NRI women
-
ఎన్ఆర్ఐ విమెన్ సేఫ్టీ సెల్
ఎన్ఆర్ఐని పెళ్లిచేసుకున్న మహిళల భద్రత కోసం అంటే ఎన్ఆర్ భర్త పెట్టే హింస, ఇబ్బందుల నుంచి సంబంధిత స్త్రీలకు రక్షణ, న్యాయ సహాయం అందించడానికి ఏర్పడిందే ఎన్ఆర్ఐ సెల్. తెలంగాణ విమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో నడుస్తోంది. స్వచ్ఛంద సంస్థలు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ, హోమ్ శాఖ, జాతీయ మహిళా కమిషన్ , భారతీయ రాయబార కార్యాలయాల సహాయం, సహకారంతో ఎన్ఆర్ఐ వివాహితల సమస్యలను పరిష్కరించేందుకు తోడ్పడుతోందీ ఎన్ఆర్ఐ విమెన్ సేఫ్టీ సెల్. ఏం చేస్తుంది? ►బాధిత మహిళల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తుంది. ఒకవేళ ఏ పోలీస్ స్టేషన్లోనూ ఫిర్యాదు నమోదు కాకపోతే.. నమోదు అయ్యేలా, స్థానిక పోలీసులు కేసును దర్యాప్తు చేసేలా, ఆ ఎన్ఆర్ఐ భర్త మీద లుక్ అవుట్ సర్క్యూలర్ జారీ చేసేలా, నాన్ బెయిలబుల్ వారెంట్ అందేలా చేస్తుంది ఎన్ఆర్ఐ విమెన్ సేఫ్టీ సెల్. ►దాంతో సదరు నిందితుడు ఎప్పుడూ దేశంలో అడుగుపెట్టినా ఇమ్మిగ్రేషన్ అధికారులు వెంటనే అతణ్ణి స్థానిక పోలీసులకు అప్పగిస్తారు. ►నిందితుడు కోర్టుకు హాజరుకానట్లయితే అతని పాస్‌పోర్ట్‌ను సీజ్ చేయాల్సిందిగా ప్రాంతీయ పాస్‌పోర్ట్ ఆఫీసర్‌ను కోర్టు ఆదేశించవచ్చు. ►బాధితులకు న్యాయసలహాలు ఇవ్వడానికి, మార్గదర్శకం చేయడానికి ఈ సెల్లో నలుగురు న్యాయనిపుణులతో కూడిన ప్యానెల్ ఒకటి ఉంటుంది. ఎన్ఆర్ఐ విమెన్ సేఫ్టీ సెల్‌ను సంప్రదించాల్సిన నంబర్లు.. 040– 27852246, వాట్సప్: 9440700906, ఇ– మెయిల్.. tswomensafety@gmail.com FACEBOOK and TWITTER :@ts_womensafety ఎన్ఆర్ఐ పెళ్ళిళ్లలో తీసుకోవల్సిన జాగ్రత్తలు ►అబ్బాయి వివాహ స్థితి అంటే... ఒంటరివాడు, విడాకులు తీసుకున్న వ్యక్తి, విడిపోయి జీవిస్తూ, న్యాయపరమైన పోరాటం సాగిస్తున్న వ్యక్తా అనే వివరాలు తెలుసుకోవాలి. ►వృత్తిపరమైన అంశాలు.. విద్యార్హతలు, ఏ వృత్తిలో ఉన్నాడు, జీతం ఎంత, ఏ ఆఫీసు, అడ్రసు, యాజమాన్యపు వివరాలు, వారి నిబద్ధత మొదలైనవి తెలుసుకోవాలి. ►విదేశ నివాస అర్హతలు..అక్కడ అతని స్థితిగతులు, విదేశీ నివాసం ఏ విధంగా పొందాడు, వీసా వివరాలు, వివాహమయ్యాక భార్యను తీసుకెళ్లడానికి అర్హత ఉందా? వంటి వివరాలు . ►ఆర్థిక స్థితిగతులు.. భారతదేశంలో అతడి నివాసం, చిరునామా, కుటుంబ వివరాలు, ఆస్తి వివరాలు, పాస్‌పోర్ట్ నంబరు, గడువు, వీసా నంబరు, గడువు, ఆధార్ కార్డు నెంబరు, విదేశీ రిజిస్ట్రేషను కార్డు, సోషల్ సెక్యూరిటీ నెంబరు. ►ఇండియాలోనే వివాహం జరగాలని, ఇక్కడి వివాహ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేయించుకోవాలని తెలియపర్చాలి. వివాహంలో ఫొటోలు తీయించుకోవాలి. ►స్థానికంగా ఉన్న వరుడి స్నేహితుల వివరాలు, వరుడు ఉంటున్న దేశంలో స్థిరపడిన కామన్ ఫ్రెండ్స్, బంధువుల సమాచారం, ఫోన్ నంబర్లు, ఈ– మెయిల్ వివరాలు తెలుసుకొని ఆ కాపీలను పెట్టుకోవాలి. ►మన న్యాయ చట్టాలతోపాటు పెళ్లయ్యాక భర్తతో ఏ దేశం వెళుతుందో ఆ దేశపు న్యాయ చట్టాలపై, తన హక్కులపై వధువుకి తప్పకుండా అవగాహన ఉండాలి. భర్త నుంచి హింస ఎదురైతే అక్కడి అధికారులను సంప్రదించాలి. ►వధువుకి సంబంధించిన హితులు, బంధువులు విదేశంలో ఉంటే వారి ఫోన్ నంబర్లు, తన భర్త పనిచేసే యజమాని వివరాలు, పోలీస్, అంబులెన్స్, ఇండియన్ ఎంబసీ వివరాలు, హై కమిషన్ వివరాలు తెలుసుకొని వారిని సంప్రదించాలి. పెళ్లయ్యాక విదేశం వెళ్తున్నప్పుడు ఇంటికి దగ్గర్లో ఉన్న బ్యాంక్‌లో వధువు పేర అకౌంట్ తెరిచి అందులో కొంత డబ్బు ఉంచాలి. ►వధువు తన పాస్‌పోర్ట్, వీసా, బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఆస్తి పత్రాలు, మ్యారేజి సర్టిఫికెట్, తన విద్యార్హతల సర్టిఫికెట్లు, ఇతర ముఖ్యమైన వివరాలను మూడు కాపీలుగా చేసి ఒకటి తన దగ్గర, ఇంకో కాపీ తల్లిదండ్రుల దగ్గర, మరొక కాపి విదేశంలో తను నమ్మదగ్గ స్నేహితుల దగ్గర పెట్టుకోవాలి. అలాగే భర్త వివరాలు, పాస్‌పోర్ట్, వీసా, ఆస్తి వివరాలు, డ్రైవింగ్ లైసెన్స్ నంబరు, సోషల్ సెక్యూరిటీ నంబరు, ఓటరు కార్డ్, ఎలీన్ రిజిస్ట్రేషన్ కార్డ్ మొదలైనవి ఫొటో కాపీ తీసి తన దగ్గర ఒకటి, తల్లిదండ్రుల దగ్గర ఒక కాపీ పెట్టాలి. ►పెళ్లి ద్వారా విదేశం వెళ్లి అక్కడ తను ఏదైనా ఉద్యోగం, వ్యాపారం లేదా ఉన్నత చదువులు చదువుకోవచ్చనే ఆలోచన, ఊహ, ఆశను మానుకోండి. అక్కడి వ్యవస్థలు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలపై పూర్తి అవగాహన లేకుండా తొందరపడి ఎన్ఆర్ఐతో పెళ్లికి ఒప్పుకోరాదు. ►తల్లిదండ్రులు సహా ఎవరి ఒత్తిడితోనూ ఎన్ఆర్ఐతో పెళ్లికి అంగీకరించకూడదు. ఎందుకంటే పెళ్లి పేరుతో అమ్మాయిలను తీసుకెళ్లి వ్యభిచార గృహాలకు, వెట్టి చాకిరీకి తరలిస్తున్న వ్యక్తులు మన కళ్లముందే ఉన్నారన్న సత్యాన్ని మరువద్దు. ఏ కొంచెం అనుమానం వచ్చినా వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలి. ►మ్యారేజ్ బ్యూరోలు, ఏజెంట్లు, మధ్యవర్తులను గుడ్డిగా నమ్మి మోసపోవద్దు. అవతలి వ్యక్తుల, కుటుంబ వివరాలను, మంచిచెడ్డలను స్వయంగా వాకబు చేసుకోవాలి. (తెలంగాణ ఎన్ఆర్ఐ సెల్) తెలంగాణ మైనారిటీస్ కమిషన్ చొరవ విదేశాల్లో గృహహింసను ఎదుర్కొంటున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన మహిళలకోసం తెలంగాణ రాష్ట్ర మైనారిటీస్ కమిషన్ హైదరబాద్‌లో కేసులు నమోదు చేసుకునే వెసులుబాటును కల్పిస్తోంది. బాధితులుగా స్వదేశానికి తిరిగి వచ్చిన మహిళలు తాము ఎదుర్కొన్న గృహహింసకు సంబంధించి నిందితుల మీద హైదరాబాద్ నుంచే కేసు ఫైల్ చేయొచ్చు. ఇక్కడి నుంచే కేసు దర్యాప్తు జరుగుతుంది. -
తెలుగు మహిళల కోసం ‘వేటా ’ ఏర్పాటు
-
తెలుగు మహిళల కోసం ‘వేటా ’ ఏర్పాటు
కాలిఫోర్నియా : ‘తెలుగు మహిళల కోట.. స్త్రీ ప్రగతి పథమే బాట’ అనే నినాదంతో కేవలం తెలుగు మహిళల కోసమే ఉత్తర అమెరికాలో తొలిసారిగా ఓ సంఘం ఏర్పాటైంది. మహిళ సాధికారతే లక్ష్యంగా తెలుగు నేలకు చెందిన ఝాన్సీ రెడ్డి హనుమాండ్ల ‘ఉమెన్ ఎంపవర్ మెంట్ తెలుగు అసోసియేషన్ (వేటా)’ అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ నగరంలో ఇండియన్ కమ్యూనిటీ సెంటర్లో నిర్వహించారు. ప్రముఖ కన్నడ సినీ హీరో అంబరీష్ సతీమణి, కర్ణాటక ఎంపీ సుమలత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వేటా ప్రెసిండెంట్, అడ్వయిజరీ కౌన్సిల్ చైర్ చైర్ ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ.. మహిళలకు అవకాశాలు కల్పించి వారిలో సృజనాత్మకతను పెంచి , వారి కలను సాకారం చేసుకోవాడాని ఈ సంస్థ తోడ్పతుందని పేర్కొన్నారు. ఈ సంఘం ద్వారా మహిళ నాయకత్వ శక్తిని ప్రంపచానికి చాటుదామని పిలుపునిచ్చారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న తెలుగు సంఘాలతో మహిళలకు న్యాయం జరగడం లేదని, అందుకే కొత్తగా కేవలం మహిళల కోసమే వేటాను ఏర్పాటు చేశామన్నారు. అనంతరం సినిమాల్లోను, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్న సుమలతకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని పలు కళాత్మక ప్రదర్శనలు చేశారు. సాయంత్రం జరిగిన బతుకమ్మ వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. -
ఎన్ఆర్ఐ మహిళలు మరింత సేఫ్
సాక్షి, హైదరాబాద్ : విదేశాల్లో వైవాహిక సమస్యలు ఎదుర్కొంటున్న మహిళలకు అన్ని రకాల సాయం అందించేందుకు విమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ విమెన్ సేఫ్టీ సెల్ విభాగం సిద్ధంగా ఉంటుందని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. బుధవారం లక్డీకాపూల్‌లోని విమెన్ సేఫ్టీ వింగ్‌లో ఎన్ఆర్ఐ విమెన్ సేఫ్టీ సెల్‌ను ఆయన ప్రారంభించారు. ఎన్ఆర్ఐ మహిళలకు ఎదురయ్యే కుటుంబ వేధింపుల పరిష్కారానికి ఎన్జీవోలు కూడా కలిసిరావాలని పిలుపునిచ్చారు. బాధితులకు న్యాయపరంగా సలహాలు, కౌన్సెలింగ్‌తోపాటు చట్టపరంగా ఈ విభాగం అన్ని రకాల సాయం అందిస్తుందని చెప్పారు. నిందితులకు శిక్షపడేలా, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటుందని వివరించారు. విమెన్ సేఫ్టీ వింగ్ చీఫ్, ఐజీ స్వాతి లక్రా మాట్లాడుతూ.. ఈ విభాగం ఎన్ఆర్ఐ బాధిత మహిళల కేసులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ దర్యాప్తు అధికారులకు తగిన ఆదేశాలు, సూచనలు ఇస్తుందని తెలిపారు. ఎన్ఆర్ఐ వివాహాల్లో ఎదురయ్యే సమస్యల పరిష్కారం, భారతీయులుగా వారికి ఉన్న హక్కులు, చట్టాలపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. దీనికోసం 14 దేశాల ఎంబసీలు, విదేశాంగ వ్యవహారాల శాఖతో అవగాహన కుదుర్చుకున్నామని వెల్లడించారు. డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వైజయంతి మాట్లాడుతూ.. కేసుల నమోదులో డాక్యుమెంటేషన్ చాలా కీలకమైనదని, ఈ విషయంలో తమ ప్రాసిక్యూటర్లు న్యాయసలహాలు అందజేస్తారని తెలిపారు. విమెన్ ప్రొటెక్షన్ సెల్, ఎస్పీ (సీఐడీ) సుమతి మాట్లాడుతూ.. ఈ విభాగం న్యాయనిపుణులతో బాధితులకు పూర్తి న్యాయం చేసేలా పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రీజినల్ పాస్‌పోర్ట్ అధికారి విష్ణువర్ధన్‌రెడ్డి, నీలా ఎన్జీవో ప్రతినిధి మమతా రఘువీర్, రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ త్రిపురాన వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నారై మహిళపై ఎమ్మెల్సీ ఫరూఖ్ దౌర్జన్యం
హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్ విచక్షణ కోల్పోయారు. అద్దె చెల్లించలేదని, ఇంటిని ఖాళీ చేయాలని కోరిన యజమానిపై చెప్పుతో దాడికి పాల్పడ్డారు. తీవ్ర పదజాలంతో దూషించారు. మహిళ అని కూడా చూడకుండా మెడ పట్టి ఇంటి నుంచి గెంటేయించారు. హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని స్కిల్ స్లె్పండర్ అపార్ట్మెంట్లో సోమవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. నగరానికి చెందిన అమ్తుల్ వసై, మహ్మద్ వసై భార్యభర్తలు. వీరు అమెరికాలోని న్యూయార్క్‌లో కుటుంబంతో నివసిస్తున్నారు. స్కిల్ స్లె్పండర్ అపార్ట్మెంట్లోని తమ ఫ్లాట్‌ను ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్‌కు అద్దెకు ఇచ్చారు. అయితే రెండేళ్లుగా ఫరూక్ ఫ్లాట్ అద్దె చెల్లించడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖాళీ చేయాల్సిందిగా ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోలేదని పేర్కొన్నారు. దీంతో ఫ్లాట్‌ను ఖాళీ చేయించేందుకు అమ్తుల్ వసై అమెరికా నుంచి నగరానికి వచ్చారు. ఉదయాన్నే తమ్ముడు మహ్మద్ ముజ్‌తుబాతో కలసి అమ్తుల్ వసై.. ఫరూఖ్ నివసిస్తున్న తమ ఫ్లాట్‌కు వెళ్లారు. ఇంట్లోకి వెళ్తూనే ముజ్‌తుమా ఫోన్లో వీడియా రికార్డింగ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా ఫ్లాట్ ఖాళీ చేయాలని రెండేళ్ల నుంచి కోరుతున్నా పట్టించుకోవడం లేదంటూ అమ్తుల్ గట్టిగా మాట్లాడటంతో ఫరూఖ్ విచక్షణ కోల్పోయారు. కాలిలోని చెప్పును తీసి అమ్తుల్ పైకి విసిరారు. దుర్భాషలాడుతూ, మెడ పట్టుకుని అక్కా తమ్ముడిని బయటకు గెంటేశారు. దీంతో బాధితురాలు న్యాయం చేయాలంటూ నాంపల్లి పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు ఎమ్మెల్సీపై పలు కేసులు నమోదు చేశారు. మహిళపై ఫరూక్ దుర్భాషలాడిన, దాడికి యత్నించిన వీడియోను పరిశీలించారు. మరోవైపు ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. నాపై వస్తున్న వార్తలన్నీ అబద్ధం: ఫరూక్ తనపై పలు టీవీ చానళ్లలో వచ్చిన వార్తలన్నీ అబద్ధమని ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్ చెప్పారు. తన ఇంటికి యూసఫ్ అలీ అనే వ్యక్తితో వచ్చిన మహిళ తనను పరుష పదజాలంతో దూషించిందని వివరించారు. ఆమె ఎవరో తనకు తెలియదని, ఇల్లు ఖాళీ చేయడం లేదంటూ తనను తిట్టడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆరేళ్ల క్రితం మహ్మద్ సమద్ అనే వ్యక్తితో ఇంటిని అద్దెకు తీసుకున్నానని చెప్పారు. నెలకు రూ.11,500 అద్దెకు ఒప్పందం కుదుర్చుకున్నానని, ప్రతీ నెల 5లోగా అద్దె చెల్లిస్తున్నాని వివరించారు. తనకు కబ్జాలు చేసే అలవాటు లేదని, కబ్జాలు చేసేవాడినైతే ఇప్పటికే సొంత ఇల్లు ఉండేదన్నారు. ఇల్లు ఖాళీ చేయమని తనకు ఎవరూ నోటీసు ఇవ్వలేదని, నోటీసు చూపిస్తే 24 గంటల్లో ఖాళీ చేస్తానన్నారు. మహిళలంటే తనకు ప్రత్యేక గౌరవం ఉందన్నారు. తనపై ఆరోపణలు చేస్తున్న మహిళ వెనక ఎవరో ఉన్నారనే అనుమానం కలుగుతోందన్నారు. -
ఎన్నారై మహిళపై ఎమ్మెల్సీ దాడి
-
కదులుతున్న రైలులో మహిళా ఎన్ఆర్ఐ..
సూరత్: గుజరాత్లో కదులుతున్న రైలులో ఓ ఎన్ఆర్ఐ మహిళ నిలువు దోపిడీకి గురైంది. ఆనంద్, నడియాద్ రైల్వే స్టేషన్ల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. బాధిత మహళ సూరత్ నుంచి సురేందర్‌నగర్ వస్తుండగా గుర్తుతెలియని దుండగులు ఆమెను అటకాయించి రూ 13.17 లక్షల విలువైన నగదు, ఆభరణాలను దోచుకున్నారు. ఈ పెనుగులాటలో స్వల్పంగా గాయపడ్డ మహిళను సూరత్‌లోని న్యూ సివిల్ ఆస్పత్రికి తరలించారు. లండన్‌లో నివసిస్తున్న వీణా దినేష్ దీపాలా ఓ వివాహానికి హాజరయ్యేందుకు జులై 17న భారత్ వచ్చారు. నగరంలోని సోదరి వద్ద ఉంటూ సురేందర్‌నగర్‌లో వివాహ కార్యక్రమానికి సోదరితో కలిసి వెళ్లారు. జామ్‌నగర్ -తిరునల్వేలి ఎక్స్‌ప్రెస్‌లో తిరుగు ప్రయాణమయ్యారు. రైలు నడియాద్ స్టేషన్ చేరుకున్న కొద్దిసేపటికి ఇద్దరు దుండగులు కోచ్‌లో ప్రవేశించి దీపాలాను కత్తులతో బెదిరించి ఆమె పర్సును బలవంతంగా లాక్కున్నారు. తర్వాతి స్టేషన్‌కు రైలు చేరుకునే సమయంలో దుండగులు పరారయ్యారు. పర్సులో ఇండియన్ కరెన్సీతో పాటు పౌండ్లు, ఆభరణాలు ఉన్నాయని బాధితురాలు పేర్కొన్నారు.చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేసినా తొలుత వారు సరిగ్గా స్పందించలేదని ఆమె చెప్పారు. -
ఎన్నారై మహిళలే అతడి టార్గెట్!
♦ పెళ్లి చేసుకుంటాడు.. డబ్బుతో ఉడాయిస్తాడు ♦ పెళ్లిళ్ల పేరుతో ఎన్ఆర్ఐలను మోసం చేస్తున్న గుంటూరువాసి అరెస్టు ♦ గతంలో భూ కబ్జా, సెటిల్మెంట్లు, బలవంతపు వసూలు కేసులు ♦ భారతీమాట్రిమోనీ.కామ్‌లో సంపన్న యువతులకు వల ♦ అమెరికాలో ప్రవాస భారతీయురాలిని పెళ్లాడి రూ.20 లక్షలతో ఉడాయింపు హైదరాబాద్: భూ కబ్జాలు ... భూ సెటిల్మెంట్ దందాలు చేశాడు... అది కుదరకపోవడంతో ఐఆర్ఎస్ అధికారినంటూ సినీ ప్రొడ్యూసర్లను బెదిరించాడు... చివరకు వ్యభిచార దందా నిర్వహించాడు. అయితే ఆశించినంత డబ్బులు రాకపోవడంతో ఈసారి ఎన్నారై మహిళలను టార్గెట్ చేసుకుని పెళ్లి మోసాలకు తెరలేపాడు. ఇందులో భాగంగానే భారతీమాట్రిమోనీ.కామ్‌లో తనకు పెళ్లికాలేదని, ఒంటరిగా ఉంటున్నానని, తల్లిదండ్రులు చనిపోయారని, అమెరికాకు బిజినెస్ పనిమీద వెళుతున్నాననే ప్రొఫైల్ అప్లోడ్ చేసి ఎన్నారై మహిళలను మోసగిస్తున్న గుంటూరుకు చెందిన కె.వెంకటరత్నరెడ్డిని నగర సైబర్ క్రైమ్ పోలీసులు గుంటూరులో శుక్రవారం అరెస్టు చేశారు. విడాకులు తీసుకొని అమెరికాలో ఉంటున్న తన అక్కకూతురికి భారతీమాట్రిమోని.కామ్‌లో నిందితుడి ప్రొఫైల్ చూసి నచ్చి పెళ్లి చేసుకుందని, 20 రోజులు కాగానే అతను భారత్‌లో అత్యవసర పని ఉందని రూ.20 లక్షలు తీసుకొని వచ్చి ఆ తర్వాత పత్తా లేకుండా పోయాడని బాధితురాలి మేనమామ రాజశేఖర్‌రెడ్డి ఈ నెల 10న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ప్రొఫైల్‌ను ఇంటర్నెట్లో సెర్చ్ చేయగా అతడో నేరగాడని, అతడికి తల్లితో పాటు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నట్లు తెలిసిందన్నారు. పథకం ప్రకారం పట్టేసుకున్నారు... బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సైబర్ పోలీసులు నిందితుడి సెల్‌ఫోన్ నంబర్లు, పాత సెల్ నంబర్లతో పాటు అతడి ఫేస్బుక్ ఖాతాలు, ఠాణాల్లో అతడిపై ఉన్న కేసులను పరిశీలించారు. సెల్‌ఫోన్ లోకేషన్ టవర్ల ఆధారంగా గుంటూరులో ఉన్నట్లు తెలుసుకుని శుక్రవారం ఉదయం అతడిని అరెస్టు చేసి నగరానికి తీసుకొచ్చారు. ఈ ఏడాది మేలో విశాఖ పాస్‌పోర్టు ప్రాంతీయ కార్యాలయం నుంచి అతడికి పాస్‌పోర్టు వచ్చిందని, నేరచరిత ఉన్నా ట్రాక్ రికార్డును పరిశీలించకుండానే ఎస్బీ అధికారులు పాస్‌పోర్టు ఎలా జారీ చేశారన్న దానిపై వారిని వివరణ కోరనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మరో ఇద్దరికి గాలం నిందితుడు అమెరికాలోనే మేరీ అనే మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. ఈమెను వివాహం చేసుకునేందుకు అమెరికా వెళ్లిన రామ వెంకట్‌కు మరో ప్రవాస భారతీయురాలు(బాధితురాలు) వలలో పడింది. దీంతో మేరీని తర్వాత పెళ్లి చేసుకుందామని ఇప్పటికే సర్టిఫికెట్ తీసుకున్నాడు. కెనడా అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు మరో నాలుగు రోజుల్లో అక్కడికి వెళుతున్నట్లు నిందితుడు పోలీసులకు విచారణలో తెలిపాడు. ఇప్పటికే ట్రావెల్ ఏజెంట్‌తో మాట్లాడిన అతడు అంతా రెడీ చేసుకున్నాడు. నిందితుడి బ్యాంక్ ఖాతాలో రూ.4 వేల అమెరికా డాలర్లు ఉన్నాయని, వాటిని సీజ్ చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అతడి ఫేస్బుక్ ఖాతాలో 300 మంది అమ్మాయిలు ఉన్నారని, ఇతని వలలో పడి ఎవరైనా మోసపోయారనే దిశగా విచారణ చేపట్టామన్నారు. ఐదు రోజుల కస్టడీకి తీసుకొని మరిన్ని వివరాలు రాబడతామని తెలిపారు. హైదరాబాద్‌లో ఏడు... గుంటూరులో రెండు కేసులు డిగ్రీ కూడా పూర్తి చేయని వెంకట రత్నరెడ్డి ఉద్యోగం దొరకకపోవడంతో తన స్నేహితులతో కలిసి భవన శిథిలాల తొలగింపు వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. అరుుతే అందులో నష్టాలు రావడంతో సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ప్రజలను మోసగించాలని పథకం రచించాడు. ఇందులో భాగంగానే ఐఆఎర్ఎస్ అధికారిగా అవతారమెత్తి సినీ ప్రొడ్యూసర్‌తో పాటు ఇతరులను బెదిరించి డబ్బులు వసూలు చేయబోయిన కేసులో బంజారాహిల్స్, ఎస్ఆర్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. జూబ్లీహిల్స్‌లో వ్యభిచార దందా నిర్వహిస్తూ దొరికిపోయాడు. గుంటూరులో పక్కింటి వారి సంత్రో కారును కూడా దొంగిలించాడు. డమ్మీ తుపాకీతో ఓ బ్యాంక్ అధికారిని బెదిరించిన కేసుతో సహా ఇప్పటివరకు అతనిపై హైదరాబాద్‌లో ఏడు, గుంటూరులో రెండు కేసులు నమోదై ఉన్నాయి. -
ప్రియుడి కోసం అమెరికా నుంచి బెజవాడకు
విజయవాడ: ఓ ఎన్నారై యువతి విజయవాడలో ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే భర్తను కాదని మానస అనే యువతి ప్రియుడి కోసం విజయవాడకు వచ్చింది. తీరా ఆమె విజయవాడ వచ్చాక ప్రియుడు హేమంత్ రెడ్డి పత్తా లేకుండా పోయాడు. అతడి కోసం ఫోన్ చేసిన ఫలితం లేకపోవడంతో మానస బంధువుల ఇంట్లో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ విషయాన్ని గమనించిన బంధువులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా హేమంత్ కోసం ఫోన్ చేస్తే వాళ్ల కుటుంబసభ్యుడు కట్నం కోసం డిమాండ్ చేస్తున్నారని మానస ఆరోపించింది. మరోవైపు ఆమె తల్లిదండ్రులు ఆమెను ఇంటికి వచ్చేందుకు అనుమతించడం లేదు. వివరాల్లోకి వెళితే... కృష్ణా జిల్లా మైలవరానికి చెందిన మానస చిన్ననాటి స్నేహితుడైన హేమంత్ రెడ్డి ప్రేమించుకున్నారు. కొన్ని కారణాల వల్ల ఓ ఎన్నారైని గత డిసెంబర్లో పెళ్లి చేసుకుంది. మానస అమెరికాకు వెళ్లినప్పటి నుంచి హేమంత్ పెళ్లి చేసుకుంటానని ఫోన్లో చెప్పాడు. ప్రియుడితో కలిసి జీవించాలనుకున్న మానస విషయాన్ని భర్తకు చెప్పి...హేమంత్ కోసం అమెరికా నుంచి విజయవాడకు వచ్చింది. ఈలోగా...హేమంత్ రెడ్డి కనిపించకుండా పోవడంతో... తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లింది. వాళ్లు ఇంట్లోకి రావద్దని చెప్పడంతో బంధువుల ఇంట్లో చేరింది. అక్కడ ఉంటూనే ప్రియుడిని కలిసేందుకు ప్రయత్నించింది. ఎంతకీ ఫోన్ కలవకపోవడంతో..హేమంత్ ఇంటికి ఫోన్ చేసింది. వాళ్లు కట్నం డిమాండ్ చేయడంతో ..వేరే దారి లేక నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. మానస పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భర్తను వదిలి వచ్చిన మానసను కట్నం పేరుతో మోసం చేయడం సరైన పద్దతి కాదంటున్నారు బంధువులు. ఎలాగైనా పోలీసులే మానసకు న్యాయం చేయాలని కోరుతున్నారు. -
కూతుర్ని గన్‌తో కాల్చి చంపిన ఎన్నారై సుజాత
అమెరికా ఫ్లోరిడాలోని ఓర్లాండోలో తెలుగు విద్యార్థిని కన్నతల్లి చేతిలోనే దారుణ హత్యకు గురైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుంటూరు జిల్లాకు చెందిన గూడూరు సుజాత... తన 17 ఏళ్ల కుమార్తె చేతనను గన్ తో కాల్చివేసింది. కన్న కూతురిని కాల్చి చంపి, అనంతరం ఆమె కూడా గుండెలపై కాల్చుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. అంతకు ముందు సుజాత...హత్య...ఆత్మహత్య విషయాన్ని తన సోదరుడు చిత్తలూరి ప్రసాద్‌కి ఈ మెయిల్ చేసింది. దాంతో అతడు హుటాహుటిన ఫ్లోరిడా చేరుకున్నాడు. అప్పటికే తల్లీ కూతుళ్లిద్దరూ రక్తపు మడుగులో పడి ఉన్నారు. అక్కడకు చేరుకున్న అతనికి చేతన మృతి చెందగా, సుజాత తీవ్రంగా గాయపడి కనిపించటంతో పోలీసులకు సమాచారం అందించాడు. సుజాత ఇంకా ప్రాణాలతో ఉండటంతో ఆమెను చికిత్స నిమిత్తం ఓర్లాండో రీజినల్ మెడికల్ సెంటర్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. హత్య, ఆత్మహత్య ఘటనకు కుటుంబ కలహాలే కారణమని పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సంఘటన జరిగినప్పుడు సుజాత భర్త రావు గూడూరు అక్కడ లేరు. ఆయన అట్లాంటా వెళ్లి అక్కడినుంచి తిరిగొస్తున్నారు. కాగా ఈ దుర్ఘటన ఆకస్మికంగా జరిగింది కాదని... సుజాత ఈనెల 2వ తేదీనే గన్ కొన్నారని, పథకం ప్రకారమే ఈ హత్య జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. సుజాత కోలుకున్నాక...ఆమెను విచారిస్తామని తెలిపారు. దుర్ఘటన జరిగే సమయానికి చేతన నాయనమ్మ ఇంట్లోనే ఉన్నా..ఆమె నిద్రపోతున్నారని తెలుస్తోంది. తాను చనిపోవాలని నిర్ణయించుకున్నానని, తాను మరణించాక ఇక కూతుర్ని చూసుకునేవారు ఎవరూ లేరు కాబట్టి ఆమెను కూడా చంపేస్తున్నానని సుజాత తన సోదరుడికి రాసిన ఈ మెయిల్ సందేశంలో పేర్కొన్నారు. మరోవైపు చేతన మరణ వార్త విని ఓర్లాండోలోని సెమినోల్ హైస్కూల్లోని ఆమె సహ విద్యార్థులు తీవ్ర దిగ్ర్బాంతికి గురయ్యారు. చేతన క్లాస్‌లో అందరినీ అబ్బురపరచే తెలివైన విద్యార్థి అని , చదువు తప్ప మరో ధ్యాస లేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఏ ప్రశ్న అడిగినా వెంటనే సమాధానం చెప్పగల సమర్థురాలని తెలిపారు. అమెరికా అధ్యక్షుడిని కలిసే అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థుల బృందంలో ఈమె కూడా ఒకరు. ఆరేళ్లుగా ఈ కుటుంబం ఓర్లాండోలో ఉంటోంది. సంచలనం రేపిన ఈ దారుణ సంఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.