SMC committee
-
తల్లిదండ్రుల ఓటు ఇంగ్లిష్ మీడియానికే
పేద పిల్లలు ఉన్నత విద్య అభ్యసించాలని, ప్రపంచంతో పోటీపడాలని ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెడితే ప్రతిపక్షాలు అడ్డుకోవడం తగదని పలు ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. సాక్షి, అమరావతి : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లలు భవిష్యత్తులో ప్రపంచ స్థాయి పోటీని దీటుగా ఎదుర్కొనేలా ఆంగ్ల మాధ్యమంలో విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలకు తల్లిదండ్రులందరూ మద్దతు పలుకుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం 1 నుంచి 6వ తరగతి వరకు.. ఆ పై సంవత్సరాల్లో వరుసగా ఇతర తరగతుల్లో ఆంగ్ల మాధ్యమాన్ని అమ లు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించారు. ఈ మేరకు రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీలు తమ స్కూళ్లలో పిల్లలకు ఆంగ్ల మాధ్యమం ద్వారా విద్యనందించాలని తీర్మానాలు చేసి పంపించాయి. విచిత్రం ఏమిటంటే ప్రయివేటు, కార్పొరేట్ పాఠశాలల్లో పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలోనే బోధన సాగు తోంది. తెలుగు మాధ్యమం ఆప్షన్ వారి దరఖాస్తు ఫారాల్లో ఉండదు. తెలుగును పూర్తిగా విస్మరించిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. తెలుగు సబ్జెక్టును ప్రభుత్వం నిర్దేశించిన పాఠ్యపుస్తకాల ప్రకారం కాకుండా తమ వర్క్ పుస్తకా ల ద్వారా ప్రశ్నలు, జవాబులను బట్టీ పట్టిస్తున్నాయి. బడుగులకు ఇంగ్లిష్ మీడియం వద్దా? ► ప్రభుత్వ పాఠశాలల్లో దిగువ మధ్య తరగతి, పేద, బడుగు, బలహీన విద్యార్థులు ఎక్కువగా చదువుకుంటున్నారు. వారందరికీ ఇంగ్లిష్ మీడియంలో విద్యను అందించడానికి, నాణ్యమైన చదువు చెప్పించడానికి వైఎస్ జగన్ప్రభుత్వం నిర్ణయాలు తీసుకొని వేగంగా అడుగులు వేసింది. ► ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడుతూ జీవోలు జారీ చేసింది. ప్రభుత్వం సమున్నత లక్ష్యంతో, సామాజిక బాధ్యతతో ఈ నిర్ణయం తీసుకుందని బడుగు, బలహీన వర్గాల నుంచి విశేష స్పందన వచ్చింది. ► సమాజంలోని అన్ని వర్గాలు.. ఇంగ్లిష్ మీడియం పెట్టాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాయి. ప్రభుత్వానికి మంచి పేరు రావడాన్ని జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా.. ‘మాతృ భాష పరిరక్షణ’ పేరుతో పలు రూపాల్లో అడ్డుతగలడం ప్రారంభించాయి. ► ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టినా, తెలుగు తప్పనిసరి సబ్జెక్టుగా ఉంటుందని.. మాతృభాషకు ఇబ్బంది రానివ్వమని ప్రభుత్వం ఎంత చెప్పినా వారి చెవికెక్కలేదు. ► ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడాన్ని ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మొదలు, ఆ పార్టీ నాయకులంతా వ్యతిరేకించారు. ఏదో రకంగా అడ్డుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించారు. న్యాయ స్థానాలను ఆశ్రయించి, ప్రభుత్వ నిర్ణయాలు అమలు కాకుండా అడ్డుకున్నారు. ఆహ్వానించిన టీచర్ల సంఘాలు ► రాష్ట్రంలోని మెజారిటీ ఉపాధ్యాయ సంఘాలు ఆంగ్ల మాధ్యమం విషయంలో ప్రభుత్వానికి మద్దతుగా నిలిచాయి. బడుగు, బలహీన వర్గాలకు నాణ్యమైన విద్య అందించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాయి. ఇంగ్లిష్ మీడియం బోధనకు సిద్ధం ► ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగును మరింత పరిపుష్టం చేసేలా తప్పనిసరి చేస్తూ ఆ పాఠ్యపుస్తకాలను మరింత పటిష్టమైన రీతిలో రూపొందించింది. ► టీచర్లకు ఆంగ్ల మాధ్యమ నైపుణ్యం కోసం శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తే సెలవుల్లో సైతం సంతోషంగా హాజరయ్యారు. శిక్షణ లో నేర్చుకున్న అంశాల తర్వాత వారి లో మరింత ఉత్సాహం, ఆత్మ విశ్వాసం పెరిగింది. ► ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్‌తో ప్రభుత్వ స్కూళ్లు మూతపడి ఉన్నప్పటికీ వారంతా ప్రభుత్వం నిర్దేశించిన మేరకు బోధ్ శిక్షా లోకమ్ యాప్ ద్వారా ఆంగ్ల మాధ్యమ బోధనా నైపుణ్యాలు పెంపొందించుకోవడంలో నిమగ్నమయ్యా రు. స్కూళ్లు తెరవగానే తమ విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలోనే ఆయా సబ్జెక్టులను బోధించేందుకు సిద్ధమవుతున్నారు. ► రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రయివేటు స్కూళ్లలో కలుపుకొని 3,05,856 మంది టీచర్లున్నారు. వారిలో దాదాపు 2 లక్షల మంది వరకు ప్రభుత్వ టీచర్లు.. టీచర్ ఎలిజిబులిటీ టెస్టు, ఆపై టీచర్ రిక్రూట్మెంటు టెస్టు (డిఎస్సీ)లో మెరిట్ సాధించి ఆయా పోస్టులు సాధించిన వారు. ఈ నేపథ్యంలో ప్రయివేటు స్కూళ్లలో కంటే ప్రభుత్వ స్కూళ్లలోనే ఆంగ్ల మాధ్యమాన్ని విజయవంతం చేయగలుగుతామని టీచర్లంతా ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ఆ మేరకు ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెట్టడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ► మరోవైపు తెలుగు మాధ్యమం పాఠశాలను కూడా మండలానికి ఒకటి ఏర్పాటు చేసి, విద్యార్థులు వచ్చి వెళ్లేందుకు వీలుగా అన్ని సదుపాయాలు కల్పించడానికి ఉత్తర్వులు జారీ చేసింది. -
ఉనికి కోల్పోయిన ‘తనిఖీ’
ప్రభుత్వ పాఠశాలల్లో లోపిస్తున్న జవాబుదారీ తనం పని చేయని ఎస్ఎంసీ కమిటీలు జిల్లా వ్యాప్తంగా ఇదే తీరు అవగాహన లేక పట్టుకోల్పోతున్న కమిటీలు ప్రజల భాగస్వామ్యం లేకుండా ఎందులోనూ పురోగతి ఉండదు. సమష్టి కృషితోనే ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఇందులో భాగంగానే పాఠశాల యాజమాన్య కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో విద్యార్థుల తల్లిదండ్రులను భాగస్వామ్యం చేస్తూ కమిటీలను ఎంపిక చేశారు. కమిటీలను సమన్వయం చేసుకుంటూ సర్వశిక్ష అభియాన్ ద్వారా ఆయా పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా పాఠశాలల పనితీరు, అభివృద్ధి, విద్యాభివృద్ధి తదితర అంశాలకు సంబంధించి తరచూ ఆయా పాఠశాలలను కమిటీలు తనిఖీలు చేయాల్సి అవసరం ఎంతైనా ఉంది. అయితే క్షేత్ర స్థాయిలో ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది. ఏర్పాటైన పాఠశాల కమిటీలు నామమాత్రంగానే మిగిలిపోతున్నాయి. - గుమ్మఘట్ట: జిల్లాలో 2,650 ప్రాథమిక పాఠశాలల్లో 1.60 లక్షల మంది, 600 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 70 వేల మంది, 610 ఉన్నత పాఠశాలల్లో 76 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరందరి ఉజ్వల భవిష్యత్తు ఆయా పాఠశాలల తనిఖీలపైనే ఆధారపడి ఉంది. తనిఖీలు ఎలా ఉండాలంటే.. పాఠశాల అభివృద్ధికి ఎలాంటి పథకాలు ఉన్నాయి? వాటి కోసం ఎంత ఖర్చు పెట్టారు? వంటి విషయాలపై తనిఖీదారులకు ముందస్తుగానే అవగాహన ఉండాలి. అదే సమయంలో సిబ్బంది నియామకం, వారి పనితీరు, విద్యార్థులకు మౌలిక వసతుల కల్పన, తరగతి గదుల నిర్వహణ, హాజరు శాతం పెంపు, నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించడం తదితర విషయాలకు సంబంధించి సమగ్ర సమాచారం ఉండాలి. వీటిని ఎప్పటికప్పుడు తనిఖీల ద్వారా పర్యవేక్షిస్తూ ఉండాలి. ప్రతి నెలలో మూడో శనివారం విధిగా సమావేశం నిర్వహించాలి. పాఠశాలల అభివృద్దికి సంభందించి చర్చ జరగాలి. అందుకు కావాల్సిన నిధుల కోసం నివేదికలు సిద్దం చేయాలి. ఇలాంటివి జరగడమే లేదు. శిక్షణనే మరిచారు.. ఎస్ఎంసీలను నియమించిన ప్రభుత్వం.. అందులోని సభ్యులకు సమగ్ర శిక్షణ ఇవ్వడం విస్మరించింది. ఎస్‌ఎంసీల బాధ్యతలు తదితరాలపై నేటికీ సభ్యులకు పూర్తిస్థాయిలో అవగాహన లేదు. స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో జరిపామని రికార్డులు చూపారే తప్పా ప్రాథమికంగా సభ్యులకు వారి బాధ్యతలపై అవగాహన లేదు. జిల్లాలో పరిస్థితి ఇదీ.. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో యాజమాన్య కమిటీలు ఏర్పాటయ్యాయి. ప్రతి తరగతి నుంచి ముగ్గురు విద్యార్థుల తల్లి,దండ్రులు, సంరక్షులను సభ్యులుగా ఎన్నుకుంటారు. జిల్లా వ్యాప్తంగా 3,860 పాఠశాలల్లో యాజమాన్య కమిటీలు ఏర్పాటయ్యాయి. గ్రామ పంచాయతీ సర్పంచ్, ఎంపీపీ, మున్సిపల్ చైర్మెన్, మేయర్ తమ విచక్షణ మేరకు పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశాల్లో పాల్గొనాల్సి ఉంది. అయితే జిల్లా వ్యాప్తంగా ఎక్కడా ఇలాంటి సమావేశాలు నిర్వహించిన దాఖలాలు లేవు. బహుళ ప్రయోజనాలు... ఎస్‌ఎంసీల పనితీరు మెరుగుపడితే ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు నాణ్యమైన విద్య అందుతుందనే అవగాహన ప్రజలు, తల్లి,దండ్రుల్లో పెరుగుతుంది. ప్రధానోపాధ్యాయులలో జవాబుదారీతనం పెరుగుతుంది. ఉపాధ్యాయుల పనితీరు మెరుగుపడుతుంది. ఇందులో భాగంగానే రెండ్రోజలు క్రితం సనప ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాలలో ఏజెన్సీ గొడవ కారణంగా మధ్యాహ్న భోజనం సక్రమంగా అందని విషయంపై కమిటీ పర్యవేక్షణలో వెలుగు చూసింది. దీంతో ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి మెమో జారీ చేసి పథకాన్ని పునరుద్ధరించారు. అలాగే సనప్ప జెడ్పీ ఉన్నత పాఠశాలలోనూ నెలకొన్న సమస్యలపై ప్రధానోపాధ్యాయుడికి మెమో ఇప్పించి, పరిష్కారానికి కమిటీ చొరవ చూపింది. పాఠశాల యాజమాన్య కమిటీలు చురుగ్గా పాల్గొనాలి పాఠశాల యాజమాన్య కమిటీలు వారి హక్కులను ముందుగా తెలుసుకోవాలి. చురుగ్గా పాల్గొని లోపాలను గుర్తించి సరిచేయాలి. స్కూల్ కాంప్లెక్స్‌ల పరిధిలో అవగాహన కూడా కల్పించాం. ఎస్ఎంసీలకు తోడు మండల విద్యాధికారుల పర్యవేక్షణ పెంచితే ఉపాధ్యాయులు వేళకు రావడంతో పాటు నాణ్యమైన విద్య అందుతుంది. ఎస్ఎంసీలకు వారి విధులపై అవహన పెంచేలా సదస్సులు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడతాం. – లక్ష్మీనారాయణ, జిల్లా విద్యాధికారి, అనంతపురం -
పాఠశాలలకు దిక్సూచి.. ఎస్ఎంసీ
కమిటీల ఎన్నికకు మార్గదర్శకాలు జారీ ఆగస్టు 1 నుంచి 10లోగా ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు విద్యారణ్యపురి : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ(ఎస్ఎంసీ)లకు ఈఏడాది ఆగస్టు 1 నుంచి 10లోగా ఎన్నికలు నిర్వహించాలని పాఠశాలల ప్రధానోపా«ధ్యాయులను ఆదేశాలు అందాయి. ఈమేరకు ఎంఈఓలకు సైతం మార్గదర్శకాలు అందాయి. విద్యాహక్కు చట్టం అమలులో భాగంగా పాఠశాలల నిర్వహణను పర్యవేక్షించేందుకుగానూ ఎస్ఎంసీలను ఏర్పాటు చేస్తారు. బడులకు వచ్చే నిధుల వినియోగంపై ఇవి నిరంతరం పర్యవేక్షణ జరుపుతుంటాయి. కేవలం ప్రభుత్వ పాఠశాలలే కాకుండా, ప్రభుత్వ ఆర్థికసాయంతో నడిచే బడులు కూడా ఈ కమిటీలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. వీటి ద్వారా ప్రతినెలా సమీక్ష సమావేశాలు నిర్వహించి, పాఠశాలల నిర్వహణపై చర్చించాల్సి ఉంటుంది. కనీసం ప్రతి రెండు నెలలకోసారి ఇవి సమావేశం కావాలని నిబంధనలు చెబుతున్నాయి. విద్యాసంవత్సరం ఆరంభంలో, ముగింపులోనూ పాఠశాల విద్యార్థుల పురోగతిపై సమీక్షించాల్సిన బాధ్యత వాటిపై ఉంటుంది. ప్రతి పాఠశాలకు ఓ కమిటీ.. జిల్లాలో 2049 ప్రాథమిక పాఠశాలలు, 360 యూపీఎస్‌లు, 510 హైస్కూళ్లు ఉన్నాయి. హైస్కూళ్లలో కేవలం 6 నుంచి 8వతరగతులకే ఎస్ఎంసీలను ఎన్నుకుంటారు. ప్రతి పాఠశాలకు ఒక ఎస్ఎంసీ కమిటీ ఉంటుంది. జిల్లాలోని 46 కేజీబీవీలు, 30 మోడల్æస్కూళ్లలో, ఎయిడెడ్ పాఠశాలల్లోనూ కమిటీల ఎన్నికలు జరుపుతారు. ప్రతి మండలంలోనూ ఈ ఎన్నిక ప్రక్రియను ఎంఈఓలు పర్యవేక్షిస్తారు. వీరితో పాటు సర్వ శిక్షా అభియాన్ జిల్లా ప్రాజెక్టు అధికారి, సెక్టోరియల్ ఆఫీసర్లు కమిటీల ఎన్నికపై ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తారు. సభ్యుల సంఖ్య.. జిల్లాలోని ప్రాథమిక పాఠశాలలకు ఒకటో తరగతి నుంచి 5వతరగతి వరకు 15 మంది, యూపీఎస్‌లలో 1వతరగతి నుంచి 7వతరగతి వరకు 21 మందిని కమిటీ సభ్యులుగా ఎన్నుకుంటారు. మరికొన్ని యూపీఎస్‌లలో 1వతరగతి నుంచి 8వతరగతి వరకు ఉన్నచోట్లలో 24 మందిని, ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి 8వ తరగతి వరకు 9 మందిని కమిటీ సభ్యులుగా ఎన్నుకుంటారు. ప్రతి తరగతికి విడివిడిగా ఎన్నికలు జరుపుతారు.Sముగ్గురు సభ్యుల్లో ఇద్దరు మహిళలు ఉండాలి. ప్రతి పాఠశాలలో 15 మంది సభ్యులు ఎన్నికైతే వారిలో 10 మంది మహిళలు, ఐదుగురు పురుషులు ఉండాలి. ఎక్స్ అఫీషియో సభ్యులుగా వీరే.. ఎస్ఎంసీలలోని ఎక్స్ అఫీషియో సభ్యులుగా హెచ్ఎంలు లేదా ఇన్చార్జి హెచ్ఎంలు మెంబర్ కన్వీనర్‌గా ఉంటారు. ఒక ఉపాధ్యాయుడు లేదా ఉపాధ్యాయురాలిని ఎంఈఓ నామినేట్ చేయవచ్చు. స్థానిక కార్పొరేటర్, కౌన్సిలర్, వార్డుమెంబర్లు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉంటారు. పాఠశాల పరిసరాల్లోని అంగన్వాడీ కార్యకర్త, ఏఎన్ఎం, మహిళా సమాఖ్య అధ్యక్షులు కూడా కమిటీలో ఉంటారు. మరో ఇద్దరు కో ఆప్డెడ్ సభ్యులను ఎస్ఎంసీ ఎన్నుకుంటుంది. ఎన్నికల విధానమిదీ.. ప్రధానోపాధ్యాయులు పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేయాలి. ప్రతి తరగతి సెక్షన్, మీడియం కలిపి ఓ తరగతిగా పరిగణించాలి. ఉన్నత పాఠశాలల్లోని 6 నుంచి 8వతరగతి వరకు మాత్రమే ఎస్‌ఎంసీని ఎన్నుకోవాలి. ప్రతి తరగతి నుంచి ముగ్గురు విద్యార్థుల తల్లిదండ్రులను సభ్యులుగా ఎన్నుకుంటారు. ఎన్నికైన వారి నుంచి ఒకరిని అధ్యక్షుడిగా మరొకరిని ఉపాధ్యక్షులుగా ఎంపిక చేస్తారు. వీరిలో ఒకరు బలహీనవర్గాలు లేదా అణగారిన వర్గాలకు చెందినవారై ఉండాలి. అధ్యక్షుడు లేదా ఉపాధ్యక్షుడిలో ఒక మహిళ తప్పనిసరిగా ఉండాలి. ఒక తరగతిలో ఇద్దరు మహిళా సభ్యులను ఎన్నుకోవాలి. ఏదైనా తరగతిలో ఆరుకంటే తక్కువ మంది విద్యార్థులుంటే దానిని తక్కువ సంఖ్యగల దిగువకు లేదా ఎగువ తరగతిలో కలిపి ఎన్నిక జరపాలి. ఎన్నిక చేతులెత్తే పద్ధతి, మూజువాణి ద్వారా నిర్వహించాలి. అసాధారణ పరిస్థితుల్లోనే రహస్య బాలెట్ పద్ధతిని పాటించాలి. ఎస్ఎంసీ ఎన్నికకు కనీసం 50 శాతం విద్యార్థుల తల్లిదండ్రులు హాజరుకావాలి. సభ్యుల పదవీకాలం 2 సంవత్సరాల పాటు ఉంటుంది. లేదా విద్యార్థి పాఠశాలను విడిచేవరకు ఉంటుంది. సర్పంచ్, మున్సిపల్ చైర్పర్సన్, మేయర్ ఏదైనా సమావేశానికి హాజరుకావచ్చు. సభ్యులు, అధ్యక్షులు, ఉపాధ్యక్షులు ఎన్నికల వివరాలను సమావేశ నిర్వహణపై మినిట్స్‌ను విధిగా ప్రధానోపాధ్యాయుడు రికార్డు చేయాలి. -
ప్రైమరీల్లో ఇంగ్లిష్
♦ జిల్లాలోని ప్రభుత్వ బడుల్లో సరికొత్త ప్రయోగం ♦ ఉపాధ్యాయులు చొరవచూపే స్కూళ్లలోనే అమలు ♦ పాఠశాలల ఎంపికలో నిమగ్నమైన యంత్రాంగం ♦ ఎంపికైన స్కూళ్ల సిబ్బందికి ప్రత్యేక శిక్షణ పాఠశాల విద్యలో వినూత్నమైన కార్యక్రమాలను చేపడుతూ రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న జిల్లా విద్యా శాఖ మరో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ పాఠశాలల పై తల్లిదండ్రులకు నమ్మకం కలిగించడంతోపాటు నానాటికీ తగ్గిపోతున్న విద్యార్థుల సంఖ్యను పెంచడానికి మరో అడుగు ముందుకేసింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు ఆశించకుండా, అదనపు బోధనా సిబ్బంది నియామకంతో సంబంధం లేకుండా ప్రాథమిక పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లిష్ మీడియం తరగతులు ప్రారంభించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. - దోమ దోమ : విద్యా శాఖ రూపొందించిన నిబంధనలకు లోబడి ఇంగ్లిష్ మీడియం ఏర్పాటుకు ఆమోదం తెలుపుతూ ఎస్ఎంసీ కమిటీల తీర్మానాలు చేసిన పాఠశాల ల్లో మాత్రమే ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. అంతేకాకుండా ఆయా పాఠశాలల్లో ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా ఇంగ్లిష్ మీడియంలో బోధనకు అంగీకరిస్తున్నట్లుగా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. నిబంధనలకు అనుగుణంగా ఇంగ్లిష్ మీడియం తరగతులను ప్రారంభించడానికి ఆసక్తి కలిగిన పాఠశాలల వివరాలను సేకరించమంటూ కొద్ది రోజుల క్రితమే జిల్లా విద్యాశాఖాధికారి రమేష్ ఆయా మండలాల ఎంఈఓలను టెలీ కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు. దీంతో ఎంఈఓలు ఈ విషయాన్ని సంబంధిత పాఠశాలల హెచ్ఎంలకు చేరవేశారు. ఎస్ఎంసీ తీర్మానాలు చేసి ఇంగ్లిష్ మీడియం ప్రారంభానికి ఆమోదం తెలిపిన పాఠశాలల వివరాలను షార్ట్ లిస్ట్ చేసే పనిని తాజాగా మండల స్థాయి అధికారులు ప్రారంభించారు. నిబంధనలు ఇవే.. ఇంగ్లిష్ మీడియం తరగతులు ప్రారంభించడానికి విద్యా శాఖ రూపొందించిన నిబంధనలు సైతం సరికొత్తగా ఉన్నాయి. ఎంపికైన పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధనను ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులనే కొనసాగించాల్సి ఉంటుంది. తెలుగు మీడియంతోపాటు అదనంగా ఇంగ్లిష్ మీడియంలో ఒకటో తరగతిని నిర్వహించాల్సి ఉంటుంది. ఇంగ్లిష్ మీడియం కోసం ప్రత్యేకంగా ఎలాంటి సిబ్బంది నియామకం జరగదు. పాఠశాలల్లో ప్రస్తుతం కల్పిస్తున్న సౌకర్యాలు, వసతులకు అదనంగా ఏమీ ఆశించకూడదు. ఎస్ఎంసీ తీర్మానంతో ఇంగ్లిష్ మీడియం ఏర్పాటుకు ఆమోదం పొందిన పాఠశాలల్లో ప్రస్తుతం పని చేస్తున్న బోధనా సిబ్బందికి వేసవి సెలవుల్లో నిపుణుల ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. శిక్షణ పూర్తయ్యాక ఉపాధ్యాయులకు ఓ పరీక్ష నిర్వహిస్తారు. అందులో సదరు ఉపాధ్యాయులు ఇంగ్లిష్ మీడియం బోధించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నారని తేలితేనే ఆ పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం ప్రారంభించేందుకు అనుమతినిస్తారు. నర్సరీ నుంచి ప్రారంభిస్తే బాగుంటుందంటున్న ఉపాధ్యాయులు.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం పాఠశాలలు ప్రారంభించాలన్న నిర్ణయాన్ని మెజార్టీ ఉపాధ్యాయులు స్వాగతిస్తున్నారు. అయితే విద్యాశాఖ విధించిన నిబంధనల మేరకు ఈ కార్యక్రమం ఎంత మేర విజయవంతం అవుతుందోనని వారు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఒకటో తరగతి నుంచి కాకుండా నర్సరీ స్థాయి నుంచి ఇంగ్లిష్ మీడియం తరగతులు ప్రారంభిస్తేనే ఈ కార్యక్రమం విజయవంతం అవుతుందని వారు చెబుతున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో మూడేళ్ల వయసున్న పిల్లలను నర్సరీల్లో చేర్పిస్తారని, ఈ కారణంగా ఒకటో తరగతిలో ఇంగ్లిష్ మీడియంలో పిల్లలు చేరే వీలెక్కడుందని వారు ప్రశ్నిస్తున్నారు. దోమ మండలంలో ఎంపికైన ప్రాథమిక పాఠశాలలివే.. దాదాపూర్, గుండాల్, కిష్టాపూర్, బుద్లాపూర్, మోత్కూర్, దిర్సంపల్లి, ఉదన్రావ్ పల్లి, మల్లేపల్లి, బాస్పల్లి, మైలారం. అందరూ సహకరిస్తే విజయవంతం.. ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రారంభించడానికి జిల్లా విద్యా శాఖ వినూత్న ప్రయత్నం చేస్తోంది. గ్రామస్తులతో పాటు ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తోడ్పాటునందిస్తే ఈ కార్యక్రమం తప్పనిసరిగా విజయవంతం అవుతుంది. డీఈఓ సూచనలకు అనుగుణంగా మండలాలవారీగా ఎస్‌ఎంసీల తీర్మానాల ద్వారా ఇంగ్లిష్ మీడియం ఏర్పాటుకు ఆమోదం తెలిపిన పాఠశాలలను ఎంపికచేసే ప్రక్రియను ప్రారంభించాం. ఎంపికైన పాఠశాలల ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. - హరిశ్చంద్ర, జిల్లా ఉప విద్యాధికారి