భర్తను హత్య చేయించిన రెండో భార్య?
ప్రియుడితో కలిసి దారుణం
* అనంతరం ప్రియుడిపైనే ఫిర్యాదు
* ఇద్దరిపై ఫిర్యాదు చేసిన మొదటి భార్య
* తలలు పట్టుకున్న పోలీసులు
బెంగళూరు : ప్రియుడి వ్యామోహంలో పడిన ప్రియరాలు తన భర్తనే దారుణంగా హత్య చేయించిన సంఘటన తాలూకాలో చోటు చేసుకుంది. విచిత్రం ఏమిటంటే హత్య తరువాత ప్రియుడిపై హత్య ఆరోపణ చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరో విచిత్రం ఏమిటంటే హతుడి మొదటి భార్య తన భర్తను రెండవ భార్య, ఆమె ప్రియుడు కలిసి హత్య చేసారని కౌంటర్ ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఎవరి ఫిర్యాదు నమోదు చేసుకోవాలో, ఎవరి ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేయాలో తెలియక తలలు పట్టుకున్నారు.
వివరాలు... తాలూకా పరిధిలోని సొణ్ణమారనహళ్లి గ్రామం నివాసి మునిస్వామి (45) హత్యకు గురయ్యాడు. మునిస్వామి రెండో భార్య శోభ (35), ఆమె ప్రియుడు మధు (26) హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీరిద్దరిపై హతుడి మొదటి భార్య దేవనహళ్లి తాలూకా కరుబరకంటలోని జనతా కాలనీ నివాసి లక్ష్మమ్మ (40) కౌంటర్ ఫిర్యాదు చేసింది. హతుడు మునిస్వామికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య లక్ష్మమ్మ దేవనహళ్లిలో నివసిస్తుండగా, రెండో భార్య శోభ గార్మెంట్స్‌లో పనిచేస్తూ సొణ్ణమారనహళ్లిలో నివాసం ఉంటోంది. మునిస్వామి ఒక్కోవారం ఒక్కో భార్య దగ్గర ఉండేవాడు. ఈ క్రమంలో ఏడాది క్రితం శోభకు తాను నిత్యం ఫ్యాక్టరీకి వెళ్లే ఆటో డ్రైవర్ మధుతో సన్నిహితం పెరిగి వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం మునిస్వామికి తెలిసి శోభను తానే దగ్గరుండి ఫ్యాక్టరీలో దిగబెట్టడం, తీసుకురావడం చేయనారంభించాడు.
దీన్ని జీర్ణించుకోలేని మధు, శోభలు మునిస్వామి హత్యకు కుట్ర పన్నారు. కుట్రలో భాగంగా ఆదివారం సాయంత్రం మునిస్వామి శోభను బైక్‌లో సొణ్ణమారనహళ్లికి తీసుకువస్తుండగా మార్గం మధ్యలో శోభ ద్వారా సమాచారం తెలుసుకున్న మధు ఆటోలో లింగనహళ్లి గ్రామం శివారులోని ఆంజనేయస్వామి దేవాలయం వద్ద అడ్డగించి గొడవకు దిగాడు. ఈ క్రమంలో ముందస్తుగానే మధు వెంట తెచ్చుకున్న వేటకొడవలితో మునిస్వామిని తలపై, భుజాలపై న రికాడు. అదే సమయంలో అటుగా వచ్చిన సుమో వాహనం డ్రైవర్ నరసింహ ఏం జరిగిందని ప్రశ్నించడంతో కొడవలి దాచి, ఏదో వాహనం ఢీకొని వెళ్లి పోయిందని ఇద్దరు బుకాయించారు.
ఆస్పత్రికి తీసుకెళ్దామని పిలవగా మధు పరారయ్యాడు. మునిస్వామి ప్రాణాపాయంలో ఉండటంతో హుటాహుటిన నరసింహ శోభ సాయంతో పట్టణంలోని మాసన ఆస్పత్రికి తరలించాడు. అయితే చికిత్స పొందుతూ మునిస్వామి అర్ధరాత్రి మృతి చెందాడు. ఇదిలా ఉండగా సోమవారం ఉదయం శోభ తన భర్తను మధు నరికి చంపాడని గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు మధును అరెస్టు చేసి విచారణ చేయడంతో శోభతో తనకు వివాహేతర సంబంధం ఉందని వివరించాడు.
మధ్యాహ్నానికి కథ మరో మలుపు : దేవనహళ్లిలో ఉన్న మునిస్వామి మొదటి భార్య గ్రామీణ పోలీస్ స్టేషన్‌కు వచ్చి తన భర్తను శోభ, మధులు పథకం ప్రకారం హత్య చేశారని పేర్కొంటూ ఫిర్యాదు చేసింది. ఈమెకు దళిత సం ఘాల నేతలు పలవురు మద్దతుగా నిలిచారు. పోలీసులు ఇద్దరి ఫిర్యాదులూ స్వీకరించారు.