Pinduoduo: దగాకోరు యాప్‌ | Pinduoduo: China most popular apps has the ability to spy on its users | Sakshi
Sakshi News home page

Pinduoduo: దగాకోరు యాప్‌

Published Thu, Apr 6 2023 6:06 AM | Last Updated on Thu, Apr 6 2023 7:26 AM

Pinduoduo: China most popular apps has the ability to spy on its users - Sakshi

వినియోగదారుల సమాచారాన్ని దొంగిలిస్తాయన్న ఆరోపణలు చైనా మొబైల్‌ అప్లికేషన్ల(యాప్‌లు)పై ఎప్పటినుంచో ఉన్నాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఇలాంటి యాప్‌లపై నిషేధం విధించాయి. చైనాలో బాగా జనాదరణ ఉన్న షాపింగ్‌ యాప్‌ ‘పిండువొడువో’ తమ యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని తస్కరిస్తున్నట్లు ఇటీవలే వెల్లడయ్యింది. 75 కోట్ల మంది డేటాను సేకరించి, వ్యాపార అభివృద్ధి కోసం వాడుకున్నట్లు బయటపడడం సంచలనం సృష్టిస్తోంది. ఈ యాప్‌ను ఫోన్లలో ఒకసారి ఇన్‌స్టాల్‌ చేసుకుంటే తొలగించడం చాలా కష్టమని సైబర్‌ సెక్యూరిటీ నిపుణు లు చెబుతుండడం గమనార్హం. చైనా ప్రభుత్వం ఇప్పటికీ పిండువొడువో యాప్‌పై చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

► 75 కోట్ల మంది వినియోగదారుల విస్తృత డేటాను పిండువొడువో యాజమాన్యం వారికి తెలియకుండానే సేకరించింది. వారి ఆసక్తులు, అభిరుచులు, ప్రాధాన్యతలు ఏమిటో తెలుసుకుంది.  
► వాటికి అనుగుణంగా నోటిఫికేషన్లు, ప్రక
టనలు పంపించడానికి తన మెíషీన్‌  లెర్నింగ్‌ మోడల్‌ను మెరుగు పర్చు కుంది.  


అనుమతి లేకుండానే..  
► మన ఫోన్లలోని డేటాను ఇతరులు చూడాలంటే మన అనుమతి తప్పనిసరి. పిండువొడువో మాత్రం ఇలాంటి అనుమతుల జోలికి వెళ్లలేదు.  
► యూజర్ల ఫోన్లలోకి పిండువొడువో యాజమాన్యం తమ యాప్‌ ద్వారా మోసపూరిత సాఫ్ట్‌వేర్‌(మాల్‌వేర్‌)ను జొప్పించింది. దాని సాయంతో ఫోన్లలోని లొకేషన్లు, కాంటాక్ట్‌లు, క్యాలెండర్లు, నోటిఫికేషన్లు, ఫొటో ఆల్బమ్స్‌ యాక్సెస్‌ చేసుకుంది.  
► ఫోన్లలోని సిస్టమ్‌ సెట్టింగ్స్‌ మార్చే వెసులుబాటు సైతం సొంతం చేసుకుంది. ఫోన్లలో ఉండే ఇతర యాప్‌లపైనా నిఘా పెట్టింది.  
► ఒక్కమాటలో చెప్పాలంటే యూజర్లకు తెలియకుండానే వారి ఫోన్లను స్వేచ్ఛగా వాడుకుంది.  
► గూగుల్‌ సంస్థ మార్చి నెలలో తన ప్లేస్టోర్‌ నుంచి పిండువొడువోను తొలగించింది.  
► తమ యాప్‌పై వచ్చిన ఆరోపణలను యాజమాన్యం ఖండించింది.  


ఏమిటీ పిండువొడువో?  
► చైనాలో ఇంటర్నెట్‌ వినియోగించే ప్రజల్లో నాలుగింట మూడొంతుల మంది పిండువొడువో యాప్‌ ఖాతాదారులే. మార్కెట్‌ విలువ ప్రఖ్యాత షాపింగ్‌ యాప్‌ ‘ఈబే’ కంటే మూడు రెట్లు ఎక్కువ.    
► గూగుల్‌ మాజీ ఉద్యోగి కోలిన్‌ హువాంగ్‌ 2015లో షాంఘైలో స్టార్టప్‌ కంపెనీగా పిండువొడువో యాప్‌ను 6.49.0 అనే వెర్షన్‌తో ప్రారంభించాడు. ఈ–కామర్స్‌ దిగ్గజాలైన అలీబాబా, జేడీ డాట్‌ కామ్‌కు పోటీగా ఈ కంపెనీ ప్రస్థానం ఆరంభమైంది. గూగుల్‌ ప్లేస్టోర్‌తోపాటు చైనా యాప్‌ స్టోర్లలో అందుబాటులోకి వచ్చింది.   
► పిండువొడువో నగరాలను కాకుండా తొలుత చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలనే తన లక్ష్యంగా చేసుకుంది. తక్కువ ఆదాయం కలిగిన ప్రజలకు చౌక ధరలకే వారు కోరుకున్న వస్తువులు చేరవేసింది. ఫ్రెండ్స్, ఫ్యామిలీ గ్రూప్‌లకు భారీగా డిస్కౌంట్లు ఇచ్చింది. దాంతో అనతి కాలంలోనే పిండువొడువో జనంలోకి బాగా చొచ్చుకెళ్లింది.  
► 2018 ఆఖరు నాటికి నెలవారీ యూజర్లలో మూడంకెల వృద్ధిని సాధించింది. అదే సంవత్సరం న్యూయార్క్‌ స్టాక్‌ మార్కెట్‌లో లిస్టయ్యింది.  
► ఈ యాప్‌ ఫోన్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్‌ అవుతూనే ఉంటుంది. అందుకే ఫోన్ల నుంచి సులభంగా తొలగించలేమని నిపుణులు వెల్లడించారు.


ఎప్పుడు బయటపడింది?
► పిండువొడువో యాప్‌లో మాల్‌వేర్‌ ఉన్నట్లు ఈ ఏడాది ఫిబ్రవరి మాసాంతంలో అనుమానాలు బలపడ్డాయి. 
► చైనా సైబర్‌ సెక్యూరిటీ సంస్థ ‘డార్క్‌ నేవీ’ ఈ మేరకు ఒక నివేదిక విడుదల చేసింది. కానీ, ఆ యాప్‌ పేరును నేరుగా ప్రస్తావించలేదు. 
► యాప్‌ నిర్వాకంపై ఇతర పరిశోధకులు దృష్టి పెట్టారు. మాల్‌వేర్‌తో డేటాను దొంగిలిస్తున్న సంగతి నిజమేనని తేల్చారు. పిండువొడువో అనేది ఒక దొంగ యాప్‌ అని స్పష్టం చేశారు. 
► ఆరోపణలు వెల్లువెత్తడంతో యాప్‌ యాజమాన్యం అప్రమత్తమైంది. మార్చి 5న వెర్షన్‌ 6.50.0 పేరిట కొత్త అప్‌డేట్‌ను విడుదల చేసింది. చాలామంది ఇంజనీర్లు, ప్రొడక్ట్‌ మేనేజర్లను తమ అనుబంధ సంస్థ అయిన ‘టెమూ’కు తరలించింది. 
► 20 మందితో కూడిన సైబర్‌ సెక్యూరిటీ ఇంజనీర్ల బృందం ఇప్పటికీ పిండువొడువోలో కొనసాగుతోంది.  


చైనా ప్రభుత్వం మౌనమెందుకో?
► కొత్త వెర్షన్‌ కూడా సురక్షితం కాదని నిపుణులు చెబుతున్నారు. అందులో అండర్‌లైయింగ్‌ కోడ్‌ ఉందని, డేటా చౌర్యం కోసం దాన్ని ఎప్పుడైనా రీయాక్టివేట్‌ చేయొచ్చని హెచ్చరిస్తున్నారు.  
► చట్ట ప్రకారం చూస్తే పిండువొడువోను నిషేధించాల్సిందేనని నిపుణులు తేల్చిచెబుతున్నారు. కానీ, ఆ యాప్‌పై ఇప్పటికీ చర్యల్లేవు. యాప్‌ కార్యకలాపాలపై బహిరంగంగా ఏనాడూ స్పందించలేదు.  
► చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్న యాప్‌ల పేర్లతో కూడిన జాబితాను చైనా సమాచార సాంకేతిక శాఖ తరచుగా విడుదల చేస్తోంది. ఈ జాబితాల్లో పిండువొడువో పేరును ఒక్కసారి కూడా చేర్చలేదు. 
► పిండువొడువో అనుబంధ యాప్‌ అయిన ‘టెమూ’ అమెరికాలో డౌన్‌లోడ్లలో అగ్రస్థానంలో ఉంది. పశ్చిమ దేశాల్లోనూ
విస్తరిస్తోంది. ఇప్పుడు దీనిపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement