
గాయపడిన నేను మంచినీళ్లు అడిగితే అరవింద్‌బాబు బయటకు నెట్టేశారు
4న నరసరావుపేట ఎమ్మెల్యే ఇంట్లో జరిగిన దాడిలో బాధితుడి ఆవేదన
గుంటూరు: నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్‌బాబు గృహంలోనే తనపై మారణాయుధాలతో దాడిచేశారని ఆ పార్టీ కార్యకర్త అల్లూరి హరికృష్ణ తెలిపారు. తీవ్రంగా గాయపడిన తనకు కనీసం తాగేందుకు మంచినీళ్లు కూడా ఇవ్వకుండా ఎమ్మెల్యే బయటకు నెట్టేశారని చెప్పారు. 4న నరసరావుపేటలోని ఎమ్మెల్యే అరవింద్‌బాబు గృహంలో తెలుగు తమ్ముళ్లు వర్గాలుగా విడిపోయి తన్నుకున్నారు. ఈ ఘర్షణలో తీవ్రంగా గాయపడిన హరికృష్ణ నరసరావుపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన నుంచి శుక్రవారం రాత్రి వన్‌టౌన్ పోలీసులు ఫిర్యాదు స్వీకరించి 43మందిపై కేసు నమోదు చేశారు.
హరికృష్ణ శనివారం ఆస్పత్రిలో మీడియాతో మాట్లాడారు. ‘నా సొంత ఊరు నరసరావుపేట మండలం ఇసప్పాలెం. నరసరావుపేట శ్రీనివాసనగర్‌లో ఉంటూ పల్నాడు రోడ్డులో బ్లడ్ బ్యాంకు నిర్వహిస్తున్నాను. 4న సాయంత్రం ఎమ్మెల్యేతో డీఎంహెచ్‌వోకు ఒక ఫోన్ చేయించుకోవాలనే ఉద్దేశంతో ప్రకాష్‌నగర్‌లోని ఆయన ఇంటికి వెళ్లగా... ప్రసాద్, సురేష్, సాయి, రాజేష్, అంకమ్మరాజు, కాళీ, ప్రేమ్‌కుమార్, నవీన్, బొట్టు సాయితోపాటు మరో 40మంది కర్రలు, కత్తులు, ఇనపరాడ్లు పట్టుకుని బైక్‌లపై ఎమ్మెల్యే గృహంలోకి వచ్చి పూలకుండీలు, కురీ్చలు పగలగొట్టారు.
అక్కడే నిలబడి ఉన్న నాపై మారణాయుధాలతో దాడి చేయడంతో నా ఎడమ చేయి మోచేతి కిందభాగంలో ఎముక విరిగింది. తల, వీపుపై గాయాలయ్యాయి. అక్కడకు వచ్చిన వారిలో సురేష్ అనే వ్యక్తి నన్ను గుర్తుపట్టి తెలిసినవాడే అనడంతో వదిలేశారు. ఇంట్లో నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యేను తీవ్రంగా గాయపడిన నేను తాగేందుకు మంచినీళ్లు ఇవ్వాలని అడిగితే బయటకు నెట్టివేసి లోపలికి వెళ్లిపోయారు. మా గ్రామం టీడీపీకి కంచుకోట. నేను కూడా అరవిందబాబు గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశా. అయినా నాకు తాగేందుకు మంచినీళ్లు ఇవ్వలేదు. రెండు రోజులుగా ఆస్పత్రిలో ఉన్నా పరామర్శించేందుకు కూడా ఎమ్మెల్యే రాలేదు.’ అని చెప్పారు.