పాఠశాలలకు దిక్సూచి.. ఎస్‌ఎంసీ
-
కమిటీల ఎన్నికకు మార్గదర్శకాలు జారీ
-
ఆగస్టు 1 నుంచి 10లోగా ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు
విద్యారణ్యపురి : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ(ఎస్‌ఎంసీ)లకు ఈఏడాది ఆగస్టు 1 నుంచి 10లోగా ఎన్నికలు నిర్వహించాలని పాఠశాలల ప్రధానోపా«ధ్యాయులను ఆదేశాలు అందాయి. ఈమేరకు ఎంఈఓలకు సైతం మార్గదర్శకాలు అందాయి. విద్యాహక్కు చట్టం అమలులో భాగంగా పాఠశాలల నిర్వహణను పర్యవేక్షించేందుకుగానూ ఎస్‌ఎంసీలను ఏర్పాటు చేస్తారు.
బడులకు వచ్చే నిధుల వినియోగంపై ఇవి నిరంతరం పర్యవేక్షణ జరుపుతుంటాయి. కేవలం ప్రభుత్వ పాఠశాలలే కాకుండా, ప్రభుత్వ ఆర్థికసాయంతో నడిచే బడులు కూడా ఈ కమిటీలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. వీటి ద్వారా ప్రతినెలా సమీక్ష సమావేశాలు నిర్వహించి, పాఠశాలల నిర్వహణపై చర్చించాల్సి ఉంటుంది. కనీసం ప్రతి రెండు నెలలకోసారి ఇవి సమావేశం కావాలని నిబంధనలు చెబుతున్నాయి. విద్యాసంవత్సరం ఆరంభంలో, ముగింపులోనూ పాఠశాల విద్యార్థుల పురోగతిపై సమీక్షించాల్సిన బాధ్యత వాటిపై ఉంటుంది.
ప్రతి పాఠశాలకు ఓ కమిటీ..
జిల్లాలో 2049 ప్రాథమిక పాఠశాలలు, 360 యూపీఎస్‌లు, 510 హైస్కూళ్లు ఉన్నాయి. హైస్కూళ్లలో కేవలం 6 నుంచి 8వతరగతులకే ఎస్‌ఎంసీలను ఎన్నుకుంటారు. ప్రతి పాఠశాలకు ఒక ఎస్‌ఎంసీ కమిటీ ఉంటుంది. జిల్లాలోని 46 కేజీబీవీలు, 30 మోడల్æస్కూళ్లలో, ఎయిడెడ్ పాఠశాలల్లోనూ కమిటీల ఎన్నికలు జరుపుతారు. ప్రతి మండలంలోనూ ఈ ఎన్నిక ప్రక్రియను ఎంఈఓలు పర్యవేక్షిస్తారు. వీరితో పాటు సర్వ శిక్షా అభియాన్ జిల్లా ప్రాజెక్టు అధికారి, సెక్టోరియల్ ఆఫీసర్లు కమిటీల ఎన్నికపై ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తారు.
సభ్యుల సంఖ్య..
జిల్లాలోని ప్రాథమిక పాఠశాలలకు ఒకటో తరగతి నుంచి 5వతరగతి వరకు 15 మంది, యూపీఎస్‌లలో 1వతరగతి నుంచి 7వతరగతి వరకు 21 మందిని కమిటీ సభ్యులుగా ఎన్నుకుంటారు. మరికొన్ని యూపీఎస్‌లలో 1వతరగతి నుంచి 8వతరగతి వరకు ఉన్నచోట్లలో 24 మందిని, ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి 8వ తరగతి వరకు 9 మందిని కమిటీ సభ్యులుగా ఎన్నుకుంటారు. ప్రతి తరగతికి విడివిడిగా ఎన్నికలు జరుపుతారు.Sముగ్గురు సభ్యుల్లో ఇద్దరు మహిళలు ఉండాలి. ప్రతి పాఠశాలలో 15 మంది సభ్యులు ఎన్నికైతే వారిలో 10 మంది మహిళలు, ఐదుగురు పురుషులు ఉండాలి.
ఎక్స్ అఫీషియో సభ్యులుగా వీరే..
ఎస్‌ఎంసీలలోని ఎక్స్ అఫీషియో సభ్యులుగా హెచ్‌ఎంలు లేదా ఇన్‌చార్జి హెచ్‌ఎంలు మెంబర్ కన్వీనర్‌గా ఉంటారు. ఒక ఉపాధ్యాయుడు లేదా ఉపాధ్యాయురాలిని ఎంఈఓ నామినేట్ చేయవచ్చు. స్థానిక కార్పొరేటర్, కౌన్సిలర్, వార్డుమెంబర్‌లు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉంటారు. పాఠశాల పరిసరాల్లోని అంగన్‌వాడీ కార్యకర్త, ఏఎన్‌ఎం, మహిళా సమాఖ్య అధ్యక్షులు కూడా కమిటీలో ఉంటారు. మరో ఇద్దరు కో ఆప్డెడ్ సభ్యులను ఎస్‌ఎంసీ ఎన్నుకుంటుంది.
ఎన్నికల విధానమిదీ..
ప్రధానోపాధ్యాయులు పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేయాలి. ప్రతి తరగతి సెక్షన్, మీడియం కలిపి ఓ తరగతిగా పరిగణించాలి. ఉన్నత పాఠశాలల్లోని 6 నుంచి 8వతరగతి వరకు మాత్రమే ఎస్‌ఎంసీని ఎన్నుకోవాలి. ప్రతి తరగతి నుంచి ముగ్గురు విద్యార్థుల తల్లిదండ్రులను సభ్యులుగా ఎన్నుకుంటారు. ఎన్నికైన వారి నుంచి ఒకరిని అధ్యక్షుడిగా మరొకరిని ఉపాధ్యక్షులుగా ఎంపిక చేస్తారు. వీరిలో ఒకరు బలహీనవర్గాలు లేదా అణగారిన వర్గాలకు చెందినవారై ఉండాలి. అధ్యక్షుడు లేదా ఉపాధ్యక్షుడిలో ఒక మహిళ తప్పనిసరిగా ఉండాలి. ఒక తరగతిలో ఇద్దరు మహిళా సభ్యులను ఎన్నుకోవాలి.
ఏదైనా తరగతిలో ఆరుకంటే తక్కువ మంది విద్యార్థులుంటే దానిని తక్కువ సంఖ్యగల దిగువకు లేదా ఎగువ తరగతిలో కలిపి ఎన్నిక జరపాలి. ఎన్నిక చేతులెత్తే పద్ధతి, మూజువాణి ద్వారా నిర్వహించాలి. అసాధారణ పరిస్థితుల్లోనే రహస్య బాలెట్ పద్ధతిని పాటించాలి. ఎస్‌ఎంసీ ఎన్నికకు కనీసం 50 శాతం విద్యార్థుల తల్లిదండ్రులు హాజరుకావాలి. సభ్యుల పదవీకాలం 2 సంవత్సరాల పాటు ఉంటుంది. లేదా విద్యార్థి పాఠశాలను విడిచేవరకు ఉంటుంది. సర్పంచ్, మున్సిపల్ చైర్‌పర్సన్, మేయర్ ఏదైనా సమావేశానికి హాజరుకావచ్చు. సభ్యులు, అధ్యక్షులు, ఉపాధ్యక్షులు ఎన్నికల వివరాలను సమావేశ నిర్వహణపై మినిట్స్‌ను విధిగా ప్రధానోపాధ్యాయుడు రికార్డు చేయాలి.