ఇంగ్లీష్‌ మీడియం మన పిల్లలకే..'పేద బిడ్డలకు తెలుగే' | CM Chandrababu Plans to remove English medium in govt schools | Sakshi
Sakshi News home page

ఇంగ్లీష్‌ మీడియం మన పిల్లలకే..'పేద బిడ్డలకు తెలుగే'

Published Tue, Dec 31 2024 5:02 AM | Last Updated on Tue, Dec 31 2024 12:44 PM

CM Chandrababu Plans to remove English medium in govt schools

బాబు మార్కు పన్నాగం.. ప్రపంచ తెలుగు రచయితల మహాసభల వేదికగా అమలు

ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్‌ మీడియం ఎత్తివేసేందుకు సీఎం చంద్రబాబు ఎత్తుగడలు

ఇందులో భాగంగానే మహాసభల్లో మేధావులు, ప్రముఖులు, రాజకీయ నేతలతో చర్చ 

కూటమి సర్కారు కుట్రపూరిత అడుగులు  

తల్లిదండ్రులు ఆరాటపడ్డ విద్యనందించిన జగన్‌ ప్రభుత్వం.. వారి సంపూర్ణ ఆమోదంతోనే 2020–21లో ఇంగ్లీష్‌ మీడియం ప్రారంభం 

గతేడాది 93 శాతం మంది ఇంగ్లీష్‌ మీడియంలోనే పరీక్షలకు హాజరు 

నిరుడు ప్రభుత్వ స్కూళ్ల నుంచే పెద్ద సంఖ్యలో టాపర్లు 

టోఫెల్‌ నుంచి ఐబీ దాకా సర్కారు స్కూళ్ల ప్రయాణం 

ఉచితంగా బైలింగ్వుల్‌ పాఠ్య పుస్తకాలు, డిక్షనరీలు.. 

పిల్లల ఆహారం నుంచి సదుపాయాల దాకా జాగ్రత్తలు 

నేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వే 2023లో ఏపీనే టాప్‌  

ఇంగ్లీష్‌ మీడియం అమలు రాష్ట్రాల్లో ముందున్న ఏపీ  

పిల్లల్ని ఏ భాషలో చదివించాలో నిర్ణయించే అధికారం తల్లిదండ్రుల ప్రాథమిక హక్కు అని ఓ కేసులో స్పష్టం చేసిన సుప్రీం కోర్టు  

సాక్షి, అమరావతి: కాలానుగుణంగా చదువుల తీరు తెన్నులు మారిపోతున్నాయి! పోటీ ప్రపంచంలో మెరుగ్గా రాణించేందుకు రాష్ట్రంలో 95 శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇంగ్లీష్‌ మీడియం విద్యనే బలంగా కోరుకుంటున్నారు. పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఆకాంక్షిస్తున్నారు. ఆర్ధికంగా భారమైనప్పటికీ ప్రైవేట్‌ స్కూళ్లలో ఇంగ్లీష్‌ మీడియంలో చదివించేందుకు సిద్ధపడుతున్నారు. 

పేదింటి తల్లిదండ్రుల ఆరాటం, పిల్లల ప్రతిభను గుర్తించిన మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ విద్యా రంగాన్ని సమున్నతంగా మార్చాలని తపన పడ్డారు. మునుపెన్నడూ చూడని విద్యా సంస్కరణలు తెచ్చారు. విద్యా బోధనలో ఆధునిక పోకడలను అందిపుచ్చుకోకుండా మూస విధానాలతో వ్యవహరిస్తే భవిష్యత్తు తరాలకు అంతులేని నష్టం జరుగుతుందని గుర్తించారు. పేద కుటుంబాల్లో మరో తరం అణగారిపోకుండా చర్యలు తీసుకున్నారు. 

ఈ క్రమంలోనే పేద విద్యార్థులు ఎక్కువగా చదివే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం బోధనను ప్రవేశపెట్టారు. ఓ మేనమామలా అడుగడుగునా వారి చదువులకు అండగా నిలిచారు. ఐరాస వేదికపై మన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సత్తా చాటేలా వెన్నుతట్టి ప్రోత్సహించారు. విద్యారంగ సంస్కరణల కోసం ఐదేళ్లలో ఏకంగా రూ.72,919 కోట్లు వెచ్చించారు. కానీ విద్యా సంస్కరణలను నిర్వీర్యం చేసి నీరుగారుస్తున్న కూటమి సర్కారు ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్‌ మీడియం బోధనను నీరుగారుస్తూ పేదింటి పిల్లలపై పగ సాధిస్తోంది. 

ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు, భాషా వికాసం, మేధావుల ముసుగులో పేద విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమాన్ని దూరం చేసే కుట్రలు మరోసారి తెరపైకి వచ్చాయి. మరి ఈ ప్రముఖులు వారి పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లను ఏ మీడియంలో ప్రైవేట్‌ స్కూళ్లలో చదివిస్తున్నారు? ఏ ఒక్కరైనా తెలుగు మాధ్యమంలో చదివిస్తున్నారా?  


పిల్లల్లో బలమైన ఆసక్తి.. 
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో అత్యధిక శాతం ఇంగ్లీష్‌ మీడియంలోనే చదివేందుకు ఆసక్తి చూపుతున్నారు. పరీక్షలు సైతం ఆంగ్లంలోనే రాస్తూ తమ నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు ఆరాట పడుతున్నారు. గతేడాది 9వ తరగతి వరకు నిర్వహించిన అన్ని పరీక్షలను ఇంగ్లీష్‌ మీడియంలోనే పూర్తి చేశారు. 

మూడు నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థుల్లో 91.33 శాతం మంది పరీక్షలను ఇంగ్లీష్‌ మీడియంలోనే పూర్తి చేయడం ఒక ఎత్తయితే, ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం చదివే విద్యార్థుల్లో దాదాపు 2.20 లక్షల మంది ఇంగ్లీష్‌ మీడియంలోనే పరీక్షలు రాయడం.. 1.94 లక్షల మంది ఉత్తీర్ణత సాధించడం మరో ఎత్తు. తద్వారా పిల్లలు ఇంగ్లీష్‌ మీడియంను ఎంత బలంగా కోరుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు.  

ఏటా ఒక్కో తరగతి చొప్పున పెంచుకుంటూ..  
‘దేశంలో పేదరికం పోవాలంటే విద్యతోనే సాధ్యం. పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి ఏదైనా ఉంటే అది చదువొక్కటే. పేదింటి బిడ్డలకు నాణ్యమైన విద్య అందించడం ప్రభుత్వం బాధ్యత. పిల్లలు అంతర్జాతీయ అవకాశాలను  అందుకోవాలంటే అది ఇంగ్లీష్‌ చదువులతోనే సాధ్యమవుతుంది..’ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పలు సందర్భాల్లో చెప్పిన మాటలివీ! అందుకు అనుగుణంగానే ఆయన 2020–21లో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీష్‌ మీడియం సిలబస్‌ను అందుబాటులోకి తెచ్చారు. 

ఏటా ఒక్కో తరగతి చొప్పున పెంచుకుంటూ 2024–25 నాటికి టెన్త్‌ని కూడా ఇంగ్లీష్‌ మీడియంలోకి మార్చేలా చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో దేశంలోనే తొలిసారిగా విద్యార్థులకు బైలింగ్వుల్‌ పాఠ్యపుస్తకాలు (మిర్రర్‌ ఇమేజ్‌), ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పిక్టోరియల్‌ డిక్షనరీ, ఉన్నత తరగతులకు ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీని అందించి ప్రోత్సహించారు. దీంతో ప్రభుత్వ రంగంలో దేశంలోనే అత్యున్నత ప్రమాణాలతో విద్యనందించే రాష్ట్రంగా, దక్షిణాదిలో ఇంగ్లీష్‌ మీడి­యం అమలు టాప్‌ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ నిలవడం గమనార్హం.    

38.50 లక్షల మంది ఇంగ్లీష్‌ మీడియంలోనే
వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం తెచ్చిన విద్యా సంస్కరణలతో 2023 – 24లో ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ వరకు విద్యార్థుల చేరికలు అంతకుముందు ఏడాదితో పోలిస్తే 1,50,005 అధికంగా నమోదయ్యాయి. గత విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 43 లక్షల మంది విద్యార్థులు ఉండగా వారిలో 38.50 లక్షల మంది ఇంగ్లీష్‌ మీడియంలోనే పరీక్షలు రాశారు. 2023–24 పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు టాప్‌ మార్కులు సాధించి ప్రైవేట్, కార్పొరేట్‌ స్కూళ్లకు సవాల్‌ విసిరారు. 

ఇంగ్లీష్‌ మీడియంలో పరీక్షలు రాసి 590కి పైగా మార్కులు సొంతం చేసుకున్నారు. గతేడాది పదో తరగతి పరీక్ష ఫలితాలకు సంబంధించి టాప్‌ 28 మంది విద్యార్థుల్లో 26 మంది ప్రభుత్వ స్కూళ్లలో చదివి బైలింగ్వుల్‌ పాఠ్య పుస్తకాల సహాయంతో ఇంగ్లీష్‌ మీడియంలో పరీక్షలు రాసి 590 నుంచి 594 వరకు మార్కులు సాధించడం గమనార్హం. జగనన్న ఆణిముత్యాలు పేరుతో ప్రతిభావంతులైన విద్యార్థులను గత ప్రభుత్వం సత్కరించి ప్రోత్సహించింది.   



ఇంగ్లీష్‌ మీడియంలో కేరళను దాటిన ఏపీ  
నేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వే (ఎన్‌ఏఎస్‌) 2023లో ఇంగ్లీష్‌ మీడియం అమలులో ఆంధ్రప్రదేశ్‌ దక్షిణాది రాష్ట్రాల్లో టాప్‌లో నిలిచింది. ఈమేరకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లల్లో ఇంగ్లీష్‌ మీడియం అమలు తీరుపై కేంద్ర ప్రభుత్వం సర్వే నిర్వహించింది. ఇంగ్లీష్‌ మీడియంలో చదువుతున్న 3, 6, 9 తరగతుల విద్యార్థులను పరీక్షించి సర్వే చేపట్టారు. సర్వేలో జాతీయ సగటు 37.03 శాతంగా ఉండగా ఆంధ్రప్రదేశ్‌లో 84.11 శాతంగా నమోదు కావడం గమనార్హం. కేరళ, కర్ణాటక, తమిళనాడు కంటే ఏపీ మెరుగైన స్థానంలో నిలిచింది. 

ప్రైవేట్‌ స్కూళ్లకు 2 లక్షల మంది విద్యార్థులు  
వైఎస్‌ జగన్‌పై కోపంతో ఆయన తెచ్చిన విద్యా సంస్కరణలను సీఎం చంద్రబాబు ఒకొక్కటిగా నిర్వీర్యం చేస్తున్నారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన వెంటనే టోఫెల్‌ను రద్దు చేశారు. అనంతరం విద్యార్థుల్లో ప్రమాణాలు లేవంటూ 1,000 సీబీఎస్‌ఈ స్కూళ్లను రద్దు చేశారు. సబ్జెక్టు టీచర్లను తొలగించారు. వచ్చే జూన్‌ నుంచి అమల్లోకి రావాల్సిన ఐబీ విద్యను కూడా రద్దు చేశారు. పేద పిల్లలకు ఇంగ్లీషు మీడియం చదువులను నీరుగార్చారు. 2024–25 విద్యా సంవత్సరంలో దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్‌ స్కూళ్లకు వెళ్లిపోవడం రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఎలా నీరుగారుతోందో చెప్పేందుకు నిదర్శనం.  

95% తల్లిదండ్రుల కోరిక ఇంగ్లీష్‌ మీడియం
రాష్ట్రంలో 2019కి ముందు ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడి­యం మాత్రమే అందుబాటులో ఉంది. అయితే తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇంగ్లీష్‌ మీడియం విద్యను బలంగా కోరుకున్నారు. అది ప్రభుత్వ స్కూళ్లలో లేకపోవడంతో ఏటా విద్యార్థుల సంఖ్య తగ్గిపోయి ప్రైవేట్‌ బాట పట్టారు. దీంతో దాదాపు 1,785 ప్రభుత్వ పాఠశాలలు వివిధ దశల్లో మూతబడ్డాయి. 

ఈ నేపథ్యంలోప్రభుత్వ పాఠశాలల పరిస్థితులపై అధ్యయనం నిర్వహించిన జగన్‌ ప్రభుత్వం తల్లిదండ్రుల అభిప్రాయాలను సైతం సేకరించింది. రాష్ట్రంలో 95 శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇంగ్లీష్‌ మీడియం విద్యను కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ఫీజులు ఆర్ధికంగా భారమైనా పిల్లల భవిష్యత్‌ దృష్ట్యా ప్రైవేట్‌ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంలో చదివిస్తున్నట్లు చెప్పారు. 

సర్కారు స్కూళ్లలో ఇంగ్లీష్‌ మీడియం లేకపోవడంతో మరో దారి కానరాక ప్రైవేట్‌లో చేర్చినట్లు వాపోయారు. ఈ క్ర­మంలో పిల్లలు, తల్లిదండ్రుల అభిప్రాయాన్ని గౌరవిస్తూ రేపటి పౌరుల ఉజ్వల భవిష్యత్తు దిశగా జగన్‌ ప్రభుత్వం విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టింది. 

పేదింటి పిల్లలు ప్రపంచ స్థాయిలో పోటీ పడేందుకు వీలుగా 2020–21లో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియంను అమల్లోకి తెచ్చింది. తొలుత ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టగా 2021–22లో ఏడో తరగతి, 2022–23లో ఎనిమిదో తరగతి, 2023–24లో తొమ్మిదో తరగతికి అందుబాటులోకి తెచ్చింది.  

ప్రభుత్వ స్కూళ్లపై పెరిగిన నమ్మకం  
మనబడి నాడు–నేడు ద్వారా 45 వేల ప్రభుత్వ పాఠశాలలను అన్ని సదుపాయాలతో సదుపాయాలతో సమూలంగా తీర్చిదిద్దే బృహత్తర పథకాన్ని వైఎస్‌ జగన్‌ చేపట్టారు. 2019–20లో 15,713 పాఠశాలల్లో రూ.3,669 కోట్లతో కార్పొరేట్‌కు దీటుగా అన్ని సదుపాయాలను కల్పించారు. రెండో విడ­తలో రూ.8 వేల కోట్లతో 22,344 పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేప­ట్టారు. డ్రాపౌట్స్‌ను అరికట్టడం, పిల్లల చదువులు తల్లిదండ్రులకు భారం కాకూడదనే లక్ష్యంతో 42.62 లక్షల మంది తల్లుల ఖాతాల్లో ఏటా రూ.15 వేల చొప్పున జగనన్న అమ్మఒడి కింద నేరుగా నగదు జమ చేశారు. 

ఒక్క అమ్మ ఒడి ద్వారానే రూ.26 వేల కోట్లకుపైగా అందించారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థపై తల్లిదండ్రులకు నమ్మకాన్ని కలిగించారు. ఇక విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో 2020 జనవరి 1న జగనన్న గోరుముద్ద పథకానికి శ్రీకారం చుట్టారు. రోజుకో రుచికరమైన మెనూతో 16 రకాల పదార్థాలు, ఫోర్టిఫైడ్‌ సార్టెక్స్‌ బియ్యంతో ఆహారాన్ని అందచేశారు. గోరుముద్దపై పర్యవేక్షణకు ప్రత్యేకంగా యాప్‌ని అందుబాటులోకి తెచ్చారు. గతంలో టీడీపీ హయాంలో మధ్యాహ్న భోజనం కోసం ఏటా రూ.450 కోట్లు ఖర్చు చేయగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏటా రూ.1,400 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.6,995.34 కోట్లు వెచ్చించింది.

మేధావుల్లారా ఆలోచించండి 
రాష్ట్రంలో ఇంగ్లీష్‌ మీడియం రద్దు చేయాలని తెలుగు రచయితల మహాసభల్లో వక్తలు, మేధావులు  డిమాండ్‌ చేశారు. కానీ రాష్ట్రంలోని 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో బడుగు బలహీన వర్గాలకు చెందిన దాదాపు 40 లక్షల మంది పిల్లలు చదువుతున్నారు. ప్రభుత్వానికి తెలుగు భాషపై నిజంగా ప్రేమ ఉంటే ప్రతి గ్రామం, పట్టణంలో ఒకేచోట తెలుగు, ఇంగ్లీష్‌ మీడియం స్కూళ్లు ఏర్పాటు చేయాలి. ఎవరికి ఏ మీడియం కావాలంటే అందులో చేరుతారు. కార్పొరేట్‌ విద్యను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని రద్దు చేసి పేద విద్యార్థులకు అన్యాయం తలపెట్టవద్దు.     – ఎస్‌.రామకృష్ణ, పురపాలక టీచర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు

మీ పిల్లలు ఎక్కడ చదివారు?..  
ప్రపంచ తెలుగు రచయితల మహాసభలో పాల్గొన్న న్యాయ కోవిదులు, రాజకీయ నాయకులు, రచయితలు మూకుమ్మడిగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం అమలు చేసే జీవో 85ను రద్దు చేయాలని కోరడం అత్యంత దుర్మార్గం. వారిలో ఏమాత్రం మానవత్వం ఉన్నా ఇంగ్లీష్‌తోపాటు తెలుగు మాధ్యమాన్ని కూడా కొనసాగించాలని పాలకులపై ఒత్తిడి తేవాలి. మహాసభలో పాల్గొన్న న్యాయ కోవిదుల పిల్లలు, రాజకీయ నేతల పిల్లలు, తెలుగు భాషా రచయితల పిల్లలు ఏ మాధ్యమంలో చదివారో.. ప్రస్తుతం ఏ దేశాల్లో ఉంటున్నారో ప్రజలకు తెలియజేస్తే బాగుంటుంది.   
    – బి.మనోజ్‌కుమార్, రమేష్, బహుజన టీచర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు

ఏపీలో విద్యా విప్లవాన్ని మళ్లీ వెనక్కి తీప్పాలనే..
తెలుగు మీడియంలో చదివి కష్టపడి న్యాయవాద డిగ్రీ సంపాదించిన యువ లాయర్లు ఇప్పుడు కోర్టుల్లో చాలామంది ఉన్నారు. వారికి చట్టాలపై ఎంత పట్టు ఉన్నా ఇంగ్లీష్‌లో సమర్థంగా వాదించే నైపుణ్యం లేక ఎంత డిప్రెషన్‌కు గురవుతున్నారో నేను చూశా. 

⇒ ‘ఇటాలియన్‌ ఆఫ్‌ ఈస్ట్‌’ అంటున్న తెలుగు భాషకు సివిల్‌ సర్వీస్‌లో ప్రశ్నాపత్రం లేని గతి ఎందుకున్నది? తెలుగు భాషలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ పరీక్ష రాసిన బీద విద్యార్థులు ఎంతమంది సెలెక్ట్‌ అయ్యారు?  

⇒ కర్ణాటకలో ప్రైవేట్‌ స్కూళ్లను కన్నడలో బోధించాలని జీవో ఇచ్చినప్పుడు తమ పిల్లల్ని ఏ భాషలో చదివించాలో నిర్ణయించే హక్కు తల్లిదండ్రుల ఫండమెంటల్‌ రైట్‌ అని సుప్రీం కోర్టే చెప్పింది కదా!  

⇒ చంద్రబాబు ప్రభుత్వం.. ప్రభుత్వ స్కూళ్లను పూర్తిగా తెలుగు మీడియంలోకి మార్చమంటోంది.  ఆయన మనవడు ఏ భాష స్కూలులో చదివి ఇప్పుడు అంతర్జాతీయ చెస్‌ ఛాంపియన్‌ కాబోతున్నాడు?  

⇒ మేధావులకు తెలుగుపట్ల ప్రేమ ఉంటే ప్రపంచ భాషల్లోకి అనువదించి నోబెల్‌ ప్రైజ్‌ పొందే పుస్తకాలు రాయాలిగానీ దిక్కులేని ప్రజల జీవితాల్లో మట్టి పొయ్యడానికి సిద్ధాంతాలు అల్లకూడదు కదా! 

⇒ ప్రపంచ రచయితల మహాసభల్లో తెలుగులో ప్రపంచ గుర్తింపు పొందగల పుస్తకాలను ఎలా రాయాలో లేదా రచించాలో 
చర్చించాలి గానీ ప్రభుత్వ స్కూళ్లను తెలుగు మీడియంలోకి మార్చే అంశాన్ని కాదు గదా!  

⇒ ఆంధ్రప్రదేశ్‌లో మొదలైన విద్యా విప్లవాన్ని మళ్ళీ వెనక్కి తిప్పాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది కేవలం జస్టిస్‌ రమణ అభిప్రాయం మాత్రమే అనుకోవడానికి లేదు. చంద్రబాబు ఆలోచనకు ఆయన ఒక ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియ ప్రారంభించాడు. 

⇒ ఇప్పటికే ఈ ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని ఆపేసింది. స్కూళ్ల అభివృద్ధి కోసం చేసుకున్న అంతర్జాతీయ అగ్రిమెంట్లన్నీ నిలిపివేశారు.  

⇒ ఇంగ్లీష్‌ విద్యను ప్రభుత్వ స్కూళ్లలో కాపాడుకునే ఉద్యమాలు గ్రామీణ స్థాయిలో మొదలైతే గానీ అది బతకదు. పోరాటం చేస్తేగానీ ఈ తిరోగమన రథ చక్రం ఆగదు.  

– ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య, సామాజిక విశ్లేషకుడు, ప్రముఖ రచయిత  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement