నాకు ఇష్టం లేదు’ అని జార్జ్‌ పెరెజ్ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ఆల్‌టైమ్‌ గరిష్ఠానికి పసిడి.. బంగారం ధరలు ఇలా

చివరకు సీఈఓగా..

తన తండ్రి స్నేహితుడు, జార్జ్‌ కంపెనీలో మైనారిటీ వాటాదారుగా ఉన్న స్టీఫెన్ రాస్ యాజమాన్యంలోని సంస్థలో జాన్‌ పాల్‌  విశ్లేషకుడిగా కెరియర్‌ ప్రారంభించాడు. తరువాత ఉన్నత విద్యను అభ్యసించి నార్త్ వెస్ట్రన్ విశ్వవిద్యాలయంలోని ప్రతిష్టాత్మక కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌ నుంచి ఎంబీఏ సంపాదించాడు. 2012 నాటికి తండ్రికి చెందిన రిలేటెడ్ గ్రూప్‌లో చేరడానికి తగినంత అనుభవం సంపాదించినట్లు భావించాడు. కానీ, అతని తండ్రి తనకు ఉన్నత పదవి మాత్రం ఇవ్వలేదు. దాంతో జాన్ పాల్ కంపెనీలో జూనియర్‌ స్థాయి ఉద్యోగిగా చేరారు. తండ్రి మార్గంలోనే పనిచేశాడు. జాన్ పాల్ ప్రస్తుతం తన సోదరుడు నిక్‌తో కలిసి రిలేటెడ్ గ్రూప్ సీఈఓగా బాధ్యతలు చేపట్టాడు. తండ్రి ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఉన్నారు. దశాబ్దానికి పైగా కంపెనీలో విభిన్న బాధ్యతాయుతమైన పదవుల్లో పనిచేసిన వీరిద్దరూ ఉన్నత పదవులు అందుకున్నట్లు జార్జ్‌ పెరెజ్ సౌత్ ఫ్లోరిడా బిజినెస్ జర్నల్‌కు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement