Kancha Aialaiah
-
బాధితులనే దోషులుగా చిత్రీకరిస్తారా?
అక్టోబరు 23 (బుధవారం)న సాక్షి దిన పత్రిక ఎడిట్ పేజీలో పాలస్తీనా సమస్యపై ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెఫర్డ్ రాసిన వ్యాసం వాస్తవాలకు భిన్నంగా ఇజ్రాయెల్‌కు వత్తాసు పలికేలా ఉంది. వ్యాసం మొత్తంగా చూసినప్పుడు పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయిల్ సాగిస్తున్న మారణ కాండకు మద్దతిస్తున్నట్లే ఉంది. రాజ్య నైజాన్ని గురించి కానీ, దానికి ఆయుధాలు, డబ్బు ఇచ్చి ప్రోత్సహిస్తున్న అమెరికా, యూరప్ దేశాల పాత్ర గురించి కానీ ఎక్కడా ప్రస్తావించకుండా బాధితులనే దోషులుగా చిత్రించేందుకు వ్యాసకర్త యత్నించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.ఈ వ్యవహారమంతా నాగరికతకు సంబంధించిన సమస్య అనడం అంతకన్నా శోచనీయం. ఆ వ్యాసంలో ఒక చోట ఆయన ‘ఇజ్రాయెల్ 1948లో ఆధునిక దేశంగా ఆవిర్భవించినప్పటికీ... ఎడారి భూమిలో ఆధునిక ప్రజాస్వామ్య, వ్యవసాయ, పారిశ్రామిక దేశంగా తనను తాను నిర్మించుకుంది. కానీ పాలస్తీనా పాలకులు వ్యక్తి స్వేచ్ఛ, ఓటు హక్కు అమలు లోకి వచ్చే ప్రజాస్వామ్యాన్ని సాధ్యమైన వ్యవస్థగా ఎన్నడూ అంగీకరించలేదు’ అని పేర్కొన్నారు. దీని ద్వారా ఆయన ఏం సందేశం ఇవ్వదలచుకున్నారు? ఇజ్రాయెల్ ఒక లౌకిక ఘనమైన ప్రజాస్వామ్య దేశం అని చెప్ప దలచుకున్నారా? అలా చెప్పడమంటే వాస్తవాన్ని చూడ నిరాకరించడమే అవుతుంది.ప్రముఖ యూదు చరిత్రకారుడు, యూరోపియన్ సెంటర్ ఫర్ పాలస్తీనా స్టడీస్ డైరెక్టర్ ఇలాన్ పాపే ఇటీ వల బ్రస్సెల్స్‌లో ‘అనడోలు’ అనే వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో... పశ్చిమ దేశాల మద్దతుతో పాలస్తీనాలో ఇజ్రాయెల్ చేస్తున్నది ముమ్మాటికీ జాతి నిర్మూలన కార్యక్ర మమేనని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ రాజకీయాలు సెటి ల్మెంట్ల నిర్మాణం నుంచి యూదు దురహంకారాన్ని రెచ్చగొట్టే దశకు వెళ్లాయని ఆయన పేర్కొన్నారు. ఈ శక్తులే ఇప్పుడు అక్కడ ప్రభుత్వంలోనూ, పోలీస్ వ్యవస్థలోనూ తిష్ట వేసుక్కూర్చున్నాయి. ఈ నాయకత్వం వల్లే ఇజ్రాయెల్ దురాక్రమణదారుగా పాలస్తీనా అంతటా విస్తరిస్తోంది. నీరు, ఆహారం, మందులపై ఆంక్షలు, మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడం వంటి చర్యలకు పాల్పడుతోంది. ఒక వైపు అమానుష చర్యలకు పాల్పడుతూ, మరోవైపు పాలస్తీనియన్లే ఈ ప్రాంతంలోని అన్ని సమస్యలకూ కారకులుగా, అనైతిక చర్యలకు పాల్పడే వారిగా చిత్రిస్తున్నారు. వీరిని అక్కడ నుంచి వెళ్లగొట్టడమే పరిష్కారమన్న ఒక తప్పుడు సిద్ధాంతాన్ని అమెరికా, యూరప్‌లు చాలా కాలంగా ప్రచారంలో పెడుతూ వస్తున్నాయి. 76 ఏళ్ల తరువాత కూడా అదే పాచికను ప్రయోగిస్తే అది చెల్లుబాటు కాదు అని చరిత్ర కారుడు పాపే తేల్చి చెప్పాడు.రెండవ అంశం: ‘అక్టోబరు 7 నాటి మారణ కాండను ఖండించకుండా ఇరాన్, లెబనాన్ కూడా హమాస్‌కు మద్దతునిస్తూ ఈ యుద్ధంలోకి ప్రవేశించాయి. ఆ విధంగా ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఒక రకమైన అక్ష శక్తిగా మారాయి’ అని ప్రొఫెసర్ గారు సూత్రీకరించారు. అది వాస్తవమా? పాలస్తీనా, అలాగే యావత్ పశ్చిమా సియా ప్రాంతానికి పెనుముప్పుగా తయారైంది ఇజ్రా యెల్. పశ్చిమ దేశాలు తమ ఆధిపత్యానికి కాలం చెల్లుతుండడం, ఏక ధృవ ప్రపంచం నుంచి బహుళ ధృవ ప్రపంచం వైపు పరిణామాలు చోటుచేసుకుంటుండడంతో బెంబేలెత్తి వలస వాదాన్ని మళ్ళీ విస్తరించేందుకు పూనుకుంటున్నాయని ప్రముఖ ఆర్థికవేత్త ప్రభాత్ పట్నాయక్ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఇజ్రాయిల్ గాజాపై దాడిని... లెబ నాన్కు, అటు నుంచి ఇరాన్‌కు, తద్వారా యావత్ పశ్చి మాసియాకు విస్తరింపజేయాలనే పన్నాగాన్ని ఈ సంద ర్భంగా గుర్తించాలి.ఇందుకోసం ఇజ్రాయిల్‌కు అమెరికా వంటి దేశాలు పెద్ద యెత్తున ఆయుధాలు, డబ్బు అందజేస్తున్నాయి. మూడవ అంశం... 1993 నార్వే ఒప్పందాన్ని ఇజ్రాయిల్ అంగీకరించి సంతకం చేయగా పాలస్తీనా, ఇరాన్ ఆ ఒప్పందాన్ని తిరస్కరించాయనీ... 1948కు ముందున్న చోటికి తిరిగి వెళ్లాలని పాలస్తీనా డిమాండ్ చేస్తోందని’ ఐలయ్య తన వ్యాసంలో పేర్కొన్నారు. ఇది వాస్తవాన్ని వక్రీకరించడమే. అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ మధ్య వర్తిత్వంలో 1993లో ఓస్లో ఒప్పందం (నార్వే ఒప్పందంపై ఇజ్రాయిల్ ప్రధాని ఐజాక్ రాబిన్, పాలస్తీనా విమో చనా సంస్థ నేత యాసర్ అరాఫత్ సంతకాలు చేశారు. ఆ తరువాత ఆ ఒప్పందానికి ఇజ్రాయెలే తూట్లు పొడిచింది. నాల్గవ అంశం... హమాస్, హిజ్బుల్లా, ముస్లిం బ్రదర్ హుడ్లు ప్రపంచం మొత్తానికి సమస్యలు సృష్టిస్తున్నాయి అని చెప్పడం కన్నా అన్యాయం ఏముంటుంది? అమెరికా, బ్రిటన్, ఇతర పశ్చిమ దేశాల అండతో ఇజ్రాయెల్ యథేచ్ఛగా ఈ ప్రాంతంలో సాగిస్తున్న అణచివేత, దురాక్రమణకు వ్యతిరేకంగా, పాలస్తీనా స్వేచ్ఛా స్వాతంత్య్రం కోసం సాగిన పోరాటం లోంచి పుట్టుకొచ్చినవే హమాస్ వంటి సంస్థలు.అయిదవదీ, చివరిదీ నాగరికతకు సంబంధించిన అంశం: ఇజ్రాయెల్– పాలస్తీనా సమస్య నాగరికతా సమస్య అని ప్రొఫెసర్ ఐలయ్య ముక్తాయింపు ఇచ్చారు. ఏది నాగరికతో ఏది అనాగరికతో ఆయన వివరించి ఉంటే బాగుండేది. ఇజ్రాయిల్ సాగిస్తున్న దురాగతాలను కప్పి పుచ్చి ఆ దేశ నాగరికత, ప్రజాస్వామ్యం గురించి కీర్తించడాన్ని ఏమనాలి? ఇప్పుడు జరగాల్సింది యుద్ధ నేరాలకు పాల్పడిన నెతన్యాహునూ, ఆయనకు మద్దతు ఇస్తున్న పశ్చిమ దేశాలను బోనులో విలబెట్టడం. – కె. గడ్డెన్న ‘ సీనియర్ పాత్రికేయుడు -
రెండు దేశాలుగా బతకడమే దారి
హమాస్‌పై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం ఏడాదికి పైగా సాగుతోంది. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా పాలస్తీనా, ఇరాన్, లెబనాన్ ఒక రకమైన అక్ష శక్తిగా మారాయి. 75 సంవత్సరాల తర్వాత కూడా ఒక దేశంగా ఇజ్రాయెల్ ఉనికిని గుర్తించడానికి ఇరాన్, పాలస్తీనా నిరాకరిస్తున్నాయి. ఇది పశ్చిమాసియాకే కాదు, ప్రపంచానికి కూడా సమస్య. 1993 నార్వే ఒప్పందాన్ని ఇజ్రాయెల్ అంగీకరించి, సంతకం చేసింది. ఇది రెండు దేశాల సూత్రాన్ని నిర్దేశించింది. దీని ప్రకారం ఇజ్రాయెల్, పాలస్తీనా ఒకరినొకరు గుర్తించుకోవాలి. యుద్ధం వల్ల దయనీయంగా మారిన పాలస్తీనా ప్రజానీకం పట్ల సానుభూతి చూపుతాము. అయితే పరిష్కారం ఏమిటి? అది రెండు దేశాల సూత్రంలో ఉందనీ, ఆ సూత్రాన్ని ఆచరణలో పెట్టాల్సి ఉందనీ మనందరికీ తెలుసు.పాలస్తీనాలోని గాజా విముక్తి దళం అని పిలవబడే హమాస్‌పై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం ఏడాదికి పైగా సాగుతోంది. ఒక వేడుకలో పాల్గొన్న 1,200 మంది ఇజ్రాయెల్ పౌరులను హమాస్ దళాలు దారుణంగా వధించడంతో ఇది ప్రారంభమైంది. 2023 అక్టోబర్ 7న జరిగిన ఆ అనాగరిక దాడిలో ఇజ్రాయెల్ పిల్లలు, మహిళలు, పురుషులు దారుణంగా చంపబడ్డారు. ఏ నిర్వచనం ప్రకార మైనా, ఇది ఉగ్ర వాద దాడి. ప్రతీకారంగా, ఇజ్రాయెల్ ప్రభుత్వం హమాస్‌పై భారీ యుద్ధాన్ని ప్రారంభించింది. పాలస్తీనాలో పిల్లలు, మహిళలు సహా వేలాదిమంది చనిపోయారు. వెస్ట్‌బ్యాంక్ దాదాపు శిథిలావస్థకు చేరుకుంది.2023 అక్టోబర్ 7 నాటి మారణకాండను ఖండించకుండా ఇరాన్, లెబనాన్ కూడా హమాస్‌కు మద్దతుగా ఈ యుద్ధంలోకి ప్రవే శించాయి. ఆ విధంగా ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఒక రకమైన అక్ష శక్తిగా మారాయి. కానీ అవి ఇజ్రాయెల్ బలంతో సరిపోలగలవా? ఇజ్రా యెల్ తన అత్యంత అధునాతన సాంకేతికత, యుద్ధ వ్యూహంతో హమాస్ ఆయుధ శక్తిని, ప్రధాన నాయకత్వాన్ని నాశనం చేసింది.దక్షిణ గాజాలోని రఫా లక్ష్యంగా సాగించిన గ్రౌండ్ ఆపరేషన్ లో హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్‌ను అంతమొందించినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) అక్టోబర్ 17న ప్రకటించింది. సిన్వార్ హత్య హమాస్‌కు చావుదెబ్బ. ఇరాన్, లెబనాన్ ఈ యుద్ధంలో తమ పౌర, సైనిక సిబ్బందిని పణంగా పెట్టడానికి సాహసించక పోవచ్చు.రెండు దేశాల పరిష్కారంసమస్యకు పరిష్కారం రెండు దేశాల సూత్రంలో ఉందనీ, ఆ సూత్రాన్ని ఆచరణలో పెట్టాల్సి ఉందనీ మనందరికీ తెలుసు. ఇజ్రా యెల్ ఆ సూత్రాన్ని అంగీకరించింది. కానీ హమాస్, ఇరాన్ వ్యతిరేకించాయి. ఇజ్రాయెల్ 1948లో ఆధునిక దేశంగా ఆవిర్భవించినప్పటికీ, తన ప్రజల సుదీర్ఘ ప్రవాస జీవితం తర్వాత, ఎడారి భూమిలో ఆధునిక ప్రజాస్వామ్య, వ్యవసాయ, పారిశ్రామిక దేశంగా తనను తాను నిర్మించుకుంది. కానీ పాలస్తీనా పాలకులు వ్యక్తి స్వేచ్ఛ, ఓటు హక్కులు అమలులోకి వచ్చే ప్రజాస్వామ్యాన్ని సాధ్యమైన వ్యవస్థగా ఎన్నడూ అంగీకరించలేదు. ఇతర ముస్లిం మత నిరంకుశ దేశాల కంటే అధ్వానంగా, పాలస్తీనా, ఇరాన్, ఈజిప్ట్, లెబనాన్ వంటి దేశాలు ఉగ్రవాద కేంద్రాలుగా మారాయి.ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యక్తిగత హక్కుల క్రమబద్ధమైన ప్రక్రియను అంగీకరించే ఏ దేశమూ ఆధునిక పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలలో స్వీయ విధ్వంస స్థితిని సృష్టించదు. హమాస్, హిజ్బుల్లా, ముస్లిం బ్రదర్హుడ్ వంటి ఉగ్రవాద సంస్థలు ప్రపంచం మొత్తానికి సమస్యలను సృష్టించాయి.ఇవి ప్రజల ఆర్థిక అభివృద్ధిపై దృష్టి పెట్టవు. ప్రజలు శాంతియుతంగా వ్యవసాయ లేదా పారిశ్రామిక పనిలో పాల్గొనడానికి అనుమతించవు. స్త్రీ వ్యతిరేక ఆధ్యాత్మిక సైద్ధాంతిక చర్చలకు పూనుకుంటాయి. తాలిబన్ రూపంలో ఇలాంటి బలగం కారణంగా అఫ్గానిస్తాన్‌లో ఏం జరుగుతోందో మనకు తెలుసు.75 సంవత్సరాల తర్వాత కూడా ఒక దేశంగా ఇజ్రాయెల్ ఉనికిని గుర్తించడానికి ఇరాన్, పాలస్తీనా నిరాకరిస్తున్నాయి. ఇది పశ్చిమాసి యాకే కాదు, ప్రపంచానికి కూడా సమస్య. 1948కి ముందు దాని ప్రజలు పదేపదే దేశభ్రష్టులైనప్పటికీ, ఇజ్రాయెల్ ఉనికిని తిరస్కరించడాన్ని చరిత్ర అంగీకరించదు.సామాజిక–ఆర్థిక పరిస్థితులు2019లో నేను ఇజ్రాయెల్, పాలస్తీనాలో విస్తృతంగా పర్యటించి రెండు దేశాల సామాజిక–ఆర్థిక పరిస్థితులను గమనించాను. ఇజ్రా యెల్ వైభవాన్ని, గొప్ప పచ్చని ఉత్పత్తి క్షేత్రాలలో సర్వత్రా చూడ వచ్చు. వారు ఎడారులను ఉత్పాదక భూములుగా మార్చారు. పేదరి కంతో కొట్టుమిట్టాడుతున్న పాలస్తీనా ప్రజలు, అక్కడి ఏ శ్రామిక ప్రజానీకం... పురుషులు, మహిళలు కూడా ఎడారిలోని పాక్షిక సాగు పొలాల్లో కనిపించరు. వారి వ్యవసాయ భూములలో ఒక్క స్త్రీని కూడా మనం చూడలేము. ఇజ్రాయెల్ స్త్రీలు భారతీయ శూద్ర, దళిత స్త్రీల లాగే నిత్యం పని చేస్తూనే ఉంటారు.యూదుల కష్టపడి పనిచేసే సంస్కృతి, ఆధ్యాత్మిక తత్వశాస్త్రం వారికి సహాయపడ్డాయి. ఐక్యరాజ్యసమితి ఆర్థిక సహాయం ఉన్నప్ప టికీ, అర్థవంతమైన విద్యాసంస్థలను అభివృద్ధి చేయకుండా పాలస్తీనా పేద దేశంగా మిగిలిపోయింది. వారి ఏకైక ఆశ మతం. ఉత్పత్తి లేకుండా మతం వారికి సహాయం చేస్తుందా?ఇజ్రాయెల్ రాజకీయ వ్యవస్థ సెక్యులరిజం సూత్రాలపై ఆధార పడి నడుస్తుంది. కానీ, పాలస్తీనా, ఇరాన్, లెబనాన్, ఈజిప్టులలో ఇలాంటి వ్యవస్థలు ఉన్నాయా? అవి మత నియంతృత్వాలని మనకు తెలుసు.కొత్త ఒప్పందాలు అవసరమా?1993 నార్వే ఒప్పందాన్ని ఇజ్రాయెల్ అంగీకరించి, సంతకం చేసింది. ఇది రెండు దేశాల సూత్రాన్ని నిర్దేశించింది. దీని ప్రకారం ఇజ్రాయెల్, పాలస్తీనా ఒకరినొకరు గుర్తించుకోవాలి. రెండవది 1994 నాటి అబ్రహాం ఒప్పందం. ఇది అబ్రహామిక్ సంస్కృతికి చెందిన పిల్లలుగా యూదులు, ముస్లింల ఉమ్మడి చారిత్రక వారసత్వంతో రెండు దేశాల సహజీవనం గురించి మాట్లాడుతుంది. పాలస్తీనా, ఇరాన్ ఆ ఒప్పందాలను తిరస్క రించాయి.పాలస్తీనా సాధారణ ప్రజానీకం పట్ల, ప్రత్యేకించి పిల్లలు, మహిళలు, శరణార్థుల దుఃస్థితి పట్ల మనమందరం సానుభూతి చూపుతాము. అయితే పరిష్కారం ఏమిటి? పాలస్తీనా, ఇజ్రాయెల్ ఆ రెండు ఒప్పందాలను గౌరవించాలా లేక కొత్త ఒప్పందాన్ని కుదుర్చుకోవాలా? పాలస్తీనా దైవపాలనా సూత్రాల ఆధారంగా పనిచేస్తోంది. ఇజ్రాయెల్‌కు ప్రజాస్వామ్యం పట్ల ఉన్నంత గౌరవం పాలస్తీనా నాయకులకు లేదు. నా ఉద్దేశంలో వారు ఆ చిన్న భూమిలో రెండు చిన్న దేశాలుగా జీవించాలి. వేరే అవకాశమే లేదు.ఉభయ దేశాలలోని, ముఖ్యంగా పాలస్తీనాలోని కష్టాల్లో ఉన్న ప్రజల పట్ల సానుభూతి చూపుతున్న ప్రపంచ మేధావులు ముస్లిం ప్రపంచంలో సంస్కరణల గురించి మాట్లాడుతూనే ఉండాలి. ముస్లిం దేశాలు సరైన ఎన్నికల ఆధారిత ప్రజాస్వామ్యాల వైపు వెళ్లాలి. మత నిరంకుశ రాజ్యాలలో ఉండకూడదు. యూదులు ఆ భూమిని విడిచి పెట్టి, 1948కి ముందున్న చోటికి తిరిగి వెళ్లాలంటున్న పాలస్తీనా, ముఖ్యంగా హమాస్, ఇరాన్ డిమాండ్‌ను వారు అంగీకరిస్తున్నట్ల యితే, అలాంటి మేధో అజ్ఞానం మానవ విలువలకు మరింత వినాశ నాన్ని తెస్తుంది.పాలస్తీనియన్లను ఆ భూభాగం నుండి బయటకు వెళ్ళమని ఇజ్రాయెలీలు కోరినట్లయితే వారికి కూడా అదే విషయం వర్తిస్తుంది. ఇలాంటి ఘోరమైన సమస్యలన్నింటికీ ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు వేసే రెండు దేశాల పౌరుల్లోనే పరిష్కారాలు కనిపిస్తాయి. మనం ఇప్పుడు ఇజ్రాయెల్ నుండి వారి సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా భిన్నాభిప్రాయాలను వింటున్నాము. యుద్ధం ముగిసిన తర్వాత ఇజ్రా యెల్ పౌరులు ప్రస్తుత ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహును పదవి నుంచి దించేయవచ్చు. యాహ్యా సిన్వార్ బతికి ఉంటే పాలస్తీ నియన్లు అలా చేసి ఉండేవారా?ఉక్రెయిన్, రష్యా సమస్యలా కాకుండా ఇజ్రాయెల్, పాలస్తీనా సమస్య నాగరికతా సమస్య. కాబట్టి మనమందరం ముస్లిం దేశాలు మొత్తంగా ప్రజాస్వామ్యం వైపు మారడం గురించి ఆలోచించాలి. పాలస్తీనా తన సొంత ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని హమాస్ పట్టు నుండి బయటపడాలి. రెండు దేశాల పరిష్కారాన్ని అంగీకరిస్తూ, ప్రపంచానికీ, దాని సొంత ప్రజలకూ మేలు చేయాలి.ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
వట్టి మేధావులు కాదు... మట్టి మేధావులు కావాలి!
2024 జూలై 24న కొల్లూరి సత్తయ్య అనే బీహెచ్ఈఎల్ కార్మిక నాయకుడు రిటైర్ అయ్యాడు. ఆయన రిటైర్మెంట్ సందర్భంగా ఆయన ఆత్మకథ ప్రచురిత మైంది. దాన్ని సత్తయ్య సొంత మాటల్లో పసునూరి రవీందర్ రాశాడు. ఈ ఆత్మకథను ప్రచురించే ముందు దానికి ముందు మాట రాయాలని పూర్తి పుస్తకాన్ని రవీందర్ నాకు ఆన్లైన్లో పంపించాడు. దాన్ని పూర్తిగా చదివాక బాల్య దశ నుండి సత్తయ్య జీవితం నన్ను నిజంగా ఆశ్చర్యపరిచింది. అటు వంటి ఒక దళిత కార్మికుని జీవిత కథను నేను ఎప్పుడూ చదవలేదు. ఆ పుస్తకానికి టైటిల్ కూడా మీరే సూచించండి అని సత్తయ్య, రవీందర్ అడిగి నప్పుడు ఈయనను ‘మట్టి మేధావి’ అనొచ్చని సూచించాను. ఆ పుస్తకం ఇప్పుడు ‘మట్టి మేధావి – కొల్లూరి సత్తయ్య – ఆటోబయోగ్రఫీ’ అనే టైటిల్‌తో బయటికి వచ్చింది.ముందుమాటలో నేను, ఇలా రాశాను: ‘‘కొల్లూరి సత్తయ్య జీవితకథ... ఒక మట్టి మేధావి చరిత్రలా కనిపిస్తుంది. ఆయన జీవితం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఒక చిన్న పల్లెటూరిలో (హైదరాబాద్ శివారు తెల్లాపూర్‌లో) ఒక మాదిగ కుటుంబంలో పుట్టి ఈ విధంగా ఎట్లా ఎదిగాడు అనిపిస్తుంది.’’సత్తయ్య మొదట్లో అసలు చదువురాని పది రూపాయల కూలీ మనిషి. బీహెచ్ఈఎల్లో పాకీ దొడ్లు కడుగుడు, క్యాంటీన్ ప్లేట్లు కడుగుడు పని చేసేవాడు. ఇంట్ల రైల్ వే గాంగ్మన్ తండ్రికి ఇద్దరు భార్యలు, 14 మంది పిల్లలు. సత్తయ్య అందరికంటే చిన్నవాడు. తండ్రి తప్ప మిగతా కుటుంబీకులు కూలీపని చేసేవారే. సత్తయ్య తల్లి మాత్రం మంత్ర సాని. ఆమె కులం మాదిగైనా డెలివరీలు చాలా బాగా చేసేది గనుక ఊళ్ళో పుట్టిన ప్రతి పిల్లకు క్షేమంగా కాన్పు చేయించే మంత్రసాని ఆమె.అందువల్ల ఆమెకు ఊళ్ళో బువ్వ దొరకని రోజుండేది కాదట. ఎక్కువ దొరికిన రోజు ఇంట్లో అందరి తోపాటు చుట్టు ఉన్న బిచ్చగాళ్లకు ఆమె బువ్వ పెట్టేది. అవ్వ (తల్లి) నుండి నేర్చుకున్న కొడుకు 10 రూపాయల్లో ఒక్క రూపాయి పక్కకు పెట్టి తమ గ్రామ శివార్లలో ఒంటికి చినిగిన బట్ట పేగులతో బతికే స్త్రీలకు చీర కొనిచ్చే పని మొదలుపెట్టాడు. క్రమంగా బీహెచ్ఈఎల్లో కార్మిక నాయకుడ య్యాడు. తనతో పాటు అతి చిన్న ఉద్యోగులను పర్మనెంటు చెయ్యాలని పోరాటాలు మొదలుపెట్టి కార్మికుల హక్కు కోసం అలుపెరుగని పోరాటాలు చేశాడు. ఈ క్రమంలో తెలుగులో చదవడం నేర్చు కున్నాడు.గ్రామ స్థాయిలో దళితుల భూములను (ముఖ్యంగా ఇనామ్ భూములు) భూదందా దారులు ఆక్రమించకుండా కాపాడే పోరాటాలు చేశాడు. క్రమంగా ఆర్థికంగా పుంజుకుంటూ కంప్యూటర్ సమస్య బీద విద్యార్థులు ఎదుర్కోగానే చిన్న కంప్యూటర్ సెంటర్ ప్రారంభించి బీద విద్యా ర్థులకు నేర్పించే ఏర్పాటు చేశాడు. కరోనా రాక ముందే అనాథ పిల్లలను తెచ్చి తన తాతకు ఇనాముగా వచ్చిన భూమిలో గదులు కట్టి తన పిల్లలు చదువుకున్న ఇంగ్లిష్ మీడియం బడుల్లో చేర్పించాడు. కరోనాతో ఆ సేవ ఆపాల్సి వచ్చింది. అప్పుడు ఆకలితో అలమటిస్తున్న వలస కూలీలకు బువ్వ బండి ప్రారంభించాడు. తన సొంత ఆదాయం నుండి ఖర్చుపెట్టి రోజుకు 400 మందికి మిల్లెట్ బ్రేక్‌ఫాస్ట్ రోజూ పెట్టేవాడు. ఆ బువ్వ బండి ఇప్పటికీ నడుస్తోంది. ఆ క్రమంలోనే నా సలహాతో ‘ఫూలే–అంబేడ్కర్ సెంటర్ ఫర్ ఫిలాసఫీ అండ్ ఇంగ్లిష్ ట్రైనింగ్’ ప్రారంభించాడు. దీన్ని చట్టపరంగా నడిపేందుకు ‘అమృత–సత్తయ్య కొల్లూరి ఎడ్యుకేషన్ సొసైటీ’ స్థాపించాడు. 2022 జనవరి 26న ప్రారంభమైన ఈ ఫిలాసఫీ–ఇంగ్లిష్ ట్రైనింగ్ దాదాపు 500 మందిని 23 రాష్ట్రాల నుండి సెలెక్ట్ చేసి ప్రతి 40 మందితో బ్యాచ్‌కి నెలరోజులు ఉచిత వసతి, ఉచిత తిండితో ట్రైనింగ్ ఇచ్చారు. ఈ సత్తయ్యే 2024 జనవరి 30న తెల్లాపూర్‌లో గద్దర్ విగ్రహాన్ని స్థాపించాడు. దానికి ప్రభుత్వం 10 కుంటల భూమి ఇచ్చింది.సత్తయ్యను మట్టిమేధావి (ఇంగ్లిష్‌లో ఇటువంటి వారినే ఆర్గానిక్ ఇంటలెక్చువల్స్) అని ఎందుకన్నారని నన్ను కొంతమంది అడిగారు. ఆయన పెద్దగా చదువుకోలేదు కానీ దళితుల, ఆది వాసుల, శూద్ర, బీసీలలో బీద పిల్లల చదువుల గురించి చాలా కృషి చేస్తున్నాడు. మట్టి అన్ని ఉత్ప త్తులకు మూలం. ఉత్పత్తులకు మతం మూలం లేదు. మట్టికి–గింజకు, మట్టికి–జంతు వుకు ఉన్న సంబంధాన్ని మట్టిలో పనిచేసే మనుషులే మేధా వులై కనిపెట్టారు. ఇక్కడే మొట్టమొదట మానవ తత్వశాస్త్రం పుట్టింది. స్త్రీ కడుపులో పుట్టిన మను షులు తిరిగి మట్టి బొందలోకి పోయేవరకు మట్టిని ప్రేమిస్తారు. మట్టితో పోరాడుతారు. అన్ని ఉత్పత్తి సంబంధాలు, మానవ సంబంధాలను మట్టిలో పని చేసే మనుషులు... పుస్తకాలు, మతాలు లేక ముందే ఏర్పర్చుకున్నారు. మట్టి మేధావులు... పుస్తకాలు, మతాలు సమాజంలోకి రాకముందే సమాజాలను అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. అయితే భారత దేశంలో మతాలు, వేదాలు వచ్చాక శూద్రుల్లో, దళితుల్లో, ఆదివాసుల్లో ఇటువంటి మట్టి మేధా వులు ఉన్నారు. కాబట్టి వారిని చదువుకు, రాతకు, మతాలను నడపడానికి దూరంగా ఉంచారు. కాల్ప నిక, ఊహాజనిత అంశాలపై పుస్తకాలు రాసేవారు మేధావులనీ; రైతులు, కార్మికులు సత్తయ్యలా మానవత్వంతో సమాజాన్ని మార్చుకుంటూ వచ్చిన వారిని అసలు గుర్తించని సాహిత్యం తయారు చేశారు. ఇటువంటి ఉత్పత్తి సంబంధ రహిత రచయితలను ‘వట్టి మేధావులు’ అనాలి.ఈ దేశంలో కాళిదాసు నుండి కాళోజీ వరకు ఊహాజనిత కవిత్వాన్ని కావ్యాల రూపంలో రాసినవాళ్లే. కాళిదాసు ‘మేఘ సందేశం’లో భూమి మీదికి తొయ్యబడ్డ యక్షుడు మేఘం ద్వారా కైలాసంలో ఉన్న భార్యకు పంపిన ప్రేమ సందేశంలో ఈ దేశ వర్ణన అంతా ఊహాజనితమైందే. ఇక్కడి వ్యవసాయ భూములు, వాటిలో పంటలు పండిస్తున్న రైతుల గురించి ఒక పద్యం కూడా అందులో లేదు. మహాకాళి ఆలయ వర్ణన ఉంది గానీ, మహా ఉత్పత్తి రంగమైన పంటపైగానీ, శ్రమచేసి పండించే రైతు బతుకుపై కానీ ఒక పద్యం కూడా లేదు.ఆనాటి సంస్కృత సాహిత్య ఉత్పత్తి వ్యతిరేక వారసత్వం ప్రాంతీయ భాషల్లోకి కూడా పాకి శ్రమను గౌరవించని, లేదా శ్రమను పట్టించుకోని రచయితలు పుట్టుకొచ్చారు. అందుకే ఈ సాహి త్యానికి ప్రపంచ గుర్తింపు లభించలేదు. ప్రకృతి వర్ణన స్త్రీ పురుషుల ప్రేమ కోసమో, యుద్ధ నిర్మా ణాల అవసరాల కోసమో కాదు చెయ్యాల్సింది. ప్రకృతిని ప్రజల శ్రమ జీవనంతో ముడేసిన రచనలు దేశంలో వచ్చినప్పుడు సాహిత్యం సార్వ జనీనత్వం సంతరించుకుంటుంది.గద్దర్ పాటల సాహిత్యంలో పుట్టుకొచ్చిన మట్టి చేతులకు గౌరవం గానీ, సత్తయ్య మాన వత్వపు మట్టిమేధావితత్వం గానీ సమాజాన్ని రోజువారీగా అభివృద్ధి వైపు పయనింపజేస్తుంది. మట్టి మేధావులకు వట్టి మేధావులకు ఉండే తేడా... భూమిపైన మానవ సమానత్వ స్వర్గాన్ని సృష్టించడానికీ, మనుషులు చనిపోయాక స్వర్గం చూపెట్టే తత్వానికీ ఉండే తేడా! మొదటి ఆలోచనలో దేవుడు శ్రమ గౌరవ వాది. రెండవ ఆలోచనలో దేవుడు శ్రమ వ్యతిరేకవాది. ఉత్పత్తి కులాలను ప్రేమించ లేని కుల సమీకరణలు సాహిత్య రంగాన్ని యుద్ధ మయం, ప్రేమమయం చేశాయి. అందుకే సత్తయ్య లాంటి వారి ఆత్మకథలను పిల్లలు చదివినప్పుడు ఉత్పత్తి, శ్రమ, సర్వజంతు ఆదరణవాదులౌతారు. జంతువుల్లో ఒక దాన్ని ఎన్నుకొని పూజించడం జంతుజాతిని కాపాడదు. అన్ని జంతువులనూ ప్రేమించి మేపాలి.భూములు పంచిన భూస్వాములున్నారు. ఆస్తులొదిలి స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న అగ్ర కులస్థులున్నారు. కానీ వాళ్ళు మానవ సమా నత్వాన్ని కోరుకోవడంలో విఫలమయ్యారు. ముఖ్యంగా విద్యా సమానత్వం రూపొందించాలనే ఆలోచనకు వాళ్ళ కులం అడ్డొచ్చింది. సత్తయ్య మాత్రం తాను బడిలో, కాలేజీలో, యూనివర్సి టీలో చదువుకోక పోయినా అంబేడ్కర్ లాగా, మహాత్మా ఫూలే లాగా ఈ దేశ బీద పిల్లలు ఇంగ్లి ష్లో చదువుకొని వాళ్ళ సిద్ధాంతాలను నేర్చుకొని దేశ మార్పునకు కృషి చెయ్యాలని పనిచేస్తున్నాడు.అందుకే సత్తయ్యను మట్టి మేధావి అనాలి. వట్టి మేధావులు కూడా ఆయన జీవిత చరిత్ర చదివి నేర్చుకుంటే దేశానికి మేలు చెయ్యగలరు.ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత,సామాజిక కార్యకర్త -
సంకీర్ణంతో సామరస్యం నెలకొనేనా?
‘ఇండియా’ కూటమి కుల జనగణనను అంగీకరిస్తూ, బీజేపీ 400 సీట్లతో గెలిచి ఏకంగా రాజ్యాంగాన్ని మార్చెయ్యాలని చూస్తున్నదనీ, మొత్తం రిజర్వేషన్లను రద్దు చెయ్యాలనుకుంటోందనీ పెద్దఎత్తున ప్రచారం చేసింది. ఇది కచ్చితంగా ఓటర్ల మీద ప్రభావాన్ని చూపించింది. దాంతో ఫలితాలు బీజేపీని సంకీర్ణంలోకి నెట్టాయి. మోదీ సంకీర్ణ ప్రభుత్వాన్ని వారి సిద్ధాంతంతోనైనా వాజ్‌పేయిలా నడిపే వ్యక్తి కాదు. మోదీని ముస్లిం దేశాలు బద్దశత్రువుగా చూసే అవకాశముంది. ఆరెస్సెస్/బీజేపీ ఆయనను కాక మరో వ్యక్తిని ప్రధానిగా ప్రతిపాదించి కాస్త సామరస్య వాతావరణంలో దేశాన్ని నడవనిచ్చే అవకాశమున్నది. కానీ మోదీ తప్పుకొనే అవకాశం కనబడటం లేదు. అందుకు ప్రత్యర్థి కూటమి ప్రత్యామ్నాయంగా బలపడటం తప్ప మార్గం లేదు.2024 ఎన్నికలు దేశ చరిత్రలో చాలా విచిత్రమైనవి. దేశస్థాయిలో మోదీ నాయకత్వంలోని బీజేపీని సంకీర్ణంలోకి నెట్టాయి. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సాల్లో పరిపాలిస్తున్న రెండు పార్టీలూ ఓడిపోయాయి. ముఖ్యంగా వైసీపీ ఓటమి చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే దేశం ఒక పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డ ఎన్నిక కూడా ఇది. బీజేపీ 240కి పడిపోవడం ఒక రక్షణ కవచం.ఈ ఎన్నికతో చాలా ఘోరంగా పతనమైపోతుందనుకున్న కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు దేశాన్ని ఒక పెద్ద ప్రమాదం నుంచి కాపాడాయి. ఉత్తరప్రదేశ్‌లో బుల్డోజర్ వ్యవస్థకు చెక్ పడింది. మొత్తం బీజేపీ శక్తులు ‘పప్పు, పప్పు’ అని ఎద్దేవా చేసిన రాహుల్ గాంధీ... ఒక దళిత మల్లిఖార్జున్ ఖర్గే నేతృత్వంలో ఎవరూ ఊహించనట్టు మ్యానిఫెస్టోను దేశం ముందు పెట్టి మోదీ, అమిత్‌షాల 400 సీట్లు తెస్తారన్న బీజేపీని 240 సీట్లకు పడేసి దేశాన్ని చాలా పెద్ద ప్రమాదం నుంచి కాపాడారు.‘ఇండియా’ కూటమి కాంగ్రెస్ మ్యానిఫెస్టోను సొంతం చేసుకొని దేశమంతటా ప్రచారం చేసింది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కాంగ్రెస్ మ్యానిఫెస్టోను ఈ ఎన్నికల ‘హీరో’ అన్నారు. ‘ఇండియా’ కూటమి కుల జనగణనను అంగీకరిస్తూ, బీజేపీ 400 సీట్లతో గెలిచి ఏకంగా రాజ్యాంగాన్ని మార్చెయ్యాలని చూస్తున్నదనీ, మొత్తం రిజర్వేషన్లను రద్దు చెయ్యాలనుకుంటోందనీ పెద్దఎత్తున ప్రచారం చేసింది. ఈ ప్రచారం కచ్చితంగా చాలామంది ఓటర్ల మీద ప్రభావాన్ని చూపించింది. నరేంద్ర మోదీ దీన్ని తట్టుకోవడానికి ముస్లింల రిజర్వేషన్లు ఎత్తేసి బీసీలకు ఇస్తామని పదేపదే మాట్లాడారు. కానీ చంద్రబాబు, నితీష్ కుమార్ వంటివారు దాన్ని అంగీకరించలేదు. ఇప్పుడు ఈ ఇద్దరు లేకుండా బీజేపీ ప్రభుత్వం నిలబడదు. అయితే అటు నితీష్ గానీ, ఇటు చంద్రబాబు గానీ మోదీకి మంచి మిత్రులు కారు. ఇద్దరూ మోదీని, షాని వ్యతిరేకించి శత్రుస్థానంలో పెట్టి, వారితో పోరాడినవాళ్లే. అయితే ఆ ఇద్దరు ఇప్పుడు ‘ఇండియా’ కూటమి దేశానికి, రాజ్యాంగానికి ప్రమాదకరమైనదని ప్రచారం చేస్తున్న మోదీని ప్రధానమంత్రిని, షాను మళ్లీ హోంమంత్రిని చేసి దేశ అభద్రతకు బాధ్యులవుతారా? లేక బీజేపీలోని మరో వ్యక్తిని ప్రధానమంత్రిని చెయ్యమని సలహా ఇస్తారా? చూడాలి.మోదీ ప్రభుత్వం చంద్రబాబుకు దూరమైన గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌కు ఎన్నో తీవ్ర నష్టాలను చేసింది. ఆంధ్ర పెట్టుబడిదారులనెవ్వరినీ నిర్మాణం రంగంలో గానీ, పెద్ద బిజినెస్‌లలో గానీ నిలువనివ్వలేదు. బ్యాంకుల విలీనం చేసినప్పుడు బరోడా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్ వంటి వాటిని ఆ పేర్లతోనే ఉంచి ఆంధ్రా బ్యాంక్‌ను మాత్రం యూనియన్ బ్యాంక్‌లో విలీనం చేశారు. మొదటి నుండి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకు వ్యతిరేకంగా ఉన్నారు. ఈ అన్నింటి రీత్యా ఇప్పుడు చంద్రబాబుపై ఆధారపడే కేంద్ర ప్రభుత్వానికి బాబు ఎటువంటి కండిషన్లు పెడతారు?అటు కాంగ్రెస్‌తో 2019లో తెలంగాణలో పొత్తులో పోటీ చేసింది టీడీపీ. కాంగ్రెస్ తమ ప్రభుత్వం వస్తే ప్రత్యేక హోదా తప్పకుండా ఇస్తామంటోంది. చంద్రబాబు, నితీష్‌కుమార్ ఒక నిర్ణయం తీసుకుంటే, మోదీ, అమిత్ షాలను ఇంటికి పంపగలరు. అయితే చంద్రబాబుకు ఇప్పుడున్న స్థితిలో అది చిన్న నిర్ణయం కాదు. మోదీ సంకీర్ణ ప్రభుత్వాన్ని వారి సిద్ధాంతంతోనైనా వాజ్‌పేయిలా నడిపే వ్యక్తి కాదు. ఎన్నికల ప్రచారంలో ఆయన దేశంలోని మొత్తం ముస్లింల మీద అక్కసు కక్కారు.గుజరాత్‌లోని 2002 మత కల్లోలం తరువాత జరిగిన ఈ ముస్లింల వ్యతిరేక ప్రచారం ఆయన్ని ఇంకా పెద్ద ముస్లిం వ్యతిరేకిగా నిలబెడుతుంది. ప్రపంచ పత్రికలన్నీ ఆయన్ని ‘గ్రేట్ డివైడర్’ అని రాశాయి. ముస్లిం దేశాలు ఈ ఎన్నికల తరువాత ఆయన్ని బద్ధశత్రువుగా చూసే అవకాశముంది. ఆరెస్సెస్/బీజేపీ ఆయన్ని కాక మరో వ్యక్తిని ప్రధానిగా ప్రతిపాదించి కాస్త సామరస్య వాతావరణంలో దేశాన్ని నడవనిచ్చే అవకాశమున్నది. కానీ ఆరెస్సెస్/బీజేపీ క్యాడర్ మోదీ, అమిత్ షాల పరిపాలనలో సుఖాలను అనుభవించడం నేర్చుకున్నారు. వారికి ఈ భోగం మరో నాయకుల నేతృత్వంలో దొరకదు. అందువల్ల ఆరెస్సెస్‌లో కూడా వారు చెప్పిందే నడుస్తుంది.గుజరాత్ పెట్టుబడి దేశాన్ని మొత్తం తన గుతా«్తధిపత్యంలోకి తీసుకుంది. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న ఏ రాష్ట్రం నుండి కూడా గుజరాత్ పెట్టుబడిదారులకు ధీటుగా పోటీపడే పరిస్థితి లేదు. తెలుగు రాష్ట్రాల నుండి నిర్మాణ రంగంలో గుజరాతీ పెట్టుబడిదారులకు ధీటుగా ఎదిగిన జీవీకే కంపెనీని బొంబాయి ఎయిర్పోర్ట్ నుండి తప్పించి మోదీ, షాలు అదానీకి అప్పజెప్పారు. తమకు ఎదురు తిరిగిన రాజకీయ నాయకులపై సీబీఐ, ఈడీలను ప్రయోగించి జైలుపాలు చేశారు. ఈ పరిస్థితి నుండి దేశం బయట పడాలంటే మోదీ, షాలు అధికారం నుండి పోవడమొక్కటే మార్గం. అందుకు ప్రత్యర్థి కూటమి ప్రత్యామ్నాయంగా బలపడటం తప్ప మరో మార్గం లేదు. అందుకు ‘ఇండియా’ కాస్త దారి చూపింది. ఈ స్థితిలో ‘ఏ కూటమితోనూ ఉండను’ లాంటి నిర్ణయాలు నష్టం చేస్తాయి. ఎప్పుడైనా ప్రాంతీయ పార్టీలు జాతీయ స్థాయి వ్యవస్థల్ని శాసించలేవు. నిజానికి, ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేనతో – బీజేపీ చేరి ఎన్నికల కమిషన్‌ను అటు తిప్పింది అనేది స్పష్టంగా కనిపిస్తోంది. కీలక స్థలాల్లో వైసీపీ కీళ్లు విరిచే ప్రయత్నం చేసింది.రాహుల్ గాంధీ దేశంలో అన్ని సభల్లో ఎన్నికల సంఘం నిష్పక్షపాత్రను ప్రశ్నిస్తూ వచ్చారు. సీబీఐ, ఈడీ, ఎలెక్టోరల్ బాండ్స్, ఇతర పార్టీల ఆదాయాలను అడ్డుకోవడం, ఉన్న పార్టీ డబ్బును ఎన్నికల్లో వాడకుండా చూడటం, ఇన్‌కమ్‌టాక్స్ వంటి సంస్థల ద్వారా బంధించడం... ఈ స్థితిలో అన్ని ప్రాంతీయ పార్టీలు తమ ఉనికిని కాపాడుకోవాలంటే ఒక జాతీయ కూటమిలో చేరి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడే నిర్ణయాల్లో, పోరాటాల్లో భాగం కాకపోతే ముందు ముందు బీజేపీ ప్రాంతీయ పార్టీలను తమ బందీలను చేస్తుంది.కాంగ్రెస్ ముఖ్యంగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర, భారత్ జోడో న్యాయ యాత్ర తరువాత ఆరెస్సెస్/బీజేపీలను నిలువరించే ప్రయత్నం చేశారు. దేశంలోని ప్రాంతీయ పార్టీలు డీఎంకే లాగ ఒక ప్రత్యామ్నాయ తాత్విక పునాదితో నిర్మించినవి కావు. అందుకే డీఎంకేని బీజేపీ సనాతన ధర్మం చుట్టూ రాద్దాంతం చేసి ఓడించాలని చూసింది. కానీ దాని ద్రావిడ, శూద్ర సిద్ధాంతరంగం కాపాడింది. బీజేపీ అక్కడ ఒక్క సీటు కూడా గెలవలేదు. ఇప్పుడు పార్లమెంట్ పోరాటం... రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రిజర్వేషన్లను కాపాడాలనే ‘ఇండియా’ కూటమికీ, ఆరెస్సెస్ సిద్ధాంతాన్ని దేశంలో నాటి, మత సమస్యను ముందు పెట్టి దేశంలో ఉత్పత్తి కులాలను అణగదొక్కే ఎన్డీఏలోని ఆధిపత్య బీజేపీకీ మధ్య జరుగుతుంది. ఎన్డీయే కూటమిలోని నితీష్ కుమార్, చంద్రబాబుకు బీజేపీ రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలకు చెక్ పెట్టే అవకాశమొచ్చింది. ఈ ఇద్దరు నాయకులు ఏం చేస్తారనేది చూడాలి. చంద్రబాబు 2002లో మోదీని ముఖ్యమంత్రి పదవి నుండి దింపే స్థితిలో ఉండి కూడా ఆయన్ని కొనసాగించే బీజేపీ నిర్ణయానికి మద్దతిచ్చారు. మళ్లీ ఈ కీలకదశలో ఆయనకు ఒక అవకాశమొచ్చింది. ‘ఇండియా’ కూటమి దేశంలోని మొత్తం ప్రతిపక్ష పార్టీలను తమ పక్కన చేర్చుకోవాల్సిన అవసరముంది. ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
బీద పిల్లల గురించి ఆలోచించండి!
ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ వాళ్లు గ్రామీణ విద్యా వ్యవస్థను ప్రాంతీయ భాషామయం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ పిల్లలు చదువుకునే ప్రభుత్వ యూనివర్సిటీలలో ఇంగ్లిష్‌ను క్రమంగా తీసేసి ప్రాంతీయ భాషను, ముఖ్యంగా హిందీని రుద్దుతున్నారు. కానీ పెట్టుబడిదారుల యూనివర్సిటీల్లో ఇంగ్లిష్ భాష, విదేశీ సిలబస్ ద్వారా చదువు చెప్పి తిరిగి దేశ నాయకత్వాన్ని మొత్తం వారి చేతికి అప్పజెప్పే కుట్ర జరుగుతోంది. జగన్ ప్రభుత్వం విద్యా సమానత్వం కోసం అన్ని రకాల కుట్రలకూ వ్యతిరేకంగా తీవ్రమైన పోరాటం చేసి స్కూలు విద్యను మార్చింది. తెలుగుకు ప్రాధాన్యమంటూ ఇంగ్లిష్ మీడియం తీసివేస్తే పూర్తిగా నష్టపోయేది బీసీ, ఎస్సీ, ఎస్టీలు. జాగ్రత్తగా ఆలోచించి ఓటెయ్యకపోతే, బీద పిల్లల భవిష్యత్ అంధకారమౌతుంది.దేశంలో ఎన్నికలు మొదటిసారి ఓబీసీల (వెనుకబడిన తరగతుల) చుట్టూ తిరుగు తున్నాయి. ఓబీసీల్లో అన్ని శూద్ర కులాలు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో కొన్ని శూద్ర వ్యవసాయ కులాలు రిజర్వేషన్లలో లేకపోవచ్చు. కొన్ని రాష్ట్రాల్లో ఉండొచ్చు. ఉదాహరణకు రెడ్డి, కమ్మ, కోస్తా కాపు కులాలు రిజర్వేషన్లలో లేవు. కర్ణాటకలో, తమిళనాడులో అన్ని శూద్ర కులాలు రిజర్వేషన్లలో ఉన్నాయి. లింగాయత్, వక్కళిగ, నాయకర్ (పెరియార్ కులం) కులాలు కూడా ఆ రాష్ట్రాల్లో రిజర్వేషన్లలో ఉన్నాయి.చారిత్రకంగా వర్ణ వ్యవస్థలో నాలుగవ వర్ణం శూద్రులు. వేద కాలంలో వారు బానిసలు. తరువాత వ్యవసాయ, కుటీర పరిశ్రమ, పశుపోషణ వంటి అన్ని ఉత్పత్తి పనులు చేసి దేశాన్ని ఈ స్థితికి తెచ్చింది ఈ కులాలే. క్రమంగా వీరి నుండి విడగొట్టబడి అంటరాని వారుగా అణగదొక్కబడ్డవారు దళితులు. వీరు కాక అరణ్య జీవనం నుండి అందరిలో కలిసే ప్రయత్నం చేస్తున్నవారు ఆదివాసులు.ఇంగ్లిష్ మీడియం వంటి సమాన విద్యే ఈ కుల వ్యవస్థను కూల్చుతుందని మనకు ఈమధ్య కాలంలోనే అర్థమవుతోంది. అందుకు మంచి ఉదాహరణ ఈ సంవత్సరం 10వ తరగతిలో ఇంగ్లిష్ మీడియంలో చదువుకున్నవారు ఆంధ్రలో 91 శాతం పాస్ అయితే, తెలంగాణలో 93 శాతం పాసయ్యారు. తెలుగు మీడియంలో చదువుకున్నవారు 80 శాతంగానే పాసయ్యారు.రిజర్వేషన్ల మాటేమిటి?అయితే 2024 ఎన్నికల్లో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చడం, అందులో ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లను క్రమంగా ఎత్తివేసే సవరణ చెయ్యడం గురించి చర్చ జరుగుతోంది. ఈ భయం బీజేపీ బయట ఉన్న వారికే కాదు, బీజేపీలో ఉన్నవారికి కూడా ఉన్నది. అయితే మరి మూడోసారి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయితే ఆయన బీసీ అని చెబుతున్నారు కనుక ఎలా తీసేస్తారు అనే ప్రశ్న ఉత్పన్నమౌతుంది? ఆరెస్సెస్ 1950లో రాజ్యాంగాన్ని డాక్టర్ అంబేడ్కర్ ఆనాటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్‌కు అందించి అమలు చేసిన నాటి నుండి ఎస్సీ, ఎస్టీలకు అందులో పొందుపర్చిన రిజర్వేషన్ల పట్ల వ్యతిరేకతతో ఉంది. అంతకంటే ముఖ్యంగా 1955లో కాకా కాలేల్కర్ బీసీ రిజర్వేషన్ రిపోర్టును ఆనాటి నెహ్రూ ప్రభుత్వం తిరస్కరించినప్పుడు ఆరెస్సెస్ మంచి పని జరిగింది అనే ధోరణిలో ఉంది.అయితే 1990లో వీపీ సింగ్ ప్రభుత్వం బీపీ మండల్ రిపోర్టును అమలు చేసినప్పుడు ఆరెస్సెస్/బీజేపీ వ్యతిరేకించాయి. ఆనాడు కాంగ్రెస్ కూడా వ్యతిరేకించింది. కాంగ్రెస్‌లో ఉన్న బీసీ నాయకులు కొంతమందైనా బీసీ రిజర్వేషన్లను సపోర్టు చేశారు. కానీ బీజేపీలో ఉన్న బీసీల్లో ఒక్క ఉమాభారతి తప్ప వేరే ఏ ఒక్క బీసీ లీడర్ కూడా బీసీ రిజర్వేషన్లను సపోర్టు చెయ్యలేదు. నరేంద్ర మోదీ ఆనాడు రిజర్వే షన్లను సపోర్టు చెయ్యలేదు. ఆయన బీసీ అని కూడా ఎవ్వరికీ తెలియదు. గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యాక మాత్రమే ఆయన బీసీగా ప్రచారం ప్రారంభించారు.2014 ఎన్నికలకు ముందు ఆ ప్రచారాన్ని బాగా పెంచారు. ప్రధానంగా ఆనాడు బీసీల ఓట్లతో ఆయన గెలిచారు. అందుకు ఫలితంగా ఆయనగానీ, బీజేపీ/ఆరెస్సెస్ ప్రభుత్వంగానీ గత పదేండ్లలో బీసీలకు ఏమి ఇచ్చారు? మొత్తం శూద్ర సమాజం బతికేది వ్యవసాయ రంగం మీద. దాన్ని మొత్తంగా గుజరాత్–ముంబయి బడా పెట్టుబడిదారులకు అప్పగించేందుకు ఘోరమైన వ్యవసాయ వ్యతిరేక చట్టాలు తెచ్చారు. శూద్ర/బీసీలు ఇంతో అంతో బతికేది వ్యవసాయ ఉత్పత్తి, వ్యవసాయ మార్కెట్ల మీద. వాటిని బడా పెట్టుబడిదారులకు అప్పజెప్పాలని చట్టాలు చేస్తే శూద్ర/బీసీ రైతులు ఎంత పోరాటం చేశారో వ్యవసాయదారులందరికీ తెలుసు. బీసీ, ఎస్సీ, ఎస్టీ పిల్లల స్కాలర్షిప్లు మొత్తం తగ్గించివేశారు. వీరు చదువుకునే ప్రభుత్వ యూనివర్సిటీలలో ఇంగ్లిష్‌ను క్రమంగా తీసేసి ప్రాంతీయ భాషను ముఖ్యంగా సెంట్రల్ యూనివర్సిటీల్లో హిందీని రుద్దుతున్నారు. కానీ పెట్టుబడిదారుల యూనివర్సిటీల్లో కేవలం ఇంగ్లిష్ భాష, విదేశీ సిలబస్ ద్వారా చదువు చెప్పి తిరిగి దేశ నాయ కత్వాన్ని మొత్తం వారి చేతికి అప్పజెప్పే కుట్ర జరుగుతోంది.చాలా విచిత్రంగా ఈ ఎన్నికల్లో ముస్లిం రిజర్వేషన్లను తీసేసి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇస్తామంటున్నారు. మోదీ, అమిత్ షా ఈ ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నారు. అసలు ముస్లింలకు రిజర్వేషన్లు యూపీ ఎస్సీలో ఉన్నాయా? కొన్ని రాష్ట్రాల్లో 4 శాతం లేదా అంతకంటే తక్కువ ఉన్నాయి. మొత్తం పారిశ్రామిక రంగాన్ని ప్రైవేటీకరిస్తూ, బీసీ, ఎస్సీ, ఎస్టీల పిల్లల్ని ఇంగ్లిష్ మీడియంలో చదువుకోవడాన్ని వ్యతి రేకిస్తూ ముస్లింలకు తగ్గించేది ఎక్కడ? బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చేది ఎక్కడ?ప్రధానమంత్రి బీసీని అని చెబుతూ నా సిద్ధాంతం ‘సనాతన ధర్మం’ అంటే ‘వర్ణధర్మం’ అంటున్నారు. బీసీలు శూద్ర వర్ణం వారు కదా! సనాతన ధర్మం వారిని దైవ పాదాల నుండి పుట్టించింది కదా! అయినా మళ్ళీ ఈ రాజ్యాంగాన్ని మార్చకుండా శూద్రులందరినీ ఏ దేవుని పాదాల్లో పుట్టిస్తారు? ఈ రాజ్యాంగం ఆ పాదాల, తొడల, భుజాల, తల పుట్టుకను రద్దు చేసి అందరి పుట్టుకను సమానం చేసింది. బీసీ ప్రధానమంత్రి చిన్నప్పుడు చాయ్ అమ్మి ఉండవచ్చు. కానీ మట్టి మోసి, మనుషుల మలాన్ని ఎత్తివేసే పనులు చేసే పిల్లల్ని కనీసం చాయ్ వ్యాపారంలోకి కూడా రానియ్యలేదే! దళితులు చాయ్ చేస్తే ఈ దేశంలో పై కులాలు ఇప్పటికీ తాగడం లేదే! మానవ మను గడకు మూలం వ్యవసాయం; ఆ పని చేసేవారంతా శూద్ర బీసీలు. వారికి బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, ఖత్రీలు, కాయస్తులతో సమాన విద్య, సమాన పని హక్కు కల్పించే ఈ రాజ్యాంగాన్ని మార్చకుండా మళ్ళీ సనాతన ధర్మాన్ని స్థాపించడం సాధ్యం కాదు. ఇక్కడే బీసీలు జాగ్రత్తగా ఆలోచించాలి. మే 5న ఆంధ్రప్రదేశ్ బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడుతూ, తమ ప్రభుత్వం రాగానే తెలుగుకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. తెలుగుకు ప్రాధాన్యమంటే, ఇంగ్లిషు మీడియం తీసేయడమా? మరి అమిత్ షా తన కొడుకు జయ్ షాను గుజరాతీ మీడియంలో ఎందుకు చదివించలేదు? అదే అమిత్ షా... ధీరూబాయి అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో మరాఠీ/గుజరాతీ మీడియం ఎందుకు పెట్టించలేదు? ఆంధ్రప్రదేశ్ బీసీ, ఎస్సీ, ఎస్టీలు జాగ్రత్తగా ఆలోచించి ఓటు వెయ్యకపోతే, బీద పిల్లల భవిష్యత్ అంధకార మౌతుంది.ఓటు వేసే ముందు... జగన్ ప్రభుత్వం విద్యా సమానత్వం కోసం అన్ని రకాల కుట్రలకు వ్యతిరేకంగా తీవ్రమైన పోరాటం చేసి స్కూలు విద్యను మార్చింది. ఇంగ్లిష్ మీడియం తీసివేస్తే పూర్తిగా నష్టపోయేది బీసీ, ఎస్సీ, ఎస్టీలు. అమిత్ షా ప్రకటన చాలా ప్రమాదకర హెచ్చరిక. ఈ మధ్య కాలంలోనే మోదీ తమ ఎంపీ అభ్యర్థులందరికీ ఉత్తరాలు రాస్తూ అమిత్ షాను ఆకాశానికి ఎత్తారు. మోదీ తరువాత అమిత్ షానే ప్రధానమంత్రి అనే డైరెక్షన్ ఇచ్చారు. ఆయన బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇంగ్లిష్ విద్య రానియ్యకూడదనే పట్టుదలతో ఉన్న వ్యక్తి.ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల్లో గ్రామీణ విద్యా వ్యవస్థను ప్రాంతీయ భాషామయం చేశారు. కానీ పెద్ద పెట్టుబడిదారులు వారి పిల్లల్ని ఇంగ్లిష్ తప్ప మరో భాష రాకుండా చూసుకుంటున్నారు. వీరి నేతృత్వంలో రేపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడిస్తే, సమస్త భవిష్యత్ దెబ్బతింటుంది. గుజరాత్లో ఎప్పుడైనా ఆంధ్ర పాలకుల నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం నడవగా చూశామా! ఆంధ్రప్రదేశ్‌లో కూటమికి ఓటు వేసే ముందు మొత్తం ప్రజలు ఆలోచించాల్సింది ఇదే.ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
నూతన విద్యా విప్లవం వర్ధిల్లాలంటే...
గత ఐదేండ్లలో దేశంలో ఎక్కడా లేని విద్యా విధానం ఆంధ్రప్రదేశ్‌లో అమలైంది. కానీ తమ పిల్లల్ని ఖరీదైన ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో చదివించిన వారు... పేదలు తమ పిల్లలకు ఇంగ్లిష్ మీడియం ప్రభుత్వ స్కూళ్లలో కావాలని కోరుకుంటే వ్యతిరేకించారు. ఇది విచిత్ర చారిత్రక సన్నివేశం. దేశంలో ప్రయివేట్ విద్య ఎంత ఖర్చుతో కూడుకున్నదో, ఏ భాషలో సాగుతున్నదో తెలియదా? ప్రజా మేధావులకు తెలివి కన్నా, బీద ప్రజల పక్షాన నిలబడే హృదయం ఉండాలి కదా! దేశ చరిత్రలో మొదటిసారి విద్యా సమానత్వ ప్రయోగాన్ని జగన్ ప్రభుత్వం చేస్తోంది. ఆ ప్రక్రియను వ్యతిరేకించే మూడు పార్టీల కూటమిని సమర్థించే మేధావులను ప్రజలు వ్యతిరేకించాల్సింది... తమ పిల్లల భవిష్యత్తు కోసం! 2024 ఆంధ్ర ఎన్నికలు గత రెండు ఎన్నికల కంటే పూర్తిగా భిన్నమైనవి. 2014లో ఒకవైపు మూడు పార్టీల కూటమికీ, వైసీపీకీ రాష్ట్ర విభజన నేపథ్యంలో జరిగాయి. అప్పుడు కేంద్రంలో రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఆనాడు కొత్త రాష్ట్ర రాజధాని, ప్రత్యేక ప్యాకేజీ ప్రధాన అంశాలు. 2019 ఎన్నికల్లో అన్ని పార్టీలు విడివిడిగా కొట్లా డాయి. వైసీపీ తన కొత్త విద్యా విధానం, గ్రామాల అభివృద్ధి అంశాలతో 151 సీట్లు గెలిచింది. విడిగా పోరాడిన మూడు పార్టీలు మట్టికరిచాయి. చంద్రబాబుకు 23 సీట్లు, పవన్ కల్యాణ్‌కి 1 సీటు వచ్చాయి. గత ఐదేండ్లలో ఆ పార్టీలు ఊహించని విధంగా దేశంలో ఎక్కడా లేని విద్యా విధానం ఆంధ్రప్రదేశ్‌లో అమలైంది. దీన్ని ఏపీ నాయ కులు చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు, జయప్రకాశ్ నారాయణ తీవ్రంగా వ్యతిరేకించారు. వీరేకాక దేశ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన ఎం.వి. రమణ కూడా వ్యతిరేకించారు. సమస్య కోర్టుకు పోయింది. అక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా వ్యతిరేకించింది. సుప్రీంకోర్టు జడ్జిగా రమణకు ఇంగ్లిష్ భాష పాత్ర ఎంతో తెలుసు. అయినా వ్యతిరేకించారు. వీరుకాక మీడియా రంగంలో ఈనాడు గ్రూపు, ఆంధ్రజ్యోతి గ్రూపు, టీవీ 5 నెట్వర్క్ అధిపతులు తమ పిల్లల్ని మంచి, మంచి ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో చదివించి... రైతులు, కూలీలు, దళితులు, బీసీలు, ఆదివాసులు తమ పిల్లలకు ఇంగ్లిష్ మీడియం ప్రభుత్వ స్కూళ్లలో కావాలని కోరుకుంటే వ్యతిరేకించారు. ఇది విచిత్ర చారిత్రక సన్నివేశం. ఈ ఎన్నికల్లో మళ్ళీ 2014 నాటి ప్రతిపక్ష గుంపు జత కట్టింది. జగన్‌ను ఓడించాలని వీళ్ళు రాత్రింబవళ్లు పనిచేసేది ఎందుకోసం? ముఖ్యంగా గ్రామీణ పిల్లలకు ఇంగ్లిష్ మీడియం చదువు ఆపెయ్యడం కోసం. ఈ క్రమంలో జయప్రకాశ్ నారాయణ గురించి కొంత చర్చించాలి. ఈయన మాజీ ఐఏఎస్ అధికారి. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కొంతకాలం ఆయన పర్సనల్ సెక్రటరీగా పని చేశారు. ఆ దశలో తెలంగాణలో నక్సలైట్లకూ, తెలుగుదేశం పార్టీకీ తీవ్ర సంఘర్షణ జరుగుతున్నది. ఎన్టీఆర్ సన్నిహిత సోషలిస్టు నాయకుడొకరు కేజీ కన్నాభిరన్ (అప్పటి పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు)కు కబురుపెట్టి, ముఖ్యమంత్రితో హక్కుల నాయకులతో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగుకు నేను, కన్నాభిరన్, బాలగోపాల్, ఎం.టి. ఖాన్ వెళ్లాం. మేం వెయిటింగ్ రూంలో ఉండగా జయప్రకాశ్ నారాయణ ఆ మీటింగ్‌ను జరగ కుండా చూడాలని చాలా ప్రయత్నం చేశాడు. కానీ ఎన్టీఆర్ వినలేదు. మీటింగ్ జరిగింది. నక్సలైట్లను అణచివెయ్యాలి గానీ వారితో చర్చలేమిటని జేపీ ఆలోచన. ఆ విభాగాన్ని చూసే పోలీస్ ఆఫీసర్ అరవిందరావుది కూడా అదే ఆలోచన. మా పౌరహక్కుల టీమ్ ఇరుపక్షాల హత్యలు, కిడ్నాప్‌లు, ఎన్కౌంటర్లు ఆపించాలని తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న రోజులవి. అప్పుడు ఎన్కౌంటర్లు, టీడీపీ కార్యకర్తల కిడ్నాపులు చాలా జరిగాయి. ఆ తరువాత జయప్రకాశ్ నారాయణ ఈనాడు పేపర్, ఈటీవీ ద్వారా మేధావి అవతారమెత్తాడు. అక్కడి నుండి ఒక ఎన్జీవో పెట్టి, ‘లోక్‌సత్తా’ (అంటే ఇంగ్లిష్‌లో గ్లోబల్ పవర్) అనే రాజకీయ పార్టీ రూపందాల్చి, దానికి అలుపెరుగని, ఎన్నడూ దిగిపోని ఏకో ముఖ (అంటే ఆ పార్టీలో మరో ముఖమే కనపడదు) అధ్యక్షుడుగా ఉన్నాడు. ఇప్పుడు ఈ గ్లోబల్ పవర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని ఉన్న మూడు పార్టీల కూటమి చాలనట్లు నాలుగో పార్టీగా అందులో చేరాడు. ఇప్పుడు జేపీ లక్ష్యమంతా ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం చదువు ఆపి, మళ్లీ తెలుగు మీడియం పెట్టేంత వరకూ పోరాటం చెయ్యడం! ఆయన మరో లక్ష్యం గ్రామాలలో స్కూళ్ల నిర్మాణం, సెక్రటే రియట్ నిర్మాణాలను ఆపి అభివృద్ధికి మార్గంగా అమరావతిని సింగ పూర్లా చూపడం! అభివృద్ధిపై ప్రపంచ యూనివర్సిటీలు చదివే గొప్ప పుస్తకం ఆయన రాసినట్లు, డెవలప్మెంటల్ ఎకనామిక్స్‌లో తాను అథారిటీ అయినట్లు నిరంతర యూట్యూబ్ ఉపన్యాసాలు ఇస్తున్నారు. గ్లోబల్ పవర్ ఈనాడు నుండి ఇప్పుడు యూట్యూబ్‌కు మారింది. విద్యా వ్యవస్థ మీద కూడా జాన్‌డ్యూయి (కొలంబియా యూనివర్సిటీలో అంబేడ్కర్ గురువు) కంటే తానే మంచి ఎక్స్‌ఫర్ట్ అన్న రీతిలో ఉపన్యాసాలు ఇస్తారు. జేపీ ప్రపంచ మార్పు మీద ఇంగ్లిష్‌లోనో, తెలుగులోనో రాసిన మంచి పుస్తకం మార్కెట్లో ఉంటే చదవాలని ఉంది. కానీ ఇంతవరకు ఒక్కటీ కనిపించలేదు. 30,000 ఎకరాల భూమిని చంద్రబాబు నాయుడు తీసు కున్నప్పుడు వెంకయ్యనాయుడు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖమంత్రి. ఆయన సలహా, సహకారం లేకుండా చంద్రబాబు ఆ పని చెయ్యడు. ఇప్పుడు గ్రామీణ బడుల నిర్మాణం, ఇంగ్లిష్ మీడియం చదువు, అమ్మ ఒడి పథకం ఆపి, అమరావతి పట్టణం వచ్చే ఐదేండ్లలో కడితే ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధితో పాటు దేశానికే ఒక మోడల్ సిటీ వస్తుందని బహుశా జేపీగారి నమ్మకం. కానీ ఒక ఎనిమిదో తరగతి విద్యార్థి మా తల్లిదండ్రులు జగన్‌కు ఓటేసి గెలిపించకపోతే, ఇంగ్లిష్ మీడియం ఆగి పోతే, నాకొచ్చే బట్టలు, బూట్లు ఆగిపోతే నేను ఉన్న బట్టలు సర్దుకుని ఇంట్లోనుండి పారిపోతాను అన్నాడు. ఆ పిల్లోడి ఆశను ఏం చెయ్యా లని ఈ నాయకులు అనుకుంటున్నారు? ప్రజా మేధావికి తెలివి కన్నా, వాగ్దాటి కన్నా బీద ప్రజల పక్షాన నిలబడే హృదయం ఉండాలి కదా! దేశంలో ప్రయివేట్ విద్య ఎంత ఖర్చుతో కూడుకున్నదో, ఏ భాషలో సాగుతుందో వీరందరికీ తెలువదా? 2024–25 ఎకనమిక్ సంవత్సరానికి ధీరూబాయి అంబానీ కొడుకు, కోడలు నడిపే స్కూలు ఫీజు చూడండి: సంవత్సరానికి ఎల్కేజీ విద్యార్థి ఫీజు: 1,70,000. 8–10వ తరగతి పిల్లల ఫీజు: 5,90,000. 11–12వ తరగతి పిల్లల పీజు: 9,65,000. ఇటువంటి స్కూళ్లు దేశంలో చాలా ఉన్నాయి. ఇవన్నీ ఏ మాతృభాషలో నడుస్తు న్నాయి? ఇంతింత ఫీజులలో ఇంగ్లిష్ మీడియంలో, విదేశీ సిలబస్‌తో చదివే పిల్లల్ని జగన్ మోడల్ విద్యా విధానం ద్వారా కాక ఎలా ఎదు ర్కొంటారు? ఏపీలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు అన్నది కాదు సమస్య. ఈ ఎన్నికల పోరాటంలో అక్కడ ప్రభుత్వ రంగంలో ప్రారంభమైన ఇంగ్లిష్ క్వాలిటీ విద్యా ఎక్స్పెరిమెంట్ ఏమైతది అనేది కీలకమైన సమస్య. నేనొక సొంత పార్టీ పెట్టుకొని జగన్‌తో పొత్తు పెట్టుకొని ఈ వ్యాసం రాయడం లేదు. జగన్ ఇచ్చిన ఎమ్మెల్యే పదవో, రాజ్యసభ ఎంపీ పదవో తీసుకుని రాయడం లేదు. ఈ దేశ ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లల భవిష్యత్తు మీద భయంతో రాస్తున్నాను. ఒక పబ్లిక్ ఇంట లెక్చువల్‌కు దోపిడీకి, అణచివేతకు గురౌతున్న ప్రజల జీవనం మారడం ముఖ్యం. రాజకీయ నాయకులకు రాజకీయాలలో తమ ఉనికి ముఖ్యం. తమ ఉనికి కోసమైనా రాజకీయ నాయకులు ప్రజల మార్పు కోసం, సమానత్వం సాధించడం కోసం చర్యలు చేపట్టి నప్పుడు వాటిని సమర్థించడం ప్రజా మేధావి ప్రధాన కర్తవ్యం. ఈ క్రమంలోని దేశ చరిత్రలో మొదటిసారి విద్యా సమానత్వ ఎక్స్పెరిమెంట్ జగన్ ప్రభుత్వం చేస్తున్నందున నేనీ విద్యా విధానాన్ని సమర్థిస్తున్నాను. ఆ ప్రక్రియను వ్యతిరేకించే మూడు పార్టీల కూటమిని సమర్థించే మేధావులను ప్రజలు వ్యతిరేకించాల్సింది... తమ పిల్లల భవిష్యత్తు కోసం! ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
మూడు విచిత్ర దారుల కలయిక
మంచి పంటలు పండే 30 వేల ఎకరాల భూమిలో అమరావతి నగర నిర్మాణమనే లాభసాటి దారి పట్టాడు చంద్రబాబు. అత్తారింటికి దారి వెతికే నటుడేమో పిల్లలకు యూట్యూబ్లుండగా బడులెందుకు అని ప్రశ్నల వర్షం మొదలెట్టాడు. దేశ భవిష్యత్తుకు బడిదారి కాదు వెతకాల్సింది, గుడిదారి అని బీజేపీ చెబుతున్నది. ఈ మూడు దారులూ ఎన్నికల కోసం ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కటయ్యాయి. ఇక జగనేమో విద్యా, వైద్య రంగాలను గ్రామ వ్యవస్థల్లోకి బలంగా తీసుకెళ్లి సంపూర్ణ గ్రామ అభివృద్ధికి పథకాలు రూపొందించే బాట పట్టాడు. ఈ అభివృద్ధి మార్పులో రిస్క్ ఉన్న మాట నిజం. బలమైన కాంట్రాక్ట్ క్లాస్ ప్రభుత్వానికి అడ్డం తిరిగే అవకాశం ఉంటుంది. కానీ ఇది అన్ని కులాల్లోని బీదవారి భవిష్యత్‌ను నిర్ణయిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఎన్నికలకు ముందు మూడు విచిత్ర దారుల కలయిక జరిగింది. ఒకటి అమరావతికి దారి. ఆ దారి ఏది, ఏది అని 2019 నుండి చంద్రబాబు వెతుకుతున్నాడు. ఈయన దారి తప్పడమనేది 2014లోనే జరి గింది. రాష్ట్రానికి హైదరాబాదును మించిన రాజధాని తను, తన కొడుకు దశాబ్దాలు పాలించి అతి త్వరలోనే సింగపూర్ లాంటి సిటీ కడుతామని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కృష్ణానది ఒడ్డున బంగారు పంటలు పండే 30 వేల ఎకరాల భూమిని రైతుల దగ్గరి నుండి తీసు కున్నారు. అప్పుడు కేంద్రాన్ని పరిపాలిస్తున్న బీజేపీ కూడా ఈ దారి తప్పిన దారిలో ఉంది. ఈ భూముల్లో మంచి పంటలు పండించుకునే రైతుల్ని అతి త్వరలోనే పెట్టుబడిదారులను చేస్తామని ఆశ పెట్టారు. ఇది విచిత్ర ఆశ. ఆ రైతులెలా నమ్మారోగానీ ఒక చిన్న రాష్ట్రం 30 వేల ఎకరాల్లో ఒక నగరాన్ని నిర్మించి, బాగా పంటలు పండే ఖరీదైన ఎకరా భూమికి బదులు 200 గజాల కమర్షియల్ ల్యాండ్ ఇస్తామంటే ఎలా నమ్ము తారు? ఇక ఆ ఐదేండ్లలో సింగపూర్ నగర నిర్మాతలు రాష్ట్ర బడ్జెట్‌నంతా ఇతర దేశాల కాంట్రాక్ట్ బృందాలకు, మంత్రివర్గ కమిటీలు ప్రపంచ పట్టణాల నమూనాల అధ్యయనానికి ఖర్చు చేశారు. నగర నిర్మాణం జరగకముందే దాని చుట్టూ రింగురోడ్లు, ఉద్యానవనాలు తయారౌతున్నట్టు ప్రకటించారు. వీటి నమూనాలు గీయడానికి వందల కోట్లు ఖర్చు చేశారు. చివరికి 2019 ఎన్నికలు వచ్చే నాటికి అమరావతికి దారేది? అనే స్థితిలో చంద్రబాబు ఆయన ప్రయివేటు విద్యా, వైద్య మంత్రివర్గ మిత్ర బృందం ఎన్నికలకు పోయింది. ఘోరంగా ఓడారు. ఇప్పుడు అత్తారింటికి దారేది? అని నిరంతరం వెతికే నాయకుడు లేని నాటకదారితో పొత్తు కుదుర్చుకున్నాడు బాబు. ఈ అత్తారింటికి నిరంతరం దారి వెతికే నటుడు పిల్లలకు యూట్యూబ్లుండగా బడులెందుకు, సినిమాలుండగా రైతులకు వ్యవసాయం పనులెందుకు, వెల్ఫేర్ స్కీములెందుకు? అని ప్రజల బతుకుదారులన్నీ మూసెయ్యాలని ఎన్నికల ముందే ప్రశ్నల వర్షం మొదలెట్టాడు. ఈ ఇద్దరు కలిసి తమ విచిత్ర దారుల కలయిక చాలద న్నట్లు మళ్లీ బీజేపీని కూడా తమ దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేశారు. దేశ భవిష్యత్తుకు బడిదారి కాదు వెతకాల్సింది, గుడిదారి అని చాలా కాలంగా బీజేపీ చెబుతున్నది. వీళ్లంతా కలిసి పోటీ చేసి గెలిస్తే, రాష్ట్ర బడ్జెట్‌ను ఏ దారి అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాలనే కొట్లాట మొదలౌతుంది. చంద్రబాబు అమరావతి నిర్మాణం కోసం ఖర్చు పెట్టాలంటాడు. 30 వేల ఎకరాలతో సింగపూర్లు నిర్మించాలి! పవన్ తన కల్యాణం కోసం ఖర్చు చేయాలంటాడు. ఆయనకు అత్తారింటి దారి వెతుకులాట, ఆ దారిలో ఖర్చు చేయడం తప్ప ప్రజల అభివృద్ధి దారి, పిల్లల బడి దారి, ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ విద్య, ప్రజల ఆరోగ్యం కోసం హాస్పిటల్స్ వంటివి ఆయన నటనా జీవితంలో ఎరుగనివి. బీజేపీతో పొత్తు కుదిరింది కనుక అది గుడుల నిర్మాణం, పురాతన సంప్రదాయ చరిత్ర పరిరక్షణ, అభివృద్ధి, విశ్వగురుపీఠ ఏర్పాటు అమెరికాలో చేయాలనే ఆశయ సాధనకు డబ్బు ఖర్చు చెయ్యాలనే డిమాండ్ చేయడం మామూలే. జగన్ పరిపాలించిన ఐదేండ్లు ఏక కేంద్ర నిర్ణయాలు, ఖర్చు అభివృద్ధి ప్లాన్లు జరిగాయి. అందులో మొదటిది, అసాధ్యమైన 30 వేల ఎకరాల నగర నిర్మాణం ఆపడం; అది ఆపకుండా ప్రజల కోసం ఏ ఖర్చూ చెయ్యలేమని గుర్తించడం. రెండవది విద్యా, వైద్య రంగాలను గ్రామ వ్యవస్థల్లోకి బలంగా తీసుకెళ్లి సంపూర్ణ గ్రామ అభివృద్ధికి పథకాలు రూపొందించటం; భవన నిర్మాణ ఖర్చును పట్టణ నిర్మాణ రంగం నుండి పల్లె నిర్మాణ రంగంలోకి మార్చడం; గ్రామాల్లో బడుల భవనాలు, హాస్పిటళ్లు, సెక్రటేరియట్లు నిర్మించడం; ఈ నిర్మాణ పనులను పెద్ద కాంట్రాక్టర్ల నుండి గ్రామ కాంట్రాక్టర్లకు మార్చడం; అందులో ముఖ్య గ్రామ ప్రజా కమిటీలకు నిర్మాణ బాధ్యతలు ఒప్ప జెప్పడం. ఈ అభివృద్ధి మార్పులో రిస్క్ ఉన్న మాట నిజం. బలమైన కాంట్రాక్ట్ క్లాస్ ప్రభుత్వానికి అడ్డం తిరిగే అవకాశం చాలా ఉంటుంది. ఇంతకంటే పెద్ద రిస్కుతో కూడిన నిర్ణయం ప్రభుత్వ విద్యా విధానాన్ని ఆంగ్ల ప్లస్ తెలుగుతో జతపర్చి ఆధునిక విద్యా టెక్నాలజీని శ్రమ జీవుల పిల్లల బతుకుల్లోకి తీసుకెళ్లటం. ఇది భారతదేశం వంటి ప్రయివేటు విద్యా పెట్టుబడి–దోపిడీ వ్యవస్థ ఏ దేశంలో లేనంత బలంగా ఉన్న చోట ప్రయోగాత్మకంగానైనా చెయ్యడం ఊహకందనిది. ఇది విద్యా దోపిడీ, ప్రయివేటు పెట్టుబడుల డబ్బు విస్తరించి ఉన్న ఆస్తులు, వాటి చుట్టూ ఉన్న మాఫియాను బాగా బలహీనపర్చే నిర్ణయం. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం అంటేనే ఉగ్రరూపం దాల్చే ప్రయివేటు ఇంగ్లిష్ మీడియం మాఫియాతో నేరుగా తలప డటం. ఈ మాఫియాకు ఇప్పటివరకు అన్ని రాజకీయ పార్టీలు దాసోహం చేసే రోజులివి. కార్మిక వర్గ రక్షకులమనే కమ్యూనిస్టు పార్టీలు సైతం ప్రయివేటు విద్యా మాఫియాను అంటకాగి బతుకుతూ ఉన్న దశ ఇది. ప్రయివేటు విద్యా రంగం ఈ దేశంలో మిగతా అన్ని పెట్టుబడిదారీ రంగాలను మించిన ఆస్తుల్ని, మంది మార్బలం, బస్సులు, కార్లు, వ్యాన్లు కలిగి ఉండి మారుమూల గ్రామాల్లో కూడా విస్తరించి ఉన్నందువల్ల దీని శక్తి ఉత్పత్తి రంగ పెట్టుబడి కంటే బలమైంది. దీన్ని ఎదిరించలేకనే అన్ని రాజకీయ పార్టీలు, చివరికి కమ్యూనిస్టు పార్టీలతో సహా, ఊకదంపుడు ‘మాతృభాష’ సిద్ధాంతం ప్రజలకు నేర్పి తమ పార్టీలను, తమ పిల్లల మెదళ్లను ప్రయివేటు విద్యా వ్యవస్థకు తాకట్టు పెట్టాయి. జగన్ దాన్ని బద్దలు కొట్టారు. ఇది మామూలు విషయం కాదు. భారతదేశ జ్ఞాన సంపద రూపు రేఖల్ని మార్చే పోరాటం ఇది. ప్రజా సంక్షేమ వ్యవస్థను భారతదేశంలో ఏ కేంద్ర ప్రభుత్వంగాని, ఏ రాష్ట్ర ప్రభుత్వంగానీ ఊహించని స్థాయిలో ‘మనీ ట్రాన్స్ఫర్’ పద్ధతిలో ప్రజా బ్యాంకు ఎకౌంటుల్లోకి ట్రాన్స్ఫర్ చేసింది జగన్ ప్రభుత్వం. ఇటువంటి స్కీములను ఈ మూడు పార్టీల కూటమి కూడా చేస్తామనొచ్చు. కానీ అన్ని సమస్యలకు, ముఖ్యంగా విశాల ప్రజల బీదరికానికి మందు జగన్ ప్రారంభించిన క్వాలిటీ ఇంగ్లిష్ మీడియం విద్యను ప్రభుత్వం ఇవ్వడంలో ఉన్నది. దానికి బద్ధ శత్రువు చంద్రబాబు, పచ్చి వ్యతిరేకి బీజేపీ, పిచ్చి వ్యతిరేకి పవన్. వీళ్లంతా ప్రయివేటు ఇంగ్లిష్ మీడియం విద్యా పెట్టుబడిదారీ వర్గాన్ని తమ భుజాల మీద మోస్తారు. వీళ్ళు అధికారంలోకి వస్తే మొదట ఆగి పోయేది ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్య, కొత్త పాఠ శాలల నిర్మాణం. ఇప్పటికే నిర్మించబడ్డ బడులకు మెయింటనెన్స్ డబ్బు ఆపివేత, మిర్రర్ ఇమేజ్ బుక్స్ ప్రింటింగ్ ఆపివేత. సంక్షేమాలు ఎన్ని చేస్తామని చెప్పినా 30 వేల ఎకరాల్లో సింగపూర్ నిర్మాణం కార్యక్రమం అన్నింటినీ ఆపేస్తుంది. అమరావతి భారీ నగర నిర్మాణ సమస్య ఈ మూడు పార్టీల మెడకు చుట్టుకున్న పెద్ద నాగు పాము. బాబు నిర్మించే పట్టణ పాముకు సరిపోయేన్ని పాలు వీరు పొయ్యకపోతే అది వీరిని కాటేసి చంపేస్తుంది. దానికి గ్రామాలను మాడ్చాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు ఒకే ఒక పరిష్కారముంది. అది ఈ ఎన్నికల్లో జగన్‌ని గెలిపించుడు. కనీసం ఇంకో ఐదేండ్లు విద్యా రంగం మార్పులతో ఇప్పుడున్న సంక్షేమ పథకాలను కొనసాగించు కుంటే క్రమంగా ఇటువంటి పథకాలు అవసరం లేని దేశంలోనే అభి వృద్ధి చెందిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అవుతుంది. ఈ మూడు దారుల కూటమే వస్తే మళ్లీ అగాథంలో ఆంధ్రప్రదేశ్ పడుతుంది. బాబు భయ మంతా గ్రామాల్లోని కూలీ నాలీ చేసుకొని బతికే వారి పిల్లలు మేధా వులు, నాయకులు అయితే తన కొడుకు, మనవడు ఏమౌతారనే. ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని కులాల్లోని బీదవారి భవిష్యత్‌ను నిర్ణయిస్తాయి. ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
చరిత్ర ఎరుగని వినూత్న నమూనాలు
వైఎస్ జగన్ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తర్వాత, గత 75 ఏళ్లలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నమూనాను మార్చేశారు. గత ఐదేళ్లలో రాష్ట్ర మానవాభివృద్ధికి బలమైన పునాది వేయడానికి అనేక చర్యలు తీసుకున్నారు. పిల్లల నాణ్యమైన విద్య కోసం ఖర్చు చేయడం మానవ వనరుల అభివృద్ధికి ఖర్చు చేయడమే తప్ప మరొకటి కాదు. దేశంలోని వికృతమైన విద్యా వ్యవస్థలో ఇది అత్యంత కష్టతరమైన సంస్కరణ. పాఠశాలలు, కళాశాలలపై దృష్టి సారించే మానవశక్తి అభివృద్ధి నమూనాను ఇంతవరకూ ఏ మూడవ ప్రపంచ దేశంలోనూ ప్రయత్నించలేదు. అలాగే, ప్రతి సంక్షేమ పథకాన్నీ పర్యవేక్షించడానికీ వాలంటీర్లను నియమించడం కూడా ప్రజాస్వామ్య పరిపాలనలో పూర్తిగా కొత్త ఆలోచన. ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని అధికార వైఎస్సార్సీపీకీ, చంద్రబాబు నాయుడు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ, భావోద్వేగ సినీ నటుడు పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీలకూ మధ్య పోటీ నెలకొంది. జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌లు తమిళనాడులో వలె నామమాత్రపు ఆటగాళ్లుగా ఉన్నాయి. ఆసక్తికరంగా, బీజేపీ రాష్ట్ర శాఖకు చంద్రబాబు వదిన పురందేశ్వరి నాయకత్వం వహిస్తుండగా, కాంగ్రెస్ రాష్ట్ర శాఖను జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల నడిపిస్తున్నారు. రెండు జాతీయ పార్టీలు, తమ సమీప బంధువులైన ప్రాంతీయ పార్టీల అధినేతలను ఇబ్బంది పెట్టేందుకు మహిళా అధ్యక్షులను ఎంపిక చేశాయి. ఇలాంటి పరిస్థితి దేశంలో ఎక్కడా లేదు. 2014 ఎన్నికల నుంచి జగన్ ఒంటరి పోరాటం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి చంద్రబాబు పొత్తుల కోసం తహతహలాడుతున్నారు. 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకుని 102 సీట్లు గెలుచుకున్న చంద్రబాబు, 2019లో కేవలం 23 సీట్లు గెలుచుకుని జగన్ చేతిలో ఘోరంగా ఓడిపోయారు. అందుకే ఇప్పుడు ఆయన జనసేన, బీజేపీతో పొత్తుకు తెగ ఆరాటపడుతున్నారు. ఇది కచ్చితంగా బాబులో ఉన్న అలజడిని తెలియజేస్తోంది. 2019 ఎన్నికలకు ముందు ప్రధాని మోదీపై చంద్రబాబు దూషణలు చేసినందున, ప్రధాని ఆయనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనలు ఇబ్బందికరంగా మారుతున్నాయి. ‘అందితే జుట్టు... అందకపోతే కాళ్ళు’ అనే తెలుగు సామెత చెప్పినట్టుగా ఉంది చంద్రబాబు రాజకీయ జీవితం. ఇప్పుడు చంద్రబాబు రాజకీయ స్థితిని మోదీ చక్కగా ఆస్వాదిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే, ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్‌కు చాలా కీలకమైనవి. ఎందు కంటే వైఎస్ జగన్ 175 సీట్లలో 151 సీట్ల భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తర్వాత, గత 75 ఏళ్లలో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ ప్రయత్నించని విధంగా రాష్ట్ర అభివృద్ధి నమూనాను మార్చేశారు. రాష్ట్రంలోని పాఠశాల, విశ్వవిద్యాలయ విద్య ప్రాథమిక నిర్మాణాన్ని మార్చడం ద్వారా వైఎస్ జగన్, భౌతిక అభివృద్ధి అని పిలుచుకునే అభివృద్ధి నమూనాను మానవ అభివృద్ధి నమూనాగా మార్చారు. గత ఐదేళ్లలో రాష్ట్ర మానవాభివృద్ధికి బలమైన పునాది వేయడానికి జగన్ అనేక చర్యలు తీసుకున్నారు. ఆయన తీసుకున్న మొదటి అడుగు – ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టడం. భారతదేశంలోని వికృతమైన విద్యా వ్యవస్థ చరిత్రలో ఇది అత్యంత కష్టతరమైన సంస్కరణ. పట్టణ పేదల పిల్లలను, వ్యవసాయ రంగంలోని శ్రామిక జనాల పిల్లలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎటూ కదలలేని ప్రాంతీయ భాషా విద్యా విధానంలో ఉంచాయి. భాషాప్రయుక్త రాష్ట్రాల ఆలోచన పేద పిల్లలు చదివే ప్రభుత్వ పాఠశాలల మెడకు చుట్టుకుంది. ధనవంతులు తమ పిల్లలను ప్రైవేట్ ఇంగ్లీషు మీడియం పాఠశాలల్లో చేర్పిస్తే, గ్రామీణ ప్రజలలో మాత్రం ప్రాంతీయ భాషావాదం ప్రచారం చేశారు. పాఠశాల మౌలిక సదుపాయాలు, నాణ్యమైన బోధన, ఆర్థిక స్థోమత లేని పిల్లలకు మంచి ఆహారం కోసం బడ్జెట్‌ను ఖర్చు చేయడానికి ఏ ప్రభుత్వమూ కూడా సిద్ధపడలేదు. పిల్లల నాణ్యమైన విద్య కోసం ఖర్చు చేయడం మానవ వనరుల అభివృద్ధికి ఖర్చు చేయడమే తప్ప మరొకటి కాదు. అసెంబ్లీల బడ్జెట్ సమావేశాల్లో చర్చలన్నీ రోడ్లు, భవ నాలు, అప్పుడప్పుడు డ్యామ్‌లకు మాత్రమే డబ్బు ఖర్చు చేసే విధంగా సాగుతుంటాయి. ఇలాంటి భౌతిక అభివృద్ధిలో భారీ మొత్తంలో డబ్బులు కాంట్రాక్టర్ల జేబుల్లోకి వెళతాయి. పాఠశాల విద్యకూ, విశ్వవిద్యాలయ విద్యకూ; పేద పిల్లల తల్లిదండ్రుల ఖాతాలకు నగదు బదిలీ పథకాలకూ గణనీయమైన మొత్తంలో బడ్జెట్‌ను కేటాయించడం ద్వారా ఆ నమూనాను జగన్ ప్రభుత్వం మార్చింది. ఇది దళారుల పాత్రను రూపుమాపింది. ఈ మార్పు అంతరార్థం ఏమిటంటే దళారీ వ్యవస్థ బలహీనపడుతుంది. తాము పొరపాటున అధికారంలోకి వచ్చినా, పాత భౌతిక వనరుల అభివద్ధి నమూనా వైపు తిరిగి వెళ్లలేమన్నది ప్రతిపక్ష పార్టీల ఆందో ళన. అదే వైఎస్ జగన్ తిరిగి అధికారంలోకి వస్తే, సంస్కరణలు మరింత లోతుగా సాగుతాయి. పది పదిహేనేళ్లలో మంచి విద్యావంతులు, ఆత్మవిశ్వాసం ఉన్న గ్రామీణ యువత సామాజిక–రాజకీయ వ్యవస్థలోకి వస్తారు. మానవ వనరుల అభివృద్ధికి అలవాటు పడిన ఆర్థిక వ్యవస్థను మార్చడానికి వారు అనుమతించరు. పైగా ఉద్యోగ స్వామ్యంతో పనిలేని అవినీతి రహిత కార్యకలాపాల కోసం పని చేస్తారు. వివిధ స్థాయుల పరిపాలనలో ‘సివిల్, పోలీసు నియంతల’ వలె పని చేయాలనుకునే అవినీతి ఉద్యోగులు, ఉన్నత స్థాయి బ్యూరో క్రాట్లు కూడా ఈ మానవ అభివృద్ధి నమూనాకు మద్దతు ఇవ్వడానికి ఇష్టపడరు. కానీ నగదు బదిలీ జీవితాన్ని రుచి చూసిన పేద గ్రామీణ, పట్టణ ప్రజలు కొత్త వ్యవస్థకు కచ్చితంగా మద్దతు ఇస్తారు. ప్రతి సంక్షేమ పథకాన్నీ పర్యవేక్షించడానికీ వాలంటీర్లను నియమించడం ప్రజాస్వామ్య పరిపాలనలో పూర్తిగా కొత్త ఆలోచన. వృద్ధులకు, రోగులకు ప్రభుత్వం నుండి వృద్ధాప్య పింఛన్ అందేలా లేదా రేషన్ వంటి ప్రయోజనాలను ఇంటి వద్దే ఇచ్చేలా వీరు సాయపడుతున్నారు. మధ్య, ఉన్నత స్థాయి బ్యూరోక్రాట్లు గ్రామాల్లో ఉన్న స్వచ్ఛంద సేవకులపై అసంతృప్తిగా ఉన్నప్పటికీ, పెద్ద సంఖ్యలో ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఒక గ్రామంలోని వాలంటీర్ ప్రతి గ్రామస్థునికీ ఒక సహాయ హస్తం! పాఠశాలలు, కళాశాలలపై దృష్టి సారించే మానవశక్తి అభివృద్ధి నమూనాను ఇంతవరకూ ఏ మూడవ ప్రపంచ దేశంలోనూ ప్రయత్నించలేదు. ఉదాహరణకు, చైనా... విద్య, ఆరోగ్య వ్యవస్థలలో ఒక రకమైన సారూప్య వ్యవస్థను ప్రయత్నించింది. వారు పెద్ద సంఖ్యలో కాలినడక వైద్యులను నియమించారు. మెరుగైన పర్యవేక్షణ వ్యవస్థ లతో కూడిన అసమానమైన ఆరోగ్య మౌలిక సదుపాయాలను కూడా జగన్ కల్పించారు. కరోనా సంక్షోభాన్ని అధిగమించడంలో ఇది ఎంతో సహాయపడింది. ఆరోగ్య రంగంలో కూడా గ్రామ వాలంటీర్లు చక్కటి పని చేస్తున్నారు. ఈ కొత్త ప్రయోగాలన్నీ దేశంలోని కాంట్రాక్టర్ వర్గాన్ని ఆశ్చర్యపరిచాయి. కాంట్రాక్టర్ వర్గం భౌతికాభివృద్ధిని కోరుకుంటుంది కానీ భారీ స్థాయి మానవ శక్తి అభివృద్ధిని కాదు. తెలంగాణలో నా చిన్నతనంలో స్థానిక భూస్వాములు ఊరి స్కూల్ టీచర్లను చదువు చెప్పవద్దనీ, జీతం తీసుకుని ఇంట్లో సంతోషంగా ఉండమనీ అనేవారు. పల్లెటూరి పిల్లలందరూ చదువుకుంటే తమ పశువుల చుట్టూ బాలకార్మికులుగా ఎవరు పని చేస్తారు, పెద్దయ్యాక జీతగాళ్లుగా ఎవరు పని చేస్తారన్నది వారి తర్కం. ఆ సమయంలో భూస్వాములు విద్య ద్వారా మానవ శక్తిని అభివృద్ధి చేయడాన్ని భూస్వామ్య వ్యతిరేకతగా చూశారు. ఇప్పుడు ఏపీలో ఇంగ్లీషు విద్యావంతులైన మానవశక్తిని అభివృద్ధి చేయడాన్ని కాంట్రాక్ట్ వ్యతిరేక పెట్టుబడిగా చూస్తున్నారు. కాంట్రాక్ట్ పెట్టుబడికీ, ప్రైవేట్ విద్యా రంగానికీ, చంద్రబాబుకూ చాలా దగ్గరి సంబంధం ఉంది.2024 ఎన్నికలలో జగన్ గెలిస్తే ఈ మోడల్ దాని మూలాలను మరింత లోతుగా పాతుకుపోయేలా చేస్తుంది. పైగా దానిని ఎవరూ మార్చలేరు. ఇది జాతీయ విద్యావ్యవస్థపై కూడా ప్రభావం చూపు తుంది. ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
అభివృద్ధిలో సరికొత్త నమూనా
భారత్‌లోని అనేక ప్రాంతాలు ఇప్పటికీ ఆధునిక ఆర్థిక వ్యవస్థకు అనుసంధానం కాలేదు. ప్రపంచ మార్కెట్ వ్యవస్థలకు అనుసంధానించడంలో విద్యదే కీలక పాత్ర. ఆధునిక విద్యాసంస్థలతో కూడిన గ్రామాభివృద్ధి నమూనాను ఏ రాష్ట్ర ప్రభుత్వమూ అనుసరించలేదు. ఈ నమూనాపై ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం దృష్టి సారించింది. రెండు వినూత్న ఆలోచనలను ముందుకు తేవడం ద్వారా జగన్ దీన్ని సాధ్యం చేశారు: 1. ప్రభుత్వ రంగంలో నాణ్యమైన ఇంగ్లీషు మీడియం విద్యను అందించడం. 2. పాఠశాల మౌలిక సదుపాయాలు, గ్రామ పరిపాలనను భారీగా మార్చడానికి వనరులను ఖర్చు చేయడం. దాని భవిష్యత్తు ప్రభావాన్ని దేశం మొత్తం మీద ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఊహించలేకపోయారు. ఇది విప్లవాత్మకమైన అభివృద్ధి నమూనా. 2024 సాధారణ ఎన్నికలకు ముందు భారతదేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఇక, పార్లమెంటు ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనే నాలుగు రాష్ట్రాలు: ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణా చల్ ప్రదేశ్, సిక్కిం. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని మునుపెన్నడూ ఊహించని పథంలోకి మార్చింది. సాధారణంగా అభివృద్ధి అంటే... ఎత్తయిన భవనాలు, మంచి రోడ్లు వంటి పట్టణ మౌలిక సదుపాయాలలో పెట్టుబడి పెట్టడానికి విధానాలను రూపొందించడమే అని రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తాయి. సాధారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీ మొత్తంలో బడ్జెట్ నిధులను పెద్ద కాంట్రాక్ట్ నిర్మాణాలకు వెచ్చిస్తాయి. ప్రపంచీకరణ యుగంలో నయా ఉదార వాద ఆర్థికవేత్తలు అలాంటి ఖర్చును మంచి అభివృద్ధిగా పరిగణి స్తారు. ఆరెస్సెస్, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కూడా ఈ నమూనానే అనుసరిస్తోంది. సోషలిస్ట్ ఎకానమీ నుండి పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ వైపునకు మారిన చైనా కూడా ఇదే నమూనాను అవలంబించింది. వీటితో పోలిస్తే భారతీయ కుల అసమానతలకు కాస్త భిన్నమైన విధానం అవసరం. భారతదేశంలో రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యం ఉన్నప్పటికీ, దాని అసాధారణమైన కుల అడ్డంకులు ప్రజల కేంద్రిత అభివృద్ధికి అనేక అవరోధాలను సృష్టించాయి. రెండవది, భారతీయ గ్రామాలు చెల్లాచెదురుగా ఉన్నాయి. వ్యవసాయాభివృద్ధి పూర్తిగా వ్యవసా యాన్ని పెట్టుబడిగా మార్చే దశకు చేరుకోలేదు. దేశంలోని అనేక ప్రాంతాలు ఇప్పటికీ ఆధునిక ఆర్థిక వ్యవస్థకు అనుసంధానం కాలేదు. ప్రజలను జాతీయ, ప్రపంచ మార్కెట్ ఆర్థిక వ్యవస్థలకు అనుసంధానించడంలో వారి విద్యే కీలక పాత్ర పోషిస్తోంది. గ్రామీణులను ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోకి... గ్రామీణ పిల్లలకు, యువతకు విద్యను అందించడానికి ఆధునిక విద్యాసంస్థలతో కూడిన గ్రామాభివృద్ధి నమూనాను ఏ రాష్ట్ర ప్రభు త్వమూ అనుసరించలేదు. ఈ నమూనాపై జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం దృష్టి సారించింది. గత ఐదేళ్లలో తన బడ్జెట్లో ఎక్కువ భాగం గ్రామీణ విద్యా మౌలిక సదుపాయాలు, సాఫ్ట్ స్కిల్స్‌ను నిర్మించడం కోసం కేటాయించింది. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో గత పదేళ్లలో టీడీపీ, వైఎస్సా ర్సీపీ ప్రభుత్వాలు పూర్తి వ్యతిరేకమైన అభివృద్ధి నమూనాలను ఎలా ఎంచుకున్నాయో చూడాలి. టీడీపీ ప్రభుత్వం కృష్ణా నది ఒడ్డున ఉన్న 30,000 ఎకరాల సారవంతమైన వ్యవసాయ భూమిని లాక్కొని, రాష్ట్ర బడ్జెట్లో ఎక్కువ భాగం అమరావతిని నిర్మించేందుకు కేటాయించడా నికి సిద్ధమైంది. పెద్ద నగరాలు మాత్రమే పెట్టుబడులు తెస్తాయనీ, వెలుపలి నుంచి వచ్చే పెట్టుబడితో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనేది నయా ఉదారవాద ఆర్థిక ఆలోచన. ఇది భారీ స్థాయి పెట్టుబడులతో కూడిన సిటీ మాల్ మార్కెట్లలోకి విస్తారమైన గ్రామీణ ప్రజలను తీసుకోలేదు. అందుకే, ధనవంతుల కోసం ఉద్దేశించిన ప్రైవేట్ పాఠశాల విద్యతో సరిపోయే పాఠశాల వ్యవస్థలో వారిని విద్యావంతులను చేయాలి. ఆ ప్రైవేట్ పాఠశాల విద్య ఇంగ్లీషు మీడియంలో కొనసాగాలి. గ్రామీణ వ్యవసాయాధారిత పిల్లలకు ప్రభుత్వ రంగంలో ఇలాంటి విద్యను అందించకపోతే వారు రాష్ట్ర, జాతీయ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో చేరలేరు. విప్లవాత్మక అభివృద్ధి నమూనా భారీ మల్టీ లేన్ రోడ్లు, పెద్ద విమానాశ్రయాలు, ఓడరేవులతో కూడిన ‘హైవే ఎకానమీ’, ప్రభుత్వ రంగ పరిశ్రమలను భారీగా ప్రైవేటీకరించడం ఆర్ఎస్ఎస్ దృక్పథానికి బాగా సరిపోతుందని మితవాద ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. ఆరెస్సెస్‌కి సంబంధించిన ఈ ఆధునిక ఆలోచన పురాతనమైన మధ్యయుగ వర్ణ ధర్మ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానమై ఉంది. ఆ వ్యవస్థలో శూద్ర ఉత్పాదక ప్రజానీకానికి ఆస్తులపై యాజమాన్యం ఉండకూడదు. ఈ నమూనాతో చంద్రబాబు శ్రుతిమించి పోయారు. వైఎస్ జగన్ మాత్రం అభివృద్ధి నమూనానే మార్చేశారు. దీన్ని నేను శూద్ర అభివృద్ధి నమూనా అని పిలుస్తున్నాను. రాష్ట్ర బడ్జెట్ ప్రధానంగా అన్ని కులాలు, కార్మిక వర్గాలను కలిగి ఉన్న వ్యవసాయ, చేతివృత్తుల ఉత్పాదక ప్రజానీకానికి ఉద్దేశించినదని సూచించడానికి నేను శూద్ర అనే చారిత్రక పదాన్ని ఉపయోగిస్తున్నాను. మొత్తం వ్యవసాయ, చేతివృత్తులకు చెందిన ఉత్పాదక ప్రజానీకంలో (ఆదివాసీ, దళిత వర్గాలు, రిజర్వుడ్ శూద్ర ఓబీసీలు, రెడ్డి, కమ్మ, కాపు వంటి అన్‌రిజర్వుడ్ శూద్రులు అందరూ ఇందులో ఉంటారు) నైపుణ్యాలు, వనరుల పునాదిని తప్పనిసరిగా మార్చాలని వైఎస్ జగన్ సరిగ్గా అర్థం చేసుకున్నారు. రాష్ట్ర పెట్టుబడిని పాఠశాల, కళాశాల విద్య, గ్రామ పరిపాలనలోకి మార్చడం ద్వారా ఈ పరివర్తన సాధ్యమవుతుంది. వైఎస్ జగన్ రెండు వినూత్న ఆలోచనలను ముందుకు తేవడం ద్వారా ఇదంతా సాధ్యం చేశారు: 1) ప్రభుత్వ రంగంలో నాణ్యమైన ఇంగ్లీషు మీడియం విద్యను అందించడం. ఇది నైపుణ్యం, జ్ఞానం రెండింటిలోనూ గ్రామాన్ని ప్రపంచంతో కలుపుతుంది. విద్యా ఖర్చుల కోసం డబ్బును బదిలీ చేయడం ద్వారా పాఠశాల, కళాశాల పిల్లల తల్లులకు ఆర్థిక సహాయం అందించడాన్ని కూడా దీనికి జోడించారు. 2) పాఠశాల మౌలిక సదుపాయాలను, గ్రామ పరిపాలనను భారీగా మార్చడానికి రాష్ట్ర అభివృద్ధి వనరులను ఖర్చు చేయడం. ప్రధాన వ్యాపారాలు లేని, శ్రమతో పని చేసే సాంప్రదాయ శూద్రులందరికీ ఈ నమూనాలో కొత్త నైపుణ్యాలు, ప్రపంచ భాషతో వ్యవహరించడానికి ప్రవేశం లభిస్తుంది. దాని భవిష్యత్తు ప్రభావాన్ని ఇప్పటి వరకు దేశం మొత్తం మీద ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఊహించలేకపోయారు. ఇది విప్లవాత్మకమైన అభివృద్ధి నమూనా. పెట్టుబడుల కేంద్ర మార్పు ఈ నమూనా... పెట్టుబడిని కేంద్రీకృత పట్టణ రంగాల నుండి వైవిధ్యమైన గ్రామీణ సమాజాలకు మారుస్తుంది. ఇది పట్టణ బ్యాంకుల్లోని డబ్బు నిల్వలను గ్రామీణ మార్కెట్లకు తరలిస్తుంది. ఇది విస్తారమైన గ్రామీణ ప్రజల ఆరోగ్యం, వ్యయం, ఉత్పత్తి, విజ్ఞాన పునాదిని మెరుగుపరుస్తుంది. మొత్తంగా సంపద కేంద్రీకరణను పట్టణ ధనవంతుల నుండి విస్తారమైన గ్రామీణ ప్రజానీకానికి బదలా యిస్తుంది. ఈ పెట్టుబడి ఉచితాల కిందికి రాదు. ఇది భవిష్యత్ విప్లవా నికి సంబంధించిన పెట్టుబడి. సాధారణంగా విప్లవం గురించి మాట్లాడే కమ్యూనిస్టులు కూడా భారతీయ కుల–సాంస్కృతిక సమాజంలో విప్లవం అంటే ఏమిటో అర్థం చేసుకోలేకపోయారు. బెంగాల్లో వారి 34 ఏళ్ల పాలన గ్రామీణ ప్రజానీకాన్ని ప్రపంచీకరణ ప్రక్రియతోనూ, ఆంగ్ల విద్యతోనూ ముడిపెట్టకుండా ఎలా దూరంగా ఉంచిందో నిరూపించింది. ఈ విప్లవం భారతదేశ అభివృద్ధిపై రెండు ముఖ్యమైన ప్రభావాలను కలిగి ఉంది. చారిత్రాత్మకంగా జ్ఞాన వ్యవస్థను నియంత్రిస్తున్నందున సంపద మొత్తంగా ద్విజ సంఘాల చేతుల్లో కేంద్రీకృతమై ఉంది. పురాతన కాలంలో ఇది సంపదను, సంస్కృత భాషను నియంత్రించింది. మధ్యయుగ కాలంలో ద్విజులు ముస్లిం పాలకులతో కలిసి సంపదను, పర్షియన్ భాషను నియంత్రించారు. గత 75 ఏళ్లుగా వారు సంపదను, ఆంగ్ల భాష ఆధారిత జ్ఞానాన్ని నియంత్రించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం విద్యపై దృష్టి సారించడం ద్వారా వైఎస్ జగన్ ప్రభుత్వం సంపదను, విజ్ఞానాన్ని వ్యవసాయ, చేతివృత్తుల వారి చేతుల్లోకి తెచ్చింది. ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
ప్రశ్నకు బలాన్నిచ్చే కుల గణన
కులాల వారీగా జనాభా విస్తృత కూర్పును బిహార్ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ గణన మొదటిసారిగా కులాల వారీగా పేదరికాన్ని స్పష్టంగా చూపిస్తోంది. కుల గణన అఖిల భారత స్థాయిలో జరిగిన తర్వాత మొత్తం రాజకీయ నిర్మాణం సమూల మార్పునకు లోనవుతుంది. సుప్రీంకోర్టు అన్ని రిజర్వేషన్లకు 50 శాతం పరిమితిని నైతిక ప్రాతిపదికన విధించింది. ఇటువంటి ప్రామాణికమైన గణాంకాలను కోర్టు ముందు ఉంచిన తర్వాత దానిని అనుసరించి వెళ్లాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే కులాల వారీగా లెక్కల సేకరణ మొదలు పెట్టింది. ఇప్పుడు బీజేపీ కూడా కుల గణన గురించి ఒక వైఖరిని తీసుకోవలసి వస్తుంది. కుల గణన అనే ప్రశ్నను ఇప్పుడు ఏ పార్టీ కూడా తప్పించుకోలేదు. బిహార్ ప్రభుత్వం మొదటి దశలో కులాల వారీగా ఆ రాష్ట్రంలోని జనాభా విస్తృత కూర్పును విడుదల చేసింది. రాష్ట్రంలో ఓబీసీలు 63.13 శాతం ఉండగా, ముస్లిమేతర అగ్రవర్ణాల వారు 10 శాతం మాత్రమే ఉన్నారని ఈ గణాంకాలు చెబుతున్నాయి. వెనుకబడినవారు (27.13 శాతం), అత్యంత వెనుకబడినవారు (36 శాతం) కలిసి 63.13 శాతం ఉన్నారు. బ్రాహ్మణులు, భూమిహార్లు, కాయస్థులు, రాజపుత్రులు (క్షత్రియులు) ఉన్న జనరల్ విభాగంలోని జనాభా 15.52 శాతం మాత్రమే. కులాల వారీగా చూస్తే యాదవులు 14.27 శాతంతో అతిపెద్ద జనాభాగా ఉన్నారు. ఈ ఒక్క కులం ఆ రాష్ట్రంలో జనరల్ కేటగిరీ అంత పెద్దది. ముస్లిం జనాభాను వేరుచేస్తే, హిందూ ఓబీసీలు 50 శాతం ఉన్నారు. కుల గణన ప్రభావం ఎలా ఉంటుంది? సుప్రీంకోర్టు స్థాయిలో న్యాయపరమైన నిర్ణయాలలో ఈ కుల గణన ఎలా ఉంటుంది? సుప్రీంకోర్టు అన్ని రిజర్వేషన్లకు 50 శాతం పరిమితిని నైతిక ప్రాతిపదికన విధించింది. ఇటువంటి ప్రామాణి కమైన గణాంకాలను కోర్టు ముందు ఉంచిన తర్వాత దానిని అనుస రించి వెళ్లాల్సి ఉంటుంది. కుల గణన అఖిల భారత స్థాయిలో జరిగిన తర్వాత మొత్తం రాజకీయ నిర్మాణం సమూల మార్పునకు లోనవు తుంది. కులాల వారీగా జనాభా లెక్కల సేకరణపై అన్ని పార్టీల్లోని ద్విజ కులాల నేతలు భయపడటానికి ఇదే కారణం. కుల సామాజిక–ఆర్థిక, విద్యాపరమైన డేటా సిద్ధమైన తర్వాత ఓబీసీ రిజర్వేషన్లను 65 శాతానికి పెంచాలని బిహార్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈడబ్ల్యూఎస్(ఆర్థికంగా వెనుకబడిన వర్గాల) రిజర్వేషన్‌తో కలిపి ఇది 75 శాతానికి చేరుకుంటుంది. నితీశ్ కుమార్, తేజస్వి యాదవ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం బీజేపీ భావజాలంలో సంక్షోభాన్ని సృష్టిస్తుంది. అంతేకాకుండా, కనీసం ఒక రాష్ట్రం నుండి అయినా, తాను గతంలో పేర్కొన్న 50 శాతం పరిమితి వైపు తిరిగి చూసుకునేలా భారత న్యాయవ్యవస్థను ఇది ఒత్తిడికి గురిచేస్తుంది. పేదరికం సూచికలు బిహార్‌లో కులాల వారీగా పేదరికం స్థాయులను చూడండి: నెలకు 6,000 రూపాయల కంటే తక్కువ ఆదాయం సంపాదించేవారు ఏ రాష్ట్రంలోనైనా పేదవారిలో అత్యంత పేదలుగా లెక్కలోకి వస్తారు. అంటే, ఈ కుటుంబాలు సంవత్సరానికి రూ.72,000ల కంటే తక్కువ సంపాదిస్తున్నాయి. 21వ శతాబ్దపు ప్రపంచీకరణ ప్రపంచంలో, ఈ ఆదాయం ఇద్దరు పిల్లలతో కూడిన దంపతులను పోషించడం కష్టం. సాధారణంగా నాటి ప్రణాళికా సంఘం ఆర్థిక సర్వేలు, నేటి నీతి ఆయోగ్ సర్వేల ద్వారా తెలిసే దారిద్య్ర రేఖ ప్రకారం, బిహార్ అత్యంత పేదరికం ఉన్న రాష్ట్రంగా అందరికీ తెలుసు. దీని తర్వాత ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వస్తాయి. వీటిని ‘బిమారు’ రాష్ట్రాలు అని కూడా అంటారు. బిహార్ కుల జనాభా గణన మొదటిసారిగా కులాల వారీగా పేదరికాన్ని స్పష్టంగా చూపిస్తోంది. దీని ప్రకారం ఎస్సీలు (42.93 శాతం) సంపూర్ణ పేదరికంలో ఉన్నారు. 42.7 శాతంతో ఎస్టీలు పేదరికంలో ఎస్సీలను అనుసరిస్తున్నారు. అత్యంత వెనుకబడిన తరగ తులు(ఎంబీసీ) జనాభాలో అత్యధిక సంఖ్యలో ఉన్నారు. పేదరికం పరంగా వారు 33.58 శాతం మంది ఓబీసీ వర్గాలకన్నా అధ్వాన్నంగా ఉన్నారు. అత్యంత పేదరికంలో 33.16 శాతం ఓబీసీలు ఉన్నారు. ఒక కులంగా అత్యధికంగా ఉన్న యాదవుల్లో 35.87 శాతం మంది పేదరికంలో ఉన్నారు. బిహార్‌లో బ్రాహ్మణులు (25.32 శాతం), భూమిహార్లు (27.58 శాతం), రాజపుత్రులు (24.89 శాతం) కూడా పేదరికంతో ఎలా బాధపడుతున్నారో గణాంకాలు చూపుతున్నాయి. అతి తక్కువ పేదరికం ఉన్న కులం కాయస్థ. ఇందులో 13.38 శాతం మంది పేదరికంతో ఉన్నారు. ఏమైనప్పటికీ, చారిత్రకంగా అణచివేయబడిన కులాలు విద్య, కుల మూలధనం లేకుండా బాధపడుతున్నాయని మనం అర్థం చేసుకోవాలి. కులాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని మనం పరిశీలిస్తే, బిహార్‌లోని ఎస్సీ, ఎస్టీ, ఈబీసీలకు కేవలం రిజర్వేషన్లు కాకుండా చాలా సంక్షేమ చర్యలు అవసరం అని బోధపడుతుంది. బిహార్‌లో వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరచాల్సిన అవ సరం ఉంది. రాష్ట్రంలో పారిశ్రామిక రాజధాని అనేది లేదు. రాష్ట్ర రాజధాని పట్నా(ప్రాచీన పాటలీపుత్ర)తో సహా దాని పట్టణ ప్రాంతా ల్లోని ఆర్థిక చైతన్యం దక్షిణ భారత దేశంలోని ఒక జిల్లా ప్రధాన కార్యాలయ స్థాయికి కూడా సమీపంలో ఉండదు. రాష్ట్ర ఉత్పాదకతను పెంపొందించకపోతే, ఇంత విస్తారమైన పేద జనాభాను దారిద్య్ర రేఖ నుంచి బయటకు తేవడం అసాధ్యం. జాతీయ పర్యవసానాలు అనేక రాష్ట్రాలు ఇప్పుడు కులాల వారీగా గణాంకాలను సేకరించ వలసి వస్తుంది. రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఇప్పటికే కులాల వారీగా లెక్కలు సేకరించడం ప్రారంభించాయి. బిహార్ కుల గణన సమాచారం విడుదలైన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ సమావేశంలో, తాము అధికారంలో ఉన్న చోట కులాల వివరాలను సేకరిస్తామని నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దశాబ్దానికి ఒకసారి సాధారణ జనాభా గణనలో కుల గణనను భాగం చేస్తామని పేర్కొంది. ఈ కొత్త పరిణామం తన మానస పుత్రిక అయిన బీజేపీ ద్వారా దేశాన్ని పాలిస్తున్న ఆర్ఎస్ఎస్కు షాక్ కలిగించింది. కారణం సులభం. రిజర్వేషన్ వ్యవస్థను తొలగించడం, కుల గుర్తింపు గురించి ఎటువంటి చర్చనైనా నిషేధించడం దాని లక్ష్యం. సామాజిక ఇంజ నీరింగ్ గురించి వారి ఆలోచన ఏమిటంటే– ముస్లింలతో, క్రైస్తవులతో పోరాడటానికి హిందువులు ఐక్యం కావాలి. కుల గుర్తింపులను విస్తరించ కూడదనీ, ద్విజ నియంత్రణలో ఉన్న సనాతన ధర్మంలో సంక్షో భాన్ని సృష్టించకూడదనీ దళిత, శూద్ర ప్రజానీకాన్ని ఒప్పించడమే వారి విధానం. 2014 ఎన్నికలలో ఓటు ప్రయోజనాల కోసం నరేంద్ర మోదీ తన ఓబీసీ గుర్తింపును ఉపయోగించుకోవడానికి ఆర్ఎస్ఎస్ చాలా అయిష్టతతో అనుమతించింది. రాజకీయ చర్చలో కుల ప్రశ్నలకు తావులేకుండా, నిరంతరం ముస్లిం బుజ్జగింపులు, ముస్లిం శత్రుత్వం, పాకిస్తాన్ మొదలైనవాటిని ఉపయోగించి గుజరాత్‌ను నిర్వహించినట్లు మోదీ దేశాన్ని నిర్వహిస్తారని వారు భావించారు. కానీ భారతదేశం గుజరాత్ కాదు. మోదీ కుల గుర్తింపు, కుల గుర్తింపులపై ఆధారపడిన ఆయన ఓట్ల సమీకరణ అనేవి... ఉత్తర భారతదేశంలో, ప్రత్యేకించి ఉత్తర ప్రదేశ్‌లో కుల గుర్తింపు సమస్యను తార్కిక ముగింపు వైపునకు నెట్టడానికి మండల్ అనుకూల వాదులకు చోదక శక్తిగా ఉంటున్నాయి. ఇప్పుడు ఆర్ఎస్ఎస్, బీజేపీ కుల గణన గురించి ఒక వైఖరిని తీసుకోవలసి వస్తుంది. అలా తీసుకోలేదంటే, మొత్తం శూద్ర, ఓబీసీ ప్రజానీకం ఇంతకాలం తమ ఓటు శక్తిని ద్విజ శక్తిని సుస్థిరం చేయ డానికి మాత్రమే వారు ఉపయోగించుకున్నారని గ్రహిస్తారు. తమ ప్రభుత్వం 27 మంది ఓబీసీలను మంత్రులుగా చేసిందని 2023 రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో మోదీ పదే పదే చెబుతున్నారు. కుల గణన హిందూ సమాజాన్ని విడదీస్తుందని కూడా ఆయన చెబుతున్నారు. చారిత్రకంగా అణచివేయబడిన ఓబీసీలను క్షేత్రస్థాయిలో ఉద్ధరించ కూడదని మాత్రమే ఇలాంటి వాదనలు తెలియజేస్తాయి. కుల గణన అంటే, ప్రతి సామాజిక బృందం వాస్తవ స్థితి ప్రాతిపదికన వనరుల కేటాయింపు, సంక్షేమ ప్రణాళికల ప్రశ్న. ఇప్పుడు కుల గణన అనే ప్రశ్నను ఏ పార్టీ కూడా తప్పించుకోలేదు. - కంచ ఐలయ్య షెపర్డ్ ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
ఇప్పుడెందుకు గుర్తొచ్చినట్టో!
లలిత్ మోదీ, నీరవ్ మోదీ బీజేపీ భావజాల కథనాల్లో ఓబీసీలుగా ఎలా మారిపోయారు? ఈ జాతి వ్యతిరేక శక్తులు ఓబీసీలు అయినట్లయితే,మొత్తం ఓబీసీ సమాజం నిజంగా సిగ్గుపడాలి. ఓబీసీ రిజర్వేషన్ల కోసం జరిగిన పోరాటంలో ఏ కీలక సమయంలోనూ ఓబీసీ ఎజెండాను బీజేపీ బలపర్చలేదు. కానీ రాహుల్ గాంధీని ఎదుర్కోవడానికి దేశంలో మోదీ పేరు పెట్టుకున్నవారందరినీ బీజేపీ ఓబీసీలుగా మార్చేసింది. మోదీ ఇంటి పేరుగా కలిగిన వారందరూ ఓబీసీలేనని వీరు ఎలా సమర్థించుకుంటారు? మోదీ పేరు కలిగిన వారు చాలామంది దేశంలో పరిశ్రమలను పెట్టారు.కానీ వీరిలో ఏ ఒక్క మోదీ కూడా ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్‌కు మద్దతివ్వలేదు. రాహుల్ గాంధీ ఒక స్వయంప్రకటిత బ్రాహ్మణుడు. నరేంద్ర మోదీ ఒక ధ్రువీకృత ఓబీసీ. వీరి జీవిత చరిత్రల్లో ఈ వాస్తవం నిరాకరించలేనిది. కానీ లలిత్ మోదీ, నీరవ్ మోదీ న్యాయస్థానంలోనూ, బీజేపీ భావజాల కథనాల్లోనూ ఓబీసీలుగా ఎలా మారిపోయారు? కర్ణాటకలో లలిత్ మోదీ, నీరవ్ మోదీ, నరేంద్ర మోదీ అని మూడు పేర్లను రాహుల్ పేర్కొన్నారు. లలిత్ మోదీ, నీరవ్ మోదీ విదేశాల నుంచి హవాలా ద్వారా డబ్బును దొంగిలించి, చట్టవిరుద్ధంగా భారత్ నుంచి పరారై, లండన్‌లో నివసిస్తున్నారు. వీరిద్దరికీ భారీ అంతర్జాతీయ బిజినెస్ నెట్వర్కులు ఉన్నాయి. వీళ్లకు ఓబీసీ ధ్రువపత్రాలు కూడా ఉన్నాయా? ఉద్దేశపూర్వక ప్రచారం మార్చి 23 ఉదయం నుంచి టీవీ ఛానల్స్, సోషల్ మీడియా వేదికల్లో బీజేపీ నేతలు... ఓబీసీలను దూషించడం రాహుల్ గాంధీ అలవాటుగా మార్చుకున్నారంటూ భారీ ప్రచారం మొదలెట్టారు. కాంగ్రెస్ పార్టీ పెద్దగా ఓబీసీల పట్ల ప్రేమ కురిపించలేదని నాకు తెలుసు. జాతీయ స్థాయిలో మండల్ అనుకూల ఓబీసీ నేత ఎవరినీ కాంగ్రెస్ పార్టీ అత్యున్నత స్థాయిలో ప్రోత్సహించలేదు. కానీ ఆ పార్టీని దెబ్బ గొట్టడానికి లలిత్ మోదీ, నీరవ్ మోదీ ఎలా ఓబీసీలు అయి పోయారు? మార్చి 24వ తేదీ ఉదయం ఒక టీవీ చర్చలో బీజేపీ ప్రభుత్వంలోని ఓబీసీ మంత్రి భూపేంద్ర యాదవ్ నోటి నుంచి లలిత్ మోదీ, నీరవ్ మోదీ ఓబీసీలు అయిపోవడం తొలిసారిగా విన్నాను. ఆ తర్వాతి నుంచి బీజేపీ వాదనలన్నింటిలోనూ అన్ని దశల్లోనూ ఇదే వినిపించింది. బీజేపీ అధ్యక్షుడు నడ్డా, ధర్మేంద్ర ప్రధాన్, ఇతర సీనియర్ మంత్రులు దీన్నే పునరావృతం చేశారు. లలిత్ మోదీ, నీరవ్ మోదీలు ఇద్దరూ ఓబీసీలే అయినట్లయితే, మొత్తం ఓబీసీ సమాజం నిజంగా సిగ్గుపడాలి. నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి అయ్యాక ఓబీసీ కార్డును బీజేపీ జాగ్రత్తగా ఉపయోగించడం ప్రారంభించిందని నాకు తెలుసు. ఎందుకంటే దేశంలో ఓబీసీలు మాత్రమే ఏకైక అతిపెద్ద ఓటు బ్యాంక్ శక్తిగా ఉంటున్నారు. ఇది మాత్రమే బీజేపీని అధికారంలో ఉంచ గలదు.మండల్ ఉద్యమం ప్రారంభించినప్పటి నుంచి ఆరెస్సెస్, బీజేపీ సాగించిన ఓబీసీ వ్యతిరేక ఉద్యమ చరిత్రను దేశంలో ఏ ఓబీసీ నేత కూడా ఎండగట్టలేదు. ఓబీసీ రిజర్వేషన్ల కోసం జరిగిన పోరాటంలో ఏ కీలక సమయంలోనూ ఓబీసీ ఎజెండాను బీజేపీ బలపర్చలేదు. కానీ రాహుల్ గాంధీని ఎదుర్కోవడానికి దేశంలో మోదీ పేరు పెట్టుకున్నవారందరినీ బీజేపీ ఓబీసీలుగా మార్చేసింది. మోదీ ఇంటి పేరుగా కలిగిన ప్రతి ఒక్కరూ ‘మోధ్–ఘాంచీ–తేలీ’ కులం నుంచే వచ్చారా? బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కుల జనగణనలో దీనికి సాక్ష్యం ఎక్కడ ఉంది? ఒక్క అఖిలేశ్ యాదవ్ మాత్రమే బీజేపీ ఓబీసీ మాయమాటల ప్రచారాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్య మంత్రి అధికార నివాసాన్ని తాను ఖాళీ చేశాక, గంగాజలంతో దాన్ని శుద్ధి చేయడం ద్వారా తన శూద్ర ఓబీసీ నేపథ్యాన్ని రాజ్‌పుత్ (క్షత్రియ) అయిన యోగీ ఆదిత్యనాథ్ అవమానించారని అఖిలేశ్ పదే పదే చెబుతూ వచ్చారు. బీజేపీ కానీ, ప్రత్యేకించి ఓబీసీ ప్రధానమంత్రి కానీ తమ సొంత పార్టీ సీఎం పాటిస్తున్న ఇలాంటి అమానుషమైన కుల ఆచరణలను ఎన్నడూ వ్యతిరేకించిన పాపాన పోలేదు. ఓటు బ్యాంకు కోసమే! రాహుల్ లేదా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓబీసీలకు అవమానం జరిగిందనే కొత్త కథనాన్ని ప్రచారం చేయడం... ‘రామచరిత మానస్’లో శూద్ర/ఓబీసీలకు వ్యతిరేకంగా భాష ఉందన్న నేపథ్యంలోని ఓటు బ్యాంక్‌ను ఉత్తరప్రదేశ్‌లో నిలబెట్టుకోవడానికేనా? ఈ నేపథ్యంలోనే ఆరెస్సెస్ సర్సంచాలక్ మోహన్ భాగవత్ కులాన్ని దేవుడు సృష్టించలేదని మాట్లాడారు. కుల సమస్యపై శాస్త్రాలను పునః సమీక్షించాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు. కులం అనేది ఉనికిలోనే లేదన్న చందంగా, కాంగ్రెస్ మేధా శక్తులు ఎన్నడూ కులం గురించి మాట్లాడలేదన్నది నిజం. లౌకికవాద శక్తులను వ్యతిరేకించడంలో భాగంగా ఆరెస్సెస్–బీజేపీ హిందూ మతం చుట్టూ తిరుగుతున్నప్పటికీ వారు అధికారాన్ని కోల్పోకుండానే కుల సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. కానీ ఓబీసీ జాబితాలోకి లలిత్ మోదీ, నీరవ్ మోదీ వంటి జాతి వ్యతిరేక శక్తులను తేవడం ద్వారా ఓబీసీ జాతీయవాద కథనాన్ని ఎలా ఆచరణలోకి తెస్తారు? మోదీ ఇంటిపేరుగా కలిగిన వారందరూ ఓబీసీలేనని వీరు ఎలా సమర్థించుకుంటారు? మోదీ పేరు కలిగిన వారు చాలామంది దేశంలో పరిశ్రమలను పెట్టారు. కానీ వీరిలో ఏ ఒక్క మోదీ కూడా ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్‌కు మద్దతివ్వలేదు. ప్రైవేట్ రంగంలో ఎంతో కొంత రిజర్వేషన్ ఉండాలని యూపీఏ ప్రభుత్వం కనీస ప్రతిపాదన చేసింది. వీరప్ప మొయిలీ నేతృత్వంలో ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ గురించి వాటాదారులకు నచ్చ జెప్పడానికి ఒక కమిటీని వేశారు. అలాంటి ప్రతిపాదనను అన్ని పెద్ద పరిశ్రమలూ వ్యతిరేకించాయి. ఓబీసీ ప్రధాని కేంద్రంలో గద్దెనెక్కిన తర్వాత అలాంటి రిజర్వేషన్ కోసం ఆరెస్సెస్, బీజేపీ ప్రతిపాదించిన పాపాన కూడా పోలేదు. పరిశ్రమలను కలిగి ఉన్న ఏ మోదీ కూడా ఓబీసీలకు మద్దతివ్వడం కానీ, ఉద్యోగాలను ప్రతిపాదించడం కానీ చేయలేదు. వైఖరి వెల్లడించాలి! ఈ దేశ పీడిత ప్రజారాశులను వంచించడానికి కుల ప్రతిపత్తిని తారుమారు చేయలేము. దేశంలోని ముఖ్యమైన ఓబీసీలు శూద్ర వ్యవసాయ, చేతివృత్తుల ప్రజారాశులకు సంబంధించినవారు. ఆధు నిక పరిశ్రమకు ముందు, గానుగ ఆడించి నూనె తీసే వర్గం చేతివృత్తుల కులంగా ఉండేదనడంలో సందేహమే లేదు. అయితే దీన్ని మోదీ ఇంటిపేరుతో ముడిపెట్టలేము. దీని ఆధారంగా చట్టబద్ధమైన లేక సామాజిక వాదనను నిర్మించలేము. ఉదాహరణకు, అనేక కమ్యూని టీల్లో చౌదరి ఇంటిపేర్లు ఉన్నాయి. భారతదేశంలోనూ, అమెరికా, కెనడా వంటి ఇతర దేశాల్లోనూ కుల వ్యతిరేక చట్టాలను ఆరెస్సెస్, బీజేపీ వ్యతిరేకిస్తున్నాయి. ఆరెస్సెస్ అధికారిక పత్రిక ‘పాంచజన్య’తోపాటు, ఆరెస్సెస్ కీలక నేతల్లో ఒకరైన రామ్ మాధవ్ అమెరికా, కెనడాల్లో తెచ్చిన కుల వ్యతిరేక చట్టాలను వ్యతిరేకిస్తూ రాశారు. మన దేశంలో మాత్రం ఎన్ని కలు, ఓట్ల ప్రయోజనం కోసం వీరు ఓబీసీ ఎజెండాను ఉపయోగించుకుంటున్నారు. ఓబీసీ ట్యాగ్ ఉన్న నరేంద్ర మోదీని ప్రధాని కావడానికి అనుమతించడం అనే వాస్తవాన్ని మినహాయిస్తే, భారతదేశంలోని ఓబీసీల ప్రయోజనాల కోసం ఆరెస్సెస్, బీజేపీ ఎలాంటి నిర్దిష్ట చర్యలూ చేపట్టలేదు. ఓబీసీ అంశంపై ఆరెస్సెస్, బీజేపీ వైఖరి గురించి జాతీయ స్థాయి చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఓబీసీ అంశంపై ఎలాంటి సీరియస్ సానుకూల ఆచరణ, వైఖరిని కలిగిలేదన్నది వాస్తవం. అయితే ఆరెస్సెస్, బీజేపీ ఉపయోగించుకున్నట్లుగా ఓబీసీ కార్డును కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ ఉపయోగించుకోలేదు. ఈ ధోరణి కనుక ఇలాగే కొనసాగినట్లయితే, ఓబీసీలు భారీగా నష్టపోతారు. ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
ఈ విద్యావిధానం దేశానికే ఆదర్శం
తీవ్ర దారిద్య్రం, గ్రామీణ, పట్టణ నిరుద్యోగిత తాండవిస్తున్న దేశంలో పిల్లలందరికీ నాణ్యమైన, ఒకే జాతీయ భాషలో విద్యను అందించడం అతిపెద్ద విప్లవం అని చెప్పాలి. రాష్ట్రంలోని పిల్లలందరి ఆస్తిగా విద్యను మలచాలనే కృతనిశ్చయంతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాఠశాల,కళాశాల, విశ్వవిద్యాలయ స్థాయిలో విస్తారంగా పెట్టుబడి పెట్టడం ద్వారా చరిత్ర సృష్టించారు. తెలుగును ఒక సబ్జెక్టుగా కొనసాగిస్తూనే అంగన్వాడీ∙(ప్రీ–స్కూల్) నుంచి విశ్వవిద్యాలయ డిగ్రీ వరకు అన్ని స్థాయిల్లోనూ ఇంగ్లిష్ మాధ్యమాన్ని తప్పనిసరి చేశారు. భారతీయ భాషా విధానంలో ఇది నిజంగానే పెనుమార్పు. కేంద్ర ప్రభుత్వం తన భాషా విధానాన్ని ఏకీకృత జాతీయ భాషా విధానంగా మార్చనంత వరకు, అన్నితరాలకు అవసరమయ్యే నాణ్యమైన కంటెంట్ విద్యను అందివ్వడం సాధ్యం కాదు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్నాళ్లకు, ఇన్నేళ్లకు ఒక దారి చూపిస్తోంది. ఒక తెలుగు దినపత్రికలో జూలై 30వ తేదీన ’పేద పిల్లలు పెద్ద చదువులు’ అనే వార్తను చూశాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యావిధానంపై, విద్య ద్వారా గ్రామీణ ప్రభుత్వ పాఠశాలలకు వెళుతున్న పేద పిల్లల జీవితాల్లో విద్యా మాధ్యమం ఎలాంటి మార్పు తీసుకొస్తోందనే అంశంపై ఆ వార్త ఒక సమగ్ర వివరణను అందించింది. భారతీయ విద్యా వ్యవస్థలోని ప్రతి ఒక్క అంశంలో సమాన అవకాశాల విషయంలో తిరస్కరణకు గురైన భారతీయ సమాజంలోని వివిధ వర్గాలకు ఏపీ విద్యా విధానం కచ్చితంగా సరికొత్త ఆశను కలిగిస్తోంది. రాష్ట్రంలోని పిల్లలందరి ఆస్తిగా విద్యను మలచాలనే కృతనిశ్చయంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయ స్థాయిలో విస్తారంగా పెట్టుబడి పెట్టడం ద్వారా ఈ కొత్త ఆశ పుట్టుకొచ్చింది. ఆయన విధానంలో మూడు కీలక అంశాలున్నాయి. ఒకటి, ఏపీ సీఎం పదే పదే చెప్పినట్లుగా, అన్ని అంశాల్లో నాణ్యమైన, సమాన విద్య అనేది ప్రభుత్వం యువతరానికి ఇచ్చే అత్యుత్తమ సంపదగా ఉంటుంది. ప్రతి ఒక్క వ్యక్తి చివరి ఊపిరి వరకు మిగిలి ఉండే ఏకైక సంపద విద్యే. ఎవరూ దాన్ని దొంగిలించలేరు. ఎవరూ దాన్ని దుర్వినియోగపర్చలేరు. రెండు, భారతీయులు తమ చరిత్ర పొడవునా అంటే ప్రజాతంత్ర రాజ్యాంగ వ్యవస్థను ఏర్పర్చుకున్న తర్వాతి కాలంలో కూడా ఒకే భాషలో అనేక బోధనావకాశాలను పొందే అవకాశానికి నోచుకోలేదు.. ఇలాంటి నేపథ్యంలో ఏపీ సీఎం తెలుగు ఒక సబ్జెక్టుగా ఉంటూనే అంగన్వాడీ (ప్రీ–స్కూల్) నుంచి విశ్వవిద్యాలయ డిగ్రీ వరకు అన్ని స్థాయిల్లోనూ ఇంగ్లిష్ మాధ్యమాన్ని తప్పక నేర్చుకునేలా చేశారు. భారతీయ భాషా విధానంలో ఇది అతి గొప్ప గెంతుగా చెప్పాలి. మూడు, ఏపీ ప్రభుత్వం విద్యారంగంపై గణనీయమైన మొత్తాన్ని చాలా సృజనాత్మకంగా ఖర్చుపెడుతోంది. ఇక్కడ ఇచ్చిన డేటా దీనిపై స్పష్టమైన చిత్రణను అందజేస్తుంది. ఇక్కడ ఇచ్చిన నగదు వివరాలు 2019లో జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు బడ్జెట్ సంవత్సరాల్లో విద్యపై పెట్టిన ఖర్చుకు సంబంధించిన వివరాలు. జగనన్న అమ్మ ఒడి పథకం కింద రూ.13,022 కోట్లు ఖర్చుపెట్టారు. ఈ మొత్తం బడికి వెళుతున్న తమ పిల్లల విద్యకోసం ఖర్చుపెట్టడానికి నిరుపేద తల్లుల ఖాతాలోకి జమచేశారు. ఇది 44 లక్షల 48 వేల 865 కుటుంబాలకు ప్రయోజనం కలి గించింది. ఇక జగనన్న విద్యా దీవెన కింద రూ. 5,573 కోట్లను కాలేజీ వెళుతున్న పిల్లలకు ఫీజు చెల్లించడానికి తల్లుల ఖాతాలోకి జమచేశారు. ఈ మొత్తం 18 లక్షల 80 వేల 934 కుటుంబాలకు లబ్ధి కలి గించింది. జగనన్న వసతి దీవెన కింద రూ. 2,270 కోట్లు ఖర్చుపెట్టారు. ఈ మొత్తం కూడా అనేక విద్యాపరమైన, కుటుంబపరమైన ఖర్చుల నిమిత్తం మహిళల ఖాతాల్లోకి వెళ్లింది. ఇకపోతే జగనన్న గోరుముద్ద పథకానికి రూ. 1,600 కోట్లు ఖర్చుపెట్టారు. ఈ పథకంకింద పాఠశాలల్లో నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించారు. ప్రతిపిల్లవాడి పళ్లెంలో నాణ్యమైన ఆహారం అందించడం కోసం దీన్ని వెచ్చించారు. చివరకు కరోనా మహమ్మారి కాలంలో పాఠశాలలు మూతపడిన సందర్భంలో కూడా వండిన భోజ నాన్ని పిల్లల ఇళ్లకే వెళ్లి అందించారు. ఇది 36,88,618 మంది పిల్లలకు ప్రయోజనం కలిగించింది. జగనన్న విద్యా కానుక అనే మరో పథకం కింద పుస్తకాలు, బ్యాగులు, షూలు తదితరాల కోసం రూ. 650 కోట్లు ఖర్చుపెట్టారు. ఈ పథకం 45 లక్షల పిల్లలకు ప్రయోజనం కలిగిం చింది. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం చక్కటి పాఠశాల మౌలిక వసతులను నిర్మించడానికి ‘నాడు నేడు’ పథకం ప్రారంభించింది. మౌలిక వసతుల అభివృద్ధి పథకం తొలిదశలో రూ. 3,564 కోట్లు వెచ్చించి 15,205 పాఠశాలల్లో నాణ్యమైన వసతులు కల్పించారు. మొత్తం మీద చూస్తే ఈ విద్యా పథకాలన్నింటిపై రెండు ఆర్థిక సంవత్సరాల సమయంలో రూ. 26,678 కోట్లను ఏపీ ప్రభుత్వం ఖర్చుపెట్టింది. ఈ పథకాలకు పెట్టిన ఖర్చు బోధన, బోధనేతర సిబ్బంది వేతనాలకంటే ఎంతో ఎక్కువ. తీవ్ర దారిద్య్రం, గ్రామీణ, పట్టణ నిరుద్యోగిత తాండవిస్తున్న దేశంలో పిల్లలందరికీ నాణ్యమైన, ఒకే జాతీయ భాషలో విద్యను అందించడం అనేది అతిపెద్ద విప్లవం అని చెప్పాలి. భారతీయ విద్యావ్యవస్థ తొలి నుంచీ కుల, వర్గ పక్షపాతంతో కొనసాగుతూ వచ్చింది. భారతీయ ప్రజాస్వామ్యం నాణ్యమైన పాఠశాల విద్య ప్రాముఖ్యతను ఇంతవరకు గుర్తించలేదు. విద్యపై మంచి బడ్జెట్ కేటాయింపులను చేయవలసిన అవసరాన్ని కూడా మన వ్యవస్థ గుర్తించలేదు. అలాగే ఏ రాష్ట్ర ప్రభుత్వం లేక కేంద్ర ప్రభుత్వం కూడా పిల్లలందరికీ ఒకే భాషలో విద్యతో జాతిని ఐక్యపర్చవచ్చని గుర్తించలేకపోయాయి. దీనికోసం ఇంగ్లిష్‌ని ప్రధాన జాతీయ బోధనా భాషగా చేస్తూ సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవలసిన అవసరం ఉంది. ఇంగ్లిష్‌ని ఇప్పటికైనా భారతీయ భాషగా గుర్తించితీరాలనీ, అన్ని పాఠశాలల్లో జాతీయ ప్రాధాన్యత కింద ఇంగ్లిష్‌ని బోధించాలనీ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్నార్ నారాయణ మూర్తి ఇటీవలే మొట్టమొదటిసారిగా పేర్కొన్నారు. అయితే సాహసోపేతమైన ముఖ్యమంత్రులుగా పేరొందిన సిద్ధరామయ్య, పినరయి విజయన్ కూడా తమ తమ రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంని ప్రవేశపెట్టడానికి భయపడ్డారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు కూడా కేజీ నుంచి పీజీ వరకు ఇంగ్లిష్ మీడియం విద్యను ప్రవేశపెడతామని వాగ్దానం చేసి దాన్ని నిలుపుకోలేకపోయారు. అత్యంత సాహసిగా పేరొందిన మమతా బెనర్జీ సైతం తన రాష్ట్రంలో ఇంగ్లిష్‌ను ఉమ్మడి బోధనా భాషగా చేయడం ద్వారా విద్యావ్యవస్థను సంస్కరించడానికి చర్యలు చేపట్టలేకపోయారు. పునరుజ్జీవనోద్యమ రాష్ట్రంగా పేరొందిన బెంగాల్ ఇప్పుడు అన్ని పరామితులలో చూస్తే విద్యలో అత్యంత వెనుకబడ్డ రాష్ట్రంగా ఉంటోంది. చివరకు మహారాష్ట్ర, గుజరాత్‌లలో కూడా సంపన్నులు తమ పిల్లలను ఇంగ్లిష్ మాధ్యమంలో చదివిస్తుండగా, మరాఠా, గుజరాతీ భాషా సెంటిమెంట్‌ని నిరుపేద దళితులకు, శూద్రులకు, ఆదివాసీలకు పరిమితం చేసి వారు ప్రాంతీయ భాషా విద్యకు కట్టుబడేలా చేశారు. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్రెడ్డి తీసుకున్న సాహసోపేతమైన చర్యను తప్పకుండా అభినందించాల్సి ఉంది. ఉత్తర భారతదేశంలో ముఖ్యమంత్రులందరూ ప్రభుత్వ పాఠశాలల ద్వారా ప్రాంతీయవాదం అనే సాంప్రదాయ అవగాహనతోనే ప్రాంతీయ భాషలను ప్రోత్సహిస్తున్నారు. కానీ సంపన్నులు మాత్రం ఇంగ్లిష్‌ను వలస భాషగా గుర్తించడం లేదు కాబట్టే తమ పిల్లలను ఏ ప్రాంతంలోనైనా, లేక ఏ రాష్ట్రంలోనైనా సరే... ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో చదివించేందుకు డబ్బు వెచ్చిస్తున్నారు. ఈ వివక్షను ఎందుకు పట్టుకుని ఇంకా వేలాడాలి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యావిధానం భాషా విధానంలో మౌలిక మలుపులాంటిది, అంతేకాకుండా ఇది సమర్థవంతమైన పెట్టుబడి పాలసీ కూడా. బ్రిటిష్ నమూనాను పోలినటువంటి విద్యాపరమైన సంక్షేమవాదాన్ని ఏపీ ప్రభుత్వం ఇప్పుడు చేపట్టింది. అయితే బ్రిటన్ వంటి అత్యంత అభివృద్ధి చెందిన దేశంలో మాదిరి కాకుండా, భారత్‌లో ఈ విధానానికి కేంద్ర ప్రభుత్వ మద్దతు లేదు. కేంద్ర ప్రభుత్వం తన భాషా విధానాన్ని ఏకీకృత జాతీయ భాషా విధానంగా మార్చనంతవరకు, ప్రస్తుతం అంతర్జాతీయీకరణకు గురైన ప్రపంచానికి వర్తించే, అన్ని తరాలకు అవసరమయ్యే నాణ్యమైన కంటెంట్ విద్యను అందివ్వడం సాధ్యం కాదు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్నాళ్లకు, ఇన్నేళ్లకు ఒక దారి చూపిస్తోంది. వ్యాసకర్త: ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెపర్డ్ ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
ఏది విజయం.. ఏది వైఫల్యం?
స్వాతంత్య్ర దినోత్సవం అంటే ఒకప్పుడు పిల్లలకు పండుగదినం. 72 ఏళ్ల క్రమంలో నచ్చిన పార్టీకి ఓటువేసే, నచ్చని పార్టీని తిరస్కరించే రాజకీయ స్వేచ్ఛ మనకు వచ్చిం దేమో కానీ మన సామాజిక వ్యవస్థ నేటికీ అప్రజాస్వామ్యంగానే కొనసాగుతోంది. కులం, అంటరానితనం, మహిళల అసమానత దీని మౌలిక లక్షణాలు. దేవుడు భారతీయులను అసమానంగా సృష్టించాడన్న ఆధ్యాత్మిక ఫాసిజం ఇప్పుడు మతం రూపంలో రాజ్యమేలుతోంది. ఆగస్టు 15, జనవరి 26 రావచ్చు, వెళ్లిపోవచ్చు. కానీ మన మేధో చింతనలో ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం కీలక చర్చనీయాంశంగా మారకపోతే మన రాజ్యాంగ సంవిధానం ఏ సమయంలోనైనా కుప్పకూలే ప్రమాదం ఉంది. మన ప్రజాస్వామ్యంలో మానవులకంటే జంతువులు మరింత గౌరవప్రదంగా మనుగడ సాగిస్తున్నాయి. వాటికి ఆధ్యాత్మికం, సామాజికం, రాజకీయం అనేవి తెలీవు కాబట్టి. ఆగస్ట్ 15 అంటే మేం చదువుకునే రోజుల్లో పాఠశాలకు పండుగ దినం అన్నమాట. 1950ల చివర్లో, 1960ల ప్రారంభంలో నా పాఠశాల రోజుల్లో ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉండేది. జెండా వందనం, తీపి మిఠాయి తినడం మా జ్ఞాపకాల్లో మిగిలి ఉంటోంది. 8 లేక 9 ఏళ్ల వయస్సులో గొడ్లు కాచే పని నుండి బలవంతంగా బడిచదువుకు మారిన అబ్బాయిగా బడి అంటే నాకు జైలులాగే తలపించేది. కానీ స్కూల్లో చేరిన తర్వాత తొలి ఆగస్టు 15 వచ్చినప్పుడు ఏదో తెలీని ఆనందం కలి గింది. ఆరోజు కాళ్లు ముడుచుకుని దుమ్ము నేలపై కూర్చునే పని ఉండేది కాదు. అది రహదారులపై ఆడుకునే రోజు. ఆరోజు పెన్సిల్ లేక కొత్త పలక వంటి చిన్ని బహుమతులు పొందవచ్చు అనే ఆశ పరవశం కలిగించేది. స్కూల్లో చేరిన తర్వాత తొలి ఆగస్టు 15న మా అన్నకు బహుమతి వచ్చింది. నాకు రాలేదని నాకు ఇప్పటికీ గుర్తు ఉంది. ఇక్కడే నా వైఫల్యం, దాంతోపాటు అసూయ మొదలయ్యింది. బహుమతి రాకపోవడం అనేది వైఫల్యంతో ఇంకా ఎక్కువగా ఎలా పోరాడాలో నేర్పింది. అసూయ అనేది వైఫల్యాన్ని ఎలా అధిగమిం చాలో నేర్పించింది. ఆ తర్వాత అనేక ఆగస్టు 15లు గడిచిపోయాయి. ఆనాడు నా తొలి ఆటలో నేను ఓడిపోయినట్లుగా భారతజాతి వైఫల్యం పొందిందా లేక ఇరుగుపొరుగు దేశాల్లో అసూయ రేకెత్తించడం ద్వారా మా తమ్ముడిలాగా విజయం పొందిందా? అనే అంశాన్ని మదింపు చేయాలనుకుంటున్నాను. మనది రాజకీయ ప్రజాస్వామ్యం. ఇక్కడ నాకు నచ్చని పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ, వచ్చే ఎన్నికల్లో దానికి వ్యతిరేకంగా ఓటు వేసే స్వాతంత్య్రం నాకు ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో దానికి వ్యతిరేకంగా ఓటు వేస్తాననే ఆశతో నేను జీవిస్తాను. ఇది నా విజయం. కానీ మనకు అప్రజాస్వామికమైన సామాజిక వ్యవస్థ ఉంది. పార్టీలు అధికారంలోకి వస్తుంటాయి, తప్పుకుంటాయి. కానీ కులం, అంటరానితనం, మహిళల అసమానతలతో కూడిన భారత అప్రజాస్వామిక సామాజిక వ్యవస్థ కొనసాగుతూనే ఉంటుంది. నామీద, ప్రతి ఒక్కరిమీద అణచివేత, హింస వేలాడుతూనే ఉంది. ఈ సామాజిక వ్యవస్థలో పేదలు, పీడితులు కడగండ్లపాలవుతుండగా, ధని కులు సైతం అభివృద్ది చెందిన మానవులుగా జీవించడం లేదు. ఇది మన వ్యవస్థ ఘోర వైఫల్యం. అప్రజాస్వామికమైన సామాజిక వ్యవస్థ భారత రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎలా కలిసి మనుగడ సాగిస్తోంది? ఎందుకంటే నా దృష్టిలో భారతీయ పౌర సమాజం అప్రజాస్వామికమైన ఆధ్యాత్మిక వ్యవస్థకు బంధీౖయె ఉంది. ఈ 21వ శతాబ్ది ఆధునిక పెట్టుబడిదారీ వ్యవస్థలోనూ మన సామాజిక సంబంధాలను పాలించడంలో మతం కీలకపాత్ర పోషిస్తూ ఉంది. ప్రస్తుతం హిందూయిజంగా పేరుమార్చుకున్న భారతీయ బ్రాహ్మణవాదం దేవుడు భారతీయులను అసమానంగా సృష్టిం చాడన్న ఆధ్యాత్మిక ఫాసిజాన్ని నియమబద్ధంగా సంస్థాగతం చేసిపడేసింది. ఈ నేలపై కొనసాగుతున్న ఇతర మతాలు కూడా తమ సామాజిక సంబంధాలను (ఇస్లాం, క్రిస్టియానిటీ, సిక్కిజం తదితరాలు) విశాల ప్రాతిపదికన బ్రాహ్మణవాద నైతిక వ్యవస్థ పరిధిలోనే కొనసాగిస్తున్నాయి. అందువల్లెనే భారత రాజ్యాంగం దేశంలోని అన్ని ఆధ్యాత్మిక వ్యవస్థలకు చెందిన దిగువకులాలు, నిరుపేదలు, మహిళలకు సమానహక్కులను అందిస్తున్నప్పటికీ అనేక సామాజిక రంగాల్లో వీరు అవమానాలు, అసమానతల బారిన పడుతున్నారు. పీడకుల హృదయ పరివర్తనవల్ల కాకుండా, పీడితులు త్యాగాలు చేస్తున్న కారణంగానే భారతీయ రాజ్యాంగ సంవిధానం మనుగడ సాగిస్తోంది. హిందువులకు (రామరాజ్యం) ఓటు వేసి అధికారం కల్పిస్తే స్వర్గం నేరుగా భారతీయ భూమిపైకి వచ్చి వాలుతుందని బీజేపీ, ఆరెస్సెస్ ప్రకటిస్తున్నాయి. మన దేశంలో కొంతమంది గోవులను పూజించదల్చినట్లయితే, పశువులను తోలుకుపోయేవారిని చిత్రహింసలకు గురిచేస్తారు. కొంతమంది ప్రజలు తమ దేవుడిపై నమ్మకం లేని ఇతరులను కూడా ఆ దేవుడినే పూజించాలని ఒత్తిడికి గురిచేస్తుంటారు. ఫలానా దేవుడిని మేం ఆరాధిస్తాం అని దళితులు ప్రకటిస్తే వారిని దేవాలయం నుంచి వెళ్లగొడతారు, చావగొట్టి చిత్రహింసలు పెడతారు. ఇతరులను చిత్రహింసలకు గురిచేసే ప్రతి ఒక్క అంశాన్ని, ప్రజాస్వామ్యానికి నమూనాగా నిర్వచిస్తుంటారు. దేశంలోని అన్ని రాజ్యాంగ వ్యవస్థలూ ఆధ్యాత్మిక ఫాసిజం ఆదేశానుసారమే పనిచేస్తుంటాయి. ప్రజాస్వామ్యానికి అర్థం ఇదేనని రాజ్యాంగబద్ధ సంస్థలు ఆమోదిస్తుంటాయి. మన దేశంలోని మేధావులు చాలా తీవ్రమైన గందరగోళంలో ఉన్నారు. ఎందుకంటే, వీరు ప్రజాతంత్ర వాతావరణంలో ఉన్న కుటుంబాలలో పుట్టినవారు కాదు. మతపరమైన సెక్యులర్ మేధావులిద్దరికీ ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యంలోనే ఉమ్మడి మూలాలున్నాయి. వీరిరువురూ ఒకే కుదురులోంచి వచ్చారు. అందుకే వీరు ఒక గొర్రెలకాపరిని మేధావిగా పరిగణించరు. మీరు లౌకికవాది అయితే ఈ అంశాన్ని ఉపేక్షించవచ్చు. లేదా మీరు హిందువైనట్లయితే దీన్ని జాతి వ్యతిరేకమనుకోవచ్చు. మనందరం ఎప్పటికీ గొర్రెల్లాగానే ఉండాలి. అంతే తప్ప మనం సమానత్వ దేవుడు సృష్టించిన జంతువులన్నింటినీ సమానంగా చూసే విమర్శనాత్మకమైన గొర్రెల కాపరిగా ఎన్నటికీ మారకూడదు. మనుషులందరినీ సమానులుగా దేవుడు సృష్టించాడు అనే సూత్రబద్ధతతోనే మానవ జీవితంలోకి దైవ భావన ప్రవేశించింది. కానీ ఈదేశంలో బ్రాహ్మణ వాదం తన రచనల ద్వారా, రోజువారీ జీవితాచరణ ద్వారా, దేవుడు మనుషులను అసమానులుగా సృష్టిం చాడని ప్రకటించింది. దాన్ని భారతీయ ఇస్లాం, భారతీయ క్రిస్టియనిజం కూడా ఆమోదించడమే కాకుండా తమ జీవితాచరణలో కూడా అసమానత్వాన్నే కీలకమైన అంశంగా స్వీకరించింది. మన దేశంలో చాలామంది మేధావులు తాము లౌకికవాదులమని భావిస్తుంటారు కానీ అన్ని మతాల పుట్టుకకు ఆధ్యాత్మక ఫాసిజమే మూలమనే అంశంపై చర్చించరు. వీరి దృష్టిలో వివిధ మతాలు ఉనికిలో ఉండటం అనేది సుందరమైన బహుళత్వానికి, వైవిధ్యతకు సంకేతమట. ఇలాంటి లౌకికవాదం వల్ల కూడా ఈదేశంలోని దళితులు, ఆది వాసులు, శూద్రులు కష్టాల్లో మునిగితేలుతున్నారు. ఈ అంశాన్ని ఘనత వహించిన మన లౌకిక మేధావులు చర్చిం చరు. సామాజిక శాస్త్రం కాదు కాబట్టి ఆధ్యాత్మక వ్యవస్థపై చర్చ అనవసరం అనే బౌద్ధిక నిజాయితీ రాహిత్యం వీరిది. ప్రతి ఆధ్యాత్మిక అప్రజాస్వామ్యాన్ని చివరకు ఆధ్యాత్మిక ఫాసిజాన్ని కూడా సెక్యులరిజం తన ముసుగులో కప్పిపెడుతుంది. ఇదే యూనివర్సిటీల్లో, సివిల్ సర్వీసులో, రాజకీయరంగంలో వారి ఉద్యోగాలను కాపాడుతోంది మరి. అసమానత్వాన్ని దేవుడి ప్రసాదంగా ఎంచే మతం పాలి స్తున్నప్పుడు నిర్దిష్ట రాజకీయ ప్రజాస్వామిక చర్చ ఆ మతాన్ని కూడా చర్చలోకి లాగాల్సిందే. లేకుంటే ఆధ్యాత్మిక బానిసల సమ్మతితో విద్రోహులు అధికారం చేజిక్కించుకుంటారు. ఆధ్యాత్మిక నిరంకుశాధికారత్వం, చివరకు ఫాసిజం కూడా వ్యవస్థాగత ఆధ్యాత్మికవాదంలో భాగమే. ఎందుకంటే బ్రాహ్మణవాదం ప్రతి భారతీయుడిలోకి చొచ్చుకుపోయింది. మానవులను అది బాని సత్వంలో లేక ఆధిపత్యం కింద జీవించేలా చేసింది. బ్రిటిష్ హయాంలో కొన్ని సంస్కరణలు ప్రారంభమైనా, భారతీయ ఆధ్యాత్మిక వ్యవస్థలు మాత్రం అప్రజాస్వామికంగానే కొనసాగుతూ వచ్చాయి. ప్రజాస్వామ్యం అంటే వీటి దృష్టిలో మానవ చింతనకు, పౌరసమాజానికి అతీతంగా జీవించే స్వయం ప్రతిపత్తి వ్యవస్థ అని అర్థం. కాని ఇది నిజం కాదు. 72 ఏళ్ల రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యం తర్వాత కూడా మానవ అసమానత్వం అనేది మన కాలానికి, వయస్సుకు, మనం స్వీకరించిన రాజకీయ వ్యవస్థకు ఏమాత్రం సరిపోలడం లేదు. మన మేధో చింతన ప్రక్రియలో ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం కీలక చర్చనీయాంశంగా మారకపోయినట్లయితే మన రాజ్యాంగ సంవిధానం ఏ సమయంలోనైనా కుప్పకూలే ప్రమాదం ఉంది. ప్రపంచంలోని పలు దేశాల్లో దీన్ని మనం చూస్తున్నాం. ప్రతి సంవత్సరం ఆగస్టు 15, జనవరి 26 (గణతంత్రదినం) రావచ్చు, వెళ్లిపోవచ్చు. యువత ముసలితనంలోకి ప్రవేశించవచ్చు. వృద్ధులు ఈ దేశంలో ఆధ్యాత్మక, సామాజిక సంబంధాల్లో మౌలిక మార్పులను చూడకుండానే మరణించవచ్చు కూడా. కానీ నా దేశ ప్రజాస్వామ్యంలో మానవులకంటే జంతువులు మరింత గౌరవప్రదంగా మనుగడ సాగిస్తున్నాయి. ఎందుకంటే వాటికి ఆధ్యాత్మకం, సామాజికం, రాజకీయం అనేవి తెలీవు కాబట్టి. ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెఫర్డ్, వ్యాసకర్త డైరెక్టర్, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సోషల్ ఎక్స్‌క్లూజన్ అండ్ ఇంక్లూజివ్ పాలసీ -
ఎర్రజెండాకు దళిత ‘స్పృహ’!
గత 95 ఏళ్లుగా భారత కమ్యూనిస్టు పార్టీల (సీపీఐ, సీపీఎం) ప్రధాన కార్యదర్శిగా ఒక్కరంటే ఒక్క దళితనేత కూడా ఎంపికైన చరిత్ర లేదు. కాంగ్రెస్, బీజేపీ, సీపీఎంలతో సహా ఏ పాలకపార్టీ కూడా దళితులను నాయకత్వ స్థానాల్లోకి ఎదిగించని తరుణంలో డి. రాజాకు సీపీఐ అత్యున్నత స్థానం కట్టబెట్టడంతో కమ్యూనిస్టు ఉద్యమాన్ని సుదీర్ఘకాల పక్షపాతం నుంచి విముక్తి చేసినట్లయింది. సీపీఐ ప్రధాన కార్యదర్శిగా డి. రాజా నియామకం చారిత్రాత్మక చర్య. విజ్ఞత కలిగిన కమ్యూనిస్టుగా, సిద్ధాంతవేత్తగా, స్ఫూర్తిదాయక మూర్తిగా ఎదిగిన ఈ దళిత నాయకుడి ఎంపిక వామపక్ష–అంబేడ్కర్ వాదుల్లో ఒక నూతన స్ఫూర్తిని కలిగించే చర్య. ఈ రెండు పక్షాలతో రాజా సజీవ సంబంధాలను కొనసాగించడం భవిష్యత్ ఐక్యతకు బలం చేకూరుస్తుంది కూడా. తన సొంత ప్రతిభాపాటవాలపై ఆధారపడి ఎదిగివచ్చిన డి. రాజా అందరి ప్రశంసలకు అర్హుడు. భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ప్రధాన కార్యదర్శిగా డి. రాజా నియామకం ఒక చారి త్రాత్మక చర్య. భారత జాతీయ కమ్యూనిస్టు నేతగానే కాకుండా, విజ్ఞత కలిగిన కమ్యూనిస్టుగా, సిద్ధాంతవేత్తగా, స్ఫూర్తిదాయక మూర్తిగా ఎది గిన దళిత నాయకుడు డి. రాజా. మండల్ అనుకూల, వ్యతిరేక ఉద్యమాలు భారత రాజకీయ చరిత్రను మార్చివేసిన తర్వాత, వామపక్షాల నుంచి దళిత బహుజనులకు, కమ్యూనిస్టులకు మధ్య సాధికారిక స్వరంతో చర్చలు జరిపిన ఏకైక నేత డి. రాజానే. దామోదరం సంజీవయ్య తర్వాత కాంగ్రెస్ పార్టీలో సైతం పార్టీ అధ్యక్షుడిగా దళితుడికి అవకాశం ఇచ్చిన చరిత్ర లేదు. భారతీయ జనతా పార్టీ బంగారు లక్ష్మణ్‌ని పార్టీ అధ్యక్షుడిగా ప్రోత్సహించింది కానీ ఆయన తన సొంత సామర్థ్యం ప్రాతిపదికన అత్యున్నత పదవికి ఎంపిక కాలేదన్నది అందరికీ తెలిసిందే. కానీ స్టింగ్ ఆపరేషన్‌లో కేవలం లక్షరూపాయలు తీసుకుంటూ పట్టుబడిన బంగారు లక్ష్మణ్ చివరకు దాదాపుగా జైలులోనే మృతి చెందాల్సి రావడం విషాదకరం. భారత రాష్ట్రపతి పదవిలో అయిదేళ్ల పూర్తికాలం సౌఖ్యంగా గడిపిన ఏకైక దళిత నేత కె.ఆర్. నారాయణన్. ఈయన స్వతహాగా మేధావి. మరో దళిత నేత రామ్‌నాథ్ కోవింద్ ప్రస్తుతం రాష్ట్రపతిగా వ్యవహరిస్తున్నారు కానీ ఆయన పదవీ విరమణ సమయానికి రాష్ట్రపతి పదవిపై, దేశ చిత్రపటంపై ఎలాంటి ముద్ర వేయనున్నారో చూడటానికి మనం వేచి ఉండాల్సిందే. కానీ భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) 1962లో తొలిసారిగా విడిపోయింది. తర్వాత మావోయిస్టు గ్రూపుల చీలికలతో మరోసారి చీలి పోయింది. ఇలా పలుసార్లు కమ్యూనిస్టు పార్టీలో చీలికలు ఏర్పడ్డాయి. తదనంతర కాలంలో సభ్యుల పరంగా, ఎన్నికల పరంగా సీపీఎం పెద్దపాత్ర పోషించినప్పటికీ సీపీఐ కమ్యూనిస్టు సిద్ధాంత చుక్కానిగా కొనసాగుతూ వస్తోంది. చారిత్రక తప్పిదానికి సవరణ మండల్ ఉద్యమం, అంబేడ్కర్ భావజాలం భారతీయ దళిత–బహుజనుల సామాజిక, రాజకీయ ప్రతిపత్తిని మార్చివేసిన తర్వాత, దేశంలోని కమ్యూనిస్టు పార్టీలు నైతికంగా వెనుకంజ వేసి దెబ్బతిన్నాయి. 1925లో దేశంలో కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావం తర్వాత దాదాపుగా గత 95 సంవత్సరాలుగా కమ్యూనిస్టు పార్టీల (సీపీఐ, సీపీఎం) ప్రధాన కార్యదర్శిగా ఒక్కరంటే ఒక్క దళితనేత కూడా ఎంపికైన చరిత్ర లేదు. కాంగ్రెస్, బీజేపీ, సీపీఎంలతో సహా ఏ పాలకపార్టీ కూడా డి. రాజా వంటి నేతను తమ పార్టీల నిర్మాణంలో ఎదిగించని, రూపొందించని తరుణంలో సీపీఐ ప్రధాన కార్యదర్శిగా డి.రాజాకు అత్యున్నత స్థానం కట్టబెట్టడం అనేది కమ్యూనిస్టు ఉద్యమాన్ని పక్షపాతం, దురభిమానాల నుంచి విముక్తి చేసినట్లయింది. డి. రాజా ఇంతటి అత్యున్నత స్థానాన్ని సాధిం చుకున్నప్పటికీ, దీనికి గాను ఆయన పార్టీని నిజంగా అభినందించాల్సి ఉంది. ఎందుకంటే సీపీఎం నేటివరకు ఒక్కరంటే ఒక్క దళిత్‌ని/ఆదివాసీని తన పొలిట్ బ్యూరోలోకి తీసుకోలేకపోయింది. కాబట్టే దళితులు, ఆదివాసులు సీపీఎం, ఆరెస్సెస్ మధ్య ఎలాంటి వ్యత్యాసం లేదని భావిస్తున్నారు. సీపీఎం లాగా, ఆరెస్సెస్ కూడా తన అత్యున్నత స్థానంలోకి ఒక దళితుడిని, ఆదివాసీని ప్రోత్సహించలేదు. (బంగారు లక్ష్మణ్ మినహాయింపు). కమ్యూనిస్టులు మాటల్లో కాకుండా చేతల్లో తమను తాము నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. దిగువ కులాలకు చెందిన ప్రజారాశులు.. ప్రతి ఒక్కరినీ వారి చేతల ద్వారానే అంచనా వేయగలిగినటువంటి తమ సొంత మేధావులను తయారు చేసుకున్నాయని కమ్యూనిస్టులు తప్పకుండా అవగాహన చేసుకోవాలి. కార్మికులు–అగ్రకుల నాయకత్వం కమ్యూనిస్టు ఉద్యమాలు ప్రజాసముద్రంలోని అలలు వంటి వారయినట్లయితే, దాని నేతలు ఆ అలల నుంచి పుట్టుకొచ్చిన నురుగు లాంటివారని చైనా ప్రజాతంత్ర రిపబ్లిక్ తొలి ప్రధానమంత్రి చౌఎన్‌లై పేర్కొన్నారు. కానీ భారతదేశంలో తొలినుంచి జరుగుతూ వచ్చింది ఏమిటంటే దళిత బహుజన సామాజిక బృందాలనుంచి కార్మికులుగా, కర్షకులుగా, కూలీలుగా అలలు పుట్టుకొస్తే, నాయకులు మాత్రం ఆ అలలతో సంబంధం లేని ఎగువ కులాల నుంచి పుట్టుకొచ్చారు. కనీసం తొలినాళ్లనుంచి పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో కమ్యూనిస్టు నాయకత్వం దళిత బహుజన శ్రేణులనుంచి పుట్టుకొచ్చి ఉంటే బాగుండేది. కానీ వారలా చేయలేదు. దీంతో కమ్యూనిస్టు పార్టీలోని ఎగువ కులాలకు చెందిన నాయకులు ఉద్దేశపూర్వకంగానే దళిత, ఆదివాసీ కార్యకర్తలను క్షేత్ర స్థాయిలోనే ఉంచి, అలలపైన నురగలాగా మారడానికి వారిని అనుమతించలేదన్న అభిప్రాయాన్ని కలిగించారు. ఈ క్రమంలో కార్మిక వర్గం వెలుపలి నుంచే మేధోనాయకత్వం పుట్టుకొస్తుందని చెప్పిన లెనిన్ సూత్రీకరణలపైనే భారతీయ కమ్యూనిస్టు నాయకులు విశ్వాసం ఉంచుతూ వచ్చారు. ఉదాహరణకు భారతదేశంలోని బ్రాహ్మణ జనాభా ఎన్నడూ కమ్యూనిస్టు ఉద్యమ మద్దతుదారులుగా లేరు. కానీ కమ్యూనిస్టు మేధో నాయకులు మాత్రం బ్రాహ్మణులనుంచి వచ్చారు. బ్రాహ్మణులు మాత్రం ఎల్లప్పుడూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, భారతీయ జనతా పార్టీతోనే కలిసి ఉండేవారు. ఎందుకంటే వీటి సంస్థాగత నిర్మాణాలు వారి సామాజిక–ఆధ్యాత్మిక హృదయానికి, ఆలోచనలకు అతి దగ్గరగా ఉండేవి మరి. దీనికి భిన్నంగా, దళిత్, ఓబీసీలకు చెందిన ప్రజానీకం కమ్యూనిస్టు పార్టీల పక్షాన్నే ఉండేవారు కానీ వీరినుంచి మేధోగత నాయకులు ఎదిగి వచ్చేవారు కాదు. బహుశా కమ్యూనిస్టు పార్టీల్లోని క్షేత్ర స్థాయి ప్రజానీకానికి తగిన విద్య, మేధో పరిపక్వత లేకపోవడం ఒక సమస్యే కావచ్చు. ఈ పరిమితి ఉన్నప్పటికీ, సాధారణ ప్రజా రాశులనుంచి నాయకులకు శిక్షణ నివ్వడంపై కమ్యూనిస్టు పార్టీలు ప్రత్యేక దృష్టి పెట్టి ఉండాలి. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ వంటి ఉన్నత విద్యా సంస్థలలో అలాంటి చక్కటి మేధోవంతమైన యువత పుట్టుకొచ్చే సమయానికి, వాటిలో అంబేడ్కరిజం బలపడింది. దీంతో దళిత్, ఓబీసీలకు చెందిన యువత వామపక్ష భావాలపైపు మొగ్గు చూపుతున్నప్పటికీ, కమ్యూనిస్టు పార్టీల్లోని అగ్రశ్రేణి నేతలు దిగువ కులాలనుంచి నాయకులు ఆవిర్భవించడానికి అనుమతించడం లేదన్న అనుమానం క్రమేణా వారిలో పెరుగుతూ వచ్చింది. అందుకే ఆనాటి నుంచి వారు అగ్రకుల కమ్యూనిస్టు నాయకులను అనుమానించడం మొదలుపెట్టారు. అయితే డి.రాజా సీపీఐలో అత్యున్నత స్థాయికి ఎదగడం అనేది వామపక్ష అంబేడ్కర్ వాదుల్లో ఖచ్చితంగా ఒక కొత్త వాతావరణాన్ని కలిగిస్తుంది. ఈ రెండు పక్షాలలో రాజా సజీవ సంబంధాలను కొనసాగించడం కూడా దీనికి కారణం కావచ్చు. ప్రతిభాపాటవాలతోనే ఉన్నతి పెరియార్ ఈవీఆర్ రామస్వామి కాలం నుంచి దిగువ కులాల నాయకత్వం బలంగా రూపొందిన సుదీర్ఘ చరిత్రను కలిగి ఉన్న తమిళనాడు నుంచి డి.రాజా పుట్టుకొచ్చారు. డీఎంకే దివంగత నేత ఎం. కరుణానిధి నాయీ బ్రాహ్మణ సామాజిక బృందం నుంచి ఎదిగివచ్చారు. (ఈయన పూర్వీకులు ఆలయ సంగీత విద్వాంసులుగా, గాయకులుగా జీవించేవారు) ఇప్పుడు డి. రాజా తమిళనాడులోని దళిత కమ్యూనిటీ నుంచి ఎదిగివచ్చారు. అయినంతమాత్రాన రాజా స్వీయ ప్రతిభను కానీ, మనసావాచా కమ్యూనిస్టు ఉద్యమాచరణకు అంకితం కావడాన్ని కానీ ఎవరూ తోసిపుచ్చలేరు. తన సొంత ప్రతిభాపాటవాలపై ఆధారపడి ఎదిగివచ్చిన రాజా అందరి ప్రశంసలకు అర్హుడు. తన సైద్ధాంతిక భూమికను వదులుకోకుండానే ఏ సామాజిక బృందంతోనైనా చర్చించగల, వ్యవహరించగల నిఖార్సయిన నేత డి. రాజా. ప్రత్యేకించి కమ్యూనిస్టు పార్టీ నిర్మాణాల్లో స్పష్టంగా కనిపించే ఒంటెత్తువాదానికి ఆయన చాలా దూరం. పార్లమెంటరీ కమ్యూనిస్టు పార్టీలు, బృందాలను ఐక్యపరచి నేపాల్ తరహా పంథాలో భారతదేశాన్ని నడిపించగల పరిపూర్ణ వ్యక్తిత్వం ఆయనది. కమ్యూనిస్టు ఉద్యమంలో సానుకూల మార్పులను తీసుకురావడానికి సీపీఎం కూడా ఈ అవకాశాన్ని తప్పక ఉపయోగించుకుంటుందని ఆశిద్దాం. ప్రొ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త డైరెక్టర్, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సోషల్ ఎక్స్‌క్లూజన్ అండ్ ఇంక్లూజివ్ పాలసీ -
ఆంధ్రా సెటిలర్స్‌కు అండగా ఉంటాం: ఐలయ్య
హైదరాబాద్: ఆంధ్రా సెటిలర్స్‌కు అండగా ఉంటా మని, టీఆర్ఎస్ భయపెడితే వారు భయపడాల్సిన అవసరం లేదని టీమాస్ ఫోరం చైర్మన్ ప్రొఫెసర్ కంచె ఐలయ్య అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రావాళ్లపై టీఆర్ఎస్ మాటల యుద్ధం చేస్తోందని, కేసీఆర్, కేటీఆర్ వాడే భాష సరైంది కాదన్నారు. కార్యక్రమంలో టీమాస్ ఫోరం కన్వీనర్ జాన్ వెస్లీ తదితరులు పాల్గొన్నారు. -
కోరుట్ల కోర్టుకు కంచ ఐలయ్య
కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్ల కోర్టుకు వివాదాస్పద పుస్తక రచయిత ప్రొఫెసర్ కంచ ఐలయ్య బుధవారం హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆర్యవైశ్యులు, బీజేపీ కార్యకర్తలు.. ఐలయ్య వర్గీయుల పరస్పరం నినాదాలు.. తోపులాటలతో ఉద్రిక్తత నెలకొంది. ఆర్యవైశ్య వర్గీయుల్లో ఒకరు చెప్పు విసరడంతో ఓ అడ్వకేట్‌కు తగిలింది. దాడికి నిరసనగా ఐలయ్య వర్గీయులు నంది చౌక్ వద్ద ధర్నా చేశారు. ఐలయ్య బుధవారం కోర్టుకు రాగా, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు నీలి మధు, నాయకులు నోటికి నల్లవస్త్రం కట్టుకొని ప్లకార్డులతో నిరసన తెలిపారు. కోర్టు ఐలయ్యకు బెయిల్ ఇస్తూ కేసును డిసెంబర్ 27కు వాయిదా వేసింది. ఈ క్రమంలో బయటకు వచ్చిన ఐలయ్య విలేకరులతో మాట్లాడుతుండగా, ఆర్యవైశ్యులతో పాటు బీజేపీ నాయకులు ఇందూరి తిరుమలవాసు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఇదే సమయంలో ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ప్రతినిధులతో పాటు మరికొందరు ఐలయ్యకు మద్దతుగా నినాదాలు తెలుపుతూ పూలుచల్లారు. దీంతో కోర్టు ఆవరణలో ఉద్రిక్తత నెలకొంది. ఐలయ్య కారును ఆర్యవైశ్య వర్గీయులు అడ్డుకున్నారు. శ్రీపతి నాగ భూషణం అనే యువకుడు చెప్పు విసరగా.. అది న్యాయవాది కంతి మోహన్‌రెడ్డికి తగిలింది. ఆగ్రహం చెందిన శ్రీపతి నాగభూషణంను కొట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాల వారిని చెదరగొట్టడంతో గొడవ సద్దుమణి గింది. కాగా, జగిత్యాలలో ఐలయ్య బస చేసిన హోటల్ వద్ద ఆయనపై కోడిగుడ్లతో దాడి చేసేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. ఓ ఆర్యవైశ్యుడు ఐలయ్య కారుపై చెప్పు విసిరేందుకు వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. -
కించపరుస్తూ పుస్తకాలు రాస్తే సహించం
నారాయణఖేడ్: కులాల్ని కించపరుస్తూ ఎవరు పుస్తకాలు రాసినా సహించేది లేదని కాకినాడ శ్రీపీఠం మఠాధిపతి స్వామి పరిపూర్ణానంద తెలిపారు. త్వరలో అన్ని కులాలతో సర్వజన సంఘటన ఏర్పాటు చేస్తానన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో బుధవారం రాత్రి రాష్ట్రీయ హిందూ సేన ఆవిర్భావ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా పరిపూర్ణానంద మాట్లాడుతూ.. మహిషాసురుడి కోసం అమ్మ వారు ఉద్భవించిన తరహాలో కొందరు పాపాత్ముల కోసం తాను బయటకు వస్తానని, తనను అమ్మ వారే పంపారన్నారు. తన పుట్టుక, కులం, మతం గురించి అడిగిన విషయాలపై పరిపూర్ణానంద ప్రొఫెసర్ కంచ ఐలయ్యపై పరోక్షంగా వ్యంగ్యంగా మాట్లాడారు. ఎక్కడ ఏ మాతృమూర్తి తనను అక్కున చేర్చుకుంటే వారే నా తల్లి అని, ఏ గడపకు వెళ్తే అదే నా ఇల్లు అని, ఏ పురుషుడి రూపం ఎదురైనా నాకు తండ్రి లాంటి వారే అని అన్నారు. సీపీఐ రామకృష్ణ మీ అమ్మ గురించి చెప్పేందుకు ఏం ఇబ్బందని అని పేర్కొన్నాడని, నా రూట్స్ గూర్చి మీలాంటి బ్రూట్స్‌కు, చెప్పాల్సిన అవసరం లేదన్నారు. -
ఐలయ్య వివాదానికి ఇక ముగింపు
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): ప్రొఫెసర్ కంచ ఐలయ్య రచించిన ‘సామాజిక స్మగ్లర్లు–కోమటోళ్లు’ పుస్తకంపై నెలకొన్న వివాదానికి ముగింపు పలకాలని ఇరువర్గాలు నిర్ణయించాయి. ఆర్యవైశ్య సంఘం, దళిత సంఘాల నేతలతో శనివారం విజయవాడలో కీలక సమావేశం జరిగింది. సుదీర్ఘ చర్చలు, సంప్రదింపుల తర్వాత పుస్తకంపై తలెత్తిన వివాదానికి, తదనంతర పరిణామాల నేపథ్యంలో ఏర్పడిన విభేదాలకు ఫుల్స్టాప్ పెట్టాలని నిర్ణయించారు. ఉమ్మడిగా అంగీకార ప్రకటన రూపొందించారు. అనంతరం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడారు. విజయవాడతో పాటు రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న అవాంఛనీయ పరిణామాలు, వివాదాలకు ముగింపు పలకాలని ఇరుపక్షాలు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లో ఉన్న కంచ ఐలయ్యతో ఫోన్లో సంప్రదించామన్నారు. ఇకపై జరిగే సభలు, సమావేశాల్లో ఆర్యవైశ్య కులం గురించి తాను మాట్లాడబోనని ఆయన చెప్పినట్లు తెలిపారు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు, వ్యాపార, సామాజిక రంగాల ప్రైవేటీకరణపైనే తాను మాట్లాడదలచుకున్నానని చెప్పారన్నారు. తాను 2009లో ప్రచురించిన ‘సామాజిక స్మగ్లర్లు– కోమటోళ్లు’ పుస్తకం రిజర్వేషన్ల అంశం చర్చించడానికి ఉద్దేశించి రాసినదేనని వివరించారన్నారు. పుస్తకంలో ఉన్న అంశాలపై బాధ్యత కలిగిన ప్రజాసంఘాల నాయకులు, వైశ్యసంఘం నాయకుల సమక్షంలో చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఫోన్ సంభాషణలో తెలిపారని రామకృష్ణ చెప్పారు. పుస్తకంలోని వివాదాస్పద అంశాలను పెద్దల సమక్షంలో చర్చించి పరిష్కరించాలని సమావేశంలో పాల్గొన్న పెద్దలు అభిప్రాయపడినట్లు తెలిపారు. ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు జయంతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పుస్తకంలోని అంశాలపై పెద్దలతో చర్చించేందుకు కంచ ఐలయ్య అంగీకరించిన నేపథ్యంలో వివాదానికి ఫుల్స్టాప్ పెడుతున్నామన్నారు. ఈ విషయమై ఎంపీ టీజీ వెంకటేష్, మాజీ ముఖ్యమంత్రి రోశయ్య వంటి పెద్దలతో చర్చించి అంగీకార ప్రకటన చేసినట్లు చెప్పారు. త్వరలోనే కంచ ఐలయ్యతో ఆర్యవైశ్య పెద్దలు సమావేశమవుతారని తెలిపారు. ఈ సమావేశంలో బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గంగాధర్, సామాజిక హక్కుల వేదిక నాయకుడు పోతుల సురేష్, ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ పోరాట సమితి చైర్మన్ ఎల్ జైబాబు, దళిత హక్కుల పోరాట సమితి నాయకుడు బుట్టి రాయప్ప పాల్గొన్నారు. పోలీస్ కమిషనర్‌తో భేటీ పుస్తక వివాదం, అనంతర పరిణామాల నేపథ్యంలో ఇరువర్గాలు విజయవాడలో శనివారం ఒకేరోజు పోటాపోటీగా సభల నిర్వహణకు పూనుకోవడం, పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఏర్పడిన ఉత్కంఠకు తాజా పరిణామాలతో తెరపడినట్టయింది. కాగా ఇరు వర్గాల నేతలు శనివారం రాత్రి విజయవాడ నగర పోలీసు కమిషనర్ గౌతం సవాంగ్‌తో భేటీ అయ్యారు. పరస్పరం మాట్లాడుకుని సామరస్యంగా సమస్యను పరిష్కరించుకుంటామని చెప్పారు. ఐలయ్య ఇంటివద్ద ఉద్రిక్తత ఐలయ్య విజయవాడలో జరిగే సభకు వెళ్లకుండా నిరోధించేందుకు హైదరాబాద్ తార్నాకలోని ఆయన ఇంటిని ఉస్మానియా వర్సిటీ పోలీసులు దిగ్బంధించారు. ఐలయ్య ఇంటికి వెళ్లే రోడ్లను బారికేడ్లతో మూసివేశారు. ఐలయ్య ఇంటి వద్దకు చేరుకున్న టీ–మాస్ ప్రతినిధులు విమలక్క, ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు, నలిగంటి శరత్, దళిత సంఘర్షణ సమితి ప్రతినిధులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. కాగా ఐలయ్య తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదన్నారు. అయితే ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడతానని, తన పోరాటం కులాలకు వ్యతిరేకం కాదని చెప్పారు. ఇలావుండగా కంచ ఐలయ్యకు సంఘీభావంగా విజయవాడ వెళ్లేందుకు యత్నించిన ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావును, ఇతర నేతలను గుంటూరు జిల్లా తెనాలిలో పోలీసులు అడ్డుకున్నారు. అలాగే ఐలయ్యకు మద్దతుగా వివిధ ప్రాంతాల నుంచి విజయవాడకు వచ్చిన దళిత సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేశారు. -
ఐలయ్యకు మావోయిస్టు పార్టీ మద్దతు
సాక్షి, హైదరాబాద్: వైశ్యులను కించపరిచారనే నెపంతో ప్రొఫెసర్ కంచ ఐలయ్యపై జరుగుతున్న దాడిని మావోయిస్టు పార్టీ ఖండిస్తోందని రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని, సంఘ్‌పరివార్ నేతృత్వంలోనే దేశంలో ఇలాంటి దాడులు జరుగుతున్నాయని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. కులం గురించి మాట్లాడటాన్ని నేరంగా చిత్రీకరిస్తూ బెదిరింపులకు పాల్పడటం వెనుక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్ర ఉందని జగన్ ఆరోపించారు. ఏపీ ముఖ్యమంత్రి ఐలయ్య పుస్తకాలను నిషేధించాలనుకోవడం ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమేనని పేర్కొన్నారు. అభిప్రాయాలను, అక్షరాలను నిషేధించాలనుకునే నియంతృత్వ వైఖరి అత్యంత ప్రమాదకరమని పేర్కొన్నారు. ఐలయ్య రాసిన అంశాలపై కౌంటర్ వాదన చేయొచ్చని, అయితే బెదిరించడం అప్రజాస్వామ్యమని అభిప్రాయపడ్డారు. ఐలయ్యకు అన్నిరకాలుగా తమ పార్టీ మద్దతిస్తోందని, ప్రజాస్వామ్యవాదులంతా ఐలయ్యకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. -
కోమటోళ్ల నుంచి రక్షణ కల్పించండి
సాక్షి, హైదరాబాద్: కోమటోళ్ల నుంచి తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని ప్రొఫెసర్ కంచ ఐలయ్య డీజీపీ అనురాగ్ శర్మకు విజ్ఞప్తి చేశారు. సోమవారం డీజీపీని కలసిన అనంతరం ఐలయ్య విలేకర్లతో మాట్లాడుతూ ఎంపీ టీజీ వెంకటేష్, ఆర్యవైశ్య సంఘం నాయకులు శ్రీనివాస్‌గుప్తా, రామకృష్ణ, రమణ తదితరులు తనను చంపుతానని బెదిరించారని డీజీపీకి తెలిపారు. బెదిరింపుల కారణంగా తాను బయటకు వెళ్లలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్, ఇతర జిల్లాలకు వెళ్లిన సమయంలో స్థానిక పోలీసులకు ముందస్తు సమాచారం ఇస్తే భద్రతా చర్యలు తీసుకుంటారని డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారన్నారు. -
ఐలయ్య మూర్ఖుడు: కృష్ణసాగర్‌రావు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కులం పేరుతో దూషించిన కంచ ఐలయ్య ఒక మూర్ఖుడు అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అమిత్ షాను కించపరిచేలా కంచ ఐలయ్య చేసిన వ్యాఖ్యలపై కోర్టులో కేసు వేస్తామన్నారు. సీఎం కేసీఆర్‌కు ఆర్యవైశ్యులంటే చులకన భావముందని, అందుకే ఆర్యవైశ్యులను అవమానించినా పట్టించుకోవడంలేదని కృష్ణసాగర్‌రావు విమర్శించారు. ఐలయ్యపై ప్రభుత్వమే క్రిమినల్ కేసును ఎందుకు పెట్టడంలేదని ప్రశ్నించారు. కమ్యూనిస్టు పార్టీలకు సిద్ధాంతాల్లేవని.. ఉనికిని కాపాడుకోవడానికే హింసకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. -
ఉగాది రోజు ‘డబుల్’ గృహ ప్రవేశాలు
గజ్వేల్: సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ‘డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలను సకాలంలో పూర్తి చేసి, వచ్చే ఏడాది ఉగాది రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా గృహ ప్రవేశాలు చేయిస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. శుక్రవారం గజ్వేల్ పట్టణంలో ‘డబుల్ బెడ్రూమ్’మోడల్ కాలనీ, పాండవుల చెరువు, వంద పడకల ఆస్పత్రి పనులను ఆయన పరిశీలించారు. పశువైద్యం కోసం ఏర్పాటు చేసిన సంచార వైద్యశాలను ప్రారంభించి, ములుగులోని హార్టికల్చర్ యూనివర్సిటీ పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌లో 1256 ఇళ్ల నిర్మాణాలు సాగుతున్నాయన్నారు. ఇప్పటికే 650 ఇళ్ల నిర్మాణం పూర్తి కావస్తుండగా, మరో 600కు పైగా పూర్తి చేయాల్సి ఉందని చెప్పారు. ఉగాదిలోగా పనులను అన్ని హంగుల్లో పూర్తి చేసి గృహ ప్రవేశాలకు సిద్ధంగా ఉంచాలని కాంట్రాక్టు ఏజెన్సీని, అధికారులను ఆదేశించారు. హార్టికల్చర్ వర్సిటీ పనుల తీరుపై ఆగ్రహం ఇకపోతే ములుగు హార్టికల్చర్ యూనివర్సిటీ పనుల నాణ్యతపై మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి నుంచే వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి ఫోన్ చేసి నాణ్యత తీరును వివరించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. కాంట్రాక్టు ఏజెన్సీ తీరులో మార్పు రాకపోతే బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు. మంత్రి వెంట మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. కంచ ఐలయ్యపై చర్యలు తీసుకుంటాం వర్గల్: ఒక కులాన్ని దూషించే విధంగా ప్రొఫెసర్ కంచ ఐలయ్య మాట్లాడటం దురదృష్టకరమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం శాకారంలో కంచ ఐలయ్య పుస్తకాన్ని నిషేధిం చాలని, తమ మనోభావాలను గాయపరచారంటూ మంత్రికి వైశ్యులు వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ ప్రభుత్వ పక్షాన ఐలయ్య వ్యాఖ్యల్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. కులాన్ని బట్టి గుణాన్ని నిర్ణయించలేరని పేర్కొన్నారు. అన్ని కులాలు కలగలసి ఉన్న సంస్కృతి మనదని, ఇలాంటి వాతావరణంలో కులాల పంచాయితీ పెట్టడం సరికాదన్నారు. ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
కంచ ఐలయ్యపై చర్యలు తీసుకోవాలి
డీజీపీకి ఆర్యవైశ్య మహాసభ వినతిపత్రం సాక్షి, హైదరాబాద్: ఆర్యవైశ్యులను కించపరిచే విధంగా పుస్తకం రాసిన కంచ ఐలయ్యపై చర్యలు తీసుకోవాలని ఆర్యవైశ్య మహాసభ సోమవారం డీజీపీ అనురాగ్ శర్మకు ఫిర్యాదు చేసింది. స్మగ్లర్ల పేరుతో తమ మనోభావాలు దెబ్బతీసే విధంగా పుస్తకంలో పేర్కొన్నారని, ఈ మేరకు ఐలయ్యపై కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పోలీస్‌స్టేషన్‌లో తమ ఆర్యవైశ్యులు చేస్తున్న ఫిర్యాదులపై తగుచర్యలు తీసుకోవాలని కోరారు. డీజీపీని కలిసిన వారిలో రాష్ట్ర సం ఘం ప్రతినిధులు లక్ష్మీనారాయణ, మల్లికార్జున్, రాజశేఖర్ గుప్తా, రెడ్డిశెట్టి ఉన్నారు. నాకు రక్షణ కల్పించండి: ఐలయ్య ఆర్యవైశ్య సంఘం నుంచి తనకు ప్రమాదం ఉన్నందున జీవితాంతం పోలీసుల రక్షణ కావాలని ప్రొఫెసర్ కంచ ఐలయ్య కోరారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’అనే పుస్తకాన్ని రచించినందుకు రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు, దుబాయ్, యుఎస్ఏ తదితర ప్రాంతాల నుండి బెదిరింపు ఫోన్‌కాల్స్ వస్తున్నాయని, చంపుతామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసినట్టు తెలిపారు. తనకు వచ్చే ఫోన్‌కాల్స్‌లోని కొన్నింటిని ఏసీపీ కూడా మాట్లాడారని తెలిపారు. వారు తనపై కోర్టును ఆశ్రయించవచ్చని చెప్పారు. తన జీవితంలో అసహజ మరణం అంటూ జరిగితే ఆర్యవైశ్య సంఘమే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. ముఖ్యమంత్రి, హోంమంత్రి స్పందించి తనకు రక్షణ కల్పించాలని కోరారు. ఏడు సెల్ ఫోన్ నంబర్లను గుర్తించాం ప్రొఫెసర్ కంచ ఐలయ్యకు వచ్చిన బెదిరింపు కాల్స్‌కు సంబంధించి ఏడు ఫోన్ నంబర్లను ట్రేస్చేశామని ఓయూ ఇన్స్పెక్టర్ అశోక్‌రెడ్డి తెలిపారు. ఈ ఏడు నంబర్లు ఆర్యవైశ్య సంఘానికి చెందిన ప్రతినిధులవని తేలిందని, మరిన్ని వివరాలు సేకరిస్తున్నామని పేర్కొన్నారు. భద్రత కల్పించండి: అసదుద్దీన్ రిటైర్డ్ ప్రొఫెసర్ కంచ ఐలయ్యకు వెంటనే తగిన భద్రత కల్పించాలని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కోరారు. ఐలయ్యను బెదిరిస్తున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆయన సూచించారు. బెదిరింపులు సరికాదు: తమ్మినేని ప్రొఫెసర్ కంచ ఐలయ్యకు వస్తున్న బెదిరింపులను టీమాస్ ఖండిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. హైదరాబాద్‌లో సోమవారం జరిగిన టీమాస్ సభలో తమ్మినేని ప్రసంగించారు. ఐలయ్య రాసిన పుస్తకాల్లో వ్యక్తిగతంగా ఎవరినీ విమర్శించలేదని, కులాల సామాజిక చరిత్రను మాత్రమే ఆయన వెలికితీశారన్నారు. ఆయన వైశ్య కులంలోని అసంబద్ధ విధానాలనే విమర్శించారని, బ్రాహ్మణులు, రెడ్లు వంటి కులాల్లోని ఆధిపత్య సంస్కృతిపై కూడా అనేక విమర్శలున్నాయని గుర్తుచేశారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐలయ్య వంటి వారిపై దాడులు, బెదిరింపులు పెరుగుతున్నాయని తమ్మినేని ఆరోపించారు. ఐలయ్యకు రాష్ట్ర ప్రభుత్వం రక్షణ చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.