
మహిళను బెదిరించి పుస్తెలతాడు,సెల్‌ఫోన్‌తో పరారైన వ్యక్తి
పోలీస్‌స్టేషన్‌లో వివాహిత ఫిర్యాదు
వట్‌పల్లిలో ఆలస్యంగా వెలుగులోకి
పోలీసుల అదుపులో నిందితుడు!
వట్‌పల్లి(అందోల్): ఫోన్‌లో పరిచయమైన ఓ వ్యక్తి వివాహిత మహిళను అత్యాచారం చేసి ఆమె మెడలో ఉన్న బంగారు నగలతోపాటు సెల్‌ఫోన్ ఎత్తుకెళ్లిన ఘటన వట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం వెలుగు చూసింది. ఎస్‌ఐ విఠల్ కథనం మేరకు.. మండల పరిధిలోని పల్వట్ల గ్రామానికి చెందిన ఓ వివాహిత(35) ఆదివారం జోగిపేటలో చీరలు కొన్నది. చీర డ్యామేజ్ ఉండటంతో తిరిగి ఇవ్వడానికి గురువారం జోగిపేటకు వెళ్లింది.
ఫోన్‌కు గుర్తు తెలియని వ్యక్తి నుంచి కాల్ రాగా లిఫ్ట్ చేసి మాట్లాడగా.. కొత్త వ్యక్తి అని ఫోన్ కట్ చేసింది. మళ్లీ ఫోన్ చేసి నీవు నాకు తెలుసు, నీ నంబర్ నా దగ్గర ఉంది.. అంటూ పరిచయం చేసుకొని ఎక్కడ ఉన్నావు అని అడుగగా తాను ఉన్న బట్టల షాపు అడ్రస్ చెప్పింది. వెంటనే అక్కడికి వచ్చి వ్యక్తి ఆమె డబ్బులను షాపులో చెల్లించాడు. షాపింగ్ ముగిసిన తర్వాత సాయంత్రం 5 గంటల సమయంలో మహిళను బైక్‌పై ఎక్కించుకున్నాడు. అల్లాదుర్గం మండలం బహిరన్‌దిబ్బ గ్రామ రోడ్డు సమీపంలోకి రాగానే వర్షం రావడంతో తన బైక్‌ను నిలిపాడు. మళ్లీ రాత్రి 8 గంటల ప్రాంతంలో మహిళను ఎక్కించుకొని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.
అనంతరం బైక్‌పై వట్‌పల్లి మీదుగా బాధిత మహిళ గ్రామం పల్వట్ల వైపు వెళ్తూ నాగులపల్లి గ్రామ సమీపంలోకి రాగానే మహిళను దిగమన్నాడు. నన్ను మా ఇంటి దగ్గర దించాలంటూ ఆమె బైక్ దిగలేదు. దీంతో ఇద్దరి మధ్య గొడవ పెరిగింది. అతడు మహిళను బయపెట్టి మెడలో ఉన్న రెండు తులాల బంగారు పుస్తెల తాడు, సెల్‌ఫోన్ తీసుకొని పరారయ్యాడు. బాధిత మహిళ అదే రాత్రి వట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాల్‌డేటా ఆధారంగా మనూర్ మండలం బెల్లాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించి అతడిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.