కంచ ఐలయ్యపై చర్యలు తీసుకోవాలి
డీజీపీకి ఆర్యవైశ్య మహాసభ వినతిపత్రం
సాక్షి, హైదరాబాద్: ఆర్యవైశ్యులను కించపరిచే విధంగా పుస్తకం రాసిన కంచ ఐలయ్యపై చర్యలు తీసుకోవాలని ఆర్యవైశ్య మహాసభ సోమవారం డీజీపీ అనురాగ్ శర్మకు ఫిర్యాదు చేసింది. స్మగ్లర్ల పేరుతో తమ మనోభావాలు దెబ్బతీసే విధంగా పుస్తకంలో పేర్కొన్నారని, ఈ మేరకు ఐలయ్యపై కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పోలీస్‌స్టేషన్‌లో తమ ఆర్యవైశ్యులు చేస్తున్న ఫిర్యాదులపై తగుచర్యలు తీసుకోవాలని కోరారు. డీజీపీని కలిసిన వారిలో రాష్ట్ర సం ఘం ప్రతినిధులు లక్ష్మీనారాయణ, మల్లికార్జున్, రాజశేఖర్ గుప్తా, రెడ్డిశెట్టి ఉన్నారు.
నాకు రక్షణ కల్పించండి: ఐలయ్య
ఆర్యవైశ్య సంఘం నుంచి తనకు ప్రమాదం ఉన్నందున జీవితాంతం పోలీసుల రక్షణ కావాలని ప్రొఫెసర్ కంచ ఐలయ్య కోరారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’అనే పుస్తకాన్ని రచించినందుకు రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు, దుబాయ్, యుఎస్‌ఏ తదితర ప్రాంతాల నుండి బెదిరింపు ఫోన్‌కాల్స్ వస్తున్నాయని, చంపుతామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసినట్టు తెలిపారు.
తనకు వచ్చే ఫోన్‌కాల్స్‌లోని కొన్నింటిని ఏసీపీ కూడా మాట్లాడారని తెలిపారు. వారు తనపై కోర్టును ఆశ్రయించవచ్చని చెప్పారు. తన జీవితంలో అసహజ మరణం అంటూ జరిగితే ఆర్యవైశ్య సంఘమే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. ముఖ్యమంత్రి, హోంమంత్రి స్పందించి తనకు రక్షణ కల్పించాలని కోరారు.
ఏడు సెల్ ఫోన్ నంబర్లను గుర్తించాం
ప్రొఫెసర్ కంచ ఐలయ్యకు వచ్చిన బెదిరింపు కాల్స్‌కు సంబంధించి ఏడు ఫోన్ నంబర్లను ట్రేస్‌చేశామని ఓయూ ఇన్‌స్పెక్టర్ అశోక్‌రెడ్డి తెలిపారు. ఈ ఏడు నంబర్లు ఆర్యవైశ్య సంఘానికి చెందిన ప్రతినిధులవని తేలిందని, మరిన్ని వివరాలు సేకరిస్తున్నామని పేర్కొన్నారు.
భద్రత కల్పించండి: అసదుద్దీన్
రిటైర్డ్ ప్రొఫెసర్ కంచ ఐలయ్యకు వెంటనే తగిన భద్రత కల్పించాలని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కోరారు. ఐలయ్యను బెదిరిస్తున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆయన సూచించారు.
బెదిరింపులు సరికాదు: తమ్మినేని
ప్రొఫెసర్ కంచ ఐలయ్యకు వస్తున్న బెదిరింపులను టీమాస్ ఖండిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. హైదరాబాద్‌లో సోమవారం జరిగిన టీమాస్ సభలో తమ్మినేని ప్రసంగించారు. ఐలయ్య రాసిన పుస్తకాల్లో వ్యక్తిగతంగా ఎవరినీ విమర్శించలేదని, కులాల సామాజిక చరిత్రను మాత్రమే ఆయన వెలికితీశారన్నారు. ఆయన వైశ్య కులంలోని అసంబద్ధ విధానాలనే విమర్శించారని, బ్రాహ్మణులు, రెడ్లు వంటి కులాల్లోని ఆధిపత్య సంస్కృతిపై కూడా అనేక విమర్శలున్నాయని గుర్తుచేశారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐలయ్య వంటి వారిపై దాడులు, బెదిరింపులు పెరుగుతున్నాయని తమ్మినేని ఆరోపించారు. ఐలయ్యకు రాష్ట్ర ప్రభుత్వం రక్షణ చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.