ప్రైమరీల్లో ఇంగ్లిష్
♦ జిల్లాలోని ప్రభుత్వ బడుల్లో సరికొత్త ప్రయోగం
♦ ఉపాధ్యాయులు చొరవచూపే స్కూళ్లలోనే అమలు
♦ పాఠశాలల ఎంపికలో నిమగ్నమైన యంత్రాంగం
♦ ఎంపికైన స్కూళ్ల సిబ్బందికి ప్రత్యేక శిక్షణ
పాఠశాల విద్యలో వినూత్నమైన కార్యక్రమాలను చేపడుతూ రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న జిల్లా విద్యా శాఖ మరో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ పాఠశాలల పై తల్లిదండ్రులకు నమ్మకం కలిగించడంతోపాటు నానాటికీ తగ్గిపోతున్న విద్యార్థుల సంఖ్యను పెంచడానికి మరో అడుగు ముందుకేసింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు ఆశించకుండా, అదనపు బోధనా సిబ్బంది నియామకంతో సంబంధం లేకుండా ప్రాథమిక పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లిష్ మీడియం తరగతులు ప్రారంభించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. - దోమ
దోమ : విద్యా శాఖ రూపొందించిన నిబంధనలకు లోబడి ఇంగ్లిష్ మీడియం ఏర్పాటుకు ఆమోదం తెలుపుతూ ఎస్‌ఎంసీ కమిటీల తీర్మానాలు చేసిన పాఠశాల ల్లో మాత్రమే ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. అంతేకాకుండా ఆయా పాఠశాలల్లో ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా ఇంగ్లిష్ మీడియంలో బోధనకు అంగీకరిస్తున్నట్లుగా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. నిబంధనలకు అనుగుణంగా ఇంగ్లిష్ మీడియం తరగతులను ప్రారంభించడానికి ఆసక్తి కలిగిన పాఠశాలల వివరాలను సేకరించమంటూ కొద్ది రోజుల క్రితమే జిల్లా విద్యాశాఖాధికారి రమేష్ ఆయా మండలాల ఎంఈఓలను టెలీ కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు. దీంతో ఎంఈఓలు ఈ విషయాన్ని సంబంధిత పాఠశాలల హెచ్‌ఎంలకు చేరవేశారు. ఎస్‌ఎంసీ తీర్మానాలు చేసి ఇంగ్లిష్ మీడియం ప్రారంభానికి ఆమోదం తెలిపిన పాఠశాలల వివరాలను షార్ట్ లిస్ట్ చేసే పనిని తాజాగా మండల స్థాయి అధికారులు ప్రారంభించారు.
నిబంధనలు ఇవే..
ఇంగ్లిష్ మీడియం తరగతులు ప్రారంభించడానికి విద్యా శాఖ రూపొందించిన నిబంధనలు సైతం సరికొత్తగా ఉన్నాయి. ఎంపికైన పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధనను ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులనే కొనసాగించాల్సి ఉంటుంది. తెలుగు మీడియంతోపాటు అదనంగా ఇంగ్లిష్ మీడియంలో ఒకటో తరగతిని నిర్వహించాల్సి ఉంటుంది. ఇంగ్లిష్ మీడియం కోసం ప్రత్యేకంగా ఎలాంటి సిబ్బంది నియామకం జరగదు. పాఠశాలల్లో ప్రస్తుతం కల్పిస్తున్న సౌకర్యాలు, వసతులకు అదనంగా ఏమీ ఆశించకూడదు. ఎస్‌ఎంసీ తీర్మానంతో ఇంగ్లిష్ మీడియం ఏర్పాటుకు ఆమోదం పొందిన పాఠశాలల్లో ప్రస్తుతం పని చేస్తున్న బోధనా సిబ్బందికి వేసవి సెలవుల్లో నిపుణుల ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. శిక్షణ పూర్తయ్యాక ఉపాధ్యాయులకు ఓ పరీక్ష నిర్వహిస్తారు. అందులో సదరు ఉపాధ్యాయులు ఇంగ్లిష్ మీడియం బోధించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నారని తేలితేనే ఆ పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం ప్రారంభించేందుకు అనుమతినిస్తారు.
నర్సరీ నుంచి ప్రారంభిస్తే బాగుంటుందంటున్న ఉపాధ్యాయులు..
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం పాఠశాలలు ప్రారంభించాలన్న నిర్ణయాన్ని మెజార్టీ ఉపాధ్యాయులు స్వాగతిస్తున్నారు. అయితే విద్యాశాఖ విధించిన నిబంధనల మేరకు ఈ కార్యక్రమం ఎంత మేర విజయవంతం అవుతుందోనని వారు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఒకటో తరగతి నుంచి కాకుండా నర్సరీ స్థాయి నుంచి ఇంగ్లిష్ మీడియం తరగతులు ప్రారంభిస్తేనే ఈ కార్యక్రమం విజయవంతం అవుతుందని వారు చెబుతున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో మూడేళ్ల వయసున్న పిల్లలను నర్సరీల్లో చేర్పిస్తారని, ఈ కారణంగా ఒకటో తరగతిలో ఇంగ్లిష్ మీడియంలో పిల్లలు చేరే వీలెక్కడుందని వారు ప్రశ్నిస్తున్నారు.
దోమ మండలంలో ఎంపికైన ప్రాథమిక పాఠశాలలివే.. దాదాపూర్, గుండాల్, కిష్టాపూర్, బుద్లాపూర్, మోత్కూర్, దిర్సంపల్లి, ఉదన్‌రావ్ పల్లి, మల్లేపల్లి, బాస్పల్లి, మైలారం.
అందరూ సహకరిస్తే విజయవంతం..
ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రారంభించడానికి జిల్లా విద్యా శాఖ వినూత్న ప్రయత్నం చేస్తోంది. గ్రామస్తులతో పాటు ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తోడ్పాటునందిస్తే ఈ కార్యక్రమం తప్పనిసరిగా విజయవంతం అవుతుంది. డీఈఓ సూచనలకు అనుగుణంగా మండలాలవారీగా ఎస్‌ఎంసీల తీర్మానాల ద్వారా ఇంగ్లిష్ మీడియం ఏర్పాటుకు ఆమోదం తెలిపిన పాఠశాలలను ఎంపికచేసే ప్రక్రియను ప్రారంభించాం. ఎంపికైన పాఠశాలల ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. - హరిశ్చంద్ర, జిల్లా ఉప విద్యాధికారి