ఎన్‌ఆర్‌ఐని పెళ్లిచేసుకున్న మహిళల భద్రత కోసం అంటే ఎన్‌ఆర్ భర్త పెట్టే హింస, ఇబ్బందుల నుంచి సంబంధిత స్త్రీలకు రక్షణ, న్యాయ సహాయం అందించడానికి ఏర్పడిందే ఎన్‌ఆర్‌ఐ సెల్. తెలంగాణ విమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో నడుస్తోంది. స్వచ్ఛంద సంస్థలు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ, హోమ్ శాఖ, జాతీయ మహిళా కమిషన్ , భారతీయ రాయబార కార్యాలయాల సహాయం, సహకారంతో ఎన్‌ఆర్‌ఐ వివాహితల సమస్యలను పరిష్కరించేందుకు తోడ్పడుతోందీ ఎన్‌ఆర్‌ఐ విమెన్ సేఫ్టీ సెల్.
ఏం చేస్తుంది?
►బాధిత మహిళల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తుంది. ఒకవేళ ఏ పోలీస్ స్టేషన్‌లోనూ ఫిర్యాదు నమోదు కాకపోతే.. నమోదు అయ్యేలా, స్థానిక పోలీసులు కేసును దర్యాప్తు చేసేలా, ఆ ఎన్‌ఆర్‌ఐ భర్త మీద లుక్ అవుట్ సర్క్యూలర్ జారీ చేసేలా, నాన్ బెయిలబుల్ వారెంట్ అందేలా చేస్తుంది ఎన్‌ఆర్‌ఐ విమెన్ సేఫ్టీ సెల్.
►దాంతో సదరు నిందితుడు ఎప్పుడూ దేశంలో అడుగుపెట్టినా ఇమ్మిగ్రేషన్ అధికారులు వెంటనే అతణ్ణి స్థానిక పోలీసులకు అప్పగిస్తారు.
►నిందితుడు కోర్టుకు హాజరుకానట్లయితే అతని పాస్‌పోర్ట్‌ను సీజ్ చేయాల్సిందిగా ప్రాంతీయ పాస్‌పోర్ట్ ఆఫీసర్‌ను కోర్టు ఆదేశించవచ్చు.
►బాధితులకు న్యాయసలహాలు ఇవ్వడానికి, మార్గదర్శకం చేయడానికి ఈ సెల్‌లో నలుగురు న్యాయనిపుణులతో కూడిన ప్యానెల్ ఒకటి ఉంటుంది.
ఎన్‌ఆర్‌ఐ విమెన్ సేఫ్టీ సెల్‌ను సంప్రదించాల్సిన నంబర్లు.. 040– 27852246, వాట్సప్: 9440700906, ఇ– మెయిల్.. tswomensafety@gmail.com FACEBOOK and TWITTER :@ts_womensafety
ఎన్‌ఆర్‌ఐ పెళ్ళిళ్లలో తీసుకోవల్సిన జాగ్రత్తలు
►అబ్బాయి వివాహ స్థితి అంటే... ఒంటరివాడు, విడాకులు తీసుకున్న వ్యక్తి, విడిపోయి జీవిస్తూ, న్యాయపరమైన పోరాటం సాగిస్తున్న వ్యక్తా అనే వివరాలు తెలుసుకోవాలి.
►వృత్తిపరమైన అంశాలు.. విద్యార్హతలు, ఏ వృత్తిలో ఉన్నాడు, జీతం ఎంత, ఏ ఆఫీసు, అడ్రసు, యాజమాన్యపు వివరాలు, వారి నిబద్ధత మొదలైనవి తెలుసుకోవాలి.
►విదేశ నివాస అర్హతలు..అక్కడ అతని స్థితిగతులు, విదేశీ నివాసం ఏ విధంగా పొందాడు, వీసా వివరాలు, వివాహమయ్యాక భార్యను తీసుకెళ్లడానికి అర్హత ఉందా? వంటి వివరాలు .
►ఆర్థిక స్థితిగతులు.. భారతదేశంలో అతడి నివాసం, చిరునామా, కుటుంబ వివరాలు, ఆస్తి వివరాలు, పాస్‌పోర్ట్ నంబరు, గడువు, వీసా నంబరు, గడువు, ఆధార్ కార్డు నెంబరు, విదేశీ రిజిస్ట్రేషను కార్డు, సోషల్ సెక్యూరిటీ నెంబరు.
►ఇండియాలోనే వివాహం జరగాలని, ఇక్కడి వివాహ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేయించుకోవాలని తెలియపర్చాలి. వివాహంలో ఫొటోలు తీయించుకోవాలి.
►స్థానికంగా ఉన్న వరుడి స్నేహితుల వివరాలు, వరుడు ఉంటున్న దేశంలో స్థిరపడిన కామన్ ఫ్రెండ్స్, బంధువుల సమాచారం, ఫోన్ నంబర్లు, ఈ– మెయిల్ వివరాలు తెలుసుకొని ఆ కాపీలను పెట్టుకోవాలి.
►మన న్యాయ చట్టాలతోపాటు పెళ్లయ్యాక భర్తతో ఏ దేశం వెళుతుందో ఆ దేశపు న్యాయ చట్టాలపై, తన హక్కులపై వధువుకి తప్పకుండా అవగాహన ఉండాలి. భర్త నుంచి హింస ఎదురైతే అక్కడి అధికారులను సంప్రదించాలి.
►వధువుకి సంబంధించిన హితులు, బంధువులు విదేశంలో ఉంటే వారి ఫోన్ నంబర్లు, తన భర్త పనిచేసే యజమాని వివరాలు, పోలీస్, అంబులెన్స్, ఇండియన్ ఎంబసీ వివరాలు, హై కమిషన్ వివరాలు తెలుసుకొని వారిని సంప్రదించాలి. పెళ్లయ్యాక విదేశం వెళ్తున్నప్పుడు ఇంటికి దగ్గర్లో ఉన్న బ్యాంక్‌లో వధువు పేర అకౌంట్ తెరిచి అందులో కొంత డబ్బు ఉంచాలి.
►వధువు తన పాస్‌పోర్ట్, వీసా, బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఆస్తి పత్రాలు, మ్యారేజి సర్టిఫికెట్, తన విద్యార్హతల సర్టిఫికెట్లు, ఇతర ముఖ్యమైన వివరాలను మూడు కాపీలుగా చేసి ఒకటి తన దగ్గర, ఇంకో కాపీ తల్లిదండ్రుల దగ్గర, మరొక కాపి విదేశంలో తను నమ్మదగ్గ స్నేహితుల దగ్గర పెట్టుకోవాలి. అలాగే భర్త వివరాలు, పాస్‌పోర్ట్, వీసా, ఆస్తి వివరాలు, డ్రైవింగ్ లైసెన్స్ నంబరు, సోషల్ సెక్యూరిటీ నంబరు, ఓటరు కార్డ్, ఎలీన్ రిజిస్ట్రేషన్ కార్డ్ మొదలైనవి ఫొటో కాపీ తీసి తన దగ్గర ఒకటి, తల్లిదండ్రుల దగ్గర ఒక కాపీ పెట్టాలి.
►పెళ్లి ద్వారా విదేశం వెళ్లి అక్కడ తను ఏదైనా ఉద్యోగం, వ్యాపారం లేదా ఉన్నత చదువులు చదువుకోవచ్చనే ఆలోచన, ఊహ, ఆశను మానుకోండి. అక్కడి వ్యవస్థలు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలపై పూర్తి అవగాహన లేకుండా తొందరపడి ఎన్‌ఆర్‌ఐతో పెళ్లికి ఒప్పుకోరాదు.
►తల్లిదండ్రులు సహా ఎవరి ఒత్తిడితోనూ ఎన్‌ఆర్‌ఐతో పెళ్లికి అంగీకరించకూడదు. ఎందుకంటే పెళ్లి పేరుతో అమ్మాయిలను తీసుకెళ్లి వ్యభిచార గృహాలకు, వెట్టి చాకిరీకి తరలిస్తున్న వ్యక్తులు మన కళ్లముందే ఉన్నారన్న సత్యాన్ని మరువద్దు. ఏ కొంచెం అనుమానం వచ్చినా వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలి.
►మ్యారేజ్ బ్యూరోలు, ఏజెంట్లు, మధ్యవర్తులను గుడ్డిగా నమ్మి మోసపోవద్దు. అవతలి వ్యక్తుల, కుటుంబ వివరాలను, మంచిచెడ్డలను స్వయంగా వాకబు చేసుకోవాలి.
(తెలంగాణ ఎన్‌ఆర్‌ఐ సెల్)
తెలంగాణ మైనారిటీస్ కమిషన్ చొరవ
విదేశాల్లో గృహహింసను ఎదుర్కొంటున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన మహిళలకోసం తెలంగాణ రాష్ట్ర మైనారిటీస్ కమిషన్ హైదరబాద్‌లో కేసులు నమోదు చేసుకునే వెసులుబాటును కల్పిస్తోంది. బాధితులుగా స్వదేశానికి తిరిగి వచ్చిన మహిళలు తాము ఎదుర్కొన్న గృహహింసకు సంబంధించి నిందితుల మీద హైదరాబాద్ నుంచే కేసు ఫైల్ చేయొచ్చు. ఇక్కడి నుంచే కేసు దర్యాప్తు జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment