బెంగళూరు: చైనా సహా పలు దేశాల్లో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న తరుణంలో భారత్ అప్రమత్తమైంది. కోవిడ్ కేసులపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు సూచించింది. దేశంలో కోవిడ్ నాలుగో వేవ్ వస్తుందనే భయాందోళనలు నెలకొన్నాయి. పండగలు, కొత్త ఏడాది వేడుకల నేపథ్యంలో కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి.
కరోనా నాలుగో వేవ్ భయాలు పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాస్కును తప్పనిసరి చేస్తున్నట్లు ప్రకటించింది. సినిమా థియేటర్లు, పాఠశాలలు, కళాశాలల్లో మాస్కులు తప్పనిసరి చేసింది. న్యూఇయర్ వేడుకల్లో పబ్‌లు, రెస్టారెంట్లు, బార్లలో మాస్కు తప్పనిసరిగా ధరించాల్సిందేనని కర్ణాటక ఆరోగ్య మంత్రి కే సుధాకర్ స్పష్టం చేశారు. నూతన సంవత్సర వేడుకలకు అర్ధరాత్రి 1 గంటల వరకే అనుమతి ఉంటుందని తెలిపారు. కరోనాపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గర్భిణీ మహిళలు, పిల్లలు, వృద్ధులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాలకు వెళ్లకూడదని కోరారు.
యూపీలో అలర్ట్..
ఉన్నావ్‌కు చెందిన ఓ యువకుడికి కరోనా పాజిటివ్‌గా తేలిన క్రమంలో ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. అయితే, ప్రస్తుతం ఆ యువకుడు దుబాయ్ వెళ్లాడు. అంతకు ముందే పరీక్షలు చేసుకోగా ప్రస్తుతం పాజిటివ్‌గా తేలింది. అతడి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించనున్నట్లు అధికారులు తెలిపారు. అతడి కుటుంబ సభ్యులతో పాటు 20 మంది నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించారు. చైనా నుంచి వచ్చిన 40 ఏళ్ల వ్యక్తికి పాజిటివ్‌గా తేలిన మరుసటి రోజునే ఈ విషయం బయటపడటం కలకలం సృష్టిస్తోంది. ఈ క్రమంలో ఆసుపత్రి పరిసరాల్లో మాస్కులను తప్పనిసరి చేసినట్లు డిప్యూటీ సీఎం బ్రజేశ్ పాఠక్ వెల్లడించారు. రద్దీ ప్రాంతాల్లో మాస్కు ధరించాలని కోరారు.
ఇదీ చదవండి: చైనాలో శవాల గుట్టలు.. శ్మశానాల ముందు మృతదేహాలతో పడిగాపులు!
Comments
Please login to add a commentAdd a comment