సాక్షి, హైదరాబాద్: అన్ని ఆసుపత్రుల్లో వైద్య సేవలకు ఎలాంటి ఆటంకం లేకుండా లైన్ క్లియర్ చేస్తూ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. చికిత్స అందించే వైద్య సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రొటోకాల్స్‌ను వివరిస్తూ అనేక సూచనలు చేసింది. కరోనా కారణంగా లాక్‌డౌన్ కాలంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో కేవలం అత్యవసర వైద్య సేవలు మాత్రమే అందుతున్నాయి. వాటిల్లో సాధారణ వైద్య సేవలు నిలిచిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రులు సహకరించకపోవడంతో వైద్యం అందక ఓ గర్భిణీ ఇటీవల చనిపోయింది. అనేక ప్రైవేటు ఆసుపత్రుల్లో అత్యవసర సేవలు చేయడానికి కూడా వైద్యులు భయపడుతున్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతుందన్న ఆందోళనే దీనికి కారణం. చదవండి: 21దాకా లాక్‌డౌన్..?
కొన్ని జిల్లాల్లో ప్రైవేటు ఆసుపత్రులు తెరిస్తే అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. సాధారణ వైద్య సేవలను నిలిపేయొద్దని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ పదేపదే చెబుతున్నా చాలాచోట్ల అమలు కావడంలేదు. ఈ అంశంపై కొంత గందరగోళం నెలకొంది. ఒకవైపు ఆసుపత్రుల యాజమాన్యాలు భయాందోళనలు వ్యక్తం చేస్తుంటే, కొన్నిచోట్ల తెరవాలంటే జిల్లా అధికారుల నుంచి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అందరిలోనూ కరోనా భయమే నెలకొని ఉంది. ఈ నేపథ్యం లోనే కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వైద్య సిబ్బందికి భరోసానిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. ఆసుపత్రుల్లో సాధారణ వైద్య సేవలను పునరుద్ధరించేలా ఈ మార్గదర్శకాలిచ్చారు. కరోనా చికిత్స చేసే బ్లాకులున్న ఆసుపత్రులతో పాటు, కరోనాతో సంబంధం లేని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు ఇవి వర్తిస్తాయి.
ఆ ఆస్పత్రుల్లో ప్రత్యేక ద్వారం...
ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో గాంధీ ఆసుపత్రిలో కరోనా చికిత్స అందిస్తున్నారు. గచ్చిబౌలిలో టిమ్స్ ఆసుపత్రిని కరోనా కోసమే కేటాయించారు. అయితే మున్ముందు కేసులు పెరిగే పరిస్థితి ఉంటే, జిల్లా స్థాయి వరకు అన్ని రకాల ఆసుపత్రుల్లోనూ కరోనా చికిత్స కోసం ప్రత్యేకంగా ఒక బ్లాక్‌ను సిద్ధం చేసే అవకాశాలున్నాయి. అటువంటి చోట్ల సాధారణ చికిత్స చేసే వైద్య సిబ్బంది కూడా భయాందోళనకు గురయ్యే ప్రమాదముంది. అలాగే ప్రైవేటు ఆసుపత్రులకు కూడా సాధారణ రోగులతోపాటు కరోనా అనుమానితులు కూడా వచ్చే అవకాశముంది. కాబట్టి అన్ని ఆసుపత్రులు కూడా కరోనా లక్షణాలతో, ఫ్లూ లక్షణాలతో వచ్చే వారి కోసం ప్రత్యేక ద్వారాన్ని తెరవాలి. వారిని ప్రత్యేక బ్లాక్‌లలో పరీక్షించాలి. ఆయా ఆసుపత్రుల్లో ఉండే ఏఏ విభాగాలు ఏ స్థాయిలో రిస్క్‌లో ఉంటాయో, వైద్య సిబ్బంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.
►కరోనా బ్లాక్ ఉన్న సాధారణ ఆసుపత్రిలో ఔట్‌పేషెంట్ (ఓపీ) విభాగాన్ని తేలికపాటి రిస్క్‌గా గుర్తించారు. అటువంటి చోట హెల్ప్ డెస్క్‌లో పనిచేసే సిబ్బంది భౌతిక దూరం పాటించాలి. అలాగే మూడు లేయర్ల మెడికల్ మాస్క్, గ్లోవ్స్ ధరించాలి.
►డాక్టర్ చాంబర్‌లో రోగులను పరీక్షించే ప్రాంతాన్ని తేలికపాటి రిస్క్‌గానే గుర్తించారు. అప్పుడు డాక్టర్లు కూడా మూడు లేయర్ల మాస్క్, గ్లోవ్స్ ధరించాలి.
►ఈఎన్‌టీ, డెంటల్ చికిత్సకు సంబంధించి డాక్టర్ల చాంబర్లు మధ్యస్థ రిస్క్‌లో ఉన్నాయి. ఎన్–95 మాస్క్‌లు, గాగుల్స్, గ్లోవ్స్, ఫేస్ షీల్డ్ ధరించాలి.
►ప్రీ అనెస్థీటిక్ చెకప్ చేసే ప్రాంతం కూడా మధ్యస్థ రిస్క్‌లో ఉంటుంది. డాక్టర్లు తప్పనిసరిగా ఎన్–95 మాస్క్‌లు, గాగుల్స్, గ్లోవ్స్ ధరించాలి.
►ఫార్మసీ కౌంటర్‌లో మందులు సరఫరా చేసే ప్రాంతం కూడా మధ్యస్థ రిస్క్‌లో ఉంటుంది. అందులో పనిచేసేవారు మూడు లేయర్ల మాస్క్, గ్లోవ్స్ ధరించాలి.
►అలాగే శానిటరీ సిబ్బంది తరచుగా ఆసుపత్రులను శుభ్రం చేస్తుంటారు. వారు తేలికపాటి రిస్క్‌లో ఉంటారు. అటువంటివారు మూడు లేయర్ల మాస్క్, గ్లోవ్స్ ధరించాలి.
ఇన్‌పేషెంట్ విభాగంలో...
►వార్డులు, వ్యక్తిగత రూంలలో ఉండే రోగులను చూసే వైద్య సిబ్బంది తేలికపాటి రిస్క్‌లో ఉంటారు. వారు తప్పనిసరిగా మూడు లేయర్ల మెడికల్ మాస్క్, గ్లోవ్స్ ధరించాలి.
►ఐసీయూ/క్రిటికల్ కేర్‌లలో ఉండే రోగులను చూడటం మధ్యస్థ రిస్క్‌గా గుర్తించారు. వారు ఎన్–95 మాస్క్‌లు, గాగుల్స్, గ్లోవ్స్, ఫేస్ షీల్డ్ ధరించాలి.
►వార్డు/ఐసీయూ/క్రిటికల్ కేర్‌లలో చనిపోయిన (కరోనాతో సంబంధం లేని) వారి మృతదేహాన్ని మార్చురీ నుంచి తరలించడం తక్కువ రిస్క్‌గానే పరిగణించారు. అప్పుడు మూడు లేయర్ల మెడికల్ మాస్క్, గ్లోవ్స్ ధరించాలి.
►ఆపరేషన్ థియేటర్‌లో శస్త్రచికిత్స చేయడం మధ్యస్థ రిస్క్‌గా గుర్తించారు. అప్పుడు వైద్య సిబ్బంది మూడు లేయర్ల మాస్క్‌లు, ఫేస్ షీల్డ్, గ్లోవ్స్ ధరించాలి.
నాన్ కరోనా ఎమర్జెన్సీ విభాగంలో..
►ఎమర్జెన్సీ కేసులను పరీక్షించేటప్పుడు వైద్యులు, ఇతర సిబ్బంది తేలికపాటి రిస్క్‌లోనే ఉంటారు. అప్పుడు మూడు లేయర్ల మాస్క్, గ్లోవ్స్ ధరించాలి.
►సీరియస్ రోగిని పరీక్షించడం మాత్రం హైరిస్క్ కిందే లెక్క. కాబట్టి పూర్తిస్థాయి పీపీఈ కిట్ వాడాలి. అంటే ఎన్–95 మాస్క్, కవరాల్, గాగుల్స్, నైట్రేల్ ఎగ్జామినేషన్ గ్లోవ్స్, షూ కవర్లు వాడాలి.
ఇతర సేవల్లో ఉన్నప్పుడు..
►లేబరేటరీలో శాంపిళ్ల కలెక్షన్, పరీక్ష చేయడం, రేడియో డయాగ్నసిస్, బ్లడ్ బ్యాంకుల్లో సేవలు అందించడం, లాండ్రీ సర్వీసుల్లో ఉన్నవారు తేలికపాటి రిస్క్‌లోనే ఉంటారు. మూడు లేయర్ల మాస్క్‌లు, గ్లోవ్స్ ధరిస్తే చాలు.
►కిచెన్, ఇంజనీరింగ్ సర్వీసెస్, పరిపాలనా ఆర్థిక విభాగాల్లో పనిచేసేవారు తక్కువ రిస్క్‌లోనే ఉన్నట్లు లెక్క. వారు ఫేస్ కవర్ ఉపయోగిస్తే చాలు.
►ఇక అంబులెన్సుల్లో వెంటిలేషన్ లేకుండా రోగులను తరలించడం తక్కువ రిస్క్‌గానే పరిగణిస్తారు. అప్పుడు సిబ్బంది మూడు లేయర్ల మాస్క్‌లు, గ్లోవ్స్ ధరిస్తే చాలు. అలాగే అంబులెన్స్ డ్రైవర్‌కు కూడా ఇదే వర్తిస్తుంది.
►తీవ్రమైన శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడే రోగులను అంబులెన్స్‌లలో తరలించడం హైరిస్క్‌గానే పరిగణిస్తారు. అప్పుడు సిబ్బంది పూర్తిస్థాయి పీపీఈ కిట్ వాడాలి. అంటే ఎన్–95 మాస్క్, కవరాల్, గాగుల్స్, గ్లోవ్స్, షూ కవర్ తప్పక ఉపయోగించాలి.
Comments
Please login to add a commentAdd a comment