
కొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో కేసుల్లో పురోగతి
గడిచిన ఏడాదిలో చోరీకి గురైన మొబైల్ ఫోన్లు 3,647
స్వాదీనం చేసుకున్నవి 1,250 వీటి విలువ దాదాపు రూ.2 కోట్లపైనే..
చోరీకి గురైన ఫోన్లను ఇట్టే పట్టేస్తున్న పోలీసులు
వికారాబాద్: మనిషి జీవితంలో సెల్‌ఫోన్ భాగమైపోయింది. నేడు మొబైల్ ఫోన్ లేని ఇళ్లంటూ లేదు. గ్రామీణ ప్రాంతాలు మొదలుకొని పట్టణాల వరకు వీటి వాడకం భారీగా పెరిగిపోయింది. 90 శాతం మంది స్మార్ట్ ఫోన్లనే వినియోగిస్తున్నారు. ఒక్కో మొబైల్ కోసం రూ.10 వేల నుంచి రూ.లక్షన్నర వరకు వెచ్చిస్తున్నారు. ఇదే సమయంలో ఫోన్ల దొంగతనాలు కూడా ఎక్కువైపోయాయి. ఐదేళ్లుగా పోలీసులు సవాళ్లు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టాలని భావించిన కేంద్ర టెలీకామ్ మంత్రిత్వ శాఖ నూతన టెక్నాలజీ (సీఈఐఆర్ పోర్టల్)ని అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా జిల్లా పోలీసు విభాగం మంచి పురోగతి సాధించింది.
భారీగా రికవరీ
గత ఏడాది జిల్లాలోని ఆయా పోలీస్ స్టేషన్ల పరిధి లో 3,647 ఫోన్లు చోరీకి గురయ్యాయి. కొన్ని చోట్ల బాధితులు నేరుగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయగా.. మరికొన్ని చోట్ల సీఈఐఆర్ పోర్టల్‌లో నమోదు చేశారు. వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్, మోమిన్‌పేట్, కుల్కచర్ల, తుంకిమెట్ల, మర్పల్లి ప్రాంతాల్లో సంతలు నిర్వహించే సమయంలో ఎక్కువగా సెల్ ఫోన్లు చోరీకి గురవుతున్నాయి. దీంతో పోలీసులు ఈ ప్రాంతాలను హాట్ స్పాట్లుగా ప్రకటించారు. జిల్లాలో చోరీకి గురైన ఫోన్ల రికవరీ బాధ్యతను ఎస్పీ.. సీసీఎస్ పోలీసులకు అప్పగించారు.
సీఈఐఆర్ టెక్నాలజీని వినియోగించి దాదా పు రూ.2 కోట్ల విలువ చేసే 1,250 సెల్ ఫోన్లను రికవ రీ చేశారు.తెలంగాణ జిల్లాలతోపాటు పక్క రాష్ట్రాలైన ఏపీ, కర్ణాటక నుంచి వీటిని స్వాదీనం చేసుకున్నారు. ఏపీలోని కర్నూల్ జిల్లా డోన్ పట్టణానికి చెందిన కొందరు జిల్లాలో సెల్ ఫోన్లను చోరీ చేస్తు న్నట్లు గుర్తించి వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. దొంగతనాలకు పాల్పడుతున్న వారిలో ఎక్కువ శాతం మైనర్లేనని పోలీసులు గుర్తించారు.
ఫోన్ పోతే ఏం చేయాలి?
సెల్‌ఫోన్ పోయినా.. చోరీకి గురైనా వెంటనే సీఈఐఆర్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. ఇందుకోసం మూడు పద్ధతులు ఉంటాయి. బాధితులు తమ ఫోన్ ద్వారా www.ceir.gov.in వెబ్ సైట్‌లో నేరుగా నమోదు చేసుకోవచ్చు. లేదా మీసేవా కేంద్రంలో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ రెండూ కాకుండా ఫోన్ ఎక్కడ పోయిందో అక్కడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయవచ్చు. అయితే ఐఎంఈ నంబర్, ఫోన్ నంబర్, మొబైల్ కొన్న సమయంలో పొందిన బిల్, అడ్రస్ తదితర వివరాలను ఇందులో పొందుపరచాల్సి ఉంటుంది. మనం ఈ పోర్టల్‌లో నమోదు చేస్తే చోరీకి గురైన ఫోన్ స్టేటస్ చూసుకోవటానికి వీలుంటుంది. దాన్ని ఎవరు.. ఎక్కడ వాడుతున్నారు. అసలు వాడుతున్నారా..? లేదా..? అదే నంబర్‌ను వినియోగిస్తున్నారా..? వేరే నంబర్ వాడుతున్నారా..? లాంటి వివరాలు తెలుసుకునేందుకు వీలుపడుతుంది. పోలీసులు ఈ టెక్నాలజీని ఉపయోగించి ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేస్తున్నారు.
ఏడాది క్రితం వరకు చోరీకి గురైన ఫోన్ల రికవరీ పోలీసులకు పెద్ద సవాల్‌గా ఉండేది.. దొంగ దొరికితే తప్ప కేసులు కొలిక్కి వచ్చేవి కాదు.. కానీ ఇప్పుడాపరిస్థితి లేదు. కొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో కేసుల్లో గణనీయమైన పురోగతి కనిపిస్తోంది.. నేరం చేసిన వారితోపాటు.. చోరీకి గురైన కోట్ల రూపాయల విలువ చేసే సెల్‌ఫోన్లను సైతం స్వాధీనం చేసుకుంటున్నారు.
ఎక్కడున్నా దొరికిపోతాయి
సీఈఐఆర్ టెక్నాలజీతో దొంగిలించన ఫోన్లు ఎక్కడున్నా కనిపెట్టవచ్చు. కొందరు చోరీ చేసిన మొబైల్స్‌ను గుర్తించకుండా స్పేర్ పార్ట్స్‌గా మార్చి విక్రయిస్తున్నారు. అయినా దొరికిపోతారు. ఫోన్ ఏ రూపంలో ఉన్నా.. ఎక్కడ ఉన్నా గుర్తించడాని సీఈఐఆర్ టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతుంది. కొంత ఆలస్యం కావచ్చు అంతే.. – నారాయణరెడ్డి, ఎస్పీ