Govt Schools: ఇంగ్లిష్‌.. చిక్కుముడి | Telangana: New Problems in Rationalization Of Public Schools And Teachers | Sakshi
Sakshi News home page

Govt Schools: ఇంగ్లిష్‌.. చిక్కుముడి

Published Fri, Aug 20 2021 4:20 AM | Last Updated on Fri, Aug 20 2021 8:32 AM

Telangana: New Problems in Rationalization Of Public Schools And Teachers - Sakshi

రాష్ట్రంలో సర్కారీ స్కూళ్లల్లో ఆంగ్లమాధ్యమంలో చేరే విద్యార్థులు పెరుగుతున్నారు. అయితే తెలుగు మాధ్యమ టీచర్లు 80% ఉండ గా, ‘ఇంగ్లిషు’లో బోధించేవారు 20% ఉన్నారు.
ఇంగ్లిష్‌ టీచర్ల సంఖ్యను పెంచేందుకు కొత్తగా నియామకాలు చేపట్టాలి. లేదా తెలుగు మీడియం టీచర్లకు ఇంగ్లిష్‌లో తర్ఫీదు ఇవ్వాలి. నియామకాలు చేపడితే తెలుగు మీడియం టీచర్లు మిగిలిపోతారు. వీరిని ఏం చేయాలన్నది విద్యాశాఖను వేధిస్తున్న సందేహం. 

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ స్కూళ్లు, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ ప్రక్రియపై క్షేత్రస్థాయిలో కసరత్తు మొదలైంది. జిల్లా స్థాయి అధికారులు సమగ్ర వివరాలతో నివేదికలు పంపాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు తాజాగా ఆదేశించారు. దీంతో ఉపాధ్యాయులు ఎక్కడ ఎక్కువగా ఉన్నారు? విద్యార్థులు ఎక్కువ ఉండి, టీచర్లు తక్కువ ఉన్న స్కూళ్లు ఎన్ని ఉన్నాయనే డేటాను సేకరిస్తున్నారు. అయితే రాష్ట్రంలోని 1.08 లక్షల మంది ఉపాధ్యాయుల్లో 80% వరకు తెలుగు మాధ్యమంలో బోధించేవారే ఉన్నారు. కాగా 2009లో ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టారు. అప్పట్నుంచీ ఆ మాధ్యమంలో చేరే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. అదే ఏడాది జరిగిన డీఎస్సీలో ఆంగ్ల మాధ్యమం బోధించే అధ్యాపకుల నియామకం జరిగింది. అయితే స్వల్ప సంఖ్యలోనే ఈ నియామకాలు జరిగాయి. ఆ తర్వాత నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్కూల్‌ హెడ్స్‌ అండ్‌ టీచర్స్‌ (నిష్టా) ఆధ్వర్యంలో తెలుగు టీచర్లకు ఆంగ్లంలో శిక్షణ ఇస్తూ పరీక్షలు నిర్వహించి పాస్‌ చేస్తున్నారు. కానీ ఇప్పటికీ మొత్తం టీచర్లలో ఇంగ్లిష్‌ మీడియం బోధించే వారి సంఖ్య 20 శాతానికి మించకపోవడం సమస్యగా మారింది. 2009 నుంచి ఇప్పటివరకు ఎక్కువ స్కూళ్ళల్లో తెలుగు మీడియం టీచర్లే ఆంగ్లంలో బోధిస్తున్నారని, దీనివల్ల పెద్దగా ప్రయోజనం ఉండటం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇదే పెద్ద సమస్య!
రాష్ట్రవ్యాప్తంగా 40,898 ప్రభుత్వ, ప్రైవేటు పాఠాశాలలుండగా వీటిల్లో 60,06,344 మంది విద్యార్థులున్నారు. 2019–20 యూడైస్‌ (యూనిఫైడ్‌ డిస్ట్రిక్ట్‌ ఇన్‌ఫర్మేషన్‌ సిస్టమ్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌) లెక్కల ప్రకారం ఇంగ్లిష్‌ మీడియంలో ఉన్న వాళ్ళు 73.60 శాతమైతే, తెలుగు మాధ్యమంగా చదివేవాళ్ళు 23.84 శాతమే ఉన్నారు. ఇక మొత్తం స్కూళ్లలో 30 వేల వరకు ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. వీటిల్లో 1 నుంచి 10వ తరగతి వరకు 26.87 లక్షల మంది చదువుతున్నారు. వీరిలో 10 లక్షల మంది వరకు ఆంగ్ల మాధ్యమంలోనే చదువుతున్నట్టు అంచనా. ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా చేరేవారిలో 65 శాతం ఇంగ్లిష్‌ మాధ్యమాన్నే కోరుకుంటున్నారని తేలింది. ఈ లెక్కల ప్రకారం చూస్తే ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియం బోధించే ఉపాధ్యాయుల సంఖ్య గణనీయంగా పెరగాలి. 2019–20 లెక్కల ప్రకారం మొదటి తరగతిలో (ప్రభుత్వ, ప్రైవేటు కలిపి) 6.55 లక్షల మంది చేరితే, ఇందులో 4.63 లక్షల మంది ఇంగ్లీష్‌ మీడియాన్నే ఎంచుకున్నారు. దీన్నిబట్టి చూసినా సర్కార్‌ స్కూళ్ళలో సైతం ఆంగ్ల మాధ్యమం బోధించే ఉపాధ్యాయుల సంఖ్య భారీగా పెరగాల్సిన అవసరం ఉందని స్పష్టమవుతోంది. 

ఇప్పటికిప్పుడు ఏమీ చేయలేం
ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగు మీడియం బోధించే వారికి అవసరమైన నైపుణ్యం కల్పించడమా? లేదా మిగులు టీచర్లను డీఈవో పూల్‌లో పెట్టడమా? అనే దానిపై ఇప్పటికిప్పుడే ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం లేదని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. క్షేత్ర స్థాయిలో సమగ్ర డేటా సేకరించిన తర్వాత పరిస్థితిని ప్రభుత్వానికి నివేదిస్తామని, అక్కడి నుంచి వచ్చే మార్గదర్శకాలకు అనుగుణంగా ముందుకెళ్తామని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఆంగ్లంలో బోధన జరగకపోతే విద్యార్థులు ప్రైవేటు స్కూళ్ళకు వెళ్లే ప్రమాదం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏదేమైనా ఉపాధ్యాయుల వృత్తి నైపుణ్యానికి రేషనలైజేషన్‌ ఓ సవాల్‌గా మారనుందని విద్యారంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. 

టీచర్లకు శిక్షణలో ‘నిష్టా’కీలకపాత్ర
ఆంగ్ల మాధ్యమంలో బోధించే టీచర్ల సంఖ్య పెంచేందుకు జాతీయ స్థాయిలో కృషి జరుగుతోంది. ముఖ్యంగా తెలుగు మీడియం నుంచి వచ్చిన ఉపాధ్యాయుల ప్రమాణాలు మెరుగుపరిచేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో ‘నిష్టా’కీలక పాత్ర పోషిస్తోంది. కరోనా కాలంలోనూ ఆన్‌లైన్‌లో శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఉపాధ్యాయులకు పరీక్ష నిర్వహించి సర్టిఫికెట్లు కూడా ఇస్తోంది. తెలంగాణలోని మొత్తం టీచర్లలో 20 శాతం మంది మాత్రమే ఆంగ్లంలో బోధించేవారుండగా, వీరిలో సగం మందికి నిష్టాయే శిక్షణ ఇచ్చింది. వాస్తవానికి విద్యాశాఖ ఉపాధ్యాయులకు ఇంగ్లిష్‌ బోధనపై శిక్షణ తరగతులు నిర్వహించాలి. అయితే తెలుగు మీడియం నుంచి వచ్చిన ఉపాధ్యాయులు దీనిపై నిరాసక్తత ప్రదర్శిస్తున్నారని అధికారులు అంటున్నారు. దసరా, దీపావళి, సంక్రాంతి సెలవుల్లో శిక్షణపై టీచర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెబుతున్నారు.

ఇంగ్లిష్‌లో సంభాషణ పెరగాలి
ఇంగ్లిష్‌ మీడియంలో సైతం బోధన సరిగా జరగడం లేదనే విమర్శలున్నాయి. అయితే తెలుగు మాతృభాషగా ఉన్న విద్యార్థులకు అర్థం కాకపోవడం వల్లే తెలుగులో బోధిస్తున్నట్టు టీచర్లు చెబుతున్నారు. ఇంగ్లిష్‌లో పరస్పర సంభాషణ క్రమంగా పెంచుకుంటూ వెళితే అటు విద్యార్థులకు, ఇటు ఉపాధ్యాయుడికీ ఇంగ్లిష్‌ భాష మీద పట్టు వస్తుందని నిష్టా అధికారి ఒకరు తెలిపారు. విద్యార్థులకు ఇంగ్లిష్‌లో పాఠం చెప్పాలంటే కనీసం ఒక రోజు ముందు ప్రిపేర్‌ కావాలని పేర్కొన్నారు. నిజానికి ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులంతా ఉన్నత విద్యావంతులేనని, కాస్త శ్రద్ధ పెడితే వారంతా ఆంగ్లంలో బోధన వైపు తేలికగా మళ్ళొచ్చని నిష్టా పరిశీలనలో వెల్లడైంది. 

అందరికీ ఆదర్శం ‘బోరేగావ్‌’
సాధించాలనే తపన, శ్రద్ధ ఉంటే ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దొచ్చనడానికి నిజామాబాద్‌ జిల్లా బోరేగావ్‌ గ్రామ హైస్కూల్‌ ఓ ఉదాహరణ. అక్కడి ప్రధానోపాధ్యాయుడి ప్రత్యేక పర్యవేక్షణలో 1,100 మంది విద్యార్థులు ఆంగ్ల బోధనలో విద్యనభ్యసిస్తున్నారు. ఇక్కడ ప్రతి ఉపాధ్యాయుడు ఇంగ్లిష్‌ మీడియంలో చెప్పగలిగేలా ఆయన వారిలో స్ఫూర్తిని రగిలించారు. టీచర్లలో కొందరు నిష్టా ద్వారా శిక్షణ పొందారు.

కార్యాచరణలో చిత్తశుద్ధి అవసరం 
చిత్తశుద్ధి గల కార్యాచరణ ప్రణాళికతో ముందుకువెళ్తే ఉపాధ్యాయులు తమ నైపుణ్యం పెంచుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఇది అన్ని స్థాయిల్లోనూ జరగాలి. ఇప్పటికే తెలుగు మీడియంలో చదివిన వాళ్ళే ఇంగ్లిష్‌ మీడియంలో బోధిస్తున్నారు. సోషల్, బయోసైన్స్‌ చెప్పే టీచర్లు మినహా మిగతా సబ్జెక్టులు చెప్పే తెలుగు మీడియం టీచర్లు ఇంగ్లిష్‌లో బోధించేలా తర్ఫీదు ఇవ్వొచ్చు. దీనికి టీచర్ల సంఘాలూ సహకరిస్తాయి. పిల్లలు, తల్లిదండ్రులు సంతృప్తి చెందేలా బోధన జరగాల్సిన అవసరమైతే ఉంది. అయితే ఈ ప్రక్రియను క్రమంగా, ప్రణాళిక బద్ధంగా ముందుకు తీసుకెళ్ళాలి. 
– జంగయ్య, యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు

2019–20 లెక్కల ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్ళలో ఏ మాధ్యమంలో ఎంతమంది విద్యార్థులు...
మాధ్యమం        విద్యార్థుల సంఖ్య
ఇంగ్లిష్‌               44,21,111     
తెలుగు              14,32,098
ఉర్దూ                 1,45,545
హిందీ                3229
మరాఠీ                2515
కన్నడ               1441
బెంగాలీ             250
తమిళం             155

   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement