అనుకున్నది సాధించాలనే అకుంఠిత దీక్ష, పట్టుదల అవసరం. ''సక్సెస్''.. వినటానికి చిన్న పదమే అయినా సాధించాలంటే సంవత్సరాలు పడుతుందని ఎంతోమంది నిజ జీవితంలో నిరూపించి చూపించారు. అయితే విజయం సాధించాలంటే నీ మీద నీకు నమ్మకం ఉండాలి. ఇలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు 'లీ థియామ్ వా' (Lee Thiam Wah). ఇంతకీ ఈయనెవరు? ఈయన సాధించిన సక్సెస్ ఏంటనేది ఇక్కడ చూసేద్దాం..
మలేసియాకు చెందిన 'లీ థియామ్ వా' 99 స్పీడ్ మార్ట్ వ్యవస్థాపకులు, యజమాని. నిజానికి ఈయనకు చిన్నతనంలోనే పోలియో వ్యాధి కారణంగా రెండు కాళ్ళూ చచ్చుబడిపోయాయి. తల్లిదండ్రుల ఆర్ధిక స్తోమత అంతంత మాత్రంగా ఉండటం చేత.. లీను ఆరేళ్ళు మాత్రమే పాఠశాలలో చదివించగలిగారు. ఆ తరువాత లీ చదువుకోలేకపోయారు.
చిన్నతనం నుంచే ఏదో ఒకటి సాధించాలానే తపనతో లీ థియామ్ వా.. సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని రోడ్డు పక్కన ఓ చిన్న దుకాణం స్టార్ట్ చేశారు. ఆ తరువాత కొన్ని సంవత్సరాలకు ఓ కిరాణా దుకాణం ప్రారంభించడానికి కావాల్సిన డబ్బు పొదుపు చేసారు. ఆ తరువాత అనుకున్న విధంగానే కిరాణా దుకాణం మొదలుపెట్టారు. అదే అనతి కాలంలో '99 స్పీడ్ మార్ట్'గా అవతరించింది. ఎంతో శ్రమించి ఈ స్టోర్‌లను మలేషియా మొత్తం విస్తరించగలిగారు.
వైకల్యం కారణంగా నాకు ఎవరూ పని ఇవ్వరు, నాకు నేనే సహాయం చేసుకోవాలి అనే ఉద్దేశ్యంతో ప్రారంభమైన లీ ప్రయాణం నేడు ధనవంతుణ్ణి చేసింది. విజయం సాధించాలంటే అంగవైకల్యం అడ్డుకాదని ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన లీ.. ఇప్పుడు ఎంతోమందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారు.
60 ఏళ్ల లీకు చెందిన 99 స్పీడ్ మార్ట్ రిటైల్ హోల్డింగ్స్ బీహెచ్డీ, కౌలాలంపూర్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో అరంగేట్రం చేసింది. ఏడు సంవత్సరాలలో ఇదే ఏకంగా 531 మిలియన్ డాలర్లను సేకరించింది. ఐపీవో స్టాక్ మొదటిరోజే 15 శాతం పెరగడంతో లీ నికర విలువ 2.8 బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో ఈయన మలేషియాలో అత్యంత సంపన్నుల జాబితాలో ఒకరుగా నిలిచారు.
ఇదీ చదవండి: ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ కార్లు ఇవే..
కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడువు.. అదీ చేతకాకపోతే పాకుతూ పో, అంతేకానీ ఒకేచోట అలా కదలకుండా ఉండిపోకు అన్న మహాకవి శ్రీ శ్రీ మాటలు నిజం చేసి ఎంతోమందికి ఆదర్శనంగా నిలిచిన వ్యక్తులలో మలేసియా కుబేరుడు 'లీ థియామ్ వా' ఒకరు. ఈయన జీవితం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
Comments
Please login to add a commentAdd a comment