మన మీద జరగుతున్న, జరిగే అవకాశమున్న దాడుల గురించి తెలుసుకోవడం, అవగాహన పెంచుకోవడం కూడా మనం తీసుకునే భద్రతాచర్యల్లో భాగమే. మహిళలు తమకు తామే చైతన్యవంతులు కావాలి! మనం ఉన్న పరిసరాలను జాగ్రత్తగా పరిశీలించాలి. ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తుల ఉనికిని గమనిస్తే సాధ్యమైనంత త్వరగా అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేయాలి. చీకటి ప్రదేశాల్లో, జనసంచారం అంతగాలేని చోట ఉండకూడదు.
►టాక్సీలో, ఆటోలో వెళ్లాల్సి వస్తే వాటిని ఎక్కేముందు ఆ వాహనాల నంబర్‌ను నోట్ చేసుకొని ఇంట్లో వాళ్లకు కానీ, సన్నిహితులకు కానీ మెసేజ్ చేయాలి. అలాగే గమ్యస్థానం చేరుకునే వరకు కావాల్సిన వాళ్లతో ఫోన్‌లో మాట్లాడుతూ ఉండాలి. అంటే వాహనం వెళ్తున్న దారిని ఎప్పటికప్పుడు వాళ్లకు తెలియచేస్తూ ఉండాలి. ఒకవేళ అంతసేపు మనతో మాట్లాడే తీరికలో ఎవరూలేకపోయినా.. మాట్లాడుతున్నట్లు నటిస్తూ డ్రైవర్‌ను నమ్మించాలి. ప్రయాణిస్తున్న దారినీ పరిశీలిస్తూ ఉండాలి.
►నడుస్తూ వెళ్తున్నప్పుడు సాధ్యమైనంత వరకు రద్దీ ప్రదేశాల్లో నడిచే ప్రయత్నం చేయాలి. ఒకవేళ దాడి జరిగితే కేకలు వేస్తే స్పందించే వాళ్లుంటారు.
►బయటకు వెళ్లేటప్పుడు సాధ్యమైనంత వరకు బంగారు నగలను ధరించకపోవడమే మంచిది. ఒకవేళ ఆకతాయిలు మన మీద దాడి చేసినప్పుడు వాళ్లు మన నుంచి ఏం లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారో గమనించాలి. పర్స్‌లాంటివి అయితే వాటిని ఇచ్చేసి వెంటనే అక్కడి నుంచి బయటపడడం ఉత్తమం.
►హ్యాండ్‌బ్యాగ్‌లో విధిగా పెప్పర్‌స్ప్రే, చెంప పిన్నులు వంటివి పెట్టుకోవాలి.
►సాధ్యమైనంత వరకు ఆకతాయిలు వెనుక నుంచి దాడి చేయడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి నడిచేటప్పుడు అయిదడుగుల కంటే తక్కువ దూరంలో ఎవరైనా మన వెంట వస్తుంటే అప్రమత్తం కావాలి.
►మన మీద దాడి జరగగానే గాబరా పడకుండా ముందు దాడిచేసిన వ్యక్తుల కళ్లలో పొడవడానికి ప్రయత్నించాలి. కుదరకపోతే రెండు తొడల మధ్య తన్నడానికి యత్నించాలి. ఈ రెండూ కూడా ది బెస్ట్ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ అని మరచిపోవద్దు.
►అలాగే మొబైల్ ఫోన్స్‌లో సేఫ్టీ యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్రమాదం పొంచి ఉంది అని గ్రహించగానే వాటిని ఉపయోగించాలి. అంతేకాదు మహిళల భద్రత కోసం ప్రభుత్వాలు, ఇతర సంస్థల టోల్‌ఫ్రీ నంబర్లనూ ఫీడ్ చేసుకోవాలి. ప్రమాదపు సంకేతాలు కనిపించగానే ఆ నంబర్లకు ఫోన్ చేయాలి.
►భౌతిక దాడుల సంగతి సరే.. ఇంటర్నెట్ జీవితంలో భాగమైన ఈ కాలంలో సైబర్ నేరాల సంఖ్యా తక్కువేం లేదు. కాబట్టి సోషల్ నెట్‌వర్క్‌లో విరివిగా పాలుపంచుకునేవారు తమ వ్యక్తిగత సమాచారాన్ని అసలు పంచుకోకుండా ఉంటేనే మంచిది. ఇంటి చిరునామా, ఫోన్‌నంబర్, ఫోటోలు పెట్టకూడదు. అలాగే ఈ–మెయిల్‌లో కూడా ఎలాంటి పర్సనల్ డాక్యుమెంట్స్‌ని, వాటికి సంబంధించిన సమాచారాన్ని పొందుపరచకూడదు. బ్యాంక్ సిబ్బంది ఎవరూ ఫోన్‌లో ఆధార్ నంబరు, కార్డు నంబరు, సీవీవీ, ఓటీపీ అడగరు. ఈ విషయాన్ని ఆడ, మగ తేడాలేకుండా అందరూ గ్రహించాలి, గుర్తుపెట్టుకోవాలి.
►మొత్తం కొత్త వాతావరణంలో కొత్తవాళ్లు ఇచ్చే తినుబండారాలు, పానీయాలను స్వీకరించకూడదు. ఈ విషయంలో ఎలాంటి మొహమాటాలకు తావివ్వకూడదు.
►చివరిదైనా ముఖ్యమైన సూచన, జాగ్రత్త.. మన సిక్స్›్తసెన్స్‌ను నమ్మడం. బయటకు వెళ్లినప్పుడో.. టాక్సీ ఎక్కినప్పుడో.. ఏదైనా ప్రమాదం పొంచి ఉంది అని అనిపిస్తే మెదడు ఇచ్చే ఆ సంకేతాలను కొట్టిపారేయాక శ్రద్ధ పెట్టి అక్కడి నుంచి వీలైనంత త్వరగా తప్పుకోవాలి.
►క్యాబ్‌లో ప్రయాణిస్తున్నప్పుడెప్పుడూ డ్రైవర్ వెనక సీట్లోనే కూర్చోవాలి. డ్రైవర్ దాడికి దిగితే చున్నీతో అతని మెడకు చుట్టేసి అతణ్ణి నిలువరించే వీలుంటుంది. అందుకే హ్యాండ్‌బ్యాగ్‌లో పెప్పర్‌స్ప్రేతోపాటు విధిగా చున్నీనీ పెట్టుకోవాలి ఆత్మరక్షణాయుధంలా.
►అలాగే క్యాబ్ ఎక్కగానే చైల్డ్ లాక్ ఓపెన్ చేసుకోవాలి. దీనివల్ల డ్రైవర్ తన దగ్గర్నుంచి తర్వాత క్లోజ్ చేసే వీలుండదు. ఇలా చైల్డ్ లాక్‌ను ఓపెన్ చేసుకోవడం వల్ల డ్రైవర్ ఏదైనా అఘాయిత్యం తలపెట్టతలిచినా మన వైపు ఉన్న డోర్‌ను తీసుకునే అవకాశం ఉంటుంది.
కుటుంబ హింసను ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు
►ముందు జీవితభాగస్వామి ఇష్టాఇష్టాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలి. దానికనుగుణంగా మలచుకునే ప్రయత్నం చేయాలి. చిన్నచిన్న త్యాగాలకూ సిద్ధపడాలి. వీటి ప్రయోజనం తప్పకుండా ఉంటుందనే విషయం మరిచిపోవద్దు. దీనివల్ల భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది.
►జీవితభాగస్వామికి కుటుంబంలో ఇష్టమైన వ్యక్తులెవరో తెలుసుకొని వారిని గౌరవించాలి. వారిపట్ల శ్రద్ధ చూపించాలి.
►వాదోపవాదాలు, వాగ్వివాదాలు వచ్చినప్పుడు మౌనం వహించడం కన్నా మంచి పద్ధతి లేదు. పరిస్థితి సద్దుమణిగాక మీరు చెప్పాలనుకున్నది నిదానంగా చెప్పొచ్చు.
►వివాహం అయిన కొత్తల్లోనే ఆర్థికవనరుల నిర్వహణలో కచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాలి. సమాన భాగస్వామ్యం నిర్వర్తించాలి. ఎవరి ఏటీఎమ్ కార్డులు వాళ్ల దగ్గరే ఉంచుకోవాలి. జాయింట్ ఎకౌంట్స్ జోలికి పోవద్దు. జాయింట్ లాకర్స్‌కీ పోవద్దు. అయితే స్థిరాస్తుల కొనుగోలు విషయంలో మాత్రం జాయింట్ రిజిస్ట్రేషన్‌కే ప్రాధాన్యమివ్వాలి. అలాగే ఒకరి క్రెడిట్ కార్డ్స్ ఒకరు ఉపయోగించుకోకుండా ఉంటేనే మంచిది. అలాగే మీ పాస్‌పోర్ట్, పర్సనల్ డాక్యుమెంట్స్ వంటివి మీకు సంబంధించిన భద్రమైన చోటులో దాచుకోండి.
►పుట్టినరోజులు, పెళ్లిరోజులు గుర్తుపెట్టుకుని బాధ్యతగా కాకుండా ఇష్టంగా విష్ చేయాలి. ఓ చిన్న బహుమతి ఇవ్వాలి.
►మంచి పనుల పట్ల పరస్పర పొగడ్తలు, ప్రోత్సాహం, అభినందనలు అవసరం.
►ఇతరులతో పోల్చడం చాలా ప్రమాదం. అలాగే జీవితభాగస్వామి బలహీనతలనూ ఒప్పుకునే పెద్దమనసును అలవర్చుకోవాలి.
►జీవితభాగస్వామికి చాడీలు చెప్పే అలవాటు మానుకోవాలి.
►సంసారంలో సమస్యలు వచ్చినప్పుడు కలిసి కూర్చుని చర్చించుకునే వాతావరణాన్ని ఏర్పరచుకోవాలి. చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం కాకపోతే సైకాలజిస్ట్ దగ్గరకు వెళ్లి కౌన్సెలింగ్ తీసుకోడానికి వెనుకాడవద్దు.
►మీరు ఇంత ఒద్దికగా, ఓపికగా ఉంటున్నా అత్తగారింట్లో అవాంఛనీయ పరిస్థితులు, మనస్తాపం కలిగించే సంఘటనలు ఎదురవుతున్నట్లయితే సన్నిహితులతో, తల్లిదండ్రులతో వాటిని పంచుకోవడం మంచిది.
►హెల్ప్‌లైన్, ఫ్యామిలీ కౌన్సెలర్స్, సైకాలజిస్ట్‌ల నంబర్లు దగ్గరపెట్టుకోవాలి. పరిస్థితి చేయిదాటుతుందనిపిస్తే వాళ్లను సంప్రదించాలి. అలాగే మహిళల రక్షణకు, భద్రత కోసం ఏర్పడ్డ చట్టాల మీద ప్రాథమిక అవగాహనను ఏర్పరచుకోవాలి. మీకు ఆ అవగాహన ఉన్నట్టు ఏదో ఒక సందర్భంలో మీ జీవిత భాగస్వామికీ తెలియచేయాలి.
ఇవన్నీ చేస్తే జీవిత భాగస్వామి వద్ద మీరు తలవంచినట్టు భావించకండి.. మీ సంసార విజయానికి ఇవి మెట్లు అని గ్రహించండి. – ఇ. పార్వతి, అడ్వొకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్
Comments
Please login to add a commentAdd a comment